ఘన వారసత్వనికి గుర్తింపు


Mon,July 22, 2019 01:26 AM

యునెస్కో వారసత్వ కట్టడాలు, ప్రదేశాలపై పోటీ పరీక్షల్లో తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం యునెస్కో నూతనంగా
గుర్తించిన ప్రదేశాల వివరాలు అందిస్తున్నాం.

UNESCO
-ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగమైన విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)ప్రపంచ వారసత్వ కమిటీ ప్రపంచ వారసత్వ జాబితాలో మరో 29 చారిత్రక, సహజసిద్ధమైన ప్రదేశాలు, కట్టడాలు, మానవ నిర్మితాలను చేర్చింది. అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జూన్‌ 30 నుంచి జూలై 10 వరకు జరిగిన యునెస్కో 43వ సదస్సులో ఆయా దేశాల నుంచి వచ్చిన నామినేషన్లను పరిశీలించింది. ఇందులో మనదేశం నుంచి పింక్‌ సిటీగా గుర్తింపు తెచ్చుకున్న రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపూర్‌ చోటు సంపాదించుకుంది.
unesco1
-భారతదేశంలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రాంతాలు 36 ఉండగా జైపూర్‌ 37వ ప్రాంతంగా చేరింది. ఇప్పటివరకు యునెస్కో 167 దేశాలకు చెందిన 1,121 ప్రాంతాలను వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. ఈ ఏడాది ఆఫ్రికా నుంచి ఒకటి, ఆరబ్‌ దేశాల నుంచి రెండు, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో 10, యూరప్‌, ఉత్తర అమెరికా నుంచి 15, లాటిన్‌ అమెరికా నుంచి ఒక ప్రాంతాన్ని వారసత్వ జాబితాలో చేర్చారు. అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం) ప్రతి ఏటా ఏప్రిల్‌ 18న నిర్వహిస్తారు.

యునెస్కో నూతన వారసత్వ ప్రదేశాలు

1బుడ్జ్‌ బిమ్‌ కల్చరల్‌ ల్యాండ్‌స్కేప్‌


world
-నైరుతివిక్టోరియాలోని ఆస్ట్రేలియన్‌ అబోరిజినల్‌ సైట్‌ ‘బుడ్జ్‌ బిమ్‌ కల్చరల్‌ ల్యాండ్‌ స్కేప్‌'ను యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చింది. ‘బుడ్జ్‌ బిమ్‌ కల్చరల్‌ ల్యాండ్‌ స్కేప్‌' ఆస్ట్రేలియాకు నైరుతిలో ఆదివాసులు ఉండే గుండిట్జ్‌మార ప్రాంతంలో ఉన్నది. ఆరువేల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ ఆదివాసులు జీవనం సాగించారు. ఇది పిరమిడ్లు, అక్రోపోలిస్‌, స్టోన్‌హెంజ్‌ కంటే పురాతనమైనది. ఆదివాసుల సంస్కృతి ఇక్కడ విలసిల్లింది. ఆదివాసుల సంస్కృతి ప్రాముఖ్యతకు ప్రపంచ వారసత్వ రక్షణ పొందిన మొదటి ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది.

2ఖాన్‌ ప్యాలెస్‌


123
-అజర్‌బైజాస్‌లోని ఖాన్‌ప్యాలెస్‌ షెకి చారిత్రక కేంద్రం. గ్రేటర్‌ కాకసస్‌ పర్వత పాదాల వద్ద ఉన్న ఈ చారిత్రక నగరాన్ని గుర్జన నది వేరుచేస్తుంది. 18వ శతాబ్దంలో మట్టిప్రవాహాలు పాత పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత ఈ చారిత్రక కేంద్రాన్ని పునర్నిర్మించారు. ఇక్కడి నిర్మాణాల్లో కప్పులతో కూడిన ఇళ్ల్లు అక్కడి సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం చేపట్టారు. ముఖ్యమైన చారిత్రాత్మక వాణిజ్య మార్గాల్లో ఉన్న నగర నిర్మాణం సఫావిడ్‌, కద్జార్‌, రష్యన్‌ భవన సంప్రదాయాలతో ప్రభావితమైంది. నగరానికి ఈశాన్యంలో ఖాన్‌ ప్యాలెస్‌లో అనేక వర్తక గృహాలు ఉన్నాయి. 18వ శతాబ్దం చివరి నుంచి 19వ శతాబ్దం వరకు పట్టు, కొబ్బరికాయల వ్యాపారం ఎక్కువగా సాగింది.

3దిల్మన్‌ బరియల్‌ మౌండ్స్‌


cnn
-బహ్రెయిన్‌-దిల్మన్‌ అతి ప్రాచీన నాగరికత. సముద్రవాణిజ్య మార్గంలో బహ్రెయిన్‌ ఉండటంతో నాగరికత ఏర్పడింది. దిల్మన్‌ బరియల్‌ మౌండ్స్‌ను ఒక డానిష్‌ బృందం కనుగొన్నది. ఈ ద్వీపం పశ్చిమ భాగంలో మట్టిదిబ్బల (శ్మశాన వాటికలు) సమాధులను క్రీ.పూ 2050-క్రీ.పూ 1750 మధ్య నిర్మించారు. ఈ సమాధులు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. 11,774 సమాధులు ఇక్కడ ఉన్నాయి. ప్రతి సమాధిలో ఒక కేంద్ర రాతిగది, దాని చుట్టూ భూమితో తక్కువగోడ, దానిపై కంకరతో చేసిన కప్పు ఉంటుంది. ఈజిప్టు సమాధులవలే భారీ సంపద ఇక్కడ పేర్చలేదు. ఇందులో రాతి, ఖనిజాలు, రాతితో చేసిన జాడి, దంతపు వస్తువులు, రాగి ఆయుధాలు ఉన్నాయి. వాటి సంఖ్య, స్థాయి పరంగానే కాకుండా శ్మశానగదులు వాటి వివరాలు పూర్తిగా ఉన్నాయి. ఇందులో 21 పురావస్తు ప్రదేశాలు ఉన్నాయి. ఇది దిల్మన్‌ నాగరికతకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. దిల్మన్‌ బరియల్‌ మట్టిదిబ్బల సమూహంతో బహ్రెయిన్‌ మూడో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా స్థానాన్ని దక్కించుకుంది.

4జైపూర్‌ సిటీ


city_palace
-పింక్‌ సిటీగా పేరు పొందిన రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు లభించింది. మధ్యయుగపు రాజరిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన జైపూర్‌ పర్యాటక ప్రాంతంగా ప్రపంచ గుర్తింపు పొందింది. రాజస్థాన్‌ నగర నిర్మాణ శైలి రాజపుత్రుల రాజరిక అభిరుచికి తగిన విధంగా ఉంటుంది. జైపూర్‌ మహానగరానికి ఉన్న సకల వసతులు కలిగి వాణిజ్యానికి అనుకూలంగా ఉండి ప్రఖ్యాత వ్యాపార కూడలిగా ఉన్నది. ఆధునిక నగరాల నిర్మాణానికి ముందే అభివృద్ధి చెందిన భారతీయ నగరాల్లో జైపూర్‌ ప్రత్యేకత కలిగి ఉంది. జైపూర్‌ నగరం 111 అడుగుల (34 మీటర్ల) రహదారులతో ఆరు విభాలుగా విభజించి ఉంటుంది. నగరశివారు ప్రాంతాలు రహదారులతో నగరంతో అనుసంధామై ఉంటాయి. మధ్యలో ఆరో భాగంలో రాజమహల్‌ నాలుగు వైపులా నాలుగు భాగాలు, ఆరోభాగం తూర్పు దిశగా విస్తరించి ఉంటుంది. ప్యాలెస్‌ విభాగం రాజసౌధాలను ఆనుకుని ఉంటుంది.

-క్రీ.శ 1727లో అంబర్‌ మహరాజు రెండో జైసింగ్‌ ఈ నగర నిర్మాణం చేపట్టాడు. తన రాజధానిని అంబర్‌ నుంచి జైపూర్‌కు మార్చాడు. 16వ శతాబ్దం నాటి అంబర్‌కోట, గులాబీరంగు ఇసుక రాతికట్టడమైన హవామహల్‌, ఖగోళ విజ్ఞాన కేంద్రం జంతర్‌మంతర్‌ వంటివి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తన రాజధాని ఆతిథ్యానికి పెద్దపీట వేయాలన్న తలంపుతో జైపూర్‌ మహరాజు నగరంలోని కట్టడాలన్నింటికి గులాబీ రంగు వేయించాడని చరిత్ర చెబుతుంది. అందుకే దీనిని గులాబీ నగరం (పింక్‌ సిటీ)గా పిలుస్తారు. ప్రణాళికాబద్ధంగా నిర్మించిన జైపూర్‌ నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. సవాయ్‌ జైసింగ్‌ వాస్తుశాస్త్ర నిపుణులతో చక్కటి నిర్మాణ శైలితో జైపూర్‌ నగరాన్ని నిర్మించాడు. ఒక్కొక్కవీధి తూర్పు-పడమర, ఉత్తర-దక్షిణాలుగా నిర్మింపజేశాడు. తూర్పు ద్వారం పేరు ‘సూర్యస్థూపం’ పడమటి ద్వారాన్ని‘ చంద్రస్థూపం’ గా పిలుస్తారు. ఉత్తర ద్వారం జొరావర్‌సింగ్‌ ద్వారం అంటారు. ఉత్తరద్వారం వైపు పురాతన రాజధాని అయిన అంబర్‌ ఉన్నది. జైపూర్‌ నగరాన్ని ఎనిమిది మండలాలుగా విభజించారు.

పితాపద అనే తొమ్మిదో భాగం వాణిజ్య అవసరాల కోసం నిర్మించారు. ప్రముఖ పర్యాటక పత్రిక కోస్ట్‌ ట్రావెలర్‌ జరిపిన సర్వేలో ఆసియాలోని పర్యాటక ఆకర్షణను కలిగిన నగరాల్లో ఏడో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సర్వేలో 76.5 శాతం ఓట్లు సంపాదించుకుంది. అంతర్జాతీయ పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ నగరంలో అసంఖ్యాకంగా ఆలయాలు ఉన్నాయి. ప్రతి వీధిలో ఆలయాన్ని దర్శించవచ్చు. మతపరంగా ఈ నగరాన్ని చిన్నకాశీగా పిలుస్తారు. గోవింద్‌ జీ ఆలయం, గల్తాజీ ఆలయం, శ్రీకాళి ఆలయం, సంగనవేరి ద్వారం, లక్ష్మీనారాయణ మందిరం (బిర్లామందిర్‌), ఘర్‌గణేష్‌ ఆలయం, షీలాదేవి ఆలయం, పంచాయతీ హాల్‌, రాధాగోవింద్‌జీ ఆలయంతో పాటు 130 సంవత్సరాల ముందు మిర్జా ఇస్మాయిల్‌ రోడ్డు సమీపంలో ఉన్న ది ఆల్‌ సెయింట్స్‌ చర్చి నిర్మాణం అప్పటి నిర్మాణశైలికి తార్కాణంగా నిలిచింది. వీటితో పాటు జైపూర్‌ నగరం అందమైన పూలతోటలు, ఉద్యానవనాలతో నిండిఉంటుంది. వాటిలో ప్రధానమైన రామ్‌నివాస్‌ గార్డెన్‌, సిసోలియా క్వీన్‌ గార్డెన్‌, ప్యాలెస్‌, కనక్‌ బృందావన్‌, సెంట్రల్‌ పార్క్‌, మాన్‌సరోవర్‌ సమీపంలో ఉన్న టెక్నాలజీ పార్క్‌, గోనర్‌ వద్ద ఉన్న విద్యాధర్‌ కా బాగ్‌ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా జైపూర్‌ నగరం సంప్రదాయక, ఎన్నో అధునాతన పరిశ్రమలకు ముఖ్యకేంద్రంగా ఉంది. ఆసియాలో అత్యధికంగా స్వర్ణాభరణాలు, వజ్రాలు, రత్నాభరణాలను చేసే నగరాల్లో జైపూర్‌ ప్రధానమైనది. నీలి వజ్రాలకు ఇక్కడ మాత్రమే పదునుపెడతారు. ఇన్ని అంశాలతో కూడిన జైపూర్‌ నగరాన్ని ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్స్‌ అండ్‌ సైట్స్‌కు చెందిన 21 దేశాల అధికారుల బృందం 2018లో పరిశీలించి వారసత్వ హోదా ఇవ్వాలని నిర్ణయించింది.

5బగాన్‌


baghan
మయన్మార్‌లో బగాన్‌ అతి ప్రాచీనమైన నగరం. క్రీ.శ 2వ శతాబ్దంలో ఈ నగరాన్ని నిర్మించారు. మయన్మార్‌లోని ప్రధానమైన పర్యాటక ప్రదేశాల్లో బగాన్‌ ఒకటి. ప్రపంచ నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఇక్కడికి యాత్రికులు వస్తుంటారు. బగాన్‌ క్రీ.శ. 1044 నుంచి క్రీ.శ. 1287 వరకు రాజధాని నగరంగా ఉంది. మయన్మార్‌లో అయ్యర్వాడి నదికి సమీపంలో బగాన్‌ ఉంది. ఇక్కడ క్రీ.శ 11, 13వ శతాబ్దాల నాటి బౌద్దుల నిర్మాణాలు ఉన్నాయి. 40 వేల చ.మీ. విస్తీర్ణంలో వేల కట్టడాలు, అందులో హిందూ, బౌద్ధదేవాలయాలు, పగోడాలు, మఠాలు, స్థూపాలు ఉన్నాయి. థేరవాద, మహాయాన, తాంత్రిక బౌద్ధమతంతో పాటు హిందూ మతం (శైవం, వైష్ణం) మత సంప్రదాయాలు ఇక్కడ విలసిల్లాయి. 716 గోపురాలతో కూడిన నిర్మాణాలు ఉన్నాయి. వీటికి బంగారుపూత పూసిన గోపుర శిఖరం ప్రత్యేక ఆకర్షణ.

6ప్యారటీ ఇలా గ్రాండీ


paraty
-ఇది బ్రెజిల్‌లోని బ్రెజిల్‌-సెర్రాడా బోసినా పర్వత శ్రేణి, అట్లాంటిక్‌ మహాసముద్రం మధ్య ఉన్నది. తీరప్రాంత పట్టణ చారిత్రక కేంద్రాల్లో ఇది ఒకటి. ఇది ప్రపంచంలోని జీవవైవిధ్య ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. ప్యారటీ అనేది 18వ శతాబ్దపు పాత ఓడరేవు పట్టణం. ఇది ఆఫ్రికన్‌ బానిసలకు ప్రవేశ కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతం వివిధ జాతుల వైవిధ్యానికి నిలయంగా ఉండటంతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపునిచ్చింది.

7బాబిలోన్‌


e-babylon-iraq
-బాబిలోన్‌ గ్రీక్‌ అకడియస్‌ బాబిల్లా అని పిలిచే పురాతన మెసపటోమియా నగర రాజ్యం. ఇది పదివేల సంవత్సరాలకు పూర్వమే ప్రపంచ పట్టణాల్లో ముఖ్యపట్టణం. ప్రపంచంలో ప్రథమంగా ఏర్పడిన మహాసామ్రాజ్యాల్లో ప్రసిద్ధి చెందింది. దీని అవశేషాలను నేటి ఇరాక్‌లోని బాగ్దాద్‌కు 85 కి.మీ. దూరంలోని ఆల్‌ హిల్లా, బాబిల్‌ ప్రావిన్స్‌లో కనుగొన్నారు. టైగ్రిస్‌, యూఫ్రటిస్‌ నదుల మధ్య ఉన్న సారవంతమైన మెసపటోమియా మైదానంలోని శిథిలమైన మట్టి-ఇటుకల భవనాలు, మట్టిదిబ్బలు, పురాతన ఆవాసాల నుంచి ఏర్పడిన ప్రసిద్ధ నగరం నేటి బాబిలోన్‌. ఇక్కడ నబోపాలసార్‌ అనంతరం అతని కుమారుడు నెబుకెడ్‌ నెజర్‌ క్రీ.పూ 626-539 పాలన కాలంలో బాబిలోనియా తన ప్రాచీన ఔన్నత్యాన్ని మించిన ఘనత పొందింది.

8లియాంగ్జు నగర అవశేషాలు


cdn.cnn
-చైనాలోని లియాంగ్జు నగరంలోని పురాతన శిథిలాలు ప్రపంచ వారసత్వ జాబితాలో చేరాయి. ఇవి క్రీ.పూ. 3300-2300 కాలానికి చెందినవి. యాంగ్జీ నది పరీవాహక ప్రాంతంలో ఇవి నిక్షిప్తమై ఉన్నాయి. యాంగ్జీ నది వాయవ్య ప్రాంతంలో 14.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.

9జోడ్రెల్‌ బ్యాంక్‌ అబ్జర్వేటరీ


k-observatory
-అనేక దశాబ్దులుగా ఖగోళ పరిశోధనలో సేవలందిస్తున్న బ్రిటన్‌లోని జోడ్రెల్‌ బ్యాంక్‌ అబ్జర్వేటరీ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ప్రపంచంలోనే రేడియో ఖగోళశాస్త్ర పరిశోధనశాలలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. ఇది ఉల్కలు, చంద్రుడి గురించి అనేక అధ్యయనాలు చేసింది. 3,200 టన్నుల బరువుతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టీరిబుల్‌ రేడియో టెలిస్కోప్‌ అయిన జోడ్రెల్‌ బ్యాంక్‌ అబ్జర్వేటరీని 1945లో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన రేడియో టెలిస్కోప్‌లలో ఒకటిగా ఉంది.

10ఒంబిలిన్‌ కోల్‌ మైనింగ్‌


batu-bara
-ఆగ్నేయాసిలోని పురాతన బొగ్గు మైనింగ్‌ ప్రాంతమైప ఒంబిలిన్‌ కోల్‌ మైనింగ్‌ ప్రాంతం ఇండోనేషియాలో ఉంది. పశ్చిమ సుమత్రాలోని సవహ్లుంటోలో ప్రాంతంలో విస్తరించి ఉన్నది. బోరోబుదూర్‌, ప్రంబనన్‌ ఆలయం, సంగిరాస్‌ సైట్‌, బాలిలోన్‌ సుబాక్‌ వ్యవస్థ తర్వాత ఇండోనేషియాలోని ఒంబిలిన్‌ కోల్‌ మైనింగ్‌ ప్రాంతాన్ని ప్రపంచ సాంస్కృతిక వారసత్వంగా యునెస్కో గుర్తించింది.

11హిర్కానియన్‌ అడవులు


world-heritage
-ఇరాన్‌లోని హిర్కానియన్‌ అడవులు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ అడవులు కాస్పియన్‌ సముద్రం దక్షిణ తీరం వెంట 850 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. కాస్పియన్‌ సముద్రం దక్షిణ సరిహద్దులోని తూర్పు నుంచి పడమర వరకు విస్తరించి ఉత్తర ఖోరాసన్‌, గోలెస్తాన్‌, మజందరస్‌, గిలాస్‌, అర్బాబిల్‌ సరిహద్దులుగా కలిగి ఉన్నాయి. పర్షియన్‌ చిరుతపులి, 180 రకాల పక్షులు, 60కిపైగా క్షీరద జాతులకు ఈ అడవులు నిలయంగా ఉన్నాయి. ఇవి అతిపురాతనమైన అడవులు. 25 నుంచి 50 మిలియన్‌ సంవత్సరాల నాటివి. 44 శాతం వాస్కులర్‌ మొక్కలు ఈ అడవుల్లోనే కనిపిస్తాయి.

-యునెస్కో ఇటీవల గుర్తించిన వారసత్వ ప్రదేశాల జాబితాల్లో ఈ కిందివి కూడా ఉన్నాయి.
-రిస్కో కైడో అండ్‌ సాక్రెడ్‌ మౌంటెన్స్‌ ఆఫ్‌ కల్చర్‌ ల్యాండ్‌స్కేప్‌- స్పెయిన్‌
-బ్రాగాలోని బోమ్‌ జీసస్‌ డో మోంటే అభయారణ్యం- పోర్చుగల్‌
-పురాతన ఫెర్రస్‌ మెటలర్జి సైట్స్‌- బుర్కినోఫాసో
-అయిసినాయిపీ రైటింగ్‌ ఆన్‌ స్టోన్‌- కెనడా
-పసుపు సముద్రం బోహై గల్ఫ్‌ ఆఫ్‌ చైనా- చైనా
-ఎర్జిబిర్జియా మైనింగ్‌ రీజియన్‌- జర్మనీ
-ఫ్రెంచ్‌ ఆస్ట్రల్‌ ల్యాండ్స్‌ అండ్‌ సీస్‌- ఫ్రాన్స్‌
-క్లాడ్రుబి నాడ్‌ లాబెం దగ్గర ఉత్సవ గుర్రాల గ్యారేజ్‌- చెక్‌ రిపబ్లిక్‌
-ఆగ్స్‌బర్గ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌- జర్మనీ
-లే కొల్సినె డెల్‌ ప్రాసెకో డి కోనెగ్లియానో ఎ వాల్డోబియాడెనే- ఇటలీ
-ఫ్రాంక్‌ లాయిడ్‌ రైట్‌ (20వశతాబ్దపు అర్కిటెక్చర్‌)- యునైటెడ్‌ స్టేట్స్‌
-జియాంగ్‌ కువాంగ్‌ మెగాలిథిక్‌ జార్‌ సైట్స్‌- లావోస్‌
-క్రిమియోంకీ ప్లింట్‌ మైనింగ్‌ రీజియన్‌- పోలెండ్‌
-కాలాడ్రుబి నాడ్‌ లాబమ్‌- జెకియా

12చర్చెస్‌ ఆఫ్‌ స్కోవ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌


brejil
-స్కోవ్‌ రష్యా అతిపురాతన నగరం. వాయవ్య రష్యన్‌ నగరమైన స్కోవ్‌లో పదిహేడు ప్రత్యేక భవనాలు ఉన్నాయి. మధ్య యుగంలో ఈ నగరం అతి సంపన్న నగరంగా వెలుగొందింది. 12వ శతాబ్దంలో వీటిని నిర్మించారు. స్కోవ్‌ నగరంలోని ఈ చారిత్రక కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. వీటి నిర్మాణంలో స్కోవ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ లక్షణాలు ఉన్నాయి.

13వత్నాజోకుల్‌ నేషనల్‌ పార్క్‌


park
-వత్నాజోకుల్‌ నేషనల్‌ పార్క్‌ ఐస్‌లాండ్‌ ఉపరితల వైశాల్యంలో 14,701 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దాదాపు ఐస్‌లాండ్‌ వైశాల్యంలో 14శాతం ఆక్రమించి ఉన్నది. ఇక్కడ ఎక్కువ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది. ఐరోపాలో అతిపెద్ద హిమానీనదానికి నిలయంగా ఉంది. 2004లో థింగ్వెలిర్‌ నేషనల్‌ పార్క్‌ తర్వాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన మూడో ఐస్‌లాండ్‌ ప్రదేశం వత్నాజోకుల్‌ నేషనల్‌ పార్క్‌. 10 అగ్నిపర్వత కేంద్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 2109.6 మీటర్ల ఎత్తుగల ఐస్‌లాండ్‌లోనే ఎత్తయిన హవన్నాడాల్ష్న్‌కుర్‌ శిఖరం హిమానీ నదం దక్షిణ భాగంలో ఉన్నది. మంచు, అగ్నిపర్వతాలతో కూడుకున్న ఈ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు నిత్యకృత్యం. 2016లో వారసత్వ హోదా కోసం ఐస్‌లాండ్‌ ప్రభుత్వం యునెస్కోకు నామినేషన్‌ పంపినప్పటికీ 2018లో పరిశీలించి ఇప్పుడు ప్రకటించింది.

14మౌండెడ్‌ టూంబ్స్‌


japan-mo
-జపాన్‌లోని పురాతన సమాధులైన ఇవి మొజు-ఫురుచి కోఫున్‌ గ్రూప్‌నకు చెందినవి. జపాన్‌ పశ్చిమ ప్రాంతంలోని ఒసాకాలోని పురాతన శ్మశానవాటికల సముహమే మౌండెడ్‌ టూంబ్స్‌. ఇందులో 49 వరకు మట్టిదిబ్బలు ఉన్నాయి. వీటిని నాలుగో శతాబ్దం నుంచి ఐదో శతాబ్దం వరకు నిర్మించారు. సకాయ్‌, హబికినో, ఫుజిడెరా నగరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ సమాధుల్లో 486 మీటర్ల పొడవుతో కీ హోల్‌ ఆకారంలో ఉన్న సమాధి ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పవచ్చు. ఇది జపాన్‌ 16వ చక్రవర్తి నింటోకు చెందిన సమాధిగా భావిస్తారు. ఈ మౌండెడ్‌ టూంబ్స్‌ను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడంతో జపాన్‌లో వారసత్వ ప్రదేశాల సంఖ్య 23కు చేరింది.

-ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న ప్రదేశాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించి వారసత్వ సంపద ప్రాధాన్యతను తెలియజేసేలా యునెస్కో వివిధ కార్యక్రమాలను చేపడుతుంది. ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం అంటే ప్రపంచపర్యాటక మ్యాపులో శాశ్వతస్థానాన్ని సంపాదించడమే. అక్కడి ప్రాంతాల ప్రజలకు హెరిటేజ్‌ గుర్తింపు ఒక గర్వకారణంగా చెప్పవచ్చు. ఒకసారి హెరిటేజ్‌ కమిటీ గుర్తింపు లభిస్తే ఎనలేని ప్రచారం జరుగుతుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వారసత్వంగా గుర్తించి వాటిని పరిరక్షిస్తూ.. ఇతర తరాలకు అందిస్తుంది. ఈ గుర్తింపు ద్వారా మానవ సంస్కృతి, వికాసానికి నిదర్శనంగా నిలిచిన ఈ ప్రాంతాల పరిరక్షణ బాధ్యతలను యునెస్కో చేపడుతుంది. మనుషులు, జంతువులు ఈ చారిత్రక ప్రదేశాల్లోకి అక్రమంగా ప్రవేశించకుండా, ధ్వంసం కాకుండా, స్థానిక పరిపాలన యంత్రాంగం నిర్లక్ష్యానికి గురికాకుండా కాపాడుతుంది. ఇందుకు అవసరమైన నిధులను ప్రపంచ వారసత్వ నిధి సమకూరుస్తుంది.

15సియోవాన్‌


Seowon
-కొరియాలోని జోసియన్‌ శకానికి చెందిన తొమ్మిది కన్ఫ్యూషియస్‌ అకాడమీలు (సియోవాన్‌) ప్రపంచ వారసత్వ జాబితాలో చోటుసంపాదించాయి. క్రీ.శ. 1392-1910 కాలానికి చెందిన జోసియన్‌ రాజవంశం వీటిని నిర్మించింది. సియోవాన్‌ కన్ఫూషియస్‌ అకాడమీలు కన్ఫ్యూషియనిజం అభివృద్ధికి సూచికగా నిలిచాయి. ముఖ్యంగా ఈ తొమ్మిది అకాడమీల్లో యోయోంగ్జులోని సోసు సియోస్‌ కన్ఫూషియస్‌ అకాడమీ మొదటిది. దీనికి జూ సే బూంగ్‌ (1495-1554) బేగుండోంగ్‌ సియోవాన్‌ అని పేరు పెట్టారు. తర్వాత నామ్‌గైసోవాస్‌ను హమ్యాంగ్‌, ఒక్సాన్సీవోస్‌ను జియోంగ్జు, డోసాన్సీవోస్‌ను అండోంగ్‌, పిరామ్‌సీవోస్‌ను జాంగ్‌సింగ్‌, డోడోంగ్సివోస్‌ను డాల్సియాంగ్‌, బయోంగ్సాన్సీవోస్‌ను అండోంగ్‌, డోనామ్‌సీవోస్‌ను నాన్సాస్‌, మ్యూజియోంగ్సీవోస్‌ను జియోంగప్‌ నిర్మించారు. 1573లో నిర్మించిన ఓక్సాన్సీవోస్‌ ప్రత్యేకమైన భవననిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. మొత్తం కట్టడం కన్ఫ్యూషియస్‌ రేఖాగణిత శైలిలో ఉంటుంది. ఇవన్నీ కొరియన్లు ఇష్టపడే పశ్చిమ దిశలో నిర్మాణం జరిగాయి.
...? సూదగాని సత్యం గౌడ్‌

299
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles