రాష్ర్టాల పునర్విభజన- ఆంధ్రరాష్ట్రం


Wed,June 19, 2019 02:40 AM

తెలంగాణ ఉద్యమ చరిత్ర
India

జస్టిస్ జగన్ మోహన్ రెడ్డి నివేదికాంశాలు

- 1952, సెప్టెంబర్ 3న పోలీసు కాల్పులు జరుపడానికి ముందు 30 నుంచి 40వేల మంది జనం ఆందోళనలో పాల్గొనడం, పోలీసు ఆదేశాలను ధిక్కరించి ఊరేగింపు ప్రయత్నించడం, హెచ్చరికలను లెక్కచేయకపోవడం, లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం చేసినా ఫలితం లేకపోవడం, పోలీసుల పైకి ఆందోళనకారులు రాళ్లవర్షం కురిపించడం, వైర్‌లెస్ వ్యానును తగులబెట్టడం తదితర పరిస్థితుల కారణంగా పోలీసులు కాల్పులు జరపడం సమర్ధనీయమే అని నివేదిక పేర్కొన్నది.
- ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ సమస్యలను రాతపూర్వకంగా ప్రభుత్వానికి సమర్పించుకునే అవకాశమున్నది. తాము చట్టసభలకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అంతేకాని చట్టవిరుద్ధంగా యధేచ్చగా రోడ్లపైకి రావడం సరైనదికాదు. ప్రాణ నష్టానికి, పలువురు గాయపడడానికి కారణమైన సంఘటనలు దురదృష్టకరం. వీరిలో కొందరు అమాయకులు, పాదాచారులు కూడా పోలీసుల తుపాకీ తూటాల బారిన పడినవారిలో ఉన్నారు. కాల్పుల్లో మరణించిన, గాయపడిన వారిలో అమాయకులు ఉన్నారనే కారణంతో చట్టబద్ధంగా జరిగిన పోలీసు కాల్పులను చట్ట విరుద్ధమైనవిగా పరిగణించలేము. పోలీసు కాల్పుల్లో మరణించిన, అంగవైకల్యం పొందిన అమాయకులకు ప్రభుత్వం పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని న్యాయమని సరైనదని అనిపిస్తే తగిన విధంగా పరిహారం చెల్లించగలదని భావిస్తున్నాను అని రాసిన నివేదికను జస్టిస్ జగన్‌మోహన్ రెడ్డి కమిషన్ 1952, డిసెంబర్ 28నప్రభుత్వానికి సమర్పించింది.

ముల్కీ ఉద్యమం ప్రాముఖ్యం

- వరంగల్‌లో మూకుమ్మడిగా జరిగిన ఉపాధ్యాయ బదిలీలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ముల్కీ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు వ్యాపించడం, మూడు వారాలకు పైగా విద్యార్థులు ఆందోళన చేయడం, తరగతులు బహిష్కరించి ప్రదర్శనలు నిర్వహించడం, నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలు, అక్కడక్కడ (వరంగల్, నల్లగొండ, జంటనగరాలు) నాన్ ముల్కీలకు విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణలు, బెదిరింపు చర్యలు, వ్యక్తిగత దాడులు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 3,4 తేదిల్లో సిటీ కాలేజీ, అప్జల్‌గంజ్ ప్రాంతాలలో ఎవరు పిలవకున్నా సుమారు 30 వేల నుంచి 40 వేల మంది ప్రజలు, విద్యార్థులు పాల్గొన్న మహోద్యమం. తెలంగాణ ప్రాంత ప్రజల్లో అంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడి ఉద్యోగాల్లో చేరిన నాన్-ముల్కీలపై వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉన్నదో తెలుపుతున్నది.
- ప్రభుత్వం ఒకవైపు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు ప్రకటన చేసినా ముల్కీ ఉద్యమం ఇంత తీవ్ర స్థాయిలో జరగడం, ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం, ఒక వైపు కాల్పుల్లో వ్యక్తులు చనిపోతున్నా మరోవైపు గంట గంటకూ మరింత ఎక్కువ సంఖ్యలో జనం రోడ్లపైకి రావడం ఇక్కడి ప్రజలకు భవిష్యత్తు పట్ల గల అభద్రతాభావాన్ని సూచిస్తున్నది. ఆంధ్రను తెలంగాణతో కలిపి ఒకే భాష రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కొందరు ఆంధ్రప్రాంత పెద్దమనుషులు చేస్తున్న విశాలాంధ్ర నినాదానికి వ్యతిరేకంగా...ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలిచ్చిన జవాబు ఈ ముల్కీ ఉద్యమం.
- ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని, ఆంధ్రతో ఎట్టి పరిస్థితిల్లో విలీనం చేయరాదన్న తెలంగాణ ప్రజల నిశ్శబ్ధ అంతర్గత ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ నాన్-ముల్కీ గో బ్యాక్, ఇడ్లి, సాంబార్ గ్యోబ్యాక్ హైదరాబాద్ హైదరాబాదీయులదే నినాదాలు.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమస్యలు

- 1953 అక్టోబర్ 1న కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రం వద్దని విభజన సంఘానికి డిసెంట్ నోట్ ఇచ్చి ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును 1950లోనే అడ్డుకున్న ప్రకాశం పంతులు కాంగ్రెస్ పార్టీలో లేకపోయినా నెహ్రూ పిలిచి ముఖ్యమంత్రి పదవి ఇస్తాననగానే మద్రాసు లేని ఆంధ్రరాష్ర్టానికి తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనే విషయమై వాదోపవాదాలు జరిగి రాష్ట్రం వాయిదా పడిందని పట్టాభి గతంలో చేసిన వ్యాఖ్య సరైనదేనని నిరూపించారు ప్రకాశం పంతులు. అనాడే మద్రాసు లేని ఆంధ్రకు ప్రకాశం ఒప్పుకుని ఉండి ఉంటే పొట్టి శ్రీరాములు వంటి త్యాగధనున్ని అంతటి మహనీయున్ని ఆంధ్రరాష్ట్రం పోగొట్టుకునేది కాదు. ఆ విధ్వంసకాండ జరిగి ఉండేదికాదు.
- నీలం సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రిగా, తేన్నెటీ విశ్వనాథం, కడప కోటిరెడ్డి, దామోదరం సంజీవయ్య మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రరాష్ట్ర తొలి గవర్నర్‌గా చందులాల్ మాధవలాల్ త్రివేదిచే మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు.

రాష్ర్టావతరణ నాడే వెల్లడైన ఆంధ్రుల అంతరంగం

- లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ శ్రీమాడభూషి అనంతశయనం అయ్యంగారు తన ప్రసంగంలో ఆంధ్రుల రథం సాగింది. ఇది హైదరాబాద్ వెళ్లే వరకు నిలువదు. మధ్యలో కందెన కోసం కర్నూలులో ఆగింది కాని హైదరాబాద్‌కు త్వరలోనే వెళ్లి తీరుతుందని అన్నారు. ఆంధ్రరాష్ట్ర ఆవిర్భానికి ఒక్క రోజు ముందే హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర రాష్ట్రం వీలైనంతా త్వరలో ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. విశాలాంధ్ర అవసరాన్ని వివరించడానికి నీలం సంజీవరెడ్డి, ఆయ్యదేవర కాళేశ్వరరావు, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకట్రావ్, కడప కోటిరెడ్డి, దామోదర సంజీవయ్య, అట్లూరి సత్యనారాయణరాజులతో ఒక ఉపసంఘాన్ని నియమించారు.
- 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావ సభలో కళా వెంకట్రావ్ ప్రసంగిస్తూ హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడటానికి మనమందరం కృషిచేస్తున్నాం. హైదరాబాద్‌కు సంబంధించినంత వరకు అభిప్రాయ భేదాలు లేవన్నారు. నీలం సంజీవరెడ్డి కూడా హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడటానికి సభ్యులందరూ కృషి చేయాలని ఉద్భోదించి, ఆ ఆశయం నెరవేరే వరకు శాశ్వత రాజధాని సమస్యలేనే లేదన్నారు.
- ఇక ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే కర్నూలునుతాత్కాలిక రాజధానిగా పేర్కొన్నారంటే ఆంధ్రుల దృష్టి హైదరాబాద్‌పై ఉన్నదని స్పష్టమౌవుతుంది.

ఫజల్ అలీ (SRC) కమిషన్-1953

- భారత ప్రభుత్వ హోంశాఖ తీర్మాణం (నం.53/69/53 పబ్లిక్ 29.12.1953) ద్వారా ఒరిస్సా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సయ్యద్ ఫజల్ అలీ చైర్మన్‌గా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌లో సభ్యునిగా ఉన్న హృదయనాధ్ కుంజ్రూ, ఈజిప్టులో భారత రాయబారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కమలం మాధవ ఫణిక్కర్‌లతో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్‌ను 1953 డిసెంబర్ 29న ఏర్పాటు చేసింది.

తీర్మానంలో ప్రస్తావించిన అంశాలు

- భారతదేశంలో రాష్ర్టాల ఏర్పాటు ప్రక్రియ చారిత్రక పరిణామ క్రమంలో యాదృచ్చికంగా, పరిస్ధితుల కారణంగా జరిగింది. వంద సంవత్సరాలు అంతకుమించి ఈ రాష్ర్టాలు కలిసి ఉండటం వల్ల రాజకీయంగా, పరిపాలనా పరంగా సాంస్కృతిక సంబంధాలతో తమకు తాము అభివృద్ధి చెందినవి. వాటి మధ్య సంబంధాలు కూడ అభివృద్ధి చెందినవి.
- ప్రజలలో రాజకీయ చైతన్యం బాగా అభివృద్ధి చెందడం, ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం బాగా పెరగడం వలన క్రమంగా భాషా ప్రాతిపదికన రాష్ర్టాల ఏర్పాటు కోసం ఆకాంక్షలు ప్రజల్లో పెరుగుతున్నాయి. అలాంటి సమస్యలే ఇతర సమస్యలతో ముడిపడి ఉంటూ ఒక కొత్త రాష్ట్రమేర్పాటు అనేక రాష్ర్టాలపై ప్రభావం చూపిస్తున్నది. అందువల్ల ఏ ఒక్క రాష్ట్రం ఏర్పాటైనా ఇతర రాష్ర్టాలతో సంబంధం లేకుండా ఒంటరిగా సాధ్యపడదు.
- ఒక ప్రాంతంలోని భాషా, సంస్కృతులు ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదు. కానీ రాష్ర్టాల పునరేకీకరణలో ఇతర ముఖ్యమైన అంశాలు కూడ ప్రాధాన్యం కలిగి ఉంటాయని మన మనస్సులో ఉంచుకోవాలి. అన్నింటికంటే ముందుగా భారతదేశ ఐక్యతను భద్రతను పరిరక్షించడం, దృడపరచడం అనేవి ముఖ్యమైనవి. వీటితో పాటు ఒక్కో రాష్ట్ర కోణంలో నుంచి కాకుండా దేశం దృష్టి నుంచి చూసినపుడు ఆర్థిక పరిపాలనాపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంటుంది. భారతదేశం ఆర్థికంగా, సాంస్కృతికంగా, నైతికపరంగా ఒక క్రమమైన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నది. విజయవంతంగా ముందుకు సాగుతున్న జాతీయ ప్రణాళికలో ఏరకమైన మార్పులు జోక్యం చేసుకున్నా అవి జాతీయ ప్రయోజనాలకు హానికరంగా పరిణమిస్తాయి.
- భారత యూనియన్‌లోని రాష్ర్టాల పునర్విభజన అంశాన్ని ఎంతో జాగ్రత్తగా పరిక్షించాల్సి ఉన్నది. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, భావోద్వేగాలకు అతీతంగా దేశాన్ని రాజ్యాంగంలో పేర్కొన్న వివిధ రాష్ర్టాలలోని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ర్టాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఈ విధమైన పరిశీలనకై భారత ప్రభుత్వం రాష్ర్టాల పునర్విభజన కమిషన్‌ను నియమిస్తున్నదని హోంశాఖ తీర్మానం స్పష్టం చేసింది.
- ఈ కమిషన్ సమస్య మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తుంది. చారిత్రక నేపథ్యానికి, ప్రస్తుత పరిస్థితిని ఇంకా ముఖ్యమైన, సంబంధిత కారనాలను కూడా నిశితంగా పరిశీలిస్తుంది. పునర్విభజనకు సంబంధించి ఏ విధమైన ప్రతిపాదనైనా పరిగణలోకి తీసుకునే స్వేచ్చ ఈ కమిషన్‌కు ఉంది. విశాలమైన సూత్రాలపై ఆధారపడి మొదటి దశలో కమిషన్ రాష్ర్టాల పునర్విభజన సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ స్థూలమైన ప్రతిపాదనలు ఇవ్వవచ్చు. మధ్యంతర నివేదికలను కూడా ప్రభుత్వానికి ఇవ్వవచ్చునని ఆ తీర్మానంలో హోంశాఖ తెలిపింది. కమిషన్‌కు విధివిధానాల రూపకల్పనకు సంబంధించి స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. కమిషన్ విచారణ బహిరంగంగా కాకుండా ప్రయివేటుగా జరపాలని పేర్కొన్నది. 1955, జూన్ 30లోపు రాష్ర్టాల పునర్విభజన కమిషన్ తమ నివేదికను సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించింది.

SRC సభ్యుల పర్యటన, విధివిధానాల రూపకల్పన

- 1954; పిబ్రవరి 23న ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తూ ఫజల్ అలీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. విజ్ఞప్తులు పంపడానికి తుది గడువుగా ఏప్రిల్ 24ను నిర్ణయించారు. ఈ గడువులోపు 1,52, 250 విజ్ఞప్తులు కమిషన్‌కు చేరగా వాటిలో పరిశీలించదగినవి సుమారు రెండు వేల లోపు ఉన్నట్లు కమిషన్ గుర్తించింది.
- 1954 జూన్ 29న హైదరాబాద్‌లో స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్ తన విచారణ ప్రారంభించింది. నగరంలోని గ్రీన్‌లాండ్స్ భవనంలో వివిధ రాజకీయ సంస్థల నాయకులు ఫజల్ అలీ, కుజ్రూ, ఫణికర్‌లను కలిసి తమ వాదనలు వినిపించారు.

విశాలాంధ్ర నినాదం వెనుక సామ్రాజ్యవాదం- నెహ్రూ

- ఆంధ్రుల వాంఛలను సరిగ్గానే అర్థం చేసుకున్న ప్రధాని నెహ్రూ కర్నూలులో అక్టోబర్ 1న కోల్స్ మెమోరియల్ స్కూల్‌లో ఆంధ్ర రాష్ట్ర అవతరణని ప్రకటించిన అనంతరం మీడియా సమావేశంలో పలు విషయాలు చెప్పారు. విశాలాంధ్ర రాష్ట్రం అనే నినాదాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో నేనే అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. విశాల శబ్ధం దురాక్రమణ చింతగల సామ్రాజ్యవాదాన్ని స్ఫురింప చేస్తుంది. ఈ విశాలాంధ్ర నినాదం వెనుక దాగిఉన్న మనస్తత్వం సామ్రాజ్యవాద తత్వంతో కూడినట్టిది అని చెప్పారు (ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ 3-10-1953). నెహ్రూ ఎంతో దూరదృష్టితో ఆంధ్రుల విశాలాంధ్ర ఆకాంక్షను విశ్లేషించి సమాజం ముందుంచిన సామ్రాజ్యవాద మనస్తత్వం ప్రజలకు ఏనాడో అర్థమైంది.
- ఆంధ్రులకు తెలంగాణ ప్రాంతంపై ప్రేమ బయటికి చెప్తున్నట్లు కేవలం భాషమీద మాత్రమే కాదు ఈ భాష మీద సిసలైన ప్రేమతో విశాలాంధ్రను కోరింది కేవలం కవులు, రచయితలు మాత్రమే. కాని హైదరాబాద్ నగరంపై, తెలంగాణలో వందలాది మైళ్లు ప్రవహించి ఆంధ్రలో అడుగిడుతున్న కృష్ణా, గోదావరి నదులపై, ఇక్కడి ఉద్యోగాలపై, పత్తి పంట పండే నల్లరేగడి భూములపై, బడ్జెట్‌లో మిగులుతున్న నిధులపై, రాజధాని నగరంలోని విలువైన ప్రభుత్వ, కాందిశీకులు, నిజాం వదిలిన భూములపై, ప్రభుత్వ, ప్రయివేటు రంగ ఉద్యోగాలపై ఉన్న ఆకాంక్ష విశాలాంధ్ర నినాదాన్ని ముందుకు తెస్తున్నది.
- కర్నూలులో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నించలేదు. ఎలాంటి ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. పుణె నుంచి మిలటరీ సహాయంతో టెంట్‌లను తెప్పించి వేయించారు. రాష్ర్టాల పునర్విభజన సంఘాన్ని సంవత్సరాంతం (1953)లోగా నియమించే అవకాశం ఉన్నదని ప్రధాని నెహ్రూ కర్నూలులో మీడియా సమావేశంలో వెల్లడించారు.1953 డిసెంబర్ 22న ప్రధాని పార్లమెంట్‌లో కూడ ఇదే విషయాన్ని ప్రకటించారు.
mallikarjun

993
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles