కరెంట్ అఫైర్స్


Wed,July 3, 2019 01:57 AM

Telangana
ISTA

ఇస్టా సదస్సు

హైదరాబాద్‌లో అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సదస్సును కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి జూన్ 26న ప్రారంభించారు. ఈ సదస్సుకు 80 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇస్టా ప్రెసిడెంట్ క్రెగ్ మెక్‌గ్రిల్, సెక్రటరీ జనరల్ ఆండ్రియాస్ వాయస్.

ఎన్‌ఐఆర్‌డీలో సిర్‌డ్యాప్ సదస్సు

రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో జూన్ 26, 27 తేదీల్లో ఆసియా, పసిఫిక్ సమగ్ర గ్రామీణాభివృద్ధి కేంద్రం (సెంటర్ ఆన్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్-సిర్‌డ్యాప్) అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. భారత్‌తో సహా 15 దేశాలు దీనిలో సభ్యులుగా ఉన్నాయి. వాతావరణంలోని మార్పుల తీవ్రతను తగ్గించడానికి, అవసరమైన కార్యాచరణ గురించి చర్చించడానికి దీన్ని 1979లో ఏర్పాటు చేశారు.

బ్రిక్స్ ప్రతినిధుల వర్క్‌షాప్

శీతోష్ణస్థితిలో వస్తున్న మార్పుల నేపథ్యంలో నీటి వనరుల నిర్వహణ నమూనా అనే అంశంపై వరంగల్ నిట్‌లో బ్రిక్స్ దేశాల కూటమి ప్రతినిధులతో రెండు రోజుల వర్క్‌షాప్ జూన్ 27న ప్రారంభమైంది. బ్రిక్స్ కూటమిలో పలు పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టుల్లో వరంగల్ నిట్ భాగస్వామిగా చేరింది. ఈ నేపథ్యంలో ఈ సదస్సును నిర్వహించారు.

ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డులు

రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల ప్రదానం జూన్ 29న జరిగింది. 12 విభాగాల్లో అచీవర్ అవార్డు, ఎమర్జింగ్ అవార్డులను అందజేశారు. ఎన్‌జీవో విభాగం నుంచి డా. రెడ్డీస్ ఫౌండేషన్, ఎస్‌ఎంఈ విభాగం నుంచి సువెన్ లైఫ్ సైన్సెస్, విద్యావిభాగం నుంచి చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకురాలు రత్నారెడ్డి, ఫిల్మ్ ఆర్టిస్ట్ నుంచి విజయ్ దేవరకొండ, వైద్య రంగం నుంచి డా. ఎన్ చంద్రశేఖరరావు, అంకుర సంస్థల నుంచి ఎనీ టైమ్ లోన్, స్పెషల్ కేటగిరీ మహిళా విభాగం నుంచి నాసర్ స్కూల్ ప్రతినిధి బేగం అనీస్ ఖాన్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి నృత్యకారిణి యామినీ రెడ్డి, ఫుడ్ అండ్ బెవరేజెస్ నుంచి మెస్సర్స్ కరాచీ బేకరి, క్రీడల నుంచి సుహీం షేక్, రిటైల్ విభాగం నుంచి నీరూస్, ఎమర్జింగ్ యాక్టర్‌గా ప్రియదర్శి అవార్డులను అందుకున్నారు.

National
Modi-Pompeo

ఆరోగ్య సూచీలో కేరళకు అగ్రస్థానం

ఆరోగ్యవంతమైన రాష్ర్టాలు-అభివృద్ధి భారతం అనే సూచీని నీతి ఆయోగ్ జూన్ 25న విడుదల చేసింది. ఈ సూచీలో కేరళ అగ్రస్థానంలో నిలువగా, ఆంధ్రప్రదేశ్ 2, మహారాష్ట్ర 3వ స్థానాల్లో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో గుజరాత్ (4), పంజాబ్ (5), హిమాచల్‌ప్రదేశ్ (6), జమ్ముకశ్మీర్ (7), కర్ణాటక (8), తమిళనాడు (9), తెలంగాణ (10) ఉన్నాయి. 2015-16 నుంచి 2017-18 ఆరోగ్య పరిరక్షణకు ఆయా రాష్ర్టాలు తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచీని రూపొందించారు.

ఉత్తమ ఠాణాలు

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ) జూన్ 26న ఉత్తమ ఠాణాలు-2018 జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 86 పోలీస్ స్టేషన్లతో రూపొందించిన ఈ జాబితాలో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకు చెందిన కలు పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని నికోబార్ జిల్లాలోగల క్యాంప్‌బెల్ బే ఠాణ రెండో స్థానం, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఫరక్కా ఠాణా మూడో స్థానం పొందాయి. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన నారాయణపురం ఠాణా 14వ స్థానం, చింతపల్లి పోలీస్ స్టేషన్ 24వ స్థానంలో నిలిచాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నారాయణపురం ఠాణా, నల్లగొండ జిల్లాలో చింతపల్లి పోలీస్ స్టేషన్ ఉన్నాయి. మౌలిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ ఠాణాల జాబితాను 2017 నుంచి రూపొందిస్తున్నారు.

మోదీతో అమెరికా మంత్రి సమావేశం

ప్రధాని మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో జూన్ 26న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాంపియో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో, ఉగ్రవాద వ్యతిరేకపోరులో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్-అమెరికా నిర్ణయించాయి.

జల్‌శక్తి అభియాన్

దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు జల్‌శక్తి అభియాన్ (జేఎస్‌ఏ) అమలు చేయనున్నారు. దీనిలో భాగంగా దేశంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్‌చార్జులుగా సీనియర్ అధికారులను నియమిస్తూ జూన్ 26న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరు ఎంపిక చేసిన ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ రాజ్యసభలో జరిగిన చర్చలో తెలిపారు.

persons
Priya-Serrao

రా అధిపతిగా సామంత్

భారత గూఢచార సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సామంత్‌కుమార్ గోయల్‌ను కేంద్రం జూన్ 26న నియమించింది. అంతకుముందు రా అధిపతిగా ఉన్న అనిల్ దశమానా పదవీకాలం జూన్ 29న ముగిసింది. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో వైమానిక దాడుల ప్రణాళికలు రూపొందించడంలో సామంత్ కీలకంగా వ్యవహరించారు.

ఐబీ చీఫ్‌గా అర్వింద్

ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి అర్వింద్ కుమార్ జూన్ 26న నియమితులయ్యారు. అంతకుముందు ఐబీ అధిపతిగా ఉన్న రాజీవ్ జైన్ పదవీకాలం జూన్ 30తో ముగిసింది.

అస్కాకు నైటింగేల్ పురస్కారం

ప్రభుత్వ వైద్యంలో నర్సింగ్ వృత్తిలో విశేష సేవలందించినందుకు అస్కా సలోమికి అత్యున్నత పురస్కారం నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్-2019 జూన్ 27న లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన ఈమె పేరును కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అస్కా సలోమి 2009లో గాంధీ నర్సింగ్ కాలేజీ నుంచి ప్రధానాచార్యులుగా పదవీ విరమణ పొందారు.

షార్ డైరెక్టర్‌గా ఆర్ముగం

ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్‌గా ఆర్ముగం రాజరాజన్ నియమితులయ్యారు. ఈ మేరకు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి జూన్ 27న ఉత్తర్వులు వెలువడ్డాయి. జూలై 1న ఆయన బాధ్యతలు చేపట్టారు. షార్ డైరెక్టర్‌గా ఉన్న ఎస్ పాండ్యన్ జూన్ 30న పదవీ విరమణ చేశారు.

మిస్ ఆస్ట్రేలియాగా ప్రియా

మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా-2019గా భారత సంతతికి చెందిన ప్రియా సెరావో నిలిచింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జూన్ 28న నిర్వహించిన అందాల పోటీల్లో ప్రియా మిస్ ఆస్ట్రేలియా కిరీటాన్ని సొంతం చేసుకుంది.

International
G20-Summit

ఐరాసలో భారత్‌కు మద్దతు

ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎంపిక చేసేందుకు నిర్వహించే ఎన్నికల్లో భారత్ అభ్యర్థిత్వానికి 55 దేశాలతో కూడిన ఆసియా-పసిఫిక్ బృందం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ జూన్ 26న తెలిపారు. చైనా, పాకిస్థాన్‌లు కూడా ఈ ఆసియా-పసిఫిక్ దేశాల బృందంలో ఉన్నాయి.

జీ20 దేశాల సదస్సు

జపాన్‌లోని ఒసాకాలో జూన్ 28న జీ20 దేశాల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇన్‌క్లూజివ్‌నెస్ (సమ్మిళితం), ఇండిజినేషన్ (దేశీయత), ఇన్నోవేషన్ (ఆవిష్కరణ), ఇన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడులు), ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (అంతర్జాతీయ సహకారం) అనే 5-ఐ సూత్రాన్ని ప్రతిపాదించారు. 1997లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి గ్రూపు ఏర్పాటు చేయాలని భావించాయి. దీంతో 1999లో బెర్లిన్‌లో తొలిసారి జీ20 సదస్సును నిర్వహించారు.

అత్యంత ఖరీదైన నగరాలు

గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెర్సర్ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను జూన్ 28న విడుదల చేసింది. ఈ నివేదికలో ఈ ఏడాది కూడా హాంకాంగ్ తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో టోక్యో (2), సింగపూర్ (3), సియోల్ (4), జ్యూరిచ్ (5), షాంఘై (6), అస్గాబత్ (7), బీజింగ్ (8), న్యూయార్క్ సిటీ (9), షెంజెన్ (10) ఉన్నాయి. తక్కువ ఖరీదైన నగరాల్లో టునిస్ (209), తాష్కెంట్ (208), కరాచీ (207) నిలిచాయి.
ఈ జాబితాలో భారతదేశం నుంచి ముంబై 67వ ర్యాంకు సాధించింది. న్యూఢిల్లీ 118, బెంగళూరు 179, కోల్‌కతా 189వ స్థానాల్లో ఉన్నాయి.

చైనా జేఎల్-3 క్షిపణి ప్రయోగం

అత్యంత అధునాతనమైన జలాంతర్గామి నుంచి ప్రయోగించే జేఎల్-3 ఖండాంతర క్షిపణి (ఎస్‌ఎల్‌బీఎం)ని జూన్ 2న విజయవంతంగా పరీక్షించినట్లు చైనా జాతీయ మంత్రిత్వ శాఖ జూన్ 28న ప్రకటించింది. 14 వేల కి.మీ. దూరం ప్రయాణించగల ఈ క్షిపణి, ఒకేసారి పది స్వతంత్ర లక్షిత అణ్వాయుధాలను మోసుకుపోగలదు.

కాగిత రహిత పాస్‌పోర్టు

కాగిత రహిత పాస్‌పోర్టుపై ప్రాజెక్టు చేపట్టాలని కెనడా, నెదర్లాండ్స్ దేశాలు జూన్ 28న నిర్ణయించాయి. 2019లో ఇరుదేశాలు అంతర్గతంగా పైలెట్ ప్రాజెక్టుగా పరిశీలించి, 2020 నుంచి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని నిర్ణయించాయి. ప్రస్తుతం పాస్‌పోర్ట్‌పై ఉన్న చిప్‌పై ఉంటున్న వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో రహస్య సంకేతభాషలో స్టోర్ చేయాలని తీర్మానించాయి.

Sports

టీటీ టోర్నీ విజేత శ్రీజ

జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టీటీ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. హర్యానాలోని సోనెపట్‌లో జూన్ 27న ముగిసిన ఈ టోర్నీలో ఆర్‌బీఐ తరఫున బరిలోకి దిగిన శ్రీజ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ (హర్యానా)పై గెలుపొందింది. దీంతో శ్రీజ తొలిసారి సీనియర్ స్థాయిలో విజేతగా నిలిచింది.

వన్డే ర్యాంకింగ్‌లో భారత్‌కు అగ్రస్థానం

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జూన్ 27న విడుదల చేసిన వన్డే ర్యాంకుల జాబితాలో భారత్‌కు అగ్రస్థానం లభించింది. ఈ జాబితాలో 123 పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో నిలువగా ఇప్పటివరకు టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్ 122 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. వరుసగా తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ (114), ఆస్ట్రేలియా (112) ఉన్నాయి.

పుల్లెల గోపీచంద్‌కు డాక్టరేట్

భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు ఐఐటీ కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. జూన్ 28న ఐఐటీ కాన్పూర్ స్నాతకోత్సవం సందర్భంగా గోపీచంద్‌కు ఇస్రో మాజీ చైర్మన్, ఐఐటీ కాన్పూర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ అయిన ప్రొఫెసర్ కే రాధాకృష్ణన్ రజత ఫలకం, ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరన్‌దికర్ డాక్టరేట్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.

కోరి గాఫ్ రికార్డ్

అమెరికా బాలిక గోరి గాఫ్ 15 ఏండ్లకే వింబుల్డన్ మెయిన్ డ్రాకు ఎంపికై ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డుకెక్కింది. జూన్ 28న జరిగిన మెయిన్ డ్రా చివరి రౌండ్లో గాఫ్ బెల్జియం క్రీడాకారిణి గ్రీట్ మీనెన్‌న్‌పై గెలిచింది. ఓపెన్ శకంలో వింబుల్డన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన పిన్న వయస్కురాలిగా 15 ఏండ్ల 122 రోజుల గాఫ్ అరుదైన రికార్డును నెలకొల్పింది.
Vemula-Saidulu

1309
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles