కరెంట్ అఫైర్స్


Wed,June 26, 2019 01:55 AM

సీజేగా ఆర్‌ఎస్ చౌహాన్

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Justice

ఇండియన్ ఓషన్ ట్యూనా సదస్సు

ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ (ఐఓటీసీ) 23వ అంతర్జాతీయ సమావేశాలు జూన్ 17న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో 6.3 శాతం వాటాతో భారత్ రెండో స్థానంలో ఉందని కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి రజని సిఖ్రీ సిబాల్ తెలిపారు. ట్యూనా చేపల వ్యాపారంపై 31 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో చర్చించారు. భారత్ నుంచే 20 శాతం ట్యూనా చేపల ఉత్పత్తి జరుగుతుందని ఐఓటీసీ తెలిపింది.

తొలిసారి ఆన్‌లైన్‌లో కోర్టు ఫీజు

దేశంలోనే తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా కోర్టు ఫీజుల విధానాన్ని రాష్ట్ర హైకోర్టు అమలు చేయనున్నది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల మధ్య జూన్ 19న ఒప్పందం కుదిరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రాల సమక్షంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏ వెంకటేశ్వరెడ్డి, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ గీత ఎస్ పిైళ్లెలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకాన్ని జూన్ 21న సీఎం కేసీఆర్ పారంభించారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), ఎల్ అండ్ టీ సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాయి.

పెద్దపల్లి జిల్లాకు స్వచ్ఛ అవార్డు

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛ సుందర శౌచాలయ పురస్కారానికి పెద్దపల్లి జిల్లా ఎంపికైంది. మరుగుదొడ్లను వినయోగించడం, వాటిని సరైన రీతిలో నిర్వహించడం, రంగులు వేసి బాగా ఉంచడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మూడు జిల్లాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణ నుంచి పెద్దపల్లి జిల్లా ఉంది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన జూన్ 24న ఈ అవార్డును అందుకున్నారు.

జమిలి ఎన్నికలపై కమిటీ

ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూన్ 19న ప్రకటించారు. జమిలి ఎన్నికలపై నిర్దిష్ట కాలవ్యవధిలోగా భాస్వామ్య పక్షాలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. ఇది రాజకీయ కమిటీ. ఇందులో వివిధ రాజకీయ పార్టీల నేతలు సభ్యులుగా ఉంటారు.

ఆరు జలాంతర్గాములు

అధునాతన పరిజ్ఞానంతో దేశంలో ఆరు జలాంతర్గాములను నిర్మించేందుకు భారత నౌకాదళం జూన్ 20న చర్యలు మొదలుపెట్టింది. పీ-75 ప్రాజెక్టు కింద రూ.45 వేల కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

కొల్హాపురి చెప్పులకు జీఐ ట్యాగ్

దేశవ్యాప్తంగా ఆదరణ కలిగిన కొల్హాపురి బ్రాండ్ చెప్పులకు జూన్ 20న జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్, షోలాపూర్, సతారాలలో కొల్హాపూర్ చెప్పులు ఎక్కువగా తయారవుతుండటంతో ఈ గుర్తింపునిచ్చారు. ఈ ట్యాగ్‌తో కొల్హాపురి చెప్పులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది.
Kolhapuri

జీఎస్టీ కౌన్సిల్ 35వ భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి అధ్యక్షత వహించిన జీఎస్టీ కౌన్సిల్ 35వ భేటీ జూన్ 21న ఢిల్లీలో జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ చార్జర్లపై పన్ను తగ్గింపు ప్రకటన జీఎస్టీ కౌన్సిల్ నుంచి వెలువడుతుందని భావించగా, నిర్ణయాన్ని ఫిట్‌మెంట్ కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను ప్రస్తుతం 12 శాతం ఉండగా దీన్ని 5 శాతానికి, ఎలక్ట్రిక్ చార్జర్లపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గించాలన్న ప్రతిపాదనలను ఫిట్‌మెంట్ కమిటీకి నివేదించింది. 2020, జనవరి 1 నుంచి ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్ విధానం ప్రారంభమవుతుంది.

షాంఘై సీజేల సదస్సు

రష్యాలోని సోచిలో షాంఘై కో ఆపరేషనల్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) దేశాల 14వ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు జూన్ 18న జరిగింది. ఈ సదస్సుకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నాయకత్వంలో జస్టిస్ ఎన్‌వీ రమణ, డీవై చంద్రచూడ్, ఎంఆర్ షా హాజరయ్యారు. ఎస్‌సీఓ దేశాల న్యాయసంస్థల మధ్య సహకారాన్ని మరింత ప్రోత్సహించాలని సదస్సు తీర్మానించింది.

ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీ

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీ జూన్ 18న ప్రపంచంలోకి అడుగుపెట్టింది. లిబ్రా అనే పేరుతో సొంత డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. ఆసక్తి ఉన్న డెవలపర్లు ఉపయోగించుకోవడానికి వీలుగా లిబ్రా పొటోటైప్ (నమూనా)ను ఓపెన్‌సోర్స్ కోడ్ (అందరూ ఉపయోగించుకునేలా) తరహాలో విడుదల చేసింది.

పురాతన వస్తువుల వేలం

భారత్‌ను పాలించిన మహారాజులు, మొఘలులు వినియోగించిన వజ్రాభరణాలు, స్వర్ణాభరణాలు, కత్తులు, రత్నాలు సహా దాదాపు 400 పురాతన వస్తువులను జూన్ 20న అమెరికాలోని న్యూయార్క్‌లో వేలం వేశారు. క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన ఈ వేలం ద్వారా ఆ సంస్థకు రూ.756 కోట్లు వచ్చాయి. ఇందులో గోల్కొండలో దొరికిన 52.58 క్యారెట్ల బరువైన మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం రూ.45 కోట్లు, ఆర్కాట్ నవాబుకు చెందిన 17 క్యారెట్ల గోల్కొండ వజ్రం రూ.23.5 కోట్లకు అమ్ముడుపోయాయి.
Golconda-Diamond

ఏడు కోట్ల 8 లక్షల శరణార్థులు

జాతుల మధ్య వైరాలు, ఎడతెగని అంతర్యుద్ధాలు, హింస, ఆర్థిక సంక్షోభాల కారణంగా 2018 ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల 8 లక్షల మంది ప్రజలు పరాయి దేశాలకు వలస వెళ్లారు. ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా జూన్ 20న యూఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్) ఒక నివేదికను విడుదల చేసింది. 2017తో పోల్చుకుంటే 20 లక్షల మంది శరణార్థులు పెరిగారని, ఈ మొత్తం శరణార్థుల సంఖ్య ప్రపంచంలో 20వ అతిపెద్ద దేశ జనాభాకు సమానమని పేర్కొంది.

ఎన్‌ఎస్‌జీ సమావేశం

కజకిస్థాన్ రాజధాని నూర్ సుల్తాన్ (ఆస్థానా)లో జూన్ 20, 21 తేదీల్లో అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ) సమావేశం జరిగింది. ఈ సమావేశం అజెండాలో భారత్‌కు సభ్యత్వాన్ని ఇచ్చే అంశం లేదని చైనా పేర్కొంది. 2016 మేలో ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కోసం భారత్ దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి చైనా అడ్డుపడుతుంది.

కిమ్‌జోంగ్‌తో జిన్‌పింగ్ భేటీ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉత్తరకొరియాలో జూన్ 21, 22 తేదీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌తో జిన్‌పింగ్ జూన్ 21న భేటీ అయ్యారు. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జరిగిన ఈ భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు వాస్తవరూపం కల్పించే కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఇరువురు నేతలు చర్చించారు.

అత్యధిక సిక్సుల మోర్గాన్

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు సాధించిన క్రికెటర్‌గా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ ప్రపంచకప్-2019లో భాగంగా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జూన్ 19న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మోర్గాన్ 17 సిక్సులు బాదాడు. మోర్గాన్ తర్వాత రోహిత్ శర్మ (16), డివిలియర్స్ (16), క్రిస్ గేల్ (16) ఉన్నారు.
Morgan

క్రికెటర్ రసిక్ సలామ్ సస్పెన్షన్

జమ్ముకశ్మీర్‌కు చెందిన యువ పేసర్ రసిక్ సలామ్‌ను రెండేండ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు బీసీసీఐ జూన్ 19న ప్రకటించింది. నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. జూలైలో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న జాతీయ అండర్-19 జట్టు నుంచి సైతం తప్పించింది. ఐపీఎల్-12లో అతడు ముంబై ఇండియన్స్ తరఫున ఒక మ్యాచ్ ఆడాడు.

ఐఎస్‌ఐ చీఫ్‌గా ఫైజ్ హమీద్

పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్)కు నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను నియమిస్తున్నట్లు పాక్ ఆర్మీ జూన్ 16న తెలిపింది. ప్రస్తుత ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

నితేశ్‌కుమార్‌కు కామన్వెల్త్ అవార్డు

భారత్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ నితేశ్‌కుమార్ జాంగిర్‌కు కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్-2019 అవార్డు లభించింది. లండన్‌లో జూన్ 18న జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ యువరాజు హ్యారీ చేతులమీదుగా నితేశ్ ఈ అవార్డును అందుకున్నారు. కంటిన్యుయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్ (సీపీఏపీ) పరికరాన్ని ఆవిష్కరించినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఐసీయూ వసతిలేక శ్వాస ఇబ్బందితో ఏటా లక్షల మంది నవజాత శిశువులు మరణిస్తున్నారు. ఈ మరణాలు తగ్గించేందుకు సీపీఏపీని ఆవిష్కరించారు.
Nitesh-kumar

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

17వ లోక్‌సభ స్పీకర్ బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ మూజువాణి ఓటు ద్వారా జూన్ 19న ఎన్నిక ప్రక్రియ చేపట్టగా సభ్యులు ఓంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజస్థాన్‌లోని కోట-బూంది నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1054
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles