కరెంట్ అపైర్స్


Wed,July 17, 2019 03:20 AM

Telangana
Telangana

స్మార్ట్ ఇండియా హాకథాన్-2019

స్మార్ట్ ఇండియా హాకథాన్-2019లో నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను చూపినందుకు ఈ అవార్డు లభించింది. బహుమతి కింద విజేతలకు రూ.50,000 నగదు ప్రదానం చేస్తారు.

చకిలం లలితాదేవి మృతి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చకిలం లలితాదేవి జూన్ 13న హైదరాబాద్‌లో మరణించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరం గ్రామానికి చెందిన ఆమె తన భర్త చకిలం తిరుమలరావుతో కలిసి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.

International
International

నగర్‌కీర్తన్

సార్క్ ఫిలిం ఫెస్టివల్ 2019లో బెంగాలీ చిత్రం నగర్‌కీర్తన్ సత్తా చాటింది. కౌషిక్ గంగూలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సార్క్ ఫిలిం ఫెస్టివల్‌లో నాలుగు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది.

అన్షులా కాంత్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ అన్షులా కాంత్ ప్రపంచ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా నియమితులయ్యారు. ఆన్షులా కాంత్ ఎస్‌బీఐ సీఎఫ్‌వోగా కూడా పనిచేశారు.

గాఫా ట్యాక్స్

ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే సేవల కంపెనీలపై ఫ్రాన్స్ ప్రభుత్వం మొదటిసారిగా గాఫా ట్యాక్స్ పేరుతో మూడుశాతం లెవీని విధించింది. గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి సంస్థల వార్షిక ఆదాయంపై ఈ మూడు శాతం పన్నును వసూలు చేస్తారు.

హయబుసా 2

జపాన్ ప్రయోగించిన హయబుసా 2 ప్రోబ్ రుగు ఆస్టరాయిడ్‌పై విజయవంతంగా దిగింది. భూమికి 300 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆస్టరాయిడ్ ఉపరితలం లోపలి భాగంలోని మూలకాలపై ఈ ప్రోబ్ సమాచారం అందిస్తుంది. హయబుసా 2ను 2014 డిసెంబర్‌లో ప్రయోగించగా 2020లో తిరిగి భూమికి చేరుకోనుంది.

ప్రపంచ జనాభా దినోత్సవం

జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. జనాభా పెరుగుదలతో ఎదురయ్యే సమస్యలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) 1989లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. 1987 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకున్నందున ఆ రోజునే జనాభా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలో ప్రస్తుతం అత్యధిక జనాభా ఉన్న 10 దేశాలు

1. చైనా - 140 కోట్లు - ప్రపంచ జనాభాలో 18 శాతం
2. ఇండియా - 130 కోట్లు - ప్రపంచ జనాభాలో 17.7 శాతం
3. అమెరికా - 32.9 కోట్లు
4. ఇండోనేషియా - 26.9 కోట్లు
5. బ్రెజిల్ - 21.2 కోట్లు
6. పాకిస్థాన్ - 20.4 కోట్లు
7. నైజీరియా - 20 కోట్లు
8. బంగ్లాదేశ్ - 16.8 కోట్లు
9. రష్యా - 14.3 కోట్లు
10. మెక్సికో - 13.2 కోట్లు

National
National

సేవ్ వాటర్ డే

జూలై 12ను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సేవ్ వాటర్ డేగా పాటించింది. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా జల సంరక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో సేవ్ వాటర్ పాదయాత్ర నిర్వహించారు.

త్రిపురలో ఖర్చీ పూజ

త్రిపుర రాష్ట్ర పండుగ అయిన ఖర్చీ పూజను జూలై 12న రాష్ట్ర ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పాత అగర్తలలోని చతుర్దశి దేవతా బారిలో ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమాన్ని జూలై 16 వరకు నిర్వహించారు. ఈ పూజలో ప్రధానంగా 14 మంది దేవతలను పూజిస్తారు.

ఆపరేషన్ థర్ట్స్

దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో అనుమతి లేని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (పీడీడబ్ల్యూ) విక్రయాన్ని నిరోధించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) జూలై 8, 9 తేదీల్లో ఆపరేషన్ థర్ట్స్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశంలోని అన్ని రైల్వేస్టేషన్లలో అనుమతి లేని నీటి బాటిళ్లను విక్రయిస్తున్న 1,371 మందిని అరెస్టు చేసి 69,294 నీళ్ల బాటిళ్లను సీజ్ చేశారు.

ప్రధాన్‌మంత్రి గ్రామ్ సడక్ యోజన

రాష్ర్టాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.1,25,000 కోట్లతో ప్రధాన్‌మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) మూడో విడత కార్యక్రమానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) జూలై 11న ఆమోదం తెలిపింది. ఈ దఫాలో గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్లను పక్కా రోడ్లతో అనుసంధానించేందుకు ప్రాధాన్యం ఇస్తారు.

హిమాచల్ గవర్నర్‌గా కల్‌రాజ్ మిశ్రా

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు కల్‌రాజ్ మిశ్రాను కేంద్రప్రభుత్వం జూలై 15న నియమించింది. ప్రస్తుత గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను గుజరాత్ గవర్నర్‌గా బదిలీ చేసింది.

కేరళ ఎన్‌ఆర్‌ఐ కంపెనీ

కేరళ నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడిన పౌరుల నుంచి రాష్ట్రంలోకి పెట్టుబడులను రాబట్టేందుకు కేరళ ప్రభుత్వం నాన్ రెసిడెంట్ కేరళైటీస్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 74శాతం, మిగతాది ఇతరుల వాటా ఉంటుంది.

కన్నాట్ ప్లేస్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆఫీస్ ప్రదేశాల్లో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ 9వ స్థానంలో నిలిచింది. సీపీఆర్‌ఈ సంస్థ గ్లోబల్ ప్రైమ్ ఆఫీస్ ఆక్యుపెన్సీ కాస్ట్ సర్వే పేరుతో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించింది.

స్పైక్ మిస్సైల్స్

ఇజ్రాయెల్‌కు చెందిన స్పైక్ మిస్సైల్స్ కొనుగోలు చేయాలని భారత సైన్యం నిర్ణయించింది. యుద్ధట్యాంకు విధ్వంసకర క్షిపణులైన స్పైక్స్ 4 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలవు.

భారత్- రష్యా వ్యూహాత్మక చర్చలు

భారత్-రష్యా రెండో వ్యూహాత్మక ఆర్థిక చర్చలు జూలై 10న ఢిల్లీలో జరిగాయి. ఈ చర్చల్లో భారత బృందానికి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్, రష్యా బృందానికి ఆ దేశ ఆర్థికశాఖ డిప్యూటీ మంత్రి తిమూర్ మ్యాక్సిమో నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో 6 అంశాలపై చర్చలు జరిపారు.

1. రవాణా మౌలిక వసతులు, సాంకేతికత అభివృద్ధి
2. చిన్న, మధ్యతరహా వాణిజ్యానికి మద్దతు
3. వ్యవసాయం, వ్యవసాయ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధి
4. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, కీలక సాంకేతికతల అభివృద్ధి
5. వాణిజ్యం, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర రంగాల్లో సహకారం
6. టూరిజం, కనెక్టివిటీలో సహకారం

సిఖ్ ఫర్ జస్టిస్‌పై నిషేధం

ఖలిస్థాన్ రాజ్యం కోసం హింసామార్గంలో పోరాటానికి ఏర్పడిన సిక్కు అతివాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. 2007లో ఏర్పడిన ఈ సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్న కారణంతో భారత ప్రభుత్వం దానిని నిషేధించింది. ఈ సంస్థకు ఆన్‌లైన్‌లో 2 లక్షల మంది మద్దతుదారులున్నారు.

Sports
Sports

క్రికెట్ విజేత ఇంగ్లండ్

క్రికెట్ ప్రపంచకప్ విజేతగా ఇంగ్లండ్ అవతరించింది. జూలై 14న లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ఇంగ్లండ్ మొదటిసారి ప్రపంచకప్ సాధించింది.

వింబుల్డన్ విజేత జకోవిచ్

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ సాధించారు. జూన్ 14న లండన్‌లో జరిగిన ఫైనల్లో దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్‌పై సెర్బియా ఆటగాడు జకోవిచ్ విజయం సాధించాడు. జకోవిచ్‌కు ఇది ఐదో వింబుల్డన్ టైటిల్.. మొత్తంగా 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్.

జూలై 13న జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ను ఓడించి రొమేనియా క్రీడాకారిణి సిమోనా హాలెప్ విజేతగా నిలిచింది.

వినేష్ ఫోగట్‌కు గోల్డ్

టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న యాసర్ డొగు ఇంటర్నేషనల్ టోర్నీలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ 53 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు. జూలై 14న జరిగిన ఫైనల్లో రష్యా క్రీడాకారిణి ఏక్తారినా పొలెస్‌చుక్‌పై 9-5 పాయింట్ల తేడాతో విజయం సాధించి బంగారు పతకం సాధించింది.

హామిల్టన్‌దే బ్రిటిష్ గ్రాండ్‌ప్రి

బ్రిటిష్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసులో మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి విజేతగా నిలిచాడు. జూలై 14న జరిగిన ఫైనల్ రేసును 21 నిమిషాల 08.452 సెకండ్లలో పూర్తిచేసి రికార్డు స్థాయిలో ఆరోసారి ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

ఆల్ ఇండియా ఫుట్‌బాల్ అవార్డ్స్

భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రి, మహిళా ఫుట్‌బాలర్ ఆశలతాదేవిలకు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) 2018-19కి గాను ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ అవార్డులు లభించాయి.

ద్యుతీ చంద్

నేపాల్‌లో జరిగిన ప్రపంచ యూనివర్సియేడ్ క్రీడల్లో భారత స్టార్ అథ్లెట్ ద్యుతీచంద్ 100 మీటర్ల విభాగంలో బంగారు పతకం సాధించారు. దీంతో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా ద్యుతీ చరిత్ర సృష్టించారు.

Persons
Persons

డీజీసీఏ

భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ నూతన డైరెక్టర్ జనరల్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖ అదనపు కార్యదర్శి అరుణ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన 1989 బ్యాచ్‌కు చెందిన హర్యానా క్యాడర్ ఐఏఎస్ అధికారి. బీఎస్ భుల్లార్ స్థానంలో అరుణ్‌కుమార్ నియమితులయ్యారు.

బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీగా ప్రవీణ్

ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ పూర్వర్‌ను నియమిస్తూ కేందప్రభుత్వం జూలై 9న ఉత్తర్వులు జారీచేసింది.

Vemula-Saidulu

870
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles