విద్యార్ధికి ఆర్ధిక చేయూత


Mon,May 13, 2019 01:39 AM

స్కాలర్‌షిప్స్
ఇంటర్ అయిపోయింది. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్‌కోర్సులు చేయడానికి విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. కానీ వీరిలో చాలామందికి ఆర్థికంగా ఫీజులు చెల్లించలేని పరిస్థితి. అలాంటి పేదవిద్యార్థులకు చదువులకు ఆర్థిక అడ్డకుంలు లేకుండా ఫీజు చెల్లించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్‌షిప్స్ ఇస్తాయి. ఇవేకాకుండా ఆర్థికంగా వెనుకబడినవారికి చేయూతనివ్వడానికి పలు సంస్థలు, అందిస్తున్న స్కాలర్‌షిప్స్ వివరాలు నిపుణ పాఠకుల కోసం..
scholarship

ప్రగతి స్కాలర్‌షిప్ స్కీం ఫర్ గర్ల్స్

-దీనికి నిధులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చేకూరుస్తుంది. దీన్ని ఏఐసీటీఈ అమలుపరుస్తుంది. ఇంజినీరింగ్ చదువుకునే బాలికలకు (మహిళలకు) ఆర్థిక చేయూతనివ్వడానికి ఈ స్కాలర్‌షిప్స్‌ను ఏర్పాటుచేశారు. మొత్తం నాలుగువేల స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు. దీనిలో 2000 డిగ్రీస్థాయి అభ్యర్థులకు, 2000 స్కాలర్‌షిప్స్ డిప్లొమా ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారికి అందిస్తారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

-ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ/డిప్లొమా మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందినవారు. ప్రవేశాలు రాష్ట్ర/జాతీయస్థాయి కౌన్సెలింగ్ ద్వారా అయి ఉండాలి.
-ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు బాలికలకు ఇస్తారు. వారి కుటుంబ వార్షికాదాయం ఎనిమిది లక్షలు మించరాదు.
-ఈ స్కాలర్‌షిప్స్ రిజర్వేషన్ల ప్రకారం అంటే ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం చొప్పున ఇస్తారు.

ఎంత స్కాలర్‌షిప్ ఇస్తారు?

-ట్యూషన్ ఫీజు కింద రూ.30,000తోపాటు నెలకు రెండువేల చొప్పున పదినెలలు ఇస్తారు. ఒకవేళ ట్యూషన్ ఫీజు రియంబర్స్‌మెంట్/మాఫీకింద పోయినవారికి విద్యాఖర్చుల కింద రూ.30 వేలు ఇస్తారు.
-ముఖ్యతేదీలు: ఈ స్కాలర్‌షిప్ ప్రతి ఏటా అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.
-కావాల్సిన సర్టిఫికెట్లు: పదోతరగతి/ఇంటర్ తదితర అవసరమైన అకడమిక్ సర్టిఫికెట్లు. కుటుంబ వార్షికాదాయ ధృవీకరణ పత్రం, ప్రవేశం పొందిన పత్రం, ట్యూషన్ ఫీజు రిసిప్ట్, ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ పాస్‌బుక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఫొటోగ్రాఫ్. కులధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, తల్లిదండ్రులు ధ్రువీకరణ పత్రం.
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.aicte-india.org

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్కాలర్‌షిప్ స్కీం

ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏటా 300 స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. వీటిని దేశనాలుగు పక్కలా అంటే దక్షణ, ఉత్తర, తూర్పు, పడమర ప్రాంతాలకు సమానంగా ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా పంచుతారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

-ఇంజినీరింగ్/ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం 2018-19లో చదివినవారు.
-వయస్సు 15- 30 ఏండ్ల మధ్య ఉండాలి. పీహెచ్‌సీలకు పదేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులయితే 65 శాతం, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలకు 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. పీహెచ్‌సీలకు అయితే 50 శాతం మార్కులతో
-ఉత్తీర్ణత. బాలికలు అయితే 60 శాతం మార్కులు సరిపోతుంది.
-వార్షిక కుటుంబ ఆదాయం లక్ష రూపాయలు మించరాదు.

ఎంత ఇస్తారు?

-ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.3,000 చొప్పున కోర్సు పూర్తయ్యే వరకు ఇస్తారు. బోనస్ కింద మెరిట్‌లో ఎంపికైనవారికి రూ.10 వేలు ఇస్తారు.
-దరఖాస్తులు ఏటా జూలై/అక్టోబర్‌లో స్వీకరిస్తారు.
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.iocl.com

సాక్షం స్కాలర్‌షిప్ స్కీం ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ స్టూడెంట్

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అమలు చేస్తున్న స్కాలర్‌షిప్స్‌లో సాక్షం ఒకటి. దీన్ని ఏఐసీటీఈ అమలు చేస్తుంది. దివ్యాంగులు సాంకేతిక (టెక్నికల్) విద్యను అభ్యసించడానికి చేయూతనిచ్చే స్కాలర్‌షిప్ ఇది.
-మొత్తం స్కాలర్‌షిప్స్ 1000. దీనిలో 500 డిగ్రీ, 500 డిప్లొమా అభ్యర్థులకు ఇస్తారు. ఒకవేళ డిగ్రీ అభ్యర్థులు దొరకకుంటే డిప్లొమాకు, డిప్లొమా అభ్యర్థులు లేకుంటే డిగ్రీకి స్కాలర్‌షిప్స్ సంఖ్యను బదలాయిస్తారు.
-ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థలో డిగ్రీ/డిప్లొమా మొదటి సంవత్సరంలో ప్రవేశం పొంది ఉండాలి. ఈ ప్రవేశం రాష్ట్ర/జాతీయస్థాయిలో
-సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ప్రాసెస్‌లో జరిగి ఉండాలి. అంటే కౌన్సెలింగ్ విధానంలో సీటు పొందినవారికి మాత్రమే.
-దివ్యాంగుడైన విద్యార్థి డిజేబిలిటీ 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం ఎనిమిది లక్షలు మించరాదు.
-స్కాలర్‌షిప్‌లకు అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
-స్కాలర్‌షిప్ కింద ట్యూషన్ ఫీజు రూ.30,000/- లేదా కాలేజీ పేర్కొన్న ఫీజును చెల్లిస్తారు. అయితే వాటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని ఇస్తారు. అదేవిధంగా నెలకు రూ. 2,000/- చొప్పున పదినెలలు ఇస్తారు. ఒకవేళ ట్యూషన్ ఫీజు మాఫీ అయితే రూ.30 వేలను పుస్తకాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్/ల్యాప్‌టాప్,వాహనం లేదా ఇతర పరీక్షలకు సిద్ధం కావడానికి ఉపయోగించుకోవచ్చు. మొత్తం స్కాలర్‌షిప్స్‌లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం చొప్పున ఇస్తారు.
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.aicte-india.org

సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్‌షిప్

వెనకబడిన కుటుంబ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఈ స్కీం కింద ఆర్థిక సహాయాన్ని నేరుగా చేస్తారు. దీన్ని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఇస్తుంది. ఏటా 82,000 మందికి ఈ పథకం కింద స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు.

ఎవరు అర్హులు?

-ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 80 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థలో రెగ్యులర్ డిగ్రీలో ప్రవేశం పొంది ఉండాలి.
-కుటంబ వార్షికాదాయం ఆరులక్షల కంటే తక్కువగా ఉండాలి.

స్కాలర్‌షిప్ ఎంత ఇస్తారు?

-బీఈ/బీటెక్ పూర్తయ్యే వరకు ఏటా రూ. 10,000 ఇస్తారు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయితే మొదటి మూడేండ్లు పదివేలు, తర్వాతి రెండేండ్లు రూ.20 వేలు ఇస్తారు.
-ముఖ్యతేదీలు: ఏటా ఈ స్కాలర్‌షిప్స్ దరఖాస్తులను జూన్/జూలైలో స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://scholarships.gov.in చూడవచ్చు

scholarship-for-mba-student

సీమన్స్ స్కాలర్‌షిప్

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఇంజినీరింగ్ చదవడానికి చేయూతనిచ్చేందుకు సీమన్స్ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తుంది.
-అర్హతలు: ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ చదువుతున్నవారు.
-అభ్యర్థులు 20 ఏండ్ల లోపు ఉండాలి. కనీసం 60శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్ (ఎంపీసీ)లో 50శాతం,ఆప్షనల్ సబ్జెక్టులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-కుటుంబ వార్షికాదాయం రెండు లక్షలు మించరాదు.

ఎంతిస్తారు?

-ఇతర స్కాలర్‌షిప్స్ ద్వారా ఫీజు చెల్లించగా మిగిలిన ఫీజు మొత్తాన్ని చెల్లిస్తారు. అదేవిధంగా పుస్తకాలు, స్టేషనరీ, హాస్టల్, ఇతరత్రా ఖర్చులకు అలవెన్సులను చెల్లిస్తారు.
నోట్: దరఖాస్తులను ప్రతి ఏటా ఆగస్టులో స్వీకరిస్తారు.

ఎన్‌టీపీసీ స్కాలర్‌షిప్

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే పథకం ఇది.
-మొత్తం 35 స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు. మొదటి సంవత్సరం ఇంజినీరింగ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు దీన్ని ఇస్తారు. ఎస్సీలకు 20, ఎస్టీలకు 10, పీహెచ్‌సీలకు 5 చొప్పున ఇస్తారు.
-అర్హతలు: భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంజినీరింగ్ కాలేజీలో ఫుల్‌టైం ఇంజినీరింగ్ డిగ్రీలో ప్రవేశం పొందిన వారు. ఎస్సీ, ఎస్టీలు కులధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలి.
-స్కాలర్‌షిప్: ఇంజినీరింగ్ రెండోసంవత్సరం నుంచి నెలకు రూ.1500 ఇస్తారు. స్కాలర్‌షిప్‌ను ఏటా పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా కొనసాగిస్తారు.
-వెబ్‌సైట్: https://www.ntpc.co.in

ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్స్

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఇంజినీరింగ్ డిగ్రీ చదవడానికి ఎల్‌ఐసీ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తుంది.
-అర్హతలు: ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు.
-అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం లక్ష రూపాయలు మించరాదు.
-తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-అభ్యర్థి పేరిట వ్యాలిడిటీ ఉన్న బ్యాంకు అకౌంట్ ఉండాలి.

ఎంత ఇస్తారు?

-ఏడాదికి రూ. 10,000 ఇస్తారు. ఈ మొత్తాన్ని నెలకు వెయ్యి చొప్పున ఇస్తారు.
-ప్రతి ఏటా సెప్టెంబర్‌లో ఈ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ వస్తుంది.
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.licindia.in/Bottom-Links/Golden-Jubilee-Foundation/Scholarship

258
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles