కరెంట్ అపైర్స్


Wed,January 9, 2019 01:55 AM

Telangana
Telangana

సీజేగా రాధాకృష్ణన్

తెలంగాణ హైకోర్టు జనవరి 1న ఏర్పడగా తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.

నీటిపారుదల శాఖకు అవార్డు

తెలంగాణ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖకు ప్రతిష్ఠాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్, పవర్ (సీబీఐపీ) పురస్కారం లభించింది. జనవరి 4న ఢిల్లీలో సీబీఐపీ 91వ వార్షికోత్సవం, అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందజేశారు. సాగునీటి వనరుల నిర్వహణలో మెరుగైన పనితీరు ప్రదర్శన, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకుగాను ఈ అవార్డు దక్కింది.

సూర్యాపేటకు జాతీయ అవార్డు

సూర్యాపేట జిల్లా జాతీయ స్థాయి అవార్డు లభించింది. 2017-18లో జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి పడే సూర్యాపేట-బడే సూర్యాపేట కార్యక్రమాన్ని గుర్తించిన కేందప్రభుత్వం నేషనల్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును జనవరి 4న ఢిల్లీలో సూర్యాపేట డీఈవో వెంకట నర్సమ్మకు కేంద్ర మానవరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ అందజేశారు.

National
National

పశ్చిమబెంగాల్‌లో క్రిషక్ బంధు

తెలంగాణలోని రైతుబంధు పథకం తరహాలో పశ్చిమబెంగాల్‌లో క్రిషక్ బంధు పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం మమతా బెనర్జీ డిసెంబర్ 31న ప్రకటించారు. ఈ పథకం కింద ఏటా ఎకరానికి రూ.5 వేల సాయం అందించనున్నారు. మరోవైపు రైతుబీమా పథకం ద్వారా రూ.2 లక్షల బీమా కల్పించనున్నట్లు, బీమా ప్రీమియాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని మమత తెలిపారు.

చిన్న పరిశ్రమల వృద్ధిపై సిన్హా కమిటీ

లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధిపై సలహాలు ఇచ్చేందుకు ఆర్‌బీఐ జనవరి 2న యూకే సిన్హా నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ జూన్ వరకు తన నివేదికను అందజేయనున్నది. ఈ కమిటీ ఎంఎస్‌ఎంఈ రంగానికి సంబంధించి ఆర్థిక, ద్రవ్య స్థిరత్వానికి దీర్ఘకాలిక సూచనలు చేయనున్నది. మొత్తం ఎగుమతుల్లో దీని వాటా 40 శాతం కాగా, తయారీ రంగంలో 45 శాతం ఉంది.

మూడు బ్యాంకుల విలీనం

బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయ బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జనవరి 2న ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మూడు బ్యాంకుల విలీనం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల సంఖ్య 19 కు తగ్గనుంది. విలీనానంతరం ఏర్పడే కొత్త బ్యాంకు రూ.14.82 లక్షల కోట్ల వ్యాపార పరిమాణంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ తర్వాత దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది.

ఇంధన రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

చమురు, గ్యాస్, ఇంధన రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (పరిశోధనలు, ప్రమాణాల వేదిక) ఏర్పాటు చేయనున్నట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జనవరి 2న వెల్లడించారు. ఈ మేరకు ఏడు చమురు కంపెనీలు (బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ, ఐఓసీ, గెయిల్, ఆయిల్ ఇండియా, ఇంజినీర్స్ ఇండియా), ఐఐటీ బాంబే మధ్య ఎంవోయూ కుదిరింది. ఇంధన రంగంలో పరిశోధనలు, నాణ్యత, ఉత్పత్తి, సామర్థ్యం పెంచే టెక్నాలజీ విషయంలో ఈ సెంటర్ సహకారం అందించనుంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం)లో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా, తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. ఆసియా కాంపిటీటివ్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ (ఏసీఐ) కో డైరెక్టర్ టాన్ ఖీ జియాప్ జనవరి 3న ఈ జాబితాను విడుదల చేశారు. జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ

దేశంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచిందని ఆంఫి (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా) జనవరి 3న ఓ నివేదికను వెల్లడించింది. రూ.3.35 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులతో మొదటిస్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ ఉండగా, రూ.3.08 లక్షలతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ రెండో స్థానంలో నిలిచింది. ఎస్‌బీఐ (రూ.2.64 లక్షల కోట్లు) 3, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ (రూ.2.42 లక్షల కోట్లు) 4, రిలయన్స్ (రూ.2.36 లక్షల కోట్లు) 5వ స్థానాల్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నింటి నిర్వహణ ఆస్తులు కలిపి రూ.23.16 లక్షల కోట్లుగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్

పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సీ)ను ప్రధాని మోదీ జనవరి 3న ప్రారంభించారు. ఫ్యూచర్ ఇండియా: సైన్స్, టెక్నాలజీ ఇతివృత్తంగా ఐదు రోజులు పాటు జరిగే ఈ కాంగ్రెస్‌కు దేశ విదేశాలకు చెందిన దాదాపు 30 వేల మంది హాజరయ్యారు. దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచే ఉద్దేశంతో ఏటా జనవరిలో సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు.

ఆధార్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఆధార్‌తో పాటు టెలిగ్రాఫ్, మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ జనవరి 4న ఆమోదం తెలిపింది. దీంతో వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు విధిస్తారు. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ కనెక్షన్ పొందేందుకు పౌరులు ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

International
International

బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా

బంగ్లాదేశ్‌లో డిసెంబర్ 30న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని పార్టీ విజయం సాధించింది. 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్, దాని మిత్రపక్షాలు 288 స్థానాలు గెలుచుకున్నాయి. విపక్ష కూటమి నేషనల్ యునైటైడ్ ఫ్రంట్ ఏడు స్థానాల్లో గెలుపొందింది. దీంతో బంగ్లా ప్రధానిగా హసీనా వరుసగా మూడోసారి, మొత్తంగా నాలుగో సారి ఎన్నికయ్యారు.

వర్డ్ ఆఫ్ ది ఇయర్

వర్డ్ ఆఫ్ ది ఇయర్-2018గా టాక్సిక్ అనే పదం నిలిచిందని ఆక్స్‌ఫర్డ్ సంస్థ జనవరి 1న ప్రకటించింది. ఈ పదాన్ని 2018లో ఎక్కువ మంది తమ డిక్షనరీలో వెతికారని తెలిపింది. అదేవిధంగా నోమోఫోబియా అనే పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకటించింది.

రెడ్ స్నోమ్యాన్ ఆకారంలో అల్టిమా టూలే

రెండు మంచు గోళాలు కలిసిన రెడ్ స్నోమ్యాన్ ఆకారంలో అల్టిమా టూలే గ్రహం ఉందని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జనవరి 3న వెల్లడించింది. ఈ గ్రహానికి సంబంధించి న్యూ హారిజన్స్ సమగ్ర చిత్రాలను తీసిందని నాసా తెలిపింది. ఫ్లూటో గ్రహం సమీపంలోని క్యూపర్ బెల్ట్‌లో ఉన్న అల్టిమా టూలే గ్రహ రహస్యాలను తెలుసుకోవడానికి నాసా అంతరిక్షంలోకి న్యూహారిజన్స్ అనే స్పేస్ ప్రోబ్‌ను పంపింది.

చంద్రుడిపై చాంగే-4

చైనా 2018, డిసెంబర్ 7న ప్రయోగించిన చాంగే-4 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి చీకటి ఛాయలో జనవరి 3న విజయవంతంగా దిగింది. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉండే ఐన్‌క్యూన్ బేసిన్‌లో దిగిన ఇది చంద్రుడి దక్షణి ధృవానికి (చంద్రుడికి అవతలి చీకటి ప్రాంతం) చేరుకున్న మొదటి స్పేస్‌క్రాఫ్ట్. చంద్రుడిపై ఉండే అత్యల్ప గురుత్వాకర్షణ వాతావరణంతో పాటు చంద్రుడి ధృవాలు, నీటి లభ్యతపై ఇది పరిశోధనలు చేయనుంది.

Sports
Sports

బీసీసీఐ మహిళల వన్డే విజేత బెంగాల్

బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే టోర్నీ విజేతగా బెంగాల్ జట్టు నిలిచింది. బెంగళూరులో డిసెంబర్ 31న జరిగిన ఫైనల్లో బెంగాల్ జట్టు 11 పరుగుల తేడాతో ఆంధ్రా జట్టుపై విజయం సాధించింది.

ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా స్మృతి

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధనకు 2018కు గాను ఉత్తమ మహిళా క్రికెటర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు లభించాయి. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ డిసెంబర్ 31న ఈ అవార్డులను ప్రకటించారు. జులన్ గోస్వామి (2007) తర్వాత ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన భారత క్రికెటర్‌గా స్మృతి రికార్డులకెక్కింది. ఆస్ట్రేలియా ఓపెనర్, వికెట్ కీపర్ అలీసా హీలీకి ఐసీసీ టీ 20 మహిళా క్రికెటర్ అవార్డు దక్కింది.

Persons
Persons

సీఐసీ ప్రధాన కమిషన్‌గా సుధీర్

కేంద్ర సమాచార కమిషన్ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్-సీఐసీ)కు ప్రధాన సమాచార కమిషనర్‌గా సుధీర్ భార్గవను నియమిస్తూ కేంద్రప్రభుత్వం డిసెంబర్ 31న ఉత్తర్వులు జారీచేసింది. ఐఎఫ్‌ఎస్ అధికారి యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వనజ ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ నీరజ్ కుమార్ గుప్తా, లా మాజీ సెక్రటరీ సురేశ్ చంద్ర కమిషనర్లుగా నియమితులయ్యారు.

రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్‌కుమార్

భారత రైల్వే బోర్డు చైర్మన్‌గా, భారత ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌ను నియమిస్తూ డిసెంబర్ 31న ఉన్నతస్థాయి నియామకాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ పదవిలో అశ్వని లొహానీ ఉన్నారు.

సీసీఐ కార్యదర్శిగా ప్రమోద్ కుమార్

సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) కొత్త కార్యదర్శిగా ప్రమోద్ కుమార్ సింగ్‌ను నియమించినట్లు జనవరి 1న సీసీఐ తెలిపింది. ఇప్పటివరకు సీసీఐ న్యాయ సలహాదారుగా పీకే సింగ్ వ్యవహరించారు. గుత్తాధిపత్య ధోరణులు, నిర్బంధ వాణిజ్య విధానాల నివారణ కమిషన్ స్థానంలో 2003లో సీసీఐ ఏర్పాటైంది. వ్యాపార రంగంలో పోటీ సంస్థలను దెబ్బతీసే ధోరణులు, విలీనాలు, కొనుగోళ్లు, లావాదేవీలు వంటి వాటిని ఇది నియంత్రిస్తుంది.

క్రికెట్ కోచ్ అచ్రేకర్ మృతి

ప్రముఖ క్రికెట్ కోచ్, సచిన్ టెండుల్కర్ గురువు రమాకాంత్ అచ్రేకర్ అనారోగ్యంతో ముంబయిలో జనవరి 2న మరణించారు. ఒకే ఒక ఫస్టక్లాస్ మ్యాచ్‌ను ఆడిన అచ్రేకర్ 1964లో హైదరాబాద్‌లో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్‌కప్ టోర్నీలో భాగంగా హెచ్‌సీఏ ఎలెవన్‌తో జరిగిన పోరులో ఎస్‌బీఐ తరఫున ఆడారు. 1990లో ద్రోణాచార్య, 2010లో పద్మశ్రీ పురుస్కారాలను అందుకున్నారు.

నేపాల్ చీఫ్ జస్టిస్‌గా చోలేంద్ర

నేపాల్ సుప్రీంకోర్టు 29వ ప్రధాన న్యాయమూర్తిగా చోలేంద్ర షంషేర్ జేబీ రాణా జనవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ అధ్యక్ష భవనం శీతల్ నివాస్‌లో ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ప్రమాణం చేయించారు. అంతకుముందు జస్టిస్ ఓంప్రకాష్ మిశ్రా చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు.

మెమరీ పోటీల్లో ధ్రువ్‌కు స్వర్ణం

వరల్డ్ మెమరీ చాంపియన్‌షిప్ (ప్రపంచ జ్ఞాపకశక్తి పోటీలు)లో భారత సంతతి బాలుడు ధ్రువ్ మనోజ్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. హాంకాంగ్‌లో జనవరి 2న జరిగిన ఈ పోటీల్లో నేమ్స్ అండ్ ఫేసెస్, రాండమ్ వర్డ్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ పౌరుడిగా గుర్తింపు పొందాడు. అలాగే ఇండియా, చైనా, తైవాన్, మలేషియా, రష్యా దేశాల్లో నిర్వహించిన 260 పోటీల్లో పాల్గొన్న బాలుడిగా ఘనత సాధించాడు.
Vemula-Saidulu

1136
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles