భారతదేశ వ్యవసాయ రంగం


Wed,March 13, 2019 01:14 AM

భారతదేశ వ్యవసాయ రంగం


-వ్యవసాయరంగ వృద్ధిలో అనిశ్చితికి కారణం దేశంలో 50 శాతానికిపైగా వ్యవసాయం వర్షపాతంపై ఆధారపడి ఉంది. ఇది వ్యవసాయ ఉత్పత్తి నష్టాలను అధికం చేస్తుంది.
-వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 2016-17లో 4.9 శాతం, అలాగే మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2017-18లో 2.1 శాతం చొప్పున నిలకడలేని ఒడిదుడుకులతో కూడిన వృద్ధిరేటు నమోదయ్యింది.

ఆహార ధాన్యాల ఉత్పత్తి


-2016-17కు సంబంధించి కేంద్ర వ్యవసాయశాఖ విడుదల చేసిన 4వ ముందస్తు అంచనాల ప్రకారం రికార్డు స్థాయిలో 275.7 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఇది గత రికార్డు అయిన 2013-14 నాటి ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే 10.6 మి.ట.అధికం.
-2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదలకు.. 2016-17లో రుతుపవనకాలంలో మంచి వర్షపాతం, ప్రభుత్వ విధాన నిర్ణయాలు కారణంగా చెప్పవచ్చు.
-2017 సెప్టెంబర్ 22న విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2017-18 ఖరీఫ్ పంట కాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తిని 134.7 మి.ట. అంచనా వేశారు. ఇది 2016-17 కాలంనాటి ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 138.5 మి.ట. కంటే 3.9 మి.ట. తక్కువగా ఉంది.
-2017-18 ఖరీఫ్ కాలంలో మొత్తం వరి ఉత్పత్తిని 94.5 మిలియన్ టన్నులుగా అంచనావేశారు.
-2017-18 ఖరీఫ్‌లో మొత్తం పప్పు ధాన్యాలు 8.7 మిలియన్ టన్నులు, చెరుకు 337.7 మి.ట., నూనె గింజలు 20.7 మి.ట., పత్తి 32.3 మిలియన్ బేళ్లు (ఒక్కో బేల్ 170 కిలోలు) ఉత్పత్తి అంచనా వేశారు.
-దేశంలో పంటల సాగుసరళిని వాతావరణ పరిస్థితులు, కమత పరిమాణం, ధరలు, లాభదాయకత, ప్రభుత్వ విధానాలు వంటి అంశాల ఆధారంగా తెలుసుకోవచ్చు.
-యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే-2017 ప్రకారం 179.8 మి.హెక్టార్లు సాగు విస్తీర్ణంతో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇది ప్రపంచ నికర సాగు భూమి లో 9.6 శాతం.
-వ్యవసాయం, దాని అనుబంధ రంగాల జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటాలను పరిశీలిస్తే.. అత్యధికంగా 60 శాతం వరకు వాటా పంటల ద్వారా లభించగా, 26 శాతం వరకు పశుపోషణ ద్వారా, 5 శాతం వరకు చేపల ఉత్పత్తి, 9 శాతం అటవీ ఉత్పత్తుల నుంచి లభిస్తుంది.
-2013-14 నుంచి 2015-16 మధ్య వ్యవసాయం, దాని అనుబంధ రంగాల జీవీఏలో వాటాలు పరిశీలిస్తే... అటవీ ఉత్పత్తులు, చేపల ఉత్పత్తుల్లో స్థిరంగా కొనసాగు తుంది.

giridar-2

కౌలు సంస్కరణలు


-భూ స్వాములు సొంతంగా వ్యవసాయం చేయలేక భూమిలేని వారికిచ్చి సేద్యం చేయించడాన్ని కౌలు వ్యవసాయం అంటారు. కౌలుదార్లు మూడు రకాలు...
1. రాయితీ హక్కులున్న కౌలుదార్లను శాశ్వత కౌలుదార్లు అంటారు. కౌలు సక్రమంగా చెల్లిస్తున్నంత కాలం వీరిని భూస్వాములు భూమి నుంచి తొలగించడానికి వీల్లేదు.
2. శాశ్వత కౌలుదార్లు తమ ఆధీనంలోని భూమిని మరికొంతమంది రైతులకు కౌలుకు ఇస్తారు. వీరినే ఉప కౌలుదార్లు అంటారు.
3. ఏ హక్కులూ లేని కౌలుదార్లు. వీరికి కౌలు భద్రత ఉండదు. కౌలు పరిమాణాన్ని భూస్వామి తన ఇష్టం వచ్చినట్లు నిర్ణయిస్తాడు.
-ప్రభుత్వం కౌలుదారీ విధానంలో సంస్కరణలను ప్రవేశపెట్టింది. అవి...
-కౌలు పరిమాణం: ప్రణాళికా సంఘం సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు పరిమాణాన్ని నిర్ణయించి, శాసనాలను రూపొందించి అమలు చేశాయి. మొత్తం పంట ఉత్పత్తిలో కౌలు పరిమాణం 20-25 శాతం మించి ఉండరాదు. దీనికి అనుగుణంగా రాష్ర్టాలు చట్టాలు చేశాయి.
-కౌలు భద్రత: కౌలుదారులు భూస్వామికి కౌలు పరిమాణం చెల్లిస్తున్నంత కాలం వారిని తొలగించడానికి వీలు కాకుండా చట్టాలు రూపొందించారు.
3. కౌలుదారులకు రాయితీ హక్కులు: కౌలుదారులు ఒక నిర్ణీత కాలం భూమిని కౌలుకుచేసి ఉన్నట్లయితే దున్నేవారికే భూమిపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ శాసనాలను రూపొందించి అమలు పర్చారు.

భూకమతాలపై పరిమితులు


-నిర్ణయించిన పరిమితికంటే ఎక్కువగా ఉన్న భూమిని భూకామందుల నుంచి ప్రభుత్వం తీసుకుని చిన్న, సన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలకు పంచడం ద్వారా వారి భూ అవసరాలను తీర్చడం భూ సంస్కరణల ఉద్దేశం.
-18 ఎకరాల మాగాణి లేదా 54 ఎకరాల మెట్టభూమిని గరిష్ఠ భూపరిమితిగా నిర్ణయించారు.
-భూ పరిమితి చట్టం ప్రకారం 1972 వరకు 23 లక్షల ఎకరాలను మిగులు భూమిగా నిర్ణయించి అందులో 13లక్షల ఎకరాలను భూమిలేనివారికి పంచారు.
-భూ సంస్కరణల పరిధిలో భూదాన భూములు, నిరుపయోగ భూముల పంపిణీ, గిరిజన భూములను అన్యాక్రాంతం కాకుండా వారి హక్కులను కాపాడి పునరుద్ధరించడం, భూరికార్డుల ఆధునీకరణ వంటి చట్టాలు కూడా ఉన్నాయి.
-2000 సంవత్సరం సెప్టెంబర్ వరకు దేశమంతటా 73.95 లక్షల ఎకరాల మిగులు భూమిని గుర్తించి, 64.96 లక్షల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, 54.72 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టారు.
-భూ రికార్డుల కంప్యూటరీకరణ 1988-89లో ప్రారంభమై దేశంలోని 528 జిల్లాల్లో కొనసాగుతుంది.

పంచవర్ష ప్రణాళికలు- వ్యవసాయం


-భారతదేశం ప్రధానంగా వ్యవసాయిక దేశం. కాబట్టి మొదటి ప్రణాళిక వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ప్రణాళికలో 3 శాతం నిధులు వ్యవసాయానికి కేటాయించారు.
-జమీందారీ పద్ధతి రద్దు, కౌలుదారీ సంస్కరణలు సత్ఫలితాలివ్వడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో వ్యవసాయోత్పత్తుల్లో 14.7 శాతం పెరుగుదల సాధ్యమైంది.
-రెండో ప్రణాళికలో ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపేట వేసి మొత్తం వ్యవసాయానికి 20 శాతం కేటాయించింది. వర్షాభావం వల్ల పంటలు సరిగ్గా పండక ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.
-దీంతో వ్యవసాయరంగం సక్రమంగా ఉంటేనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యమని గ్రహించి 3వ ప్రణాళిక మొత్తం వ్యయంలో వ్యవసాయరంగంపై 21 శాతం ఖర్చు పెట్టారు. అయితే చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధాలు, రుతుపవనాలు అనుకూలించకపోవడంతో తీవ్ర సంకట పరిస్థితులు ఏర్పడ్డాయి.
-స్వయం సమృద్ధి లక్ష్యంగా పెట్టుకుని 4వ ప్రణాళికలో వ్యవసాయానికి మొత్తం వ్యయంలో 24 శాతం కేటాయించారు. వాస్తవంగా 14.7 శాతం ఖర్చుచేశారు. పాకిస్థాన్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ నుంచి కాందిశీకులు వలస రావడం, రుతుపవనాల వైఫల్యం ఈ ప్రణాళికను దెబ్బతీశాయి.
-5వ ప్రణాళికలో పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన లక్ష్యాలుగా నిర్ణయించారు. 20 సూత్రాల పథకం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు కేటాయింపులు పెంచారు. ఈ ప్రణాళికా కాలంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ప్రణాళిక విజయవంతం కాకుండా నిరోధించింది.
-6వ ప్రణాళిక కాలంలో మొత్తం కేటాయింపుల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 24 శాతం కేటాయించారు.
-7వ ప్రణాళిక ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెంచడానికి ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి కీలకమైన విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి 30.6 శాతం కేటాయించి, వ్యవసాయానికి గ్రామీణాభివృద్ధికి 12.4 శాతం కేటాయించారు.
-8వ ప్రణాళికలో వ్యవసాయోత్పత్తుల్లో 3.1 శాతం వార్షిక పెరుగుదల సాధించాలనేది లక్ష్యం కాగా.. 3.5 శాతం పెరుగుదల నమోదయ్యింది. ఈ ప్రణాళికా కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి స్థిరమైన పెరుగుదలను కనబర్చింది.
-9వ ప్రణాళిక సంధి ప్రణాళికగా అభివర్ణించవచ్చు. ఇందులో వ్యవసాయరంగానికి 19.4 శాతం కేటాయించారు. 1999-2002 మధ్య దేశంలోని అన్ని రంగాలను సమన్వయం ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రణాళికలో నిర్ధేశించారు. మొత్తం జనాభాకు ఆహార భద్రతను సాధించేందుకు వ్యవసాయరంగంలో సగటున ఏడాదికి 4.5 శాతం అభివృద్ధి సాధించాలని నిర్ణయించినా.. తర్వాత సవరించి దాన్ని 3.4 శాతానికి పరిమితం చేశారు. అయితే సాధించింది కేవలం 2.1 శాతం మాత్రమే.
-10వ ప్రణాళికలో వ్యవసాయాభివృద్ధి రేటు 4 శాతం లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ సాధించింది 2.3 శాతం వృద్ధిమాత్రమే.
-11వ ప్రణాళికలో కూడా వ్యవసాయాభివృద్ధిరేటు 4 శాతం లక్ష్యించారు. దీనికోసం రెండో హరితవిప్లవం చేపట్టాలని నిర్ణయించారు. 2005-06లో వ్యవసాయరంగం వృద్ధిరేటు 2.3 శాతం కాగా 2006-07లో ఇది 2.7 శాతం. 2007-08 నుంచి 2010-11 వరకు సగటున వ్యవసాయరంగ వృద్ధిరేటు 3.5 శాతంగా ఉంది.
-12వ ప్రణాళిక కాలంలో వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధిరేటు 4 శాతం లక్ష్యంగా పెట్టుకున్నారు.
-గత మూడేండ్లుగా వ్యవసాయ వృద్ధి నిమ్నోన్నతంగా ఉంది. 2014-15లో - 0.2 శాతం, 2015-16లో 0.7 శాతం, 2016-17లో 4.9 శాతంగా ఉంది.

భూ సంస్కరణలు


-వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపుదల సంస్థాగత సంస్కరణపై ఆధారపడి ఉంటుంది.
-కమతాలను లాభసాటిగా పంచి, వాటి విస్తీర్ణంపై పరిమితులు విధించడం ద్వారా విలువైన భూమిని హేతుబద్ధంగా వినియోగించేందుకు ఉద్దేశించినవే భూ సంస్కరణలు.
-వీటివల్ల బలహీన వర్గాలకు భూమిని పునఃపంపిణీ చేయవచ్చు. దోపిడీని అరికట్టి దున్నేవాడికే భూమి అనే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
-సామాజిక న్యాయసాధన దిశలో కమతాలను పునఃపంపిణీ చేయడం భూసంస్కరణల లక్ష్యం.
-యూఎన్‌ఓ ప్రకారం చిన్న, ఉపాంత రైతుల, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో చేసే భూమి పునఃపంపిణీ కార్యక్రమమే భూ సంస్కరణలు.
-వ్యవసాయాభివృద్ధిని సాధించే ఉద్దేశంతో సమానత్వం, సాంఘిక న్యాయాల ఆధారంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడమే భూ సంస్కరణలుగా పేర్కొనవచ్చు.

భూసంస్కరణ చర్యలు


-దళారీల నిర్మూలన: స్వాతంత్య్రానికి పూర్వం భూమిని జమీందారీ, మహల్వారీ, రైత్వారీ అనే మూడు వ్యవస్థల్లో నిర్వహించేవారు.
-జమీందారీ పద్ధతి: దీన్ని 1793లో బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం వంటి రాష్ర్టాల్లో కారన్ వాలీస్ ప్రవేపెట్టారు. జమీందారీ పద్ధతిలో (శాశ్వత శిస్తు) భూమి శిస్తును 20-30 ఏండ్ల కాలానికి నిర్ణయించి, దాన్ని వసూలు చేయడానికి జమీందార్లను నియమించారు. దీంతో రైతులు సకాలంలో భూమి శిస్తు చెల్లించకపోతే వారి భూములను స్వాధీనం చేసుకునేవారు.
-రైత్వారీ పద్ధతి: దీన్ని 1792లో థామస్ మన్రో మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టాడు. ఇందులో రైతులకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.
-స్వాతంత్య్రానంతరం మధ్యవర్తులను తొలగించాలనే ఉద్దేశంతో 1948లో చట్టం చేశారు. 1960 నాటికి దేశమంతటా తొలగించారు.
-మహల్వారీ పద్ధతి: దీన్ని ఆగ్రా, అయోధ్యలో సర్ మెకంజీ ప్రవేశపెట్టాడు. ఇది తర్వాతి కాలంలో పంజాబ్, సింధు, గుజరాత్ ప్రాంతాల్లో విస్తరించింది.
-ఇవన్నీ రైతులకు ప్రతిబంధకాలుగా ఉండటంతో వాటి నుంచి విముక్తి కోసం భారత ప్రభుత్వం చేసిన దళారీ వ్యవస్థ రద్దు.. 1948లో టంగుటూరి ప్రకాశం మద్రాసులో ప్రవేశపెట్టిన జమీందారీ వ్యవస్థ రద్దు చట్టంతో ప్రారంభమైంది.

Giridar

1064
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles