ఘనమైన భవిష్యత్తుకు...


Sun,January 13, 2019 11:36 PM

గొప్పలు పోయే చదువుకన్నా కూడు పెట్టే చదువే ముద్దు.. నేటి విద్యార్థిలోకం ఆలోచన ఇదే. సాధారణ డిగ్రీలకు చాలాకాలం కిందటే ప్రధాన్యం తగ్గిపోయి ఇంజినీరింగ్‌కు నిన్నమొన్నటివరకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. కానీ ఇప్పుడు ఇంజినీరింగుకు కూడా క్రమంగా డిమాండ్ పడిపోతూ వస్తున్నది. త్వరగా జీవితంలో స్థిరపడాలన్న విద్యార్థుల ఆలోచనే అందుకు కారణం. అందువల్లనే చాలామంది విద్యార్థులు సంప్రదాయేతర కోర్సుల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. అలాంటివారికి సువర్ణావకాశం చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ). ఈ కోర్సు పూర్తిచేస్తే మంచి ఆదాయంతోపాటు సమాజంలో గొప్ప పేరు కూడా సంపాదించుకునే వీలుంది. అందుకే నిపుణ పాఠకులకోసం ఈ వారం సీఏ స్పెషల్ అందిస్తున్నాం..
ca
-సరైన కామర్స్ కోర్సు ఎంపికతోపాటు నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన సామర్థ్యాలను పెంపొందించుకుంటే కామర్స్ కింగ్స్‌గా ఎదగవచ్చు.
-ఒకప్పుడు కామర్స్ కోర్సులు అంటే చిన్నచూపు ఉండేది. కానీ ఇప్పుడు కామర్స్ కోర్సుల పట్ల సమాజంలో అవగాహన పెరిగింది. సీఏ కోర్సులు చదవడానికి అత్యధిక శాతం విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు.
-ప్రస్తుతం యువ వ్యాపారవేత్తల అవసరం పెరుగుతున్నది. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంస్థలను నెలకొల్పే యువ పారిశ్రామికవేత్తలను ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించడమే. ప్రభుత్వం మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా స్టార్టప్ కంపెనీలకు అత్యంత ప్రాముఖ్యం ఇస్తున్నది. పెరుగుతున్న ఆర్థిక అవసరాల దృష్ట్యా సీఏ వంటి కామర్స్ నిపుణులు, ఆర్థిక నిపుణులు, యువ పారిశ్రామికవేత్తల ప్రాధాన్యం పెరుగుతున్నది.
-ప్రస్తుత సమాజంలో మార్కెట్ అవసరాలకు సరిపడే కోర్సులు చదివిన కామర్స్ విద్యార్థులకు గిరాకీ ఉంది. వీరిలో సీఏలకు అవకాశాలు కోకొల్లలు. సీఏ పూర్తిచేసినవారు ఉద్యోగం చేయవచ్చు లేదంటే సొంతంగా ప్రాక్టీస్‌గానీ, వ్యాపారంగానీ ప్రారంభించవచ్చు.
-అత్యున్నత వేతనాలు, అపార గౌరవ మర్యాదలతో ఆర్థిక కార్యకలాపాలు ముందుండి నడిపే సీఏలకు రాబోయే రోజుల్లో అవకాశాలు విస్తృతం కానున్నాయి.
-భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎన్నో రెట్లు పెరుగనున్నాయి. బ్యాంకులో జరిగే లావాదేవీల పట్ల సీఏ చేసినవారికి అవగాహన ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ రంగంలోని ఉపాధి అవకాశాలను చేజిక్కించుకోవడంలో కామర్స్ విద్యార్థులు అందరికంటే ముందుంటారు.
-ఎంపీ కవిత ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ఆర్థికాభివృద్ధిలో సీఏల పాత్ర కీలకం. సీఏలు మరింత కృషి చేయాలి. నోట్లరద్దు కారణంగా సీఏలు రాక్‌స్టార్స్‌గా మారారు అన్నారు.
-ఇటీవల సీఏ డేను పురస్కరించుకుని సీఏ ఇన్‌స్టిట్యూట్‌వారు నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్రమోదీ.. దేశ ప్రధాని సంతకం కంటే ఒక సీఏ సంతకానికే ప్రాముఖ్యత ఎక్కువ అని సీఏల గురించి తెలిపారు.
-దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చినందున పరిశ్రమ లావాదేవీలు పెరిగి చార్టర్డ్ అకౌంటెంట్లకు డిమాండ్ పెరగనున్నదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
-నోట్లరద్దు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వంటి నిర్ణయాల వల్ల బ్యాంకింగ్ రంగం ప్రాముఖ్యం పెరిగి, ఉద్యోగ అవకాశాలు విరివిరిగా పెరిగాయి.

సీఏలకు అవకాశాలు

-పన్ను గణన, అకౌంటింగ్, డేటా విశ్లేషణ విభాగాల్లో సీఏలకు లక్షకుపైగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, జీఎస్‌టీ అమలువల్ల నగదు చెలామణి లాభదాయకత, పారదర్శకత మెరుగుపడి పన్ను ఎగవేతలు తగ్గిపోయాయని, ఫలితంగా సంభవించే ఆర్థిక అభివృద్ధివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే అంచనాను వ్యక్తం చేస్తున్నారు.
-గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్‌లు 50 శాతానికిపైగా నమోదయ్యాయి. ఇప్పటివరకు 6.08 కోట్ల ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలయ్యాయి. ఇలా ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య పెరగడంవల్ల సీఏలకు అవకాశాలు మరింత పెరిగాయి.
-100 శాతం ప్లేస్‌మెంట్ ఉండే కోర్సు సీఏ.
-దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సీఏలకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో త్వరలో జీఎస్టీ అమలు కానుంది. దీనివల్ల సీఏలకు యూఏఈలో అవకాశాలు విస్తృతం కానున్నాయి.

సీఏ ఎలా చదవాలి?

-సీఏ కోర్సును నిర్వహించే సంస్థ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ).
-సీఏ కోర్సు సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ అనే మూడు దశలుగా ఉంటుంది.

సీఏ

-ఐసీఏఐకి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.18,000.
-ఐసీఏఐ పరీక్ష ఫీజు: రెండు గ్రూపులకు రూ.2,700, ఒక్క గ్రూపునకు రూ.1,500.
-పరీక్ష ఫీజు ఎప్పుడు చెల్లించాలి: మేలో పరీక్ష రాయాలంటే ఫిబ్రవరిలోగా, నవంబర్‌లో పరీక్ష రాయాలంటే ఆగస్ట్ చివరిలోగా ఫీజు చెల్లించాలి.
గమనిక: పరీక్షల తేదీలు మారితే అందుకు అనుగుణంగా ఫీజు చెల్లించాల్సిన తేదీలు కూడా మారవచ్చు.
-సీఏ ఇంటర్మీడియట్ పరీక్ష ఏడాదికి రెండు సార్లు మే, నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు.
-సీఏ ఇంటర్మీడియట్ పరీక్ష 8 పేపర్లు రెండు గ్రూపులుగా (గ్రూపునకు 4 పేపర్లు) ఒక్కో పేపర్ 100 మార్కులకు నిర్వహిస్తారు.
-విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తంమీద 50 శాతం మార్కులను సాధించాలి.
-నూతన విధానంలో విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపుల పరీక్షలు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు.
-సీఏ ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు మూడేండ్ల ఆర్టికల్‌షిప్ చేయాలి.

ప్రాక్టికల్ ట్రెయినింగ్

-సీఏ ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు ఒక ప్రాక్టీసింగ్ సీఏ వద్దగాని, ఆడిట్ సంస్థలోగాని మూడేండ్ల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందాలి.
-సీఏ ఇంటర్మీడియట్‌లో రెండు గ్రూపులు లేదా ఏదైనా ఒక గ్రూపు (గ్రూప్-1గానీ, గ్రూప్-2గానీ) పూర్తిచేసినవారు ప్రాక్టికల్ ట్రెయినింగ్ చేయడానికి అర్హులు. ఇది నిజంగా సీఏ విద్యార్థులకు కలిసొచ్చే అంశం.
-ప్రాక్టికల్ ట్రెయినింగ్ సమయంలోనే ఒక ఏడాది ప్రాక్టికల్ ట్రెయినింగ్ ముగిశాక, సీఏ ఫైనల్ పరీక్ష రాసేలోగా సీఏ ఇన్‌స్టిట్యూట్ వారి నాలుగు ఏఐసీఐటీఎస్‌ఎస్ (అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌స్కిల్స్) శిక్షణ కూడా తీసుకోవాలి.
-ప్రాక్టికల్ ట్రెయినింగ్ చేస్తున్న సమయంలోనే విద్యార్థికి తాను ట్రెయినింగ్ తీసుకుంటున్న ప్రాంతాన్ని బట్టి రూ.2000 నుంచి రూ.7000 వరకు స్టయిఫండ్ లభిస్తుంది.


మొదటి దశ

సీఏ ఫౌండేషన్

-అర్హత: ఇంటర్ ఎంఈసీ/ఎంపీసీ/బైపీసీ/సీఈసీ/హెచ్‌ఈసీ ఇలా ఏ గ్రూప్ వారైనా సీఏ కోర్సు చదువవచ్చు. అయితే సీఏ చేయాలనుకునే చాలామంది విద్యార్థులు ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపుతోపాటే సీఏ ఫౌండేషన్ కూడా ఏకకాలంలో చదవడానికి సుముఖత చూపిస్తున్నారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష రాసిన ఎవరైనా సీఏ ఫౌండేషన్ కోర్సుకు ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వద్ద నమోదు చేసుకోవాలి. నమోదు చేయించుకున్న నాలుగు నెలలకు సీఏ ఫౌండేషన్ పరీక్ష రాయవచ్చు.

రిజిస్ట్రేషన్

-మేలో పరీక్ష రాయాలంటే ముందు ఏడాది డిసెంబర్ 31లోగా నమోదు చేసుకోవాలి.
-నవంబర్‌లో పరీక్ష రాయాలంటే అదే ఏడాదిలో జూన్ 30లోగా నమోదు చేసుకోవాలి.
-ఐసీఏఐకి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.9,200/- (ప్రాస్పెక్టస్‌తో కలిపి)
-ఐసీఏఐ పరీక్ష ఫీజు: రూ.1500/-పరీక్ష ఫీజు ఎప్పుడు చెల్లించాలి?
-మేలో పరీక్ష రాయాలంటే ఫిబ్రవరి నెలాఖరులోగా, నవంబర్‌లో పరీక్ష రాయాలంటే ఆగస్టు చివరిలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి.
గమనిక: పరీక్ష ఫీజు చెల్లించాల్సిన తేదీలు పరీక్షల తేదీలకు అనుగుణంగా మారవచ్చు.
-సహజంగా ప్రతి ప్రవేశపరీక్షను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. గతంలో ఇప్పటి సీఏ ఫౌండేషన్ స్థానంలో నిర్వహించిన సీపీటీ పరీక్ష కూడా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలోనే నిర్వహించారు. కానీ, సీఏ ఫౌండేషన్ పరీక్ష 50 శాతం మార్కులకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో, మరో 50 శాతం మార్కులకు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది.
-సీఏ ఫౌండేషన్‌లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉండటంవల్ల విద్యార్థులకు విశ్లేషణాత్మకత పెరుగుతుంది. అలాగే డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉండటంవల్ల భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెరిగే అవకాశం ఉంది.
-నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా సీఏ విద్యార్థికి అన్ని రకాల నైపుణ్యాలు ఉండాలన్న ఉద్దేశంతో సిలబస్ ఇలా రూపొందించారు.
-ఇప్పటి సీఏ ఫౌండేషన్ విధానంలో మొదటి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్‌కు పెద్దపీట వేశారు. కాబట్టి భవిష్యత్తులోని దశలైన సీఏ ఇంటర్, ఫైనల్ వంటి దశల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు మెరుగయ్యాయని చెప్పవచ్చు. సీఏ ఫౌండేషన్ సిలబస్‌లోని పేపర్-2లో ఇంగ్లిష్ గ్రామర్, రైటింగ్ స్కిల్స్, లెటర్ రైటింగ్, నోట్ మేకింగ్ వంటి కమ్యూనికేషన్ స్కిల్స్‌కు సంబంధించిన అనేక అంశాలను పొందుపర్చారు. దీనివల్ల విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పట్టు సాధించవచ్చు. డ్రాఫ్టింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి.
-సీఏ ఫౌండేషన్ పరీక్ష 4 పేపర్లుగా, ఒక్కో పేపర్‌కు 100 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు ఉంటుంది. ఒక్కో పేపర్‌కు ఒక్కో రోజు చొప్పున నాలుగు రోజులు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1, పేపర్-2 పరీక్షలు డిస్క్రిప్టివ్ పద్ధతిలో, పేపర్-3, పేపర్-4 పరీక్షలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతాయి.
-సీఏ ఫౌండేషన్ పరీక్షలు ప్రతి ఏడాది మే, నవంబర్‌లో నిర్వహిస్తారు.
-సీఏ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అదేవిధంగా నాలుగు పేపర్లు కలిపి 400 మార్కులకుగాను 50 శాతం మార్కులు అంటే 200 మార్కులు సాధించాలి.
-సీఏ కోర్సుకు సీఏ ఫౌండేషన్ అనేది ప్రవేశపరీక్ష అని చెప్పవచ్చు. సీఏ ఫౌండేషన్ పూర్తిచేసినవారే సీఏ చదవడానికి అర్హులు.
-ఇంజినీరింగ్, మెడిసిన్ చదవాలనుకునేవారికి ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షల వలెనే సీఏ చదవాలనుకునేవారికి సీఏ ఫౌండేషన్ అనేది ప్రవేశపరీక్ష.
ca4


రెండో దశ

సీఏ ఇంటర్మీడియట్

-ఈ సీఏ ఇంటర్మీడియట్ కోర్సును గతంలో సీఏ-ఐపీసీసీ అని పిలిచేవారు.
-సీఏ ఫౌండేషన్ పూర్తిచేసినవారు సీఏ ఇంటర్మీడియట్ చదవడానికి అర్హులు.
-సీఏ ఇంటర్మీడియట్ గ్రూపు-1, గ్రూపు-2లలో నాలుగు పేపర్ల చొప్పున ఎనిమిది పేపర్లు ఉంటాయి.

అర్హత

-డిగ్రీ పూర్తిచేసినవారు (కామర్స్ గ్రాడ్యుయేట్స్/పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ అయితే 55 శాతం మార్కులు, ఇతర గ్రాడ్యుయేట్స్/పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ అయితే 60 శాతం మార్కులు సాధించి ఉండాలి) కూడా సీఏ ఫౌండేషన్‌తో సంబంధం లేకుండా సీఏ ఇంటర్మీడియట్‌కు నేరుగా నమోదు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్

-మేలో పరీక్ష రాయాలంటే ముందు ఏడాది సెప్టెంబర్ 31లోగా నమోదు చేసుకోవాలి.
-నవంబర్‌లో పరీక్ష రాయాలంటే అదే ఏడాది మార్చి 1లోగా నమోదు చేయించుకోవాలి.
ca3


మూడో దశ

సీఏ ఫైనల్

-అర్హత: సీఏ ఇంటర్, రెండున్నరేండ్ల ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్ పరీక్ష రాయడానికి అర్హులు.
-రిజిస్ట్రేషన్: మే నెలలోగానీ, నవంబర్‌లో కానీ సీఏ ఫైనల్ పరీక్ష రాయాలంటే పరీక్షలకు ముందు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
-ఐసీఏఐకి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.22,000
-సీఏ ఫైనల్లో రెండు గ్రూపులు ఉంటాయి.
-సీఏ ఫైనల్ పరీక్ష ఏడాదికి రెండుసార్లు మే, నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు.
-సీఏ ఫైనల్ పరీక్ష మొత్తం 8 పేపర్లు, 2 గ్రూపులుగా (గ్రూపునకు 4 పేపర్ల చొప్పున) ఒక్కో పేపర్ 100 మార్కులకు మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు.
-విద్యార్థి వీలునుబట్టి 8 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కో గ్రూపు విడివిడిగా రాయవచ్చు.
-విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తంమీద 50 శాతం మార్కులు సాధించాలి.
-ఐసీఏఐవారి పరీక్ష ఫీజు : రెండు గ్రూపులకు రూ.3,300, ఒక్క గ్రూపునకు రూ.1800
-పరీక్ష ఫీజు ఎప్పుడు చెల్లించాలి: మేలో పరీక్ష రాయాలంటే ఫిబ్రవరి నెలాఖరులోగా, నవంబర్‌లో పరీక్ష రాయాలంటే ఆగస్ట్ చివరిలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి.
నోట్: పరీక్ష ఫీజు చెల్లించాల్సిన తేదీలు పరీక్షల తేదీలకు అనుగుణంగా మారవచ్చు.
-సీఏ ఇంటర్మీడియట్, రెండున్నరేండ్ల ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకుని సీఏ ఫైనల్ పరీక్ష రాయవచ్చు.
-సీఏ ఫైనల్ పరీక్ష 8 పేపర్లు రెండు గ్రూపులుగా (గ్రూపునకు 4 పేపర్లు) ఒక్కో పేపర్ 100 మార్కులకు నిర్వహిస్తారు.
-విద్యార్థి వీలునుబట్టి 8 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కో గ్రూపు విడివిడిగా రాయవచ్చు.
-విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తంమీద 50 శాతం మార్కులు సాధించాలి.
-కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్లుగా, ఫైనాన్స్ కంట్రోలర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, ప్లాంట్ అకౌంటెంట్స్, సిస్టమ్ ఇంప్లిమెంటర్స్, టెక్నో ఫంక్షనిస్టులుగా అవకాశాలు పొందవచ్చు. అంతేకాకుండా ట్రస్టీగా, అడ్మినిస్ట్రేటర్‌గా, వ్యాల్యూయర్‌గా, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా, ట్యాక్స్ కన్సల్టెంట్లుగా ఉద్యోగాలు లభిస్తాయి.
ca2

m-prakash

898
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles