సివిల్స్ శిక్షణకు హైదరాబాదే బెస్ట్


Mon,April 15, 2019 01:05 AM

దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలైన సివిల్స్ సర్వీసెస్‌లు సాధించాలంటే ఢిల్లీలోనే శిక్షణ తీసుకోవాలనేది కొన్నేండ్ల క్రితం వరకూ వినిపించిన మాట. ఇప్పుడు సివిల్స్ శిక్షణకు హైదరాబాద్ కేంద్రంగా మారుతున్నది. గత కొన్నేండ్లుగా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఢిల్లీని మించి సివిల్స్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు. నాణ్యమైన సివిల్స్ శిక్షణా సంస్థలకు ఇప్పుడు హైదరాబాద్ హబ్‌గా మారింది. అంతేకాకుండా దేశంలో ఏ మెట్రో నగరానికి లేని ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్‌లో ఉండటంతో ఉత్తరాది నుంచి కూడా సివిల్స్ శిక్షణకు హైదరాబాద్ వస్తున్నారు. ఇక దక్షిణాది విద్యార్థులకైతే హైదరాబాదే గమ్యస్థానంగా మారింది. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి వివిధ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులు వెల్లడించిన అభిప్రాయమిది.
civils-coaching


హార్డ్‌వర్క్‌తోనే విజయం సాధ్యం

సివిల్స్ 423వ ర్యాంకర్ అశ్విజ
ashwija

సివిల్స్ ఫలితాలు వెలువడ్డాయి. లక్షల మంది పోటీపడ్డ సివిల్స్ చివరి అంకంలో 750 మంది మిగిలారు. దీనిలో విజయం సాధించిన అశ్విజ నిపుణతో మాట్లాడిన వివరాలు ...

-నిపుణ: మీ తల్లిదండ్రులు, ఎడ్యుకేషన్ వివరాలు, సివిల్స్ వివరాలు చెప్తారా?
-అశ్విజ: మాది బళ్లారి. నేను బెంగళూరులో టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివాను. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ (2015)లో మొదటిసారి సివిల్స్ రాశాను. తర్వాత కోచింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. 2016లో అనలాగ్, సీఎస్‌బీ అకాడమీలో కోచింగ్ తీసుకున్నా. 2017లో ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కాలేదు. మూడో ప్రయత్నంలో 2018లో 423వ ర్యాంక్ సాధించాను.

-నిపుణ: ఇంజినీరింగ్ నుంచి సివిల్స్ వైపు ఎందుకు వచ్చారు?
-అశ్విజ: మా నాన్నగారు రాయచూర్‌లో ఆర్ ఆండ్ బీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ హౌజ్‌వైఫ్. తమ్ముడు బెంగళూరులో సర్జన్‌గా పనిచేస్తునాడు. బళ్లారిలో 2003లో అక్కడ పనిచేసే డిప్యూటీ కలెక్టర్.. అక్కడి సంచార జాతుల కోసం 100 ఇండ్లు కట్టించి వారికోసం ఒక బడిని ఏర్పాటు చేశారు. దాంతో వారి కుటుంబాల్లో చాలా మార్పులు వచ్చాయి. వారి పిల్లలు మంచి హోదాల్లో స్థిరపడ్డారు. మా నాన్న నాకు ఆ కాలనీని చూపించి విషయం చెప్పారు. అప్పుడే నేను పెద్ద ఆఫీసర్‌ను అయ్యి సమాజానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ నుంచే సివిల్స్‌వైపు ప్రయాణం ప్రారంభించా.

-నిపుణ: సివిల్స్ ప్రిపరేషన్ ఏ విధంగా చేశారు? ఏ పుస్తకాలు చదివారు?
-అశ్విజ: మొదటి ప్రయత్నంలో కేవ లం పరీక్ష విధానం తెలుసుకోవడానికే రాశా. రెండో ప్రయత్నం నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించా. సివిల్స్ కోసం నేను ప్రాథమిక అంశాలకు 6 నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదివా. పాలిటీకి లక్ష్మీకాంత్, ఎకానమీకి శంకర్ గణేష్, యోజన, హిస్టరీ, జాగ్రఫీ కోసం ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదివా. ఎన్విరాన్‌మెంట్ సబ్జెక్టుకు శంకర్ ఐఏఎస్ అకాడమీ బుక్ చదివా. కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజు ఒక జాతీయ పత్రిక ది హిందూని చదివాను. ప్రాంతీయవార్తల కోసం ఒక లోకల్ పేపర్ చదివా. లోకల్ పేపర్ వల్ల ప్రాంతీయ విషయాలు తెలుస్తాయి ఇవి ఇంటర్వ్యూకు ఉపయోగపడుతాయి.
-ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేస్తే మంచిది. అంటే ఉదాహరణకు పుల్వామా సంఘటన తీసుకుంటే.. ప్రిలిమ్స్ కోసం పుల్వామా సరిహద్దులు, చుట్టూ ఉండే ప్రాంతాలు, ప్రాముఖ్యతలను ఆబ్జెక్టివ్ కోణంలో చదవాలి. అదే మెయిన్స్ కోసం బోర్డర్ మేనేజ్‌మెంట్ కోణంలో చదవాలి. ఇంటర్వ్యూకు ఒక ఆఫీసర్‌గా ఎలా ప్రవర్తిస్తావు, తీవ్రవాదుల గురించిన ప్రశ్నలు అడుగుతారు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్‌కావాలి.
-మెయిన్స్‌లో 9 పేపర్లు ఉంటాయి. మొదట ఆయా పేపర్ల సిలబస్‌ను సమగ్రంగా అర్థం చేసుకోవాలి. సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి. ఏ అంశం ఏ పేపర్ పరిధిలోకి వస్తుందో తెలిసి ఉండాలి. మెయిన్స్‌లో 20 ప్రశ్నలకు 20 రాస్తేనే మంచిది. రెండు ఎస్సేలు 125 మార్కులు. అన్నింటిని సమగ్రంగా, తక్కువ పదాలతో ఎక్కు వ విషయాన్ని చెప్పే విధంగా రాయడం ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం ప్రతిరోజు ఒక అంశంపై ఎస్సే రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా కీలకం. క్వాలిటీగా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. ప్రతి అంశాన్ని దీర్ఘకాలిక వ్యూహంలో అర్థం చేసుకుని జవాబులు గుర్తించేలా, రాసేలా ఉండాలి.
-ప్రిలిమ్స్‌లో ఆబ్జెక్టివ్, మెయిన్‌లో డిస్క్రిప్టివ్, ఇంటర్య్వూలో ఒపీనియన్‌గా జవాబులు ఉంటాయి. ప్రతి అంశాన్ని పై కోణంలో చదివితే తప్పక విజయం సాధించవచ్చు.

-నిపుణ: ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఎలాంటి ప్రశ్నలు అడిగారు?
-అశ్విజ: ఇది చాలా కష్టమైన పార్ట్. బుక్స్‌లో చదివిన అంశాలకు ప్రాక్టికల్‌నాలెడ్జ్‌ను పరిశీలిస్తారు, అభ్యర్థుల వ్యక్తిగతం, వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తారు.
-ఐదుగురు సభ్యులు ఉండే బోర్డు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తుంది. వారి మనసులో ఏముం దో అంచనా వేయడం చాలా కష్టం. ఇక నా విషయానికి వస్తే మనోజ్ సోని బోర్డు ఇంటర్వ్యూ చేసింది. నా ఆప్షనల్ పాలిటీ కావడంతో ఇంటర్నేషనల్ రిలేటెడ్ విషయాలను అడిగారు. డోనాల్డ్ ట్రంప్, కిమ్‌ల సమావేశంపై, న్యూక్లియర్ ట్రీట్, అమెరికా, రష్యా కోల్డ్‌వార్‌లపై ప్రశ్నలు అడిగారు. అదేవిధంగా ఇంటర్వ్యూకు కొద్దిరోజుల ముందు జరిగిన సర్జికల్‌ైస్ట్రెక్‌కు సంబంధించి దేశంలోని మిసైల్స్, సబ్‌మెరైన్స్ తదితర రక్షణ అంశాలను అడిగారు. చివరగా నా హాబీలను చూసి నీకు మోటివేటెడ్ స్పీకర్ ఎవరు అని అడిగారు. దీనికి సమాధానం నోబెల్ గ్రహీత మలాలా అని చెప్పాను. ఎందుకు అని అడిగారు. అమె చెప్పిన ట్యాగ్ one pen, one book, one teacher can change the world, because of education is most powerful weapon చెప్పాను.

-నిపుణ: అందరూ ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటారు, మీరు బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఎందుకు కోచింగ్ తీసుకున్నారు?
-అశ్విజ: సివిల్స్ విషయంలో ఢిల్లీ కోచింగ్ బాగుటుంది అని పేరుంది. కానీ కొన్నేండ్లుగా హైదారబాద్ మిని ఢిల్లీగా మారింది. సౌత్ ఇండియాలో బెస్ట్ సివిల్స్ కోచింగ్ ప్లేస్‌గా హైదారబాద్ చెప్పవచ్చు. ఇక్కడ మంచి ఫ్యాకల్టీ, బుక్స్, వసతులన్ని ఉన్నాయి. అదేవిధంగా వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ సమశీతోష్ణస్థితి అందరికీ అనుకూలం. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్‌కు చాలా బెస్ట్ ప్లేస్.

-నిపుణ: కొత్తగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి మీరిచ్చే సందేశం?
-అశ్విజ: విజయానికి దగ్గరిదారి అంటూ ఏది ఉండదు. హార్డ్‌వర్క్, ఫోకస్డ్ స్టడీ, బాగా ప్రాక్టీస్ చేయడం వల్లే విజయం వస్తుంది. దీర్ఘకాలిక ప్రిపరేషన్‌కు సిద్ధంగా ఉండాలి. ఓటమి చూసి భయపడవద్దు. ప్రతిరోజు కనీసం 8-10 గంటలు చదవాలి. నేను వారంలో ఒక రోజు పూర్తిగా హాలిడే తీసుకునేదాన్ని, వారంతాన్ని అనలైజింగ్ చేసుకోవడం, రిఫ్రెష్ అవ్వడానికి ఉపయోగించుకున్నాను. కోచింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. నేను బాలలత మేడం సీఎస్‌బీ అకాడమీలో కోచింగ్ తీసుకున్నా. మేడం నాకు చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. ప్రతి చిన్న విషయాన్ని ఎలా విశ్లేషించాలి, ఎలాంటి కోణంలో చదవాలి అనే విషయాలను వివరించారు. ప్రతిచిన్న విషయాన్ని క్షుణ్ణంగా చెప్పారు. మేడం గైడెన్స్ నాకు చాలా ఉపయోగపడింది. కొత్త విద్యార్థులు హార్డ్‌వర్క్‌ను, ఓపికను నమ్ముకుని ప్రిపేర్ అయితే తప్పక విజయం సాధిస్తారు.

మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించొచ్చు

సివిల్స్ 590వ ర్యాంకర్ శ్రీకర్
srikar

కార్పొరేట్ జాబ్...అదీ అమెరికా ఆపిల్ కంపెనీలో.. నెలకు రూ. 5లక్షలకు పైగా వేతనం. అయినా అసంతృప్తి. జన్మభూమికి ఏదో చేయాలన్న తపన, తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చిన సమాజ సేవాతత్పరతతో సివిల్స్‌వైపు పయనించిన అనుముల శ్రీకర్ మొదటి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూకు చేరుకుని సర్వీస్ సాధించడం స్ఫూర్తిదాయకం. బాల్యం నుంచి సివిల్స్ వరకు తన ప్రస్థానం గురించి నిపుణతో శ్రీకర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లో...

-మాది యాదాద్రి భువనగిరి. నాన్న ప్రభాకరాచారి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు తీసుకున్నారు. అమ్మ గృహిణి. తమ్ముడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నేను భువనగిరి శ్రీవిద్యానికేతన్‌లో నాలుగో తరగతి వరకు చదివాను, తర్వాత ప్రెసిడెన్సీ పాఠశాలలో పదోతరగతి పూర్తిచేశాను. తర్వాత హబ్సిగూడలో ఇంట ర్, శ్రీఇందూలో ఐటీ ఇంజినీరింగ్ చేశాను. అనంతరం 2015లో యూఎస్‌ఏలోని క్యాన్సస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తిచేసి యాపిల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. 2017 వరకు ఉద్యోగం చేశాను. కానీ నా దేశానికి, నేను పుట్టినగడ్డకు ఏదో చేయాలన్న ఆకాంక్షతో 2017లో జాబ్ వదులుకుని ఇండియాకు వచ్చేశాను.

-సివిల్స్ ప్రస్థానం: సమాజసేవ చేయాలంటే అత్యుత్తమ మార్గం సివిల్ సర్వీస్ బెస్ట్ అని అటువైపు పయనం ప్రారంభించా. జాబ్ చేస్తున్నప్పడే అక్కడ రూం మేట్స్ కాళి రమేష్, రాఘవేంద్ర వంటివారు, ఇక్కడ తల్లిదండ్రులు, తమ్ముడు, స్నేహితులు నీవు తప్పక విజయం సాధిస్తావని నా వెన్నుతట్టి ప్రోత్సహించారు. యూఎస్‌ఏ నుం చి రాగానే రెండు నెలలపాటు యూపీఎస్సీ పరీక్ష విధానాన్ని, సివిల్స్ సిలబస్‌ను సమగ్రంగా అధ్యయనం చేశాను. గత పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్నల సరళిని పరిశీలించాను. సివిల్స్ రాసే అభ్యర్థుల నుంచి యూపీఎస్సీ ఏం ఆశిస్తున్నది అనేది బాగా విశ్లేషించుకున్నా, ఆయా అంశాలను సమగ్రంగా అధ్యయనం చేశాను. తర్వాత 2018 సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాను. మొదట ప్రిలిమ్స్‌కు ప్రాథమిక పుస్తకాలను సమగ్రంగా చదివాను. అదే సందర్భంలో తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకోవాలని నిర్ణయించుకుని ఆకెళ్ల రాఘవేంద్ర సార్ దగ్గర కోచింగ్‌కు వెళ్లాను. ప్రతిరోజు కనీసం 6 గంటలు ఇష్టపూర్తిగా చదివాను. ప్రిలి మ్స్ పరీక్ష రాసిన తర్వాత కటాఫ్ చూసుకుని తప్పక మెయిన్స్ వస్తుందని భావించాను. ఫలితాలు వెలువడ్డాక మెయిన్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాను. ప్రిలిమ్స్‌లో చదివిన పుస్తకాలు మెయిన్స్‌కు ఉపయోగపడుతాయి. అప్పుడు ఆబ్జెక్టివ్ విధానంలో జవాబు గుర్తించడం కోసం చదివాను, వాటినే డిస్క్రిప్టివ్ విధానానికి మార్చుకుని ఆయా అంశాలపై పట్టు పెంచుకున్నాను. తెలుగు లిటరేచర్‌కు ఆకెళ్ల సార్ మెటీరియల్‌తోపాటు కొన్ని ప్రాథమిక పుస్తకాలు చదివాను. నాన్నగారి గైడెన్స్ సరిపోయింది. మిగిలిన పేపర్లకు, ఎస్సేకు ఆన్‌లైన్‌లో మెటీరియల్ ఉపయోగించుకున్నాను. తెలుగు లిటరేచర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ జీఎస్ కూడా సమాంతరంగా చదివాను. మెయిన్స్‌లో 20కి 20 ప్రశ్నలు రాశాను.

-ప్రిపరేషన్ సమయంలో ఎక్కడా స్ట్రెస్‌గా ఫీల్ కాలేదు. మెయిన్స్ కోసం ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గంటలు చదివాను. ఆప్షనల్ తప్ప మిగిలిన ఏ సబ్జెక్టుకు కోచింగ్ తీసుకోలేదు. ఇంగ్లిష్ మీడియం నుంచి వచ్చిన నేను తెలుగు లిటరేచర్‌ను ఆప్షనల్‌గా తీసుకోవడం వల్లే కోచింగ్ అవసరమైంది. నాన్న ప్రోత్సాహం, గైడెన్స్ నాకు చాలా ఉపయోగపడింది.
-మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాక మాత్రం ఇంటర్వ్యూ కోసం మహేష్ భగవత్, బాలలత మేడం, ఆర్‌సీరెడ్డి, ఆకెళ్ల రాఘవేంద్ర, పలువురు సీనియర్స్‌తోపాటు నాన్న గారి దగ్గర సూచనలు, సలహాలు తీసుకున్నాను.
-నన్ను పీకే జోషి బోర్డు ఇంటర్వ్యూ చేసింది. వారు సాఫ్ట్‌వేర్‌లో మంచి పొజిషన్ వదులుకుని సివిల్స్ వైపు ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. నాగార్జున కొండ, పోచంపల్లి, యాదాద్రి తదితర అంశాలను అడిగారు. అదేవిధంగా తెలంగాణ మీద కూడా పలు ప్రశ్నలు వేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధి ఏమిటి? చిన్న రాష్ర్టాల వల్ల లాభమా, నష్టమా అని అడిగారు. వీటితోపాటు నేను యూఎస్‌ఏ లో జాబ్ చేసాను కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు, ట్రంప్, వీసా ఇష్యూలను అడిగారు.

-సివిల్స్ ప్రయాణం కనీసం ఏడాదిపైగా పడుతుంది. అప్పుడప్పుడు నిరుత్సాహం ఏర్పడవచ్చు ఆ సందర్భంలో మనకు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. నేను గరికపాటి నరసింహారావు, చాగంటి వంటి వారి ప్రసంగాలు వినేవాడిని, సమాజానికి సేవచేయాలంటే నేను మంచి సర్వీస్ సాధించాలనే దృఢ నిశ్చయం పదేపదే గుర్తుకు తెచ్చుకునేవాడిని.
-కోచింగ్ విషయానికి వస్తే అది ఆయా అభ్యర్థుల వ్యక్తిగతం. బలాలు, బలహీనతలను బట్టి కోచింగ్ ఆధారపడి ఉంటుంది. మంచి గైడెన్స్, సీనియర్స్ సలహాలు ఉంటే కోచింగ్ లేకుండా కూ డా సివిల్స్ సాధించవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్ అందుబాటులో ఉంటే చాలా విషయాలను నేర్చుకోవచ్చు. నేను తెలుగు లిటరేచర్ కోసం కోచింగ్ తీసుకున్నాను. తర్వాత ఇంటర్వ్యూకు గైడెన్స్ తీసుకున్నాను. మిగిలిన అన్ని అంశాలను ఇంట్లో నే ప్రిపేర్ అయ్యాను.
-చాలామంది సివిల్స్ అంటే ఢిల్లీ కోచింగ్ అని భావిస్తుంటారు. కానీ హైదరాబాద్ బెస్ట్ ప్లేస్. ఇక్కడ కాస్మోపాలిటిన్ కల్చర్ ఉంది. ప్రిపరేషన్ సమయం లో రిలాక్స్ కావడానికి హైదరాబాద్‌లోని ఆయా ప్రాంతాలను తిరిగి చూస్తే చాలు చాలా విషయా లు తెలుసుకోవచ్చు. వాటిని ప్రిపరేషన్‌లో ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్‌లో మంచి కోచింగ్ లభిస్తుంది, సివిల్స్‌కు హాట్‌స్పాట్‌గా చెప్పవచ్చు. ఢిల్లీ కోచింగ్ సెంటర్లు ఇక్కడకి వచ్చి కోచింగ్‌లను ప్రారంభిస్తున్నా యి. ఇక్కడి వాతావరణం చక్కగా అన్ని విషయాలను ఆకళింపు చేస్తుంది. సివిల్స్ హబ్‌గా హైదరాబాద్ మారింది.

-నా విజయం పూర్తికాలేదు. ప్రస్తుతం వచ్చే సర్వీస్‌లో జాయిన్ అవుతా. సివిల్స్‌లో ఐఏఎస్ సాధించడం నా లక్ష్యం. ఈసారి జరిగిన పొరపాట్లను విశ్లేషించుకుని నేను మరో ప్రయత్నం ప్రారంభిస్తాను. మొదటి ప్రయత్నం లో నేను సివిల్స్‌లో ఒక సర్వీస్ సాధించడం వెనుక నా కుటుం బం, స్నేహితుల అండదండ లు ఉన్నాయి.
-సాఫ్ట్‌వేర్ నుంచి సివిల్స్ వైపు నేను రావడానికి ప్రధాన కారణం నా కుటుంబ నేపథ్యం. అమ్మనాన్నలు వృత్తితోపాటు సమాజసేవ, సాహిత్యసేవ నా బాల్యం నుంచి నాలో అభ్యుదయభావనలకు ఆద్యం పోశాయి. పెద్దయ్యాక నేను పుట్టిన ప్రాంతానికి, నా దేశానికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం అప్పుడే పురుడుపోసుకుంది. యూఎస్‌ఏ వెళ్లినా మంచి వేతనం అందుకుంటున్నా నాకు సంతృప్తి లేదు. అందుకే తిరిగి ఇక్కడికి వచ్చి సివిల్స్‌వైపు అడుగులు వేశాను. యూఎస్‌ఏలో స్నేహితులు, ఇక్కడ అమ్మనాన్న, తమ్ముడు అందరూ నన్ను ప్రోత్సహించారు. భారీ వేతనాన్ని వదులుకుని ఇక్కడికి ఎందుకు వస్తావు అని ఎవ్వరూ ప్రశ్నించలేదు. నిరుత్సాహ పర్చలేదు.

చదివిన పుస్తకాలు

-హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం - ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్
-పాలిటీ- లక్ష్మీకాంత్
-ఆర్ట్ అండ్ కల్చర్- ఎన్‌ఐవోఎస్.
-ఎన్విరాన్‌మెంట్- ఆన్‌లైన్ మెటీరియల్
-ఎకనామిక్స్- ఆన్‌లైన్ మెటీరియల్
-తెలంగాణ అంశాలు- నమస్తే తెలంగాణ, తెలుగు అకాడమీ బుక్స్

-కొత్తగా సివిల్స్ రాసే వారికి నేను చెప్పేది అనవసర భయాలను తొలగించుకోండి. మొదటి ప్రయత్నంలోనే తప్పక విజయం సాధించవచ్చు. ప్రిలిమ్స్ నుంచే ఆప్షనల్ ప్రిపరేషన్ చేస్తే మంచిది, కోచింగ్ అనేది వ్యక్తిగత బలాలను బట్టి నిర్ణయించుకోవాలి. ఏడాది నుంచి ఏడాదిన్నరపాటు ప్రతి రోజు 6 గంటలు అర్థవంతంగా చదవితే తప్పక విజయం సాధించవచ్చు. సివిల్స్ అంటే బ్రహ్మపదార్థం ఏమీకాదు. ఇష్టపడి చదవండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, విశ్లేషణ చాలా అవసరం. సొంతంగా ప్రిపేర్ అయినా సర్వీస్ సాధించవచ్చు. సీనియర్లు, మంచి మెంటార్స్ దగ్గర సలహాలు, సూచనలు స్వీకరిచండి. ఆన్‌లైన్‌లో మంచి మెటీరియల్ లభిస్తుంది. అనవసర విషయాలను కాకుండా యూపీఎస్సీ ఏం ఆశిస్తుందో తెలుసుకుంటే విజయం మీ సొంతం. మీడియం సమస్యే కాదు. నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియం, తీసుకున్నది తెలుగు సాహిత్యం. ఇష్టపడి ఏ పనిచేసినా విజయం సాధించవచ్చు. ఒక ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నాన్ని మరింత ఉత్సాహంతో చేయాలి. దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వెళితే తప్పక సక్సెస్ మీకు లభిస్తుంది. నా వరకు కుటుంబ నేపథ్యం బాగా సహకరించింది. నాన్న టీచర్‌గా పాఠశాలలోనే కాకుండా ఇంట్లో మాకు కూడా సమాజం గురించి, సేవాదృక్పథం గురించి బోధించారు. అది నా విజయానికి సోపానంగా మారింది.
-సివిల్స్ ప్రిపరేషన్‌కు ముందు మీ బలాలను, బలహీనతలను స్పష్టంగా బేరీజు వేసుకోండి. ఇష్టంగా హార్డ్‌వర్క్ చేయండి. యూపీఎస్సీ ఏం ఆశిస్తుందో ఆకళింపు చేసుకుంటే చాలు సగం విజయం సాధించినట్లే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనుతిరగకుండా ముందుకు వెళ్లండి.

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

913
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles