కరెంట్ అఫైర్స్


Wed,March 13, 2019 01:12 AM

విద్యుత్ విజయం పుస్తకావిష్కరణ


-సీఎం కేసీఆర్ పీఆర్వోగా పనిచేస్తున్న ట్రాన్స్‌కో జీఎం గటిక విజయ్ కుమార్ రచించిన తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం (తెలుగు), ద సాగా ఆఫ్ సక్సెస్ ఆఫ్ తెలంగాణ పవర్ సెక్టార్ (ఇంగ్లిష్) పుస్తకాలను మార్చి 4న ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి వీటిని ఆవిష్కరించారు.

గిన్నిస్‌బుక్‌లోకి కోలాటం


-రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మార్చి 8న జరిగిన సామూహిక మహిళల కోలాట ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయ మైదానంలో 714 మందితో ఈ సామూహిక కోలాటం నిర్వహించారు.
Kolatam

సింగరేణికి అవార్డు


-సింగరేణి సంస్థకు లభించిన ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అందుకున్నారు. బెర్క్‌షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మార్చి 8న ముంబైలో నిర్వహించిన జాతీయస్థాయి అవార్డుల ఉత్సవంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు.

సీఐఎస్‌ఎఫ్ గిన్నిస్ రికార్డు


-సింగిల్ లైన్ సైకిల్ పరేడ్‌లో సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) మార్చి 3న గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఒకే వరుసలో 1,327 మంది భద్రతా సిబ్బంది సైకిళ్లతో పరేడ్ నిర్వహించి ఈ ఘనతను సాధించారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఎక్స్‌ప్రెస్ వేలో నిర్వహించిన ఈ పరేడ్ 3.2 కి.మీ మేర సాగింది. ఇప్పటివరకు ఈ రికార్డు 1,235 సైకిళ్లతో హుబాలి సైకిల్ క్లబ్ ఆఫ్ ఇండియా పేరున ఉంది.

పీఎం-ఎస్‌వైఎం ప్రారంభం


-ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ (పీఎం-ఎస్‌వైఎం) యోజనను ప్రధాని మోదీ మార్చి 5న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. ఈ పథకం 2019, ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండి నెలకు రూ.15,000 కంటే తక్కువగా సంపాదిస్తున్న అసంఘటిత కార్మికులు ఈ పథక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకంలో చేరినవారు 60 ఏండ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేల పింఛన్ పొందవచ్చు. ఇందులో 18 ఏండ్లు ఉన్నవారు నెలకు రూ.55, 29 ఏండ్లు దాటినవారు రూ.100 చెల్లించాలి.
pmsym

ఐటీబీపీ 53వ బెటాలియన్ ప్రారంభం


-ఏపీలోని చిత్తూరు జిల్లా కలికిరి సమీపంలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) 53వ బెటాలియన్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మార్చి 6న న్యూఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

రూ.20 నాణేలు ఆవిష్కరణ


-కేంద్రప్రభుత్వం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన రూ.20 నాణేలను ప్రధాని మోదీ మార్చి 7న ఢిల్లీలో ఆవిష్కరించారు. దీని బరువు సుమారు 8.54 గ్రాములు, 27 మిల్లీమీటర్ల వ్యాసం ఉంది. 12 కోణాల బహుభుజ ఆకృతిలో ఉండే ఈ నాణెంంపై వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలిపేవిధంగా ధాన్యపుగింజలు ముద్రించి ఉన్నాయి. దీంతోపాటు రూ.1, 2, 5, 10 నాణేల్లో కూడా కొత్త సిరీస్‌ను ప్రవేశపెట్టారు. అంధులు కూడా సులువుగా గుర్తించగలిగేరీతిలో వీటిని రూపొందించారు.

మైనా స్వామికి ఐఐఓహెచ్ అవార్డు


-రచయిత, చరిత్ర పరిశోధకుడు మైలారం నారాయణ స్వామి (మైనా స్వామి)కి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ (ఐఐఓహెచ్) అవార్డు లభించింది. మార్చి 9న ఢిల్లీలో జరిగిన ఐఐఓహెచ్ 42వ అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

భారత్‌కు ప్రాధాన్య హోదా తొలగింపు


-భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్‌పీ)ను తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 5న అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌కు లేఖ అందజేశారు. భారత ప్రభుత్వానికి దీనిపై నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లో ఇది అమల్లోకి వస్తుంది. అమెరికాకు భారత్ ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తుంది. జీఎస్‌పీ తొలగిస్తే ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్‌పీ)ను 1976లో అమెరికా రూపొందించింది.

ప్రపంచ జీడీపీ 3.3 శాతానికి తగ్గింపు


-2019కు ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్థిక సహకార-అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) 2018, నవంబర్‌లో పేర్కొన్న 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని ఈ సందర్భంగా ఓఈసీడీ పేర్కొంది.

పరాగ్వే అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి భేటీ


-పరాగ్వే అధ్యక్షుడు మారియో అబ్డో బెనిటెజ్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మార్చి 6న సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరాటానికి కలిసి రావాలని బెనిటెజ్‌ను ఉపరాష్ట్రపతి కోరారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు.
Vekaiah

ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ముకేశ్


-ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. ప్రపంచ బిలియనీర్ల జాబితా-2019ను ఫోర్బ్స్ మ్యాగజీన్ మార్చి 5న విడుదల చేసింది. గతేడాది 19వ స్థానంలో ఉన్న ముకేశ్ ఈ ఏడాది 50 బిలియన్ డాలర్ల సంపదతో 13వ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మరోసారి మొదటిస్థానంలో నిలవగా, రెండో స్థానంలో బిల్‌గేట్స్, 3వ స్థానంలో వారెన్ బఫెట్ నిలిచారు.

శాంతి, రాధాదేవికి నారీశక్తి పురస్కారం


-ఇస్రో మహిళా శాస్త్రవేత్త మున్నుస్వామి శాంతి, టీటీడీ మహిళా క్షురకుల సంఘం అధ్యక్షురాలు కగ్గనపల్లి రాధాదేవిలకు నారీశక్తి పురస్కారం లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీరికి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. మహిళా సాధికారతకు విశేష కృషిచేస్తున్న 41 మందికి, 3 సంస్థలకు నారీశక్తి పురస్కారాలను ప్రదానం చేశారు.

యూఎన్‌డీపీ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మి


-ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) నూతన గుడ్‌విల్ అంబాసిడర్‌గా టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మి నియమితులయ్యారని యూఎన్‌డీపీ మార్చి 8న ప్రకటించింది. అసమానతలను రూపుమాపడం, వివక్షను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడానికి యూఎన్‌డీపీ గుడ్‌విల్ అంబాసిడర్‌ను నియమిస్తుంది.
PadmaLaxmi

ఆర్థిక శాఖ కార్యదర్శిగా సుభాష్


-కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా సుభాష్ చంద్రగార్గ్‌ను నియమిస్తూ కేంద్ర నియామకాల మంత్రిత్వ శాఖ మార్చి 8న ఉత్తర్వులు జారీచేసింది. అజయ్ నారాయణ్ ఝా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 1983 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సుభాష్ 2017, జూన్ నుంచి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రియాంక దూబేకు చమేలీదేవి జైన్ అవార్డు


-ప్రముఖ పాత్రికేయురాలు, బీబీసీ ఢిల్లీ బ్యూరో ద్విభాషా వ్యాఖ్యాత ప్రియాంక దూబేకు ప్రతిష్ఠాత్మక చమేలీదేవి అవార్డు-2018 లభించింది. ఢిల్లీలో మార్చి 9న జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. 37 ఏళ్లుగా పాత్రికేయ రంగంలో అసమాన ప్రతిభ చూపిన మహిళలకు స్వాతంత్య్ర సమరయోధురాలైన చమేలీదేవి జైన్ పేరిట అవార్డును అందజేస్తున్నారు.

స్మృతి మంధాన రికార్డు


-టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పిన్న వయస్కురాలిగా స్మృతి మంధాన రికార్డు నెలకొల్పింది. అసోం రాజధాని గువాహటిలోని బర్సపర స్టేడియంలో మార్చి 4న ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో స్మృతి 22 ఏండ్ల 229 రోజుల వయస్సుతో ఈ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు సురేశ్ రైనా (23 ఏండ్లు, 197 రోజులు), హర్మన్‌ప్రీత్ కౌర్ (23 ఏండ్లు, 237 రోజులు) పేరిట ఉండేది.
Smriti-mandhana

వన్డేలకు ఇమ్రాన్ తాహిర్ వీడ్కోలు


-వచ్చే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మార్చి 4న ప్రకటించాడు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన ఇమ్రాన్ 2011, 2015 వన్డే వరల్డ్ కప్‌లలో, 2014, 2016 టీ20 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు 95 వన్డేలు ఆడి 156 వికెట్లు పడగొట్టాడు.

చైనా వాకర్ లియు హాంగ్ రికార్డు నడక


-మహిళల 50 కి.మీ. నడక విభాగంలో చైనీస్ వాక్ గ్రాండ్ ప్రి మీట్‌లో చైనాకు చెందిన లియు హాంగ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మార్చి 9న చైనాలోని హువాంగ్‌షన్‌లో జరిగిన 50 కి.మీ. దూరాన్ని లియు 3 గంటల 59 నిమిషాల 15 సెకన్లలో అధిగమించి విజేతగా నిలిచి ఈ ఘనత సాధించింది. 4 గంటల 4 నిమిషాల 36 సెకన్లతో ఇప్పటిదాకా లియాంగ్ రుయి (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును లియు బద్దలుకొట్టింది.

భారత్‌కు ఏడు పతకాలు


-ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో మార్చి 10న ముగిసిన జీబీ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు మొత్తం ఏడు పతకాలు లభించాయి. 56 కేజీల విభాగంలో కవీందర్ సింగ్‌కు స్వర్ణం, హుసాముద్దీన్ (తెలంగాణ)కు రజతం లభించాయి. దినేశ్ డాగర్ (69 కేజీలు), శివథాపా (60 కేజీలు), గోవింద్ సాహ్ని (49 కేజీలు)లకు రజత పతకాలు లభించాయి.

Saidulu

962
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles