ఉపాధికి మార్గం ఐటీఐ


Mon,April 15, 2019 01:03 AM

పది అయిపోయింది. తర్వాత ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటారు విద్యార్థులు. ఆర్థికంగా ఉన్నవారైతే ఉన్నత చదువులు చదవాలనుకుంటారు. అదే లేనివారైతే త్వరగా ఉపాధినిచ్చే కోర్సులు చేయాలనుకుంటారు. అలాంటివారు ఐటీఐ కోర్సులు చేస్తే త్వరగా ఉపాధి లభిస్తుంది. కావాలంటే ఆ తర్వాత ఉన్నత చదువులు కూడా చదువుకోవచ్చు. కానీ సరైన అవగాహన లేకపోవడంతో ఉన్న సమయం గడిచిపోయి ఏడాది వృథా చేసుకుంటారు. అలాంటివారికోసమే ఈ ప్రత్యేక కథనం..
ITI
-ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)లు దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ప్రత్యేకించి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తున్నాయి. కాబట్టి పదో తరగతి తర్వాత తక్కువ వ్యయంతో ఐటీఐని ఎంచుకోవడం ద్వారా ఒకటి లేదా రెండేండ్లలో టెక్నికల్‌గా నైపుణ్యం పొందవచ్చు. దీంతో చిన్న వయస్సులోనే ఉపాధి పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నత చదువులు కూడా చదవవచ్చు.
-కేంద్రప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఐటీఐలను ప్రారంభించింది. నిరుద్యోగితను తగ్గించేందుకు, మానవ వనరుల నైపుణ్యాలను పెంచేందుకు క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీం కింద 1950లో ఐటీఐలను స్థాపించింది. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి ఎక్కువగా ఐటీఐ పూర్తిచేసినవారినే తీసుకుంటున్నారు.
-నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎన్‌సీవీటీ) అనుబంధంగా రాష్ట్రంలో 54 ప్రభుత్వ, 222 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎస్‌సీవీటీ) అనుబంధంగా రాష్ట్రంలో 10 ఐటీఐలున్నాయి.
-ఐటీఐలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఇంజినీరింగ్ కోర్సుల్లో ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ (రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్), టర్నర్, వెల్డర్ (జనరల్ అండ్ ఎలక్ట్రికల్), డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ వంటి తదితర కోర్సులు ఉన్నాయి.
-నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో బుక్ బైండింగ్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కటింగ్ అండ్ స్యూయింగ్, డ్రెస్‌మేకింగ్, హార్టికల్చర్, స్టెనోగ్రఫీ, మ్యానుఫ్యాక్చర్ ఫుట్‌వేర్, సెక్రటేరియల్ ప్రాక్టీస్, బ్యూటీషియన్, హెల్త్ శానిటరీ తదితర కోర్సులు ఉన్నాయి.


ఇంజినీరింగ్ ట్రేడులు

-ఫిట్టర్: ఇది రెండేండ్ల కోర్సు. ఆరు నెలలకు ఒకటి చొప్పున నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. కోర్సు పూర్తిచేసినవారు యాంగిల్ ఐరన్‌ను, ఐ-బీమ్స్, స్టీల్ ప్లేట్లను వివిధ నిర్మాణాల్లో ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుంటారు. ఈ ట్రేడ్‌లో ఉత్తీర్ణులైనవారు డిప్లొమా లేదా డిగ్రీ కోర్సుల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. వివిధ పరిశ్రమల్లో, బ్రిడ్జిలు, భవనాలు నిర్మించే పెద్దపెద్ద కంపెనీల్లో వెల్డర్ ఫిట్టర్, పైప్ ఫ్యాబ్రికేటర్, మెకానికల్ ఫిట్టర్, టెక్నికల్ అసిస్టెంట్/టెక్నీషియన్, ప్లాంట్ మెయింటెనెన్స్ ఫిట్టర్, లేథ్ మిషన్ ఆపరేటర్ వంటి ఉద్యోగాల్లో చేరవచ్చు. భారీ పరిశ్రమల్లో వివిధ ఉత్పత్తుల నిర్మాణానికి అవసరమయ్యే విడి భాగాల తయారీ కోసం చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చు.

-డీజిల్ మెకానిక్: ఏడాది కోర్సులో ఆరు నెలలకు ఒక సెమిస్టర్ చొప్పున రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఈ ట్రేడ్ పూర్తిచేసినవారు డీజిల్ ఇంజిన్‌కు సంబంధించి పూర్తి అవగాహన పొందుతారు. డీజిల్ ఇంజిన్‌లో తలెత్తే లోపాలను సరిదిద్దగల నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ కోర్సు పూర్తిచేసినవారు అసెంబుల్డ్ షాప్‌లు, టెస్ట్ షాప్‌లు, మెకానిక్ షాప్‌లు, మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల్లో ఆటో డీజిల్ ఇంజిన్ మెకానిక్, డీజిల్ ఇంజిన్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, మెకానిక్, డీలర్స్ సర్వీస్ మెకానిక్, డ్రైవర్ లేదా వెహికిల్ ఆపరేటర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. లేదంటే సొంతంగా డీజిల్ ఇంజిన్ మెకానిక్ షాప్ ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చు.

-ఎలక్ట్రీషియన్: ఇది రెండేండ్ల కోర్సు. ఆరు నెలలకు ఒకటి చొప్పున నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఈ కోర్సు పూర్తిచేసినవారు నివాసాలు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల్లోని భవనాల్లో వివిధ రకాల వైరింగ్ విధానాల గురించి తెలుసుకుంటారు. స్ట్రీట్ లైట్లు, జాతీయ రహదారుల్లో లైటింగ్ వ్యవస్థ, ట్రాఫిక్ సిగ్నళ్లకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ఈ కోర్సు పూర్తి చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులు, ఎంఎన్‌సీ కంపెనీల్లో ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, మెషినరీ ఎలక్ట్రీషియన్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. సంబంధిత లైసెన్స్ సర్టిఫికెట్ పొంది సొంతంగా వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. హౌస్ వైరింగ్ కాంట్రాక్టర్లుగా మంచి ఆదాయం ఆర్జించవచ్చు.

-మెకానిక్ (రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్): ఈ కోర్సు కాలవ్యవధి రెండేండ్లు. ఆరు నెలలకు ఒకటి చొప్పున నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఈ కోర్సు పూర్తిచేసినవారు రిఫ్రిజిరేటర్, వాటర్ కూలర్, బాటిల్ కూలర్, డీప్ ఫ్రీజర్, వాక్ ఇన్ కూలర్, స్లిట్ ఎయిర్ కండిషనర్, ప్యాకేజ్ ఎయిర్ కండిషనర్, సెంట్రల్ ఎయిర్ కండిషనర్, ఆటోమొబైల్ ఎయిర్ కండిషనర్, ట్రాన్స్‌పోర్టు రిఫ్రిజిరేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్ కండిషనింగ్, రైల్వే ఎయిర్ కండిషనింగ్, షిప్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మొదలైన వాటి సర్వీసింగ్, రిపేరింగ్‌పై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ఈ ట్రేడ్‌లో ఉత్తీర్ణులైతే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. ఇండ్లు, పాఠశాలలు, దవాఖానలు, కార్యాలయాలు, ఫ్యాక్టరీల్లో.. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఎయిర్ కూలర్లు మొదలైన వాటి సర్వీసింగ్, రిపేరింగ్ చేస్తూ ఉపాధి పొందవచ్చు. వివిధ కంపెనీల్లో ఏసీ టెక్నీషియన్, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ మెకానిక్ వంటి ఉద్యోగాలు చేయవచ్చు. సంబంధిత రంగంలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.

-టర్నర్: రెండేండ్ల కోర్సులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఆరు నెలలకు ఒక సెమిస్టర్ ఉంటుంది. కోర్సులో భాగంగా లోహ విడిభాగాల తయారీ, పరిశ్రమల్లో ఉండే యంత్రాలు, యంత్రాల విడిభాగాలను కచ్చితంగా వాడటం ఎలా అనేది తెలుసుకుంటారు. విజయవంతంగా కోర్సును పూర్తి చేసిన తర్వాత ఉత్పత్తి, తయారీ, ఆటోమొబైల్ సంబంధిత రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సేవారంగాలైన రవాణా, రైల్వే, నౌకా నిర్మాణం, మరమ్మతులు, రక్షణ రంగాల్లో మెరుగైన అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, బీఈఎంఎల్, ఎన్టీపీసీ, సైనిక సంబంధిత వర్క్‌షాప్‌లలో ఉద్యోగాలు కూడా లభిస్తాయి. టర్నర్ ట్రేడ్ పూర్తిచేయడం వల్ల రేడియల్ డ్రిల్లింగ్ ఆపరేటర్, క్వాలిటీ టెక్నీషియన్, సీఎన్సీ ఆపరేటర్, లేథ్ మిషన్ ఆపరేటర్, హైడ్రాలిక్ హోస్ క్రింపర్ తదితర ఉద్యోగాలు పొందవచ్చు.

-వెల్డర్ (జనరల్ అండ్ ఎలక్ట్రికల్): వెల్డర్ అనేది మెకానికల్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ఒకేషనల్ కోర్సు. ఏడాది కోర్సులో ఆరు నెలలకు ఒక సెమిస్టర్ చొప్పున రెండు సెమిస్టర్లు ఉంటాయి. వెల్డింగ్‌కు సంబంధించిన నైపుణ్యం, మెటల్ వర్కింగ్ మెలకువలను నేర్చుకుంటారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇదేరంగంలో డిప్లొమా/ డిగ్రీ కోర్సులను చేయవచ్చు. భారీ, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన పనుల కోసం సొంతంగా వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందవచ్చు. వైమానిక, రక్షణ, నౌకానిర్మాణం, నిర్మాణ రంగం, ఆటోమోటివ్‌లోని చిన్న, భారీ తరహా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ వెల్డర్, ట్రాక్ వెల్డర్, వెల్డర్, స్ట్రక్చరల్ స్టీల్, పైప్ ఆర్క్ వెల్డర్, వెల్డర్ అండ్ ఫ్యాబ్రికేటర్ హెల్పర్ సంబంధిత ఉద్యోగాలు ఉంటాయి.

-డ్రాఫ్ట్‌మ్యాన్ (సివిల్): ఇది రెండేండ్ల కోర్సు. ఆరు నెలలకు ఒకటి చొప్పున నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. సివిల్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన కలుగుతుంది. విజయవంతంగా కోర్సును పూర్తిచేస్తే ప్రభుత్వ ఆధీనంలోని భవనాలు, చారిత్రక ప్రాంతాల్లో అపారమైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. నిర్మాణరంగానికి సంబంధించి డిగ్రీ కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. చారిత్రక వస్తువులకు సంబంధిచి డ్రాయింగ్‌లు వేసే ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. డ్రాఫ్ట్‌మ్యాన్ పైపింగ్, డ్రాఫ్ట్‌మ్యాన్ స్ట్రక్చరల్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్, స్ట్రక్చరల్ డ్రాఫ్ట్‌మ్యాన్ సంబంధిత ఉద్యోగాలు ఉంటాయి. డ్రాఫ్ట్‌మ్యాన్ (సివిల్)కు సంబంధించి అడ్వాన్స్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్‌మ్యాన్‌లో డిప్లొమా, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్‌మ్యాన్‌షిప్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా తదితర కోర్సులు కూడా చేసే అవకాశం ఉంటుంది.

-ఎలక్ట్రానిక్ మెకానిక్: ఎలక్ట్రానిక్ మెకానిక్ అనేది ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతులకు సంబంధించిన కోర్సు. రెండేండ్ల కోర్సులో ఆరు నెలలకు ఒకటి చొప్పున నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. కోర్సులో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన పరిజ్ఞానం, వాటి మరమ్మతులు, నిర్వహణ గురించి సంపూర్ణ అవగాహన కలుగుతుంది. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ సంబంధిత, సోలార్ విద్యుత్తు ఆధారిత ఇన్వర్టర్ల తయారీ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. సేవా రంగాలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, రైల్వే, ఇస్రో, నౌకాశ్రయం, ఆర్సీఎఫ్, బీపీసీఎల్ తదితర ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎల్జీ, సామ్‌సంగ్, నోకియా, సోని తదితర ఫోన్ల పరిశ్రమల్లో కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి. అసిస్టెంట్ లైన్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఏసీ, రిఫ్రిజిరేటర్ మెకానిక్, మెయింటెనెన్స్ టెక్నీషియన్, చార్జ్‌మెన్ మెకానిక్ సంబంధిత ఉద్యోగాలు ఉంటాయి. పై చదువులు చదవడానికీ ఆస్కారం ఉంది. ఎలక్ట్రానిక్స్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సును కూడా చదవవచ్చు.

-రాష్ట్రంలో ప్రతి జిల్లాకు (పాత జిల్లా) ఒక ఐటీఐ ప్రిన్సిపల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఐటీఐ ప్రిన్సిపాళ్ల కార్యాలయాలున్న ప్రాంతాలు..
-హైదరాబాద్-సికింద్రాబాద్
-ఆదిలాబాద్- మంచిర్యాల
-నల్లగొండ-భువనగిరి
-ఖమ్మం-కొత్తగూడెం
-నిజామాబాద్-నిజామాబాద్
-కరీంనగర్-పెద్దపల్లి
-మహబూబ్‌నగర్-మహబూబ్‌నగర్
-వరంగల్-వరంగల్
-రంగారెడ్డి-మేడ్చల్
-మెదక్-పటాన్‌చెరు

మనూలో

-హైదరాబాద్ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కొనసాగుతున్న ఐటీఐలో డ్రాఫ్ట్స్‌మ్యాన్, సివిల్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ప్లంబర్ ట్రేడులు అందుబాటులో ఉన్నాయి. దీనికి మే లేదా జూన్‌లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.


ITI2

నాన్ ఇంజినీరింగ్ ట్రేడులు

-బుక్‌బైండర్: ఇది రెండేండ్ల కోర్సు. ఈ కోర్సు చేసినవారికి కూడా భవిష్యత్తు ఉంటుంది. ప్రింటింగ్ ప్రెస్, పబ్లిషింగ్ హౌస్‌లలో వీరికి మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సు హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ రిసర్చ్ సెంటర్, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ లెవల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ గర్ల్స్, గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-మల్లేపల్లిల్లో అందుబాటులో ఉంది.
-కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: ఇది ఏడాది వ్యవధిగల కోర్సు. ప్రస్తుతం ప్రతి పనీ కంప్యూటర్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ కోర్సు చేసినవారికి ఉపాధి త్వరగానే లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వీరి అవసరం చాలా ఉంటుంది. బాయ్స్ టౌన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ లెవల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ గర్ల్స్-హైదరాబాద్, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ లెవల్ ట్రైనింగ్ సెంటర్-వికారాబాద్, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ లెవల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఉమెన్-మలక్‌పేట్, గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-మల్లేపల్లి, గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-సనత్‌నగర్, హైదరాబాద్ టెక్నికల్ కాలేజీ ఐటీసీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్‌లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
-సెక్రటేరియల్ ప్రాక్టీస్: ఇది ఏడాది వ్యవధిగల కోర్సు. ఈ కోర్సులో కార్యాలయానికి సంబంధించిన నైపుణ్యాన్ని పెంపొందిస్తారు. ఈ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఆఫీస్ అసిస్టెంట్‌గా, సెక్రటరీగా ఉపాధి పొందవచ్చు. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఫౌండేషన్ ఐటీసీ-హైదరాబాద్, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ రిసర్చ్ సెంటర్-హైదరాబాద్‌లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
-డాటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్: ఇది ఏడాది వ్యవధిగల కోర్సు. ఈ కోర్సు పూర్తిచేసినవారికి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉపాధి లభిస్తుంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్, మిల్లత్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్‌లలో ఈ కోర్సు ఉంది.
-స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్): ఇది ఏడాది వ్యవధిగల కోర్సు. ఈ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఉమెన్-మలక్‌పేట్, గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-మల్లేపల్లి, గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-సికింద్రాబాద్‌లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. -ఎస్‌ఎస్‌సీ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. సీట్ల కేటయింపు నియమ నిబంధనల మేరకు మెరిట్ కం రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది.
-ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్‌కార్డ్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, స్కాన్ చేసిన తాజా పాస్‌పోర్ట్ ఫొటో, ఎస్‌ఎస్‌సీ మెమో/తత్సమాన పత్రం, కుల ధృవీకరణ, తదితర పత్రాలను కలిగి ఉండాలి. ఆ తర్వాత న్యూ అప్లికెంట్/రిజిస్ట్రేషన్ ఐడీతో లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ సహాయంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
-వెబ్‌సైట్: http://iti.telangana.gov.in

ITI3

మైనారిటీ ఐటీఐలు

-ప్రభుత్వ ఐటీఐ (ఎం)- బోధన్-నిజామాబాద్ (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ, పార్శీ)

ప్రైవేట్ మైనారిటీ ఐటీఐలు

-జహంగీర్ పీర్ ప్రైవేట్ ఐటీఐ- మహబూబ్‌నగర్ (ముస్లిం)
-బాయ్స్ టౌన్ ప్రైవేట్ ఐటీఐ- దారుషిఫా-హైదరాబాద్ (క్రిస్టియన్)
-హెచ్‌ఈహెచ్ అల్లావుద్దీన్ ప్రైవేట్ ఐటీఐ- బొగ్గులకుంట-హైదరాబాద్ (ముస్లిం)
-జాఫేరియా ప్రైవేట్ ఐటీఐ- దారుషిఫా-హైదరాబాద్ (ముస్లిం)
-అంజుమన్ ఒమర్ ఐటీఐ- ముషీరాబాద్-హైదరాబాద్ (ముస్లిం)
-మౌంట్ కార్మిల్ బాయ్స్ ఐటీఐ- పాల్వంచ-భద్రాద్రి కొత్తగూడెం (క్రిస్టియన్)
-ఫాతిమా ఐటీఐ- కాజీపేట్-వరంగల్ (క్రిస్టియన్)
-అన్ని కో ఎడ్యుకేషనల్ ఐటీఐల్లో బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయించారు. ప్రభుత్వ ఐటీఐ-మహబూబ్‌నగర్, క్యూక్యూఎస్ ఐటీఐ-సంతోష్‌నగర్ (హైదరాబాద్), సెయింట్ జోసెఫ్ ప్రైవేట్ ఐటీఐ (హన్మకొండ)లలో బాలికలకు మాత్రమే ప్రవేశం కలదు.
-ప్రభుత్వ ఐటీఐ-హత్నూరా (సంగారెడ్డి), ప్రభుత్వ ఐటీఐ-భద్రాచలం (భద్రాద్రి కొత్తగూడెం)లలో బాలురకు మాత్రమే ప్రవేశం కలదు.

నోట్:

ఒకవేళ పదో తరగతి ఫెయిలైనా బాధపడాల్సిన అవసరం లేదు. 8, 9 తరగతులు పాసైనవారికి కూడా ఐటీఐలో తగిన కోర్సులు ఉన్నాయి. అవి పూర్తిచేసి ఉపాధి పొందవచ్చు. అలాగే ఇంటర్ ఫెయిలైనవారు కూడా ఏడాది వృథాగా పోకుండా ఉండేందుకు ఐటీఐ కోర్సుల్లో తమకునచ్చిన ఏదో ఒక ట్రేడు పూర్తిచేస్తే ఎప్పుడో ఒకప్పుడు అది ఉపయోగపడుతుంది.

-సత్యం చాపల

841
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles