తెలంగాణ ఉద్యమ చరిత్ర


Wed,June 26, 2019 02:32 AM

SRC కమిషన్ ముందు వాదనలు

-విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు అయ్యదేవర కాళేశ్వరరావు, బీవీ సుబ్బారాయుడు, దేవులపల్లి రామానుజారావు, ఎంపీ అక్తర్ హుస్సేన్, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు రాష్ర్టాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ సభ్యులను కలిసి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని కోరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాంతాల వారీగా కమిషన్ సభ్యులను కలిశారు. తెలంగాణ రాష్ట్రం కోరుతూ కేవీ రంగారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రతినిధులు కమిషన్‌ను కలిశారు. వీరిలో హరిశ్చంద్ర హెడా, జేవీ నర్సింగరావు, అరిగె రామస్వామి తదితరులు హైదరాబాద్ పీసీసీ అధ్యక్షడు కేవీ రంగారెడ్డి వెంట ఉన్నారు. రెండు తెలుగు రాష్ర్టాల నిర్మాణం కోరుతూ కాంగ్రెస్ ప్రతినిధులు తొమ్మిది తెలంగాణ జిల్లాలతో పాటు బస్తర్, సెంట్రల్ ప్రావిన్సెస్, చాందా జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్ రాష్ట్రంలో కన్నడ, మహారాష్ట్రలోని కొన్ని తెలుగు ప్రాంతాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరారు.
-తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రంగానే కాక ఆర్థికంగా, పరిపాలనా పరంగా పటిష్టంగా ఉండగలదని సూచిస్తూ, ప్రస్తుత ఆంధ్రరాష్ట్రం కంటే తెలంగాణలో తలసరి ఆదాయం జాతీయ ఆదాయం కంటే అధికంగా కలదని వీరు కమిషన్ సభ్యులకు వివరించారు. 1954 జూన్30, జూలై 1, 2 తేదీల్లో దాదాపు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కమిషన్‌ను కలిశారు. జూలై 2న కమిషన్ సభ్యులు రాజ్‌ప్రముఖ్‌గా ఉన్న నిజాంను రాజ్‌భవన్‌లో కలిసి చర్చలు జరిపారు. జూలై 4న కమిషన్ సభ్యులు నాందేడ్‌కు వెళ్లారు. మరాఠ్వాడలో జూలై 8 వరకు పర్యటించారు.
-జూలై 8న హైదరాబాద్ ప్రదేశ్ కమిటీ కమిషన్ సభ్యులను కలిసి తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోని బాంద్రా, బస్తర్ జిల్లా లు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం తాలూకా లు కలిపి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ రాష్ట్రం 60వేల చదరపు మైళ్ల వైశాల్యంతో 17కోట్ల రాబడితో స్వయంపోషకంగా ఉంటుందన్నారు. సీఎం బూర్గుల జూలై 8న వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ వాద ప్రతివాదనలను నివారించడం కోసం హైదరాబాద్ ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయం ప్రకటించలేదు కాని మంత్రులు వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలను ఫజల్ అలీ కమిషన్‌కు తెలిపారు. అయితే తాను మంత్రివర్గ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. సొంత అభిప్రాయం మాత్రం ఇవ్వలేనన్నారు.
Telangana_State

SRC సభ్యుల తెలంగాణ జిల్లాల పర్యటన

-జూలై 19న స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్ సభ్యులు కరీంనగర్, వరంగల్‌లో పర్యటించారు. కరీంనగర్‌లో విద్యార్థులు తెలంగాణ రాష్ర్టాన్ని డిమాండ్ చేశారు. వరంగల్‌లో తెలంగాణ రచయితల పక్షాన కాళోజీ నారాయణరావు విశాలాంధ్రను కోరుతూ మహాజరు సమర్పించారు. పోలీసు చర్యకు పూర్వం వరకు నైజాం నిరంకుశత్వంలో మా చరిత్ర, సంస్కృతి, మేథోవికాసము, విద్యావిజ్ఞానములు సారస్వతము అణగతొక్కబడినవని మహాజరులో పేర్కొన్నారు. అయితే వరంగల్ విద్యార్థులు విశాలాంధ్రను వ్యతిరేకిస్తూ SRC సభ్యులకు మహాజరును సమర్పించి తెలంగాణ రాష్ర్టాన్ని డిమాండ్ చేశారు.
-మృత్యుంజయ లింగం, దుగ్గిశెట్టి వెంకటయ్య గుప్తా ఒక మహాజరులో ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి జరిగిన ఆందోళన భాషా ప్రాతిపాదికపై గాక తమిళుల పెత్తనం నుంచి విముక్తి అవ్వడానికి ఉద్దేశింపబడినదని పేర్కొన్నారు. అటు ఆంధ్రుల పెత్తనం కింద తెలంగాణ మనజాలదన్నారు. వరంగల్ జిల్లాలో దాదాపు 10 హైస్కూళ్లు, ఒక ఇంటర్ కాలేజీ ఉండగా ఒక్క గుంటూరు జిల్లాలోనే 225 హైస్కూళ్లు, 6 డిగ్రీ కాలేజీలు ఉన్నాయన్నారు. వీరందరూ ప్రభుత్వ ఉద్యోగాలలో తెలంగాణ వారిని అణచివేస్తారని పేర్కొన్నారు.

SRC బృందాన్ని కలిసిన ప్రొ. జయశంకర్, తోట ఆనందరావు

-ఫజల్ అలీ కమిషన్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలంగాణ రాష్ర్టాన్ని కోరుతూ మహాజరు సమర్పించారు. ఈ ప్రతినిధి బృందంలో జయశంకర్ ఉన్నారు. అప్పటికే టీచర్‌గా పనిచేస్తున్న ఆనందరావు తోట ఉపాధ్యాయ సంఘాల పక్షాన ఫజల్ అలీని కలిశారు. తెలంగాణను ఆంధ్రతో కలపడం వల్ల ఈ ప్రాంతానికి జరిగే నష్టాన్ని గురించి ఉర్దూ భాషలో ఫజల్ అలీకి వివరించారు. తోట ఆనందరావు మాట్లాడే హైదరాబాద్ ఉర్దూను ఫజల్ అలీ మెచ్చుకొని మరునాడు వచ్చి మళ్లీ కలవమని చెప్పారు. రెండో రోజు తెలంగాణ పరిస్థితులను ఫజల్ అలీకి గంటకు పైగా వివరించారు.
-స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్ (SRC) సభ్యులు 1954 ఏప్రిల్ 8న దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటనను ప్రారంభించి జూలై 1955 చివరి వరకు సుమారు 104 ప్రదేశాలను సందర్శించారు.వివిధ రాష్ర్టాల్లో దాదాపు 38వేల మైళ్లు పర్యటించారు. 1955 సెప్టెంబర్ 30న కేంద్రప్రభుత్వానికి ఫజల్ అలీ కమిషన్ రాష్ర్టాల పునర్విభజన నివేదికను సమర్పించింది.

SRC ప్రధాన సిఫార్సులు

-హైదరాబాద్ ( తెలంగాణ), విదర్భలతో పాటు 16 రాష్ర్టాలను, 3 కేంద్రపాలిత ప్రాంతాలను స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్ సిఫార్సు చేసింది. స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్‌ను భాషా రాష్ర్టాల కమిషన్‌గా కొందరు ప్రస్తావిస్తుంటారు. తప్పుడు ప్రస్తావనే చెప్పవచ్చు వాస్తవంగా రాష్ర్టాల ఏర్పాటుకు కమిషన్ కేవలం భాషనే ప్రాతిపదికగా తీసుకోలేదు. ఒకే భాష మాట్లాడే ప్రాంతాలను నాలుగైదు రాష్ర్టాలుగా, తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర, తెలంగాణగా విభజించడమే. దీన్ని భాషారాష్ర్టాల కమిషన్‌గా వ్యవహరించడం తప్పని స్పష్టం చేస్తున్నది.
-SRC నివేదికలో 5వ చాప్టర్ హైదరాబాద్ రాష్ట్రం గురించి, 6వచాప్టర్‌లో ఆంధ్రరాష్ట్రం గురించి వివరించారు. హైదరాబాద్ రాష్ట్ర విభజనకు సంబంధించి పేరా నెంబర్ 359 నుంచి 368వ వరకు చర్చించారు. ప్రతీ రాజకీయపార్టీ, సంఘం హైదరాబాద్‌ను విభజించాలనే కోరాయని కేవలం కొద్ది మంది మాత్రమే దక్కన్ సంస్కృతి రెండు వందల ఏళ్ల నుంచి ఉన్నదని హైదరాబాద్‌ను విభజించవద్దని, ఆ సంస్కృతిని పరిరక్షించాలని కోరారు. దేశ ఐక్యతకు దక్కన్ సంస్కృతి దోహదపడుతుందన్నారు. అయితే ఈ అభిప్రాయంతో కమిషన్ ఏకీభవించలేదు.
-హైదరాబాద్ ముస్లింలలో నెలకొన్న భయాందోళనల గురించి కమిషన్ పేర్కొంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 45.4శాతం మంది ఉర్దూ భాషా మాట్లాడుతారు. హైదరాబాద్ విశాలాంధ్రకు గాని, తెలంగాణకు గాని రాజధాని అయితే తమకు ఆర్థికంగా, సాంస్కృతికంగా నష్టం వాటిల్లుతుందని ఇక్కడి ఉర్దూ మాట్లాడే ప్రజల్లో భయాందోళన ఉందని నివేదికలో పేర్కొన్నారు. దీనికి పరిష్కారంగా పెద్ద నగరాలను కేంద్రపాలన కిందికి తేవాలని కొందరు చేస్తున్న సూచనలు ఆచరణ సాధ్యం కావని కమిషన్ అభిప్రాయపడింది. ఉర్దూ భాష మాట్లాడే జంటనగరాల ప్రజల భాషా, సంస్కృతుల పరిరక్షణకు, వికాసానికి అదనంగా చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లో పరిపాలనలో ఉర్ధూకు ప్రత్యే క గుర్తింపు, స్థాయిని ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఉద్యోగ నియామకాలలో కూడా ఉర్దూ భాష మాట్లాడే వారి పట్ల వివక్షకు తావులేకుండా చర్యలు చేపట్టాలని ఎస్సార్సీ నివేదికలోని 368 పేరాలో స్పష్టంగా పేర్కొన్నారు.

విశాలాంధ్ర వాదన గురించి (పేరా 369-374)

-ప్రస్తుత హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల భవిష్యత్తును విశాలాంధ్ర ఏర్పాటు ఆకాంక్షల నేపథ్యంలో నిర్ణయించాల్సి ఉన్నది.( 369 పేజీ)
-1953 అక్టోబర్ ఒకటిన ఆంధ్రరాష్ట్రం ఏర్పడినందున ఆంధ్ర ఉద్యమ చరిత్ర మూలాల్లోకి పోవాల్సిన అవసరం మాకులేదు. నిజానికి 1953లో కొత్త రాష్ట్రంలో జరిగిన ఏర్పాటును ఆంధ్రులు ప్రత్యేకంగా సర్కారు ప్రాంతం వారు చివరి ఏర్పాటుగా భావించడం లేదు. విశాలాంధ్ర ఏర్పాటు ఆకాంక్షను సమగ్రంగా పరిశీలించలేదు. (370 పేజీ)
-తెలంగాణతో కూడిన విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడితే అది 3 కోట్ల 20 లక్షల మంది ఉండే, విస్తారమైన జలవనరులు, ఖనిజసంపద, విద్యుత్తు, విలువైన ముడి పదార్థాలతో కూడిన సముద్రతీరాన్ని కలిగిన రాష్ట్రం అవుతుంది. జంటనగరాలతో కూడిన హైదరాబాద్ ఉన్నందున ఆంధ్రరాష్ర్టానికి శాశ్వత రాజధాని సమస్య కూడ పరిష్కరించబడుతుంది. (371 పేజీ)
-విశాలాంధ్ర స్థాపన వలన ఒనగూరే మరొక ప్రయోజనమేమిటంటే కృష్ణా, గోదావరి నదులు ఏకీకృత వ్యవస్థ అదుపులోకి తేబడతాయి. ఒకే స్వత్రంత్రమైన రాజకీయ పరిధిలో ఉండి, తెలంగాణ విడిగా లేకుంటే తూర్పు పరీవాహక ప్రాంతాల్లో ఈ నదీ జలాల వినియోగానికి ప్రణాళికలు రూపొందించడం, ఆచరణలోకి తేవడం వంటివి త్వరగా చేయవచ్చు. (372 పేజీ)
-ప్రస్తుత ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక అనుసంధానం ప్రాముఖ్యత లేని అంశమే కాదు. తెలంగాణ చాలా కాలం గా ఆహారధాన్యాల కొరతను పెద్దఎత్తున ఎదుర్కొంటున్నది. కాబట్టి తెలంగాణ దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలో బొగ్గులేదు. కాని సింగరేణి నుంచి బొగ్గు సరఫరాను పొందడం సాధ్యమౌవుతుంది. తెలంగాణ సాధారణ పరిపాలన శాఖలో ఒంటరి రాష్ట్రంగా ఉండడం వలన చేస్తున్న చాలా వ్యయాన్ని తగ్గించుకోగలుగుతుంది. (373 వ పేజీ)
-ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన అసంఖ్యాక వ్యక్తులు, ప్రజాసంస్థలు చాలా కాలంగా భావోద్వేగంతో కూడిన సఖ్యత కలిగి ఉన్నందున దానికి విరుద్దంగా బలమైన కారణాలుంటే తప్ప విశాలాంధ్ర సెంటిమెంట్ పరిగణించడానికి యోగ్యమైనదే. (374 పేజీ)

తెలంగాణ అనుకూల వాదన

-విశాలాంధ్రకు అనుకూలమైన వాదనలు మనసుకు హత్తుకునేవే. ఏమైనప్పటకీ ప్రత్యేక తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా ఉండే వాదనలు కూడా అంత తేలిగ్గా కొట్టిపారేయలేనివి. (375 పేజీ)
-ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏదో ఒక స్థాయి లో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. తెలంగాణతో పోల్చితే ఆంధ్రరాష్ట్ర తలసరి ఆదా యం చాలా తక్కువగా ఉన్నది. మరోవైపు తెలంగాణలో ఆర్థికపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు చాలా తక్కువ. తెలంగాణలో భూమిపన్ను ద్వారా సమకూరే అధిక ఆదాయం సుమారు ఐదు కోట్ల వరకు వసూలవుతున్న వార్షిక ఆదాయం ఈ వ్యత్యాసానికి కారణం. ఆంధ్రతో విలీనం కావడం వల్ల ఇక్కడి స్థిరమైన వనరుల ద్వారా సమకూరుతున్న ఆదాయం ఆంధ్రకు తరలించడం వల్ల ప్రస్తు తం ఆంధ్రలో ఎదుర్కొన్నట్లే అభివృద్ధి కార్యక్రమా లు నిధుల కొరతను ఎదుర్కొంటాయని తెలంగాణ నేతలు భయపడుతున్నారు. తెలంగాణ వారి ఆరోపణలు అమోదించబడుతున్నవి. పరిపాలన కోణం నుంచి చూస్తే ఆంధ్రలో ఐక్యం కావడంతో తెలంగాణ ప్రాంతానికి ఒనగూరే అదనపు ప్రయోజనాలేమీ లేవు. (376 పేజీ)
-భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల విషయాన్ని పరిగణలోకి తీసుకునే సందర్భంలో, విశాలాంధ్రలో ఈ ప్రాంత అవసరాల గురించి పట్టించుకోరనే భయం తెలంగాణ వారిలో నెలకొని ఉంది. ఉదాహరణకు భారతదేశానికి, తెలంగాణకు నందికొండ, కుష్టాపురం ప్రాజెక్టులు ఎంతో ప్రాముఖ్యత గలవి. కోస్తాంధ్రలోని డెల్టా ప్రాంతంలో ఈ రెండు నదుల నీటిని వినియోగంలోకి తేవాలనే ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి కాబట్టి కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ ప్రస్తుతం తనకు గల స్వతంత్రమైన హక్కులను వదులుకోవడానికి సిద్దంగా లేదు. (377వ పేజీ)
-విద్యలో బాగా అభివృద్ధి చెందిన కోస్తాంధ్ర ప్రాంతం వారు ఈ రంగంలో ఎంతో వెనుకబడిన తమ అవకాశాలను దోచుకుంటారనే అభద్రతా భావం తెలంగాణ ప్రజల్లో ఏర్పడటం కూడ విశాలాంధ్ర ఏర్పాటు పట్ల వ్యతిరేకతకు గల ప్రధాన కారణం. హైదరాబాద్ వెలుపలి తెలంగాణ జిల్లాల్లో విద్యారంగం ఎంతో వెనకబడి ఉన్నది. ఫలితంగా ఆంధ్ర కంటే తక్కువ విద్యార్హతలున్నా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అనమతిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో ఆంధ్రతో కలిస్తే తమకు వారికన్నా అధమ స్థానాల్లోకి నెట్టివేస్తారన్నా భయాందోళనలు ఉన్నాయి.

1154
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles