హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌


Mon,July 8, 2019 01:14 AM

రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ప్రజల జీవన విధానం మారుతున్నది. దీంతో రోగాల బారిన పడుతున్నారు. ప్రజల్లో పెరుగుతున్న రోగాలకు తగ్గట్టే ఆస్పత్రులు కూడా పెరుగుతున్నాయి. రోగులు, సహాయకులతో ఆస్పత్రులు బిజీబిజీగా మారుతున్నాయి. దీంతో ఆస్పత్రుల నిర్వహణ అనేది క్లిష్టమైన ప్రక్రియ. అందువల్లనే ఆస్పత్రుల నిర్వహణ కోసం కోర్సులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఆ కోవలోకి చెందినవే హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు. ఈ కోర్సుల వివరాలు మీ కోసం అందిస్తున్నాం.
healthcare
-ప్రస్తుతం ఉన్న మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ అనేది చాలా మంచి కోర్సు. ఇది ఆరోగ్య రంగంలో అత్యంత ముఖ్యమైన, లాభదాయకమైన సంతృప్తినిచ్చే వృత్తి. ఒకప్పుడు సీనియర్‌ వైద్యులు హాస్పిటల్‌ మేనేజర్‌ పాత్రను పోషించేవారు. దీంతో ట్రీట్‌మెంట్‌, ఆపరేషన్లు వంటి బాధ్యతలతో పాటు రోగులకు తమ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కాబట్టి వైద్యులను ఇటువంటి హాస్పిటల్‌ మేనేజర్‌ విభాగం నుంచి తప్పిస్తేనే ఆస్పత్రులు రోగులకు మేలైన సేవలు అందించగలుగుతాయి. అందుకే ఆస్పత్రుల్లోని సంబంధిత విభాగాల నిర్వహణకు ప్రొఫెషనళ్లను తయారుచేయాలన్న హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు రూపకల్పన చేశారు.
-హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ అనేది ఆస్పత్రి నిర్వహణ లేదా ఆస్పత్రి పరిపాలన అంటారు. ఆరోగ్య సంరక్షణ సర్వీసులు, వారికి అవసరమైన సేవలను అందించేవారికి మధ్య ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటారు. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఆస్పత్రి భౌతిక, ఆర్థిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఆస్పత్రి, మెడికల్‌ సదుపాయాలను సరైన విధంగా నిర్వహించడంలో హాస్పిటల్‌ మేనేజర్లు చాలా అవసరం.
-వైద్యులు, రోగులు, నర్సులు, వైద్య అనుబంధ విభాగాల సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆస్పత్రి కార్యకలాపాలు సాఫీగా జరిగేలా చూసేవారే హాస్పిటల్‌ మేనేజర్‌. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ కలగడంతో ముందస్తు వైద్యసేవలు వినియోగించుకునేవాళ్లు అధికమయ్యారు. దీంతో ఆస్పత్రులు వాటి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. అంతేకాకుండా కొత్త ఆస్పత్రులు కూడా ఏర్పాటవుతున్నాయి. సంబంధిత విభాగాలను నిర్వహించడానికి స్పెషలైజ్డ్‌ మానవ వనరులు అవసరం. కాబట్టి చాలా విద్యాసంస్థలతో పాటు ఆస్పత్రులు కూడా హాస్పిటల్‌/హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి.
-ఈ కోర్సు చేయాలనుకునేవారికి సేవా దృక్పథం ఉండాలి. ఎక్కువ సమయం పనిలో గడపటానికి సన్నద్ధం కావాలి. సహనమూ అవసరమే. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఒత్తిడిలోనూ పనిచేయగలిగే నేర్పు, గడువులోగా పని పూర్తిచేయగల సమర్థత అవసరం.
-ఫైనాన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌పై మంచి నాలెడ్జ్‌ ఉండాలి. అందరితో పనిచేయించగల నైపుణ్యం ఉండాలి.
healthcare1

ఉపాధి


-ప్రస్తుతం పెద్ద పట్టణాలకే పరిమితమైన కార్పొరేట్‌ ఆస్పత్రులు చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తున్నాయి. ఇవి 24 గంటలూ సేవలు అందించాలి. కాబట్టి హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ సంబంధిత కోర్సులు చేసిన అభ్యర్థులకు బాగా డిమాండ్‌ ఉంది.
-ఈ కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులతో పాటు జాతీయ, అంతర్జాతీయ వైద్య విభాగ సంస్థలు, మెడికల్‌ కాలేజీలు, హెల్త్‌ ఏజెన్సీలు, ల్యాబొరేటరీలు, క్లినిక్‌లు, మానసిక చికిత్సా కేంద్రాలు, హెల్త్‌ కేర్‌ సెంటర్లు, నర్సింగ్‌ హోమ్‌లు, పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్లు, పునరావాస కేంద్రాలు, హాస్పిటల్‌ సంబంధించిన సప్లయ్‌ సంస్థలు, కార్పొరేట్‌ ఫార్మసీలు, ఫార్మా సంస్థలు, డయోగ్నస్టిక్‌ సెంటర్లు, ఆరోగ్య బీమా సంస్థలు మొదలైన చోట్ల అవకాశాలు లభిస్తాయి.
-నైపుణ్యాలు ఉన్నవారికి విదేశాల్లోనూ ఆకర్షణీయ వేతనాలతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి.

ఎంబీఏ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌


-ఈ కోర్సు చేయాలంటే 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.
-ఈ కోర్సు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉంది.
-రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌


-ఈ కోర్సు చేయడానికి 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
-ఈ కోర్సు అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, డెక్కన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లలో అందుబాటులో ఉంది.
-ఎంట్రన్స్‌ పరీక్ష ద్వారా ఈ కోర్సులోకి ఎంపిక చేస్తారు.

పీజీ డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌


-ఈ కోర్సు చేయడానికి 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
-క్యాట్‌, మ్యాట్‌, సీమ్యాట్‌, గ్జాట్‌, జీమ్యాట్‌, ఏటీఎంఏలో క్వాలిఫై అయి ఉండాలి.

మాస్టర్స్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌


-ఇటీవలనే నిమ్స్‌ హాస్పిటల్‌ ఈ కోర్సును ప్రారంభించింది.
-ఏదైనా డిగ్రీ పూర్తిచేసి 30 ఏండ్లలోపు ఉన్నవారు అర్హులు.

కెరీర్‌


-అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌, ఆపరేషన్స్‌ అసిస్టెంట్‌ హోదాతో వీరికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చదువుకున్న విద్యాసంస్థ, అభ్యర్థి నైపుణ్యాన్ని బట్టి మేనేజర్‌ ఆపరేషన్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ వంటి పోస్టుల్లో తీసుకుంటున్నారు.
-నైపుణ్యం పెరిగేకొద్ది సీనియర్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌, జూనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) హోదా వరకు చేరుకోవచ్చు.
-ప్రారంభంలో వీరికి ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత హోదాను, నైపుణ్యాన్ని బట్టి వేతనం భారీగా పెరుగుతుంది.

ఏం చేస్తారు?


-హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ అభ్యర్థుల విధులు కూడా ఇతర పరిశ్రమల్లోని మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌ మాదిరిగానే ఉంటాయి. హాస్పిటల్‌ నిర్వహణ, సిబ్బంది నియామకం, పరిపాలన సంబంధ విధులు, వివిధ విభాగాల మధ్య సమన్వయం, ఆరోగ్య సేవల మూల్యాంకనం వంటి తదితర బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. హాస్పిటల్‌ ఎఫిషియన్సీని పెంచడంతోపాటు నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో కీలకంగా వీరు పనిచేస్తారు.

కోర్సులు


pjtsau
-ఇంటర్‌ తర్వాత మెడికల్‌, నాన్‌మెడికల్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్నవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌/అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు చేయవచ్చు.
-పీజీ డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌/అడ్మినిస్ట్రేషన్‌
-పీజీ డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌
-ఎమ్మెస్సీ ఇన్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌
...?సత్యం చాపల

861
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles