అకడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ డ్రాఫ్ట్
యూజీసీ మార్గదర్శకాలు
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఓ విద్యార్థి ఫిజిక్స్ మేజర్ సబ్జెక్ట్‌గా డిగ్రీ చదవాలనుకున్నాడు. కానీ, తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోద్బలంతో ఇంజినీరింగ్‌లో చేరాడు. పరీక్షల్లో మంచి మార్కులే వస్తున్నా నచ్చిన కోర్సు చదవడం లేదన్న అసంతృప్తి పీడిస్తున్నది. బీటెక్ చివరి సెమిస్టర్లో విదేశీ విద్యకోసం అమెరికాకు ఎంపికయ్యాడు. అక్కడ ట్వంటీయత్ సెంచరీ సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ తదితర కోర్సులను తీసుకున్నాడు. ఇలాంటివాళ్లు భారత్‌కు తిరిగొచ్చాక అమెరికాలో నేర్చుకున్న కోర్సుల తాలూకు క్రెడిట్స్‌ను భద్రపరుచుకోవచ్చు. ఇలాంటి అవకాశం కల్పిస్తున్నదే అకడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ (ఏబీసీ). నూతన జాతీయ విద్యావిధానంలో (ఎన్పీఈ) భాగంగా యూజీసీ ఈ పద్ధతిని ప్రవేశపెట్టనున్నది. ఏబీసీ స్కీం మార్గదర్శకాలను రూపొందించిన యూజీసీ.. డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌ను ఇటీవలే విడుదల చేసింది. మన దగ్గర డిగ్రీలో ఒక సెమిస్టర్‌కు 24, కొన్ని సెమిస్టర్లకు 25, 26, 22 చొప్పున క్రెడిట్లు ఇస్తున్నారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో (సీబీసీఎస్) భాగంగా ఇతర కోర్సుల్లో పొందిన క్రెడిట్లు వృథా కాకుండా ఈ బ్యాంక్‌లో భద్రపరుచుకోవచ్చు.
క్రెడిట్ ట్రాన్స్ఫర్..
ఓ విద్యార్థి అత్యంత ఉత్సుకతతో ఇంజినీరింగ్‌లో చేరాడు. కానీ, ఏడాది తిరిగాక ఇంజినీరింగ్ కెరీర్ బాగాలేకపోవడంతో బీబీఏ చేయాలనుకున్నాడు. ఇలా చేయడంతో ఏడాది చదువును కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా న్యాక్ బ్యాంక్ స్కీంలో విద్యార్థి నష్టపోకుండా అతడు సాధించిన క్రెడిట్స్‌ను డిగ్రీ ప్రోగ్రాంకు ట్రాన్స్ఫర్ చేసుకునే సౌకర్యం ఉన్నది. ఏడాదికాలం వృథాకాకుండా ఒక డిపార్ట్మెంట్ నుంచి మరో డిపార్ట్మెంట్కు, ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు మారిన వారి క్రెడిట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. విద్యార్థికి సెమిస్టర్వారీగా థియరీ, ప్రాక్టికల్స్‌కు క్రెడిట్లు ఇస్తున్నారు. విద్యార్థి సాధించిన క్రెడిట్స్‌కు ఎనిమిదేండ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ఫీజులను సైతం క్రెడిట్స్ ఆధారంగానే వసూలు చేస్తారు. తాము చదువుతున్న వర్సిటీయే కాకుండా ఇతర వర్సిటీల్లో నచ్చిన కొత్త కోర్సులో కూడా చేరవచ్చు.