కాలేజీ ఎంపికలో జాగ్రత్త


Mon,July 8, 2019 01:26 AM

-ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య

ఎంసెట్‌ ర్యాంకులు ప్రకటించారు. చాలామంది సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయ్యింది. వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. చాలామంది ఏ కాలేజీలో చేరాలి? బ్రాంచీకి ప్రాముఖ్యత ఇవ్వాలా? కాలేజీకి ప్రాధాన్యం ఇవ్వాలా అనే సంశయంలో ఉన్నారు. అదేవిధంగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల వెల్లడి, ఇప్పటివరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకాని వారికి ఉన్న సందేహాల నివృత్తి కోసం జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌, ఎంసెట్‌ కన్వీనర్‌, ప్రొఫెసర్‌ ఎన్‌.యాదయ్య నిపుణతో చెప్పిన విషయాలు, సూచనలు ఆయన మాటల్లో..
photodune
-ఈసారి ఎంసెట్‌ ప్రవేశాలలో స్వల్ప మార్పులు చేశాం. గతంలో ర్యాంకుల ఆధారంగా తేదీలను ఇచ్చి ఆయా నిర్దేశిత కేంద్రాలలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసేవారు. ఈసారి విద్యార్థులకు మరింత సులభంగా, ఇబ్బందులు లేకుండా ఉండటానికి స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాం. దీనివల్ల విద్యార్థులు కోరుకున్న తేదీన కోరుకున్న సెంటర్‌లో కోరుకున్న సమయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తిచేశాం. దీనివల్ల విద్యార్థులు చాలా తక్కువ సమయంలో వెరిఫికేషన్‌ను పూర్తిచేసుకున్నారు. ఎక్కువ సమయం వృథా కాకుండా నివారించగలిగాం. అంతేకాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొదటి ఫేజ్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయింది.
-ఇక విద్యార్థులకు జూలై 6 నుంచి వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో చాలామంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఏ కాలేజీలో చదవాలి? ఏ బ్రాంచీ తీసుకోవాలి? ఈ విషయాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం...

కాలేజీ ఎంపిక:


-కాలేజీ ఎంపిక అనేది మంచి ర్యాంకు వచ్చినవారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. వారు కోరుకున్న కాలేజీలో చేరవచ్చు. ఇక మధ్యస్థంగా ర్యాంకు వచ్చిన వారికి అనేక సందేహాలు. ప్రధానంగా కాలేజీ ఎంపిక కోసం కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే కాలేజీ ఎంపిక చాలా సులువుగా చేసుకోవచ్చు. వీటిలో ప్రధానంగా కింది అంశాలను పరిశీలించాలి.
-కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌) ర్యాంకు ప్రాతిపదికగా తీసుకోవాలి.
-ఎన్‌బీఏ, న్యాక్‌ అక్రెడిటేషన్లు పరిశీలించాలి
-కాలేజీ ఎక్కడ ఉంది, రవాణా సౌకర్యం, ఉన్న ప్రదేశానికి రాకపోకలకు ఎంత సమయం తీసుకుంటుంది వంటి ప్రాథమిక అంశాలను తెలుసుకుని లెక్కలోకి తీసుకోవాలి.
-ప్లేస్‌మెంట్స్‌ విషయంలో ప్రచార పటాటోపాలను చూసి మోసపోవద్దు. క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఏయే కంపెనీలు వస్తున్నాయి, ఏటా ఎంతమందికి ప్లేస్‌మెంట్స్‌ లభిస్తున్నాయనే విషయాన్ని పూర్వ విద్యార్థుల ద్వారా, వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవాలి.
-కాలేజీలో సీనియర్‌ ఫ్యాకల్టీ ఉన్నారా లేరా తెలుసుకోవాలి. సీనియర్‌ ఫ్యాకల్టీ వల్ల విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి. ఆయా సబ్జెక్టుల్లో విలువైన సూచనలు, ప్రాజెక్టుల రూపకల్పన, అకడమిక్‌, ప్రాక్టికల్‌గా కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది.
-ల్యాబొరేటరీలను పరిశీలించుకోవాలి. పూర్వ విద్యార్థుల ద్వారా లేదా ప్రస్తుతం సెకండియర్‌, థర్డ్‌, ఫోర్త్‌ ఇయర్‌ చదువుతున్నవారి ద్వారా విషయాలను తెలుసుకోవాలి.
-సంబంధిత సబ్జెక్టులే కాకుండా అదనంగా ఏం బోధిస్తున్నారు? క్యాంపస్‌, ఆఫ్‌క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు ఏమైనా నేర్పిస్తున్నారా? సాఫ్ట్‌ స్కిల్స్‌ను నేర్పిస్తున్నారా? ఏయే క్లబ్‌లు ఉన్నాయి? టెక్‌ ఫెస్ట్‌లు, ఇంటర్‌ కాలేజీ కాంపిటీషన్లలో ఈ కాలేజీ పార్టిసిపేషన్‌ ఉందా ఇతరత్రా విషయాలు తెలుసుకోవాలి.
-లైబ్రేరీ, ప్లేగ్రౌండ్‌ తదితర అంశాలను సైతం లెక్కలోకి తీసుకుంటే తప్పక మంచి కాలేజీని ఎంపిక చేసుకోవడం సులభమే.
yadaiah

బ్రాంచీ ఎంపిక:


-ఇటీవల కాలంలో బ్రాంచీ ఎంపికలో చాలామంది మూసగా పోతున్నారు. ఎక్కువ మంది సీఎస్‌ఈ కావాలనే కోరుకుంటున్నారు. అది తప్పుకాకున్నా నిజంగా విద్యార్థికి ఏ సబ్జెక్టు లేదా ఏ బ్రాంచీమీద పట్టు లేదా అభిరుచి ఉందో పరిశీలించుకోవాలి. అవసరమైతే ఆయా సబ్జెక్టుల్లో నిపుణులను, సీనియర్ల సలహాలను తీసుకోండి.
-తల్లిదండ్రులు పిల్లల మనోభీష్టాన్ని గుర్తించి తదనుగుణంగా బ్రాంచీలను ఎంపిక చేసుకుంటే ఆయా రంగాలలో రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థికి ఉదాహరణలతో చెప్పి ఏ బ్రాంచీ తీసుకుంటే మంచిదో చెప్పండి.
-సాధారణంగా అన్ని బ్రాంచీలకు మంచి అవకాశాలే ఉంటాయి. కొన్నింటికి ఎంఎన్‌సీలలో అధిక వేతనం రావచ్చు, కానీ ఆ బ్రాంచీలకు ప్రభుత్వ, పీఎస్‌యూలలో అవకాశాలు తక్కువగా ఉండవవచ్చు. అన్ని బ్రాంచీలకు నవరత్న, మినీరత్న, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
-ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన అంశం ర్యాంకును బట్టి కొన్ని సందర్భాలలో అనుకున్న బ్రాంచీ రాకపోవచ్చు. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ బ్రాంచీ మీద ఫొకస్‌గా చదివితే తప్పక ఆ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవచ్చు. చదివే బ్రాంచీపై మక్కువ పెంచుకుని ఎక్కువ కృషి చేస్తే తప్పక ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు.
-ఆయా కాలేజీల్లో రకరకాల బ్రాంచీలు ఉంటాయి. అవి చదివితే కెరీర్‌ తప్పక ఉంటుంది. లేకపోతే ఆ కాలేజీలు ఆ బ్రాంచీలను పెట్టరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.
-చివరగా కాలేజీ, బ్రాంచీల ఎంపిక అనేది పూర్తిగా విద్యార్థి అభీష్టం మీదనే ఆధారపడుతుంది. కొన్ని సందర్భాలలో కాలేజీ చూసుకుంటే బ్రాంచీ దొరకకపోవచ్చు. బ్రాంచీ చూసుకుంటే కాలేజీ దొరకకపోవచ్చు. కానీ బాధపడాల్సిన అవసరం లేదు, మీ ఇష్టమైన దానిలో చేరి ఫోకస్డ్‌గా చదివితే తప్పక రాణిస్తారు.

ఆప్షన్ల ఎంపిక కోసం:


-ఎవరైతే సర్టిఫికేషన్‌ పూర్తయ్యిందో వారు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకోవాలి. దీనికోసం అభ్యర్థులకు ఇప్పటికే లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను పంపాం. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో షేర్‌ చేసుకోవద్దు. పూర్తిగా సీక్రెట్‌గా ఉంచుకోవడం మంచిది.
-ఆప్షన్లు ఇచ్చేముందు మ్యానువల్‌ ఆప్షనల్‌ ఫార్మ్‌ ప్రింట్‌ తీసుకుని మ్యానువల్‌గా కాలేజీ, డిస్ట్రిక్ట్‌ కోడ్‌, కోర్సు కోడ్‌లను ప్రాధాన్యత క్రమంలో రాసుకోండి.
-ఒకటికి రెండుసార్లు పైన చెప్పిన అంశాలను అంటే కాలేజీ, బ్రాంచీలను ప్రాతిపదికగా తీసుకుని జాబితాను తయారుచేసుకోండి.
-తల్లిదండ్రులు, నిపుణులు, సీనియర్‌ విద్యార్థులను సంప్రదించి జాగ్రత్తగా జాబితాను రూపొందించుకోండి.
-మ్యానువల్‌గా ఓకే అనుకున్నాక ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్లను ఇచ్చుకోండి. సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లను ఇచ్చుకోండి.
-చివరగా విద్యార్థులకు చెప్పే విషయం ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుని నిర్ణయించుకోండి. ఇది మీ జీవితంలో అత్యంత మలుపు తిప్పే కాలం ఇది. జీవితంలో స్థిరపడాలనుకునే రంగాన్ని జాగ్రత్తగా నిర్ణయించుకుని ఇష్టంతో ముందుకుపోవాలి.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎవరికి...?


-ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో చాలామందికి రకరకాల అనుమానాలు ఉన్నాయి. వీటి నివృత్తి కోసం ఎంసెట్‌ ప్రవేశాలకు సంబంధించిన అధికారులు తెలిపిన వివరాలు..
-ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
-మొదటి పదివేల ర్యాంకు లోపు వచ్చిన అన్ని కేటగిరీల అభ్యర్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటుంది.
-ఆదాయ ధృవీకరణ పత్రం ప్రకారం జనరల్‌ (ఓసీలకు) రూ. లక్ష లోపు ఆదాయం ఉన్నవారికి, ఎస్సీ, ఎస్టీలైతే రూ. 2 లక్షల ఆదాయం ఉన్నవారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటుంది.
-ఇక బీసీ అభ్యర్థుల విషయానికి వస్తే అర్బన్‌ ఏరియా విద్యార్థులకు రూ. 2 లక్షలు, రూరల్‌ ఏరియా అభ్యర్థులైతే రూ. 1.50 లక్షల లోపు ఉండాలి.
-ఆదాయ ధృవీకరణ పత్రం ప్రకారం అర్హత ఉన్నవారికి ఎస్సీ/ఎస్టీలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటుంది.
-పైన పేర్కొన్న ఆదాయ పరిమితుల్లో ఉండి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివిన అన్ని కేటగిరీల విద్యార్థులందరికీ ఏ ర్యాంక్‌ వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది.
-డీఆర్‌డీఏ స్కీంలో చదువుకున్న ఎస్సీ/ఎస్టీల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది.
-ప్రభుత్వం పేర్కొన్న ఆదాయ పరిమితుల్లో ఉన్న ప్రతి విద్యార్థికి (పదివేల కంటే ఎక్కువ ర్యాంక్‌ వచ్చినవారు) ప్రభుత్వం రూ. 35 వేలు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇస్తుంది. మిగిలిన ఫీజును అభ్యర్థులు చెల్లించాలి.
-ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన ఇంటర్నల్‌ ైస్లెడింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులకూ (అర్హత ఉన్నవారికి) ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది.
...?కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

వెబ్‌ ఆప్షన్లు కీలకం


-అభ్యర్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత ఇంట్లో/ ఇంటర్నెట్‌ సెంటర్‌/ ఇతర ఇంటర్నెట్‌ అవకాశం ఉన్నచోటికి వెళ్లి వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోవాలి.
-కొంతమంది ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చి ఉంటారు. మరోసారి తల్లిదండ్రులు, విద్యార్థులు కాలేజీలు, కోర్సులకు సంబంధించి కసరత్తు చేసుకోవడం మంచింది. అంటే ఏ కాలేజీలో చేరాలి? ఏ బ్రాంచీలో చేరాలి? అక్కడ ఫీజు కట్టగలమా? హాస్టల్‌ సౌకర్యం ఉందా (అవసరమైన వారికి) తదితర వివరాలను తెలుసుకోవాలి.
-టీఎస్‌ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో యూజర్‌ మ్యానువల్‌ను క్షుణ్ణంగా చదవండి.
-ఆప్షన్స్‌ నమోదు చేసేటప్పుడు కాలేజీలు, కోర్సులను ప్రియారిటీ ప్రకారం నమోదు చేసుకున్నారా లేదా చూసుకోండి.
-ముఖ్యంగా ఇంటర్నెట్‌ సెంటర్లలో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేవారు ఆప్షన్లు సేవ్‌ చేసిన తర్వాత బయటకి వచ్చే ముందు తప్పనిసరిగా లాగ్‌ అవుట్‌ కావాలి.
-నిర్ణీత తేదీలోపు విద్యార్థి ఎన్నిసార్లయినా ఆప్షన్లు మార్చుకోవచ్చు. మొదటి లిస్ట్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ను జూలై 10న ప్రకటిస్తారు. జూలై చివరి వారంలో సెకండ్‌ ఫేజ్‌ మొదలవుతుంది.
-సీటు అలాట్‌మెంట్‌ అయిన తర్వాత అభ్యర్థులు ఆర్‌వోసీ ఫాం నంబర్‌, టీఎస్‌ఎంసెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, జనన తేదీతో లాగిన్‌ కావాలి. తర్వాత ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ ప్రింట్‌ తీసుకోవాలి.
-అలాట్‌మెంట్‌ ఆర్డర్‌లో పేర్కొన్న ట్యూషన్‌ ఫీజును నిర్ణీత గడువులోగా చెల్లించాలి. లేకుంటే సీటు రద్దవుతుంది.
-ట్యూషన్‌ ఫీజును క్రెడిట్‌/డెబిట్‌/నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చు. తర్వాత ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. అప్పుడు అలాట్‌ అయిన సీటు ఉంటుంది. ఆ కాపీని ప్రింట్‌ తీసుకోవాలి.
-ఒకవేళ అభ్యర్థి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌లో జీరో ట్యూషన్‌ ఫీజు (ఎటువంటి ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుంటే) ఉంటే నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. లేకుంటే సీటు రద్దవుతుంది. ఆ కాపీని ప్రింట్‌ తీసుకోవాలి.
-విద్యార్థి ఇష్టాయిష్టాలను బట్టి రెండు, మూడు రౌండ్ల కౌన్సెలింగ్‌లకు వెళ్లవచ్చు. అయితే వీటికి సంబంధించిన విషయాలను సమగ్రంగా తెలుసుకోవడం మంచిది.

ఎక్కువ ఆప్షన్లు ఇవ్వండి


-వెబ్‌ ఆప్షన్ల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏ ర్యాంక్‌ వచ్చిన అభ్యర్థులైనా సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లను ఇవ్వాలి. ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడంవల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఉదాహరణకు ఒక అభ్యర్థికి 2 వేల ర్యాంక్‌ వచ్చింది. గతేడాది ప్రకారం మంచి కాలేజీలో వస్తుందన్న నమ్మకంతో నాలుగైదు ఆప్షన్లు మాత్రమే ఇచ్చారునుకుందాం. ఈసారి ర్యాంకుల పరిస్థితిని బట్టి ఆ కాలేజీల్లో సీటు రాకుంటే మళ్లీ రెండోదశ కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మంచి ర్యాంక్‌ వచ్చి కూడా మొదటిదశలో మిగిలిపోయిన సీట్లలో ఎంపికచేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ కాలేజీలు, కోర్సులు ఆప్షన్లు ఇచ్చుకుంటే మంచిది. అలాట్‌మెంట్‌ ర్యాంక్‌, సీట్ల ప్రాతిపదికనే జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఆప్షన్లు ఇచ్చినా మీరు ఇచ్చిన ప్రియారిటీ బట్టే సీటు అలాట్‌ అవుతుంది. మరో ముఖ్య విషయం కాలేజీల వివరాలు, కోర్సుల వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుని ఆప్షన్లు ఇవ్వాలి. గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ విషయంలో ఆ కాలేజీల వివరాలు తెలుసుకోవాలి. మీ ప్రియారిటీ ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి.
-మొదటి ఫేజ్‌ సీట్ల అలాట్‌మెంట్‌లో అభ్యర్థి అనుకున్న కాలేజీలో/కోర్సులో సీటు రాకుంటే రెండో కౌన్సెలింగ్‌కు వెళ్లాలి. అయితే ఇక్కడ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటి ఫేజ్‌లో అలాట్‌ అయిన సీటుకు సంబంధించి నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించకపోతే ఆటోమేటిక్‌గా సీటు రద్దవుతుంది. ఒకవేళ ఫీజు చెల్లిస్తే సీటు ఉంటుంది. రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇప్పుడు వచ్చిన కోర్సు/కాలేజీ కంటే ఉన్నతమైంది మాత్రమే ఆప్షన్లుగా ఇవ్వాలి.
-రెండో రౌండ్‌లో సీటు అలాట్‌ అయితే మొదటి రౌండ్‌లో వచ్చిన సీటు రద్దవుతుంది. ఫీజు బదిలీ చేయబడుతుంది. ఒకవేళ రెండో రౌండ్‌లో సీటు రాకుంటే మొదట వచ్చిన సీటు ఉంటుంది. రెండో రౌండ్‌లో కూడా అభ్యర్థి అనుకున్నది రాకుంటే మూడో రౌండ్‌కు వెళ్లవచ్చు. ఇక్కడ కూడా ఇప్పటికే అలాట్‌ అయిన కోర్సు/కాలేజీ కంటే ఉన్నతమైందే ఆప్షన్లుగా ఇవ్వాలి. లేకుంటే మంచి ర్యాంక్‌ వచ్చి కూడా ఏదో ఒక కోర్సు/కాలేజీలో జాయిన్‌ కావాల్సి వస్తుంది. మొదట సీటు రద్దయి రెండోరౌండ్‌లో వేరే సీటు అలాట్‌ అయితే మొదటి సీటును ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వడం కుదరదు. అది వేరేవారికి అలాట్‌ చేస్తారు. కాబట్టి రెండు/మూడు రౌండ్‌లకు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా నిపుణులు/సీనియర్ల సలహాలు తీసుకుని ఆప్షన్లు ఎంపికచేసుకోవాలి.
b-srinivas

1306
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles