హై ఐటీలు


Mon,May 13, 2019 01:48 AM

ఐఐటీలు.. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు. ప్రామాణిక విద్యకు పేరుగాంచిన సంస్థలు. ఇంజినీరింగ్ విద్యకు మారుపేరు ఐఐటీలు. అత్యంత మేటి సాంకేతిక సంస్థలకు నాయకత్వం వహిస్తున్న దిగ్గజాలను అందించిన సంస్థలు ఇవి. ఇంజినీరింగ్ చదవాలనుకున్న ప్రతివిద్యార్థి డ్రీమ్ ఐఐటీ. సుమారు మూడుదశాబ్దాలుగా దేశంలో ఈ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం దేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి. మరో నెలరోజుల్లో వీటిలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆయా ఐఐటీల గురించి సంక్షిప్తంగా...
IIT_Delhi

ఐఐటీ ఖరగ్‌పూర్

iit-kharagpur
-దేశంలో మొదటి ఐఐటీ ఇది. దీన్ని 1951లో ప్రారంభించారు. ఈ సంస్థ నినాదం Yogah Karmasu Kaushalam. కలకత్తాకు 150 కి.మీ. దూరంలో దీన్ని నిర్మించారు. బ్రిటీషర్స్ నిర్మించిన నిర్బంధ క్యాంపు (జైలు)లో ఈ కాలేజీని ప్రారంభించడం విశేషం. నాడు స్వాతంత్ర యోధులను నిర్బంధించిన ఈ ప్రాంతం నేడు ఒక మహావిద్యాలయంగా మారింది. మొదట 224 మంది విద్యార్థులు, 42 మంది అధ్యాపకులతో ఈ ఐఐటీని ప్రారంభించారు. స్విస్ ఆర్కిటెక్చర్ డా. వెర్నర్ ఎం. మోజర్ దీనికి రూపకల్పన చేశారు.

ఐఐటీ బాంబే

-ఈ సంస్థను 1958లో ప్రారంభించారు. విదేశాల సహకారంతో ప్రారంభించిన మొట్టమొదటి ఐఐటీ. యునెస్కో, సోవియట్ యూనియన్ ఈ సంస్థకు నిధులను అందించాయి. ఇంజినీరింగ్, పరిశోధనల్లో దీనికి ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. భారత ప్రభుత్వం చేత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినియెన్సీ గుర్తింపు పొందిన సంస్థ. ఐఐటీ బాంబేకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది. ఇక్కడ ఇంజినీరింగ్‌తోపాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాలు కూడా ఉన్నాయి. అత్యున్నత ప్రమాణాలతో దిగ్గజ ఐఐటీగా బాంబే ఐఐటీ ప్రసిద్ధిగాంచింది. బాంబేలో పొవాయి ప్రాంతంలో విశాలమైన క్యాంపస్‌తో బాంబే ఐఐటీ అలరారుతున్నది.

ఐఐటీ మద్రాస్

-జాతీయ ప్రాముఖ్య కలిగిన విద్యాసంస్థల్లో మద్రాస్ ఐఐటీ ఒకటి. జర్మనీ సాంకేతిక సహాయసహకారాలతో ఏర్పాటుచేసిన సంస్థ కావడం విశేషం. 1956లో ఈ సంస్థకు బీజం పడింది. దీనికి సంబంధించిన ఒప్పందం వెస్ట్ జర్మనీలోని బాన్ నగరంలో జరిగింది. 1959లో ఐఐటీ మద్రాస్‌ను కేంద్రం ప్రారంభించింది. సుమారుగా 500 మంది ఫ్యాకల్టీలు, 8000 మంది విద్యార్థులుతో 250 ఎకరాల విశాలమైన క్యాంపస్ మద్రాస్ ఐఐటీ కి ఉంది. ఇంజినీరింగ్, ప్యూర్ సైన్సెస్‌తోపాటు పలు విభాగాలు ఈ సంస్థలో ఉన్నాయి. ఈ ఏడాది ఎన్‌ఐఆర్‌ఎఫ్ ప్రకటించిన జాబితాలో మొదటి స్థానంలో మద్రాస్ ఐఐటీ నిలిచింది.

ఐఐటీ కాన్పూర్

-తమసోమా జ్యోతిర్గమయ అనే నినాదంతో ఈ సంస్థను 1959లో కేంద్రం ప్రారంభించింది. యునైటెడ్ స్టేట్స్‌లోని తొమ్మిది పరిశోధనా విశ్వవిద్యాలయాల కన్సార్టియం సహాయంతో ఐఐటీ కాన్పూర్ ఇండో-అమెరికన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ప్రముఖ ఆర్థికవేత్త జాన్ కెన్నత్ గాల్‌బ్రీత్ మార్గదర్శకత్వంలో దేశంలో మొదటిసారిగా కంప్యూటర్ సైన్స్‌ను (1963లో) ప్రారంభించిన సంస్థ ఐఐటీ కాన్పూర్. 1000 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఐఐటీ కాన్పూర్‌ను నిర్మించారు. నోయిడాలో ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను 2012లో ఈ సంస్థ ప్రారంభించింది. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, అంతర్జాతీయ సంబంధాల కోసం కార్యాలయాన్ని నిర్మించింది. అంతేకాకుండా న్యూయార్క్‌లో అలుమినిస్‌తో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఐఐటీ కాన్పూర్ ఇంజినీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్, ఇంటర్ డిసిప్లినరీ, డిజైన్ కోర్సులను అందిస్తున్నది.

ఐఐటీ ఢిల్లీ

-ఈ సంస్థను యూకే సహకారంతో 1961లో ప్రారంభించారు. యూకే గవర్నమెంట్, ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీస్ ఇన్ లండన్ సహకారంతో ఇంజినీరింగ్&టెక్నాలజీ సొసైటీని ప్రారంభించి ఐఐటీని నెలకొల్పారు. ఢిల్లీలో 320 ఎకరాల ప్రాగంణంలో దీన్ని ఏర్పాటుచేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినియెన్సీ కలిగిన సంస్థ ఇది. బీటెక్, ఎంటెక్, ఎంఎస్, ఎమ్మెస్సీ, ఎండిజైన్, ఎంబీఏ తదితర కోర్సులను ఐఐటీ ఢిల్లీ అందిస్తుంది. 2000 సంవత్సరంలో టెక్నాలజీ బిజినెస్ ఇన్‌క్యుబేషన్ యూనిట్, 2012లో సోనిపట్ క్యాంపస్‌లను ఐఐటీడీ ప్రారంభించింది. ఎయిమ్స్ ఢిల్లీతో కలిసి జజ్జర్ క్యాంపస్‌లో బయోమెడికల్ రిసెర్చ్‌ను ప్రారంభించాయి.

ఐఐటీ గువాహటి

-ఈ ఐఐటీని 1994లో ప్రారంభించగా 1995 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ బీటెక్, బీడిజైన్, ఎంఏ, ఎండిజైన్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే నినాదంతో దీన్ని స్థాపించారు. దేశంలో అత్యంత సుందరమైన ప్రదేశంలో నిర్మించిన ఐఐటీగా దీనికి పేరు. ఒకవైపు బ్రహ్మపుత్రా నది మరోవైపు కొండల మధ్య 700 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. ఈశాన్య, తూర్పు, దక్షిణ ప్రాంతాలలో శక్తివంతమైన పరమ్ ఇషాన్ అనే సూపర్ కంప్యూటర్ నిర్వహణను ఐఐటీ గువాహటి చేపడుతున్నది.

ఐఐటీ రూర్కీ

iit-roorkee
-దేశంలోని అత్యంత పురాతన ఇంజినీరింగ్ కాలేజీ థామస్ కాలేజీ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ ఇది తర్వాతి కాలంలో యూనివర్సిటీ ఆఫ్ రూర్కీగా తర్వాత ఐఐటీగా రూపాంతరం చెందింది. 1847లో ప్రారంభమైన ఈ కాలేజీ ఆసియా ఖండంలో అత్యంత పురాతనమైనదిగా కీర్తి గడించింది. 1949లో దీనికి యూనివర్సిటీ స్థాయిని ఇచ్చారు. 2001లో దేశంలో ఏడో ఐఐటీగా దీన్ని కేంద్రం ప్రకటించింది. Nothing can be achieved without hard work అనే నినాదంతో దీన్ని ప్రారంభించారు. మొదట్లో రూర్కీ ప్రవేశాల కోసం ప్రత్యేక ఎంట్రెన్స్ ఉండేంది. తర్వాతి కాలంలో మిగిలిన ఐఐటీల ప్రవేశాల కోవలోకి దీన్ని తీసుకువచ్చారు. ఇక్కడ 21 అకడమిక్ విభాగాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఇంజినీరింగ్, అప్లయిడ్ సైన్సెస్, హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ విభాగాలు, యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి.

ఐఐటీ గాంధీనగర్

-2008లో కేంద్రం ప్రకటించిన ఎనిమిది ఐఐటీల్లో ఇది ఒకటి. మొదట దీన్ని విశ్వకర్మ గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీలో తాత్కాలికంగా ప్రారంభించారు. మెంటార్‌గా ఐఐటీ బాంబే వ్యవహరించింది. 2011లో లోక్‌సభలో బిల్లు పాసైన తర్వాత శాశ్వత క్యాంపస్‌ను సబర్మతి నదీతీరాన నిర్మించారు. ఇండియా-కి-కోజ్ (డిస్కవరింగ్ ఇండియా), గ్లోబల్ హెల్త్ అండ్ డెవలప్‌మెంట్ వంటి వినూత్న కార్యక్రమాలతో ఐఐటీ గాంధీనగర్ విద్యను అందిస్తుంది. అదేవిధంగా సకార్, న్యాస వంటి సోషల్ కల్చర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్స్‌తో ఐఐటీ గాంధీనగర్ విద్యార్థులు పలు కార్యక్రమాలను చేపడుతుండటం విశేషం.

ఐఐటీ భువనేశ్వర్

-ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఐఐటీని 2008లో ప్రారంభించారు. భువనేశ్వర్ శివారు ప్రాంతాల్లో 936 ఎకరాల విశాల ప్రాంగణంలో దీన్ని ఏర్పాటుచేశారు. ప్రత్యేక మెరైన్ క్యాంపస్ కలిగిన ఐఐటీగా ఇది రికార్డు సృష్టించింది. సముద్ర సంబంధిత అంశాలు, మత్స్య సంపద, ఎకోసిస్టమ్ పరిశోధన, అధ్యయనం కోసం ఈ క్యాంపస్‌ను ప్రారంభించారు. ఇక్కడ బేసిక్ సైన్సెస్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్ సైన్సెస్, మినరల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఎర్త్, ఓషన్ అండ్ ైక్లెమెట్ సైన్సెస్‌కు సంబంధించిన విభాగాలు ఉన్నాయి. యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఐఐటీ హైదరాబాద్

-రెండోతరం ఐఐటీల్లో హైదరాబాద్ ప్రముఖమైనది. 2008లో హైదరాబాద్ సమీపంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దీన్ని ప్రారంభించారు. 2015లో సంగారెడ్డికి సమీపాన ఉన్న కందిలో 576 ఎకరాల ప్రాంగణంలో నిర్మించిన నూతన క్యాంపస్‌కు దీన్ని మార్చారు. ఇక్కడ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ రేషియో 1:13. యూజీ ప్రోగ్రామ్స్‌తోపాటు పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ఐఐటీహెచ్ ఆఫర్ చేస్తుంది. సుమారు 50 పరిశ్రమలతో అనుసంధానం కావడమేకాకుండా ఇక్కడి చేసిన పరిశోధనలకు సంబంధించి 85 పేటంట్లను ఫైల్ చేయడం ఒక రికార్డు. అదేవిధంగా కేంద్రం ప్రకటించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగుల్లో మొదటి తరం ఐఐటీలను దాటి పదోస్థానంలో నిలవడం మరో విశేషం. అదేవిధంగా ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్సీలో బీటెక్‌ను ఆఫర్ చేస్తున్న తొలి ఐఐటీగా రికార్డు నెలకొల్పింది. జపాన్, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, తైవాన్ దేశాలకు చెందిన సుమారు 50 యూనివర్సిటీలతో ఎంఓయూలను చేసుకుని శరవేగంగా విద్యాభివృద్ధిలో పురోగమిస్తున్న ఐఐటీ ఇది.

ఐఐటీ పట్నా

-One who aspires wisdom, attains it అనే మోటోతో దీన్ని 2008లో ప్రారంభించారు. బీహార్ రాష్ట్ర రాజధాని పట్నాకు 40 కి.మీ దూరంలో సుమారు 500 ఎకరాల ప్రాంగణంలో దీన్ని ఏర్పాటుచేశారు. సింగపూర్, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, కెనడాలోని పలు విశ్వవిద్యాలయాలతో ఐఐటీ పాట్నా కలిసి పనిచేయడానికి ఒప్పందం చేసుకుంది. ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, బేసిక్ సైన్సెస్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ఈ సంస్థ అందిస్తుంది.

ఐఐటీ రోపర్

-Guide in the Right Direction అనే నినాదంతో దీన్ని 2008లో ప్రారంభించారు. పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో ఉంది. రోపర్ ఐఐటీని మూడు వేర్వేరు క్యాంపసుల్లో నిర్వహిస్తున్నారు. ట్రాన్సిట్ క్యాంపస్ ఇది పూర్వం మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ట్రాన్సిట్ -2. ప్రస్తుతం కొత్తగా శాశ్వత ప్రాంగణాన్ని ఏర్పాటుచేస్తున్నారు. దీని నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుంది. ఇక్కడ ఇంజినీరింగ్‌కు సంబంధించిన పలు బ్రాంచీలు ఉన్నాయి.

ఐఐటీ ధార్వాడ్

-knowledge is one that liberates అనే నినాదంతో దీన్ని 2016లో ప్రారంభించారు. కర్ణాటకలోని ధార్వాడ్‌లో 120 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ఐఐటీ బాంబే దీనికి మెంటార్‌గా వ్యవహరిస్తుంది. తాత్కాలిక క్యాంపసు వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (వాల్మి)లో ఏర్పాటుచేశారు. ముంబై-బెంగళూరు జాతీయరహదారిలో ఇది ఉంది. ప్రస్తుత క్యాంపసుకు 3 కి.మీ. దూరంలో 470 ఎకరాల్లో ధార్వాడ్ ఐఐటీ శాశ్వత ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సీఎస్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ కోర్సులను, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నారు. త్వరలో పీజీతోపాటు ఇతర కోర్సులను ప్రారంభించనున్నారు.

ఐఐటీ జోధ్‌పూర్

iit-jodhpur
-You are the entire Knowledge and Science అనే నినాదంతో దీన్ని 2008లో ప్రారంభించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 852 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దీన్ని ఏర్పాటుచేశారు. మొదట్లో ఈ సంస్థకు మెంటార్ సంస్థగా ఐఐటీ కాన్పూర్ వ్యవహరించింది. మొదటి సెషన్ 109 మంది విద్యార్థులతో ఐఐటీ కాన్పూర్‌లో ప్రారంభిం చారు. అనంతరం 2017లో పూర్తిస్థాయిలో జోధ్‌పూర్‌లోని శాశ్వత ప్రాంగణానికి మార్చారు. బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ఇక్కడ అందిస్తున్నారు.

ఐఐటీ ఇండోర్

iit-indore
-Knowledge is for the well-being of everyone అనే నినాదంతో కేంద్రప్రభుత్వం 2009లో దీన్ని ప్రారంభించింది. మొదట్లో ఈ క్యాంపస్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ దేవీ అహల్యా విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. మెంటార్‌గా ఐఐటీ బాంబే వ్యవహరించింది. తర్వాత శాశ్వత ప్రాంగణాన్ని ఇండోర్‌కు 25 కి.మీ. దూరంలోని సిమరోల్‌లో నిర్మించారు. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఈ సంస్థ దూసుకుపోతుంది. విశాలమైన ఆన్‌లైన్ లైబ్రెరీ సౌకర్యం ఇక్కడి ప్రత్యేకత. బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ఐఐటీ ఇండోర్ ఆఫర్ చేస్తుంది.

ఐఐటీ వారణాశి (బీహెచ్‌యూ)

-1919లో ప్రారంభించిన బెనారస్ ఇంజినీరింగ్ కాలేజీ 1968లో బెనారస్ హిందూ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. 2012లో దీన్ని ఐఐటీగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 1916లో పండిట్ మదన్ మోహన్ మాలవీయ డా. అనిబీసెంట్ సహకారంతో దీన్ని ప్రారంభించారు. Education is Character అనేది ఐఐటీ బీహెచ్‌యూ నినాదం. 2019 ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగుల్లో 11వ స్థానంలో ఈ సంస్థ నిలిచింది. దేశంలోని అతి పురాతన విద్యాసంస్థల్లో ఇది ఒకటి. ఇక్కడికి పలు దేశాల్లోని విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. ప్రపంచంలో దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఐఐటీ భిలాయ్

iit-bhilai
-మూడోతరం ఐఐటీల్లో భిలాయ్ ఒకటి. దీన్ని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయ్‌లో 2016లో ప్రారంభించారు. తాత్కాలికంగా దీన్ని రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. ఉక్కు నగరంగా పేరుగాంచిన భిలాయ్‌కు దగ్గర్లో శాశ్వత భవనాన్ని రాయ్‌పూర్ విమానాశ్రయానికి 54 కి.మీ దూరంలో 445 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇక్కడ యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నారు.

ఐఐటీ గోవా

iit-goa
-మూడోతరం ఐఐటీలో గోవా ఒకటి. 2016లో తాత్కాలిక క్యాంపస్ గోవా ఇంజినీరింగ్‌లో దీన్ని ప్రారంభించారు. పనాజీకి 21 కి.మీ దూరంలో ఇది ఉంది. ప్రస్తుతం ఐఐటీ బాంబే ఈ సంస్థకు మెంటార్‌గా వ్యవహరిస్తుంది. శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి 320 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. మరో ఏడాదిలోగా ఐఐటీ గోవా శాశ్వత క్యాంపస్‌లోకి మారనున్నది. ఇక్కడ కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్‌లను ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా పీజీ, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి.

ఐఐటీ పాలక్కడ్

-కేరళలోని పాలక్కడ్‌లో 2015లో దీన్ని ప్రారంభించారు. 2014 బడ్జెట్‌లో దీన్ని ఆమోదించి కేవలం ఏడాది వ్యవధిలోనే ప్రారంభించడం విశేషం. మొదట్లో దీన్ని అహల్య ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో ఏర్పాటుచేశారు. ఐఐటీ మద్రాస్ మెంటార్‌గా వ్యవహరించింది. 2017లో శాశ్వత ప్రాంగణంలోకి క్యాంపస్‌ను మార్చారు. పాలక్కడ్‌కు సమీపంలో కంజికోడ్ అనే ప్రాంతంలో 500 ఎకరాలలో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ బీటెక్, రెండేండ్ల ఎంఎస్ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. అదేవిధంగా కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, హ్యుమానిటీస్‌ను ఇటీవలే ప్రారంభించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన పశ్చిమకనుమలకు దగ్గర్లో ఈ సంస్థ ఉంది. అంతేకాకుండా కోయంబత్తూరు విమానాశ్రయానికి 60 కి.మీ దూరంలో ఉంది.

ఐఐటీ జమ్ము

iit-jammu
-ఇది మూడోతరం ఐఐటీ. దీన్ని 2016లో ప్రారంభించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, జమ్ముకశ్మీర్ ప్రభుత్వం మధ్య జరిగిన ఎంఓయూ ద్వారా దీన్ని ఏర్పాటుచేశారు. జమ్ముకు సమీపంలోని జగ్‌తి గ్రామంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఐఐటీ ఢిల్లీ దీనికి మెంటార్‌గా వ్యవహరిస్తుంది. ఇక్కడ బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నారు. మొదటి బ్యాచ్‌లో 82 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు.

ఐఐటీ తిరుపతి

-మూడో తరం ఐఐటీల్లో తిరుపతి ఒకటి. దీన్ని 2014లో ప్రకటించారు. మార్చి 2015లో శంకుస్థాపన చేశారు. దీనికి ఐఐటీ మద్రాస్ మెంటార్‌గా వ్యవహరిస్తుంది. టెంపుల్ టౌన్‌గా ప్రసిద్ధిగాంచిన తిరుపతిలో దీన్ని ఏర్పాటుచేశారు. 2015 నుంచి విద్యార్థులకు బీటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. 2017-18 నుంచి ఎంఎస్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను ఇక్కడ ప్రారంభించారు. ఈ సంస్థకు సమీపంలో ఐఐఎస్‌ఈఆర్, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, రేణిగుంట విమానాశ్రయం ఉన్నాయి.

ఐఐటీ ధన్‌బాద్

-Arise, Awake, strive for the highest and be in the light అనే నినాదంతో దీన్ని ఏర్పాటుచేశారు. 1901లో ఇండియన్ కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానం ప్రకారం ఇంగ్లండ్‌లోని రాయల్ స్కూల్ ఆఫ్ మైన్స్ నమూనాలో గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ మైనింగ్ ఇంజినీరింగ్‌ను 1926లో ప్రారంభించారు. తర్వాతి కాలంలో పలు కోర్సులను ప్రారంభిస్తూ 1967లో యూనివర్సిటీ హోదాను పొందింది. 1997 నుంచి ఐఐటీలతో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం)లో జేఈఈ ద్వారా ప్రవేశాలు కల్పించడం ప్రారంభించారు. 2015లో పార్లమెంట్ తీర్మానంతో ఐఎస్‌ఎంను 2016 నుంచి ఐఐటీగా మార్చారు. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఇది వేగంగా దూసుకుపోతుండటం విశేషం. అత్యంత విశాలమైన లైబ్రెరీ, ల్యాబ్‌లు ఇక్కడ ఉన్నాయి.

ఐఐటీ మండి

iit-mandi
-రెండో తరం ఐఐటీల్లో మండి ఒకటి. దీన్ని 2009లో ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి 14 కి.మీ. దూరంలో కమండ్ అనే ప్రాంతంలో,
-ఉల్ నదీతీరాన దీన్ని ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు మెంటార్‌గా ఐఐటీ రూర్కీ వ్యవహరించింది. జర్మనీ, యూఎస్‌ఏలోని విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడానికి ఐఐటీ మండి ఒప్పందాలను చేసుకున్నది. అదేవిధంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఈసారి 20వ స్థానంలో నిలిచింది. అన్ని ఐఐటీలాగ్లే
-మండి ఐఐటీ కూడా బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తుంది. ప్రశాంత వాతావరణంలో నిర్మించిన క్యాంపస్ దీని సొంతం.
iit-rankings

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

365
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles