ఎనీ స్కిల్స్ @ ఎన్పీటీఈఎల్

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పనులెన్నో సులభతరంగా మారాయి. ఉన్న చోటు నుంచే పనులు పూర్తిచేయడం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతుంది. ఎవరైనా తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటారు. అలాంటివారికి అవసరమైన వివిధ కోర్సులు ఆన్లైన్ వేదికగా అందుబాటులోకి వచ్చాయి. వయస్సు, అర్హతతో సంబంధం లేకుండా వారికిష్టమైన రంగాల్లో శిక్షణ పొందే అవకాశాన్ని ఎన్పీటీఈఎల్ (నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్) కల్పిస్తుంది. ఈ ఎన్పీటీఈఎల్ గురించి తెలుసుకుందాం..
వయసుతో సంబంధంలేదు
కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. చిన్న తరగతుల నుంచి ఉన్నత కోర్సు అధ్యయానికి ఆన్లైన్ పరిష్కారంగా మారింది. ఈ కోవలో ఎన్పీటీఈఎల్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. చెన్నైకి చెందిన 86 ఏండ్ల మహిళ జర్మన్ భాషను, అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల కుర్రాడు బయో ఎనర్జీ, డిజైన్ థింకింగ్ కోర్సులను ఎన్‌పీటీఈఎల్‌లో నేర్చుకుని, పరీక్ష రాయడమే ఇందుకు నిదర్శనం. వీరు ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్న కోర్సుల్లో చేరి ఆయా విషయాలను నేర్చుకున్నారు.
ఎన్పీటీఈఎల్ నేపథ్యం
దేశంలో ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో వేగంగా విస్తరిస్తున్న ఉన్నత విద్యా సంస్థలు ప్రధానంగా ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యాబోధనకు ఆటంకం కలుగకూడదన్న ఉద్దేశంతో వివిధ విషయాలకు సంబంధించిన పాఠ్యాంశాలను దృశ్య మాద్యమంలో నిక్షిప్తం చేసి ప్రజలకు అందించాలని ప్రతిపాదించారు. ఉన్నత విద్య, పరిశోధనా రంగాల్లో ప్రామాణికంగా నిలిచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, దేశంలో ఉన్న వివిధ ఐఐటీలు ఒక కూటమిగా ఏర్పడి, 1999లో ఈ ప్రతిపాదనలు చేశాయి. ఎన్పీటీఈఎల్ ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమారు రూ.20 కోట్లు బడ్జెట్ కేటాయించి, అనుమతినిచ్చింది. 2003 నుంచి 2014 వరకు ఈ ప్రాజెక్టు ఆచరణకు అవసరమైన మౌలిక వసతులు, విధి విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. దీనిలో బోధించే కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకొని ఉచితంగా నేర్చుకోవచ్చు. పరీక్ష రాసే ఉద్దేశం ఉన్నవారు మాత్రమే రూ.1000 చెల్లించి, పరీక్షకు హాజరుకావచ్చు.
పారిశ్రామిక రంగం చేయూత
ఎన్పీటీఈఎల్కు పారిశ్రామిక రంగం చేయూతనందిస్తుంది. సుమారు 43 పరిశ్రమలు పూర్తి స్థాయిలో సహకారం అందజేస్తున్నాయి.
పారిశ్రామిక రంగ నిపుణులు బోధిస్తున్నారు.
పారిశ్రామిక రంగ సామాజిక బాధ్యత కింద అర్హులైన అభ్యర్థులకు పరీక్ష ఫీజులో రాయితీలు అందిస్తున్నారు. టాటా టెక్నాలజీస్, క్యాప్ జెమినీ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటి వరకు సుమారు 1,12,000 మందికి ఫీజు రాయితీలు కల్పించారు.
పారిశ్రామిక రంగ ఉద్యోగుల నైపుణ్యాలను పెం పొందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఎన్పీటీఈఎల్ కోర్సుల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన వారికి ఉపాధి అవకాశాలు, సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ కల్పిస్తున్నారు.
వేసవిలో ఇంటర్న్‌షిప్‌లు
వివరాలకు https://nptel.ac.in/noc/ index.html వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
https://swayam.gov.in వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలి.
3730 లోకల్ చాప్టర్లు
మెరుగైన సేవల కోసం ఎన్పీటీఈఎల్ ఆయా కళాశాలల్లో లోకల్ చాప్టర్ ప్రారంభించమని ప్రోత్సహిస్తుంది. దేశం లోపల, వెలుపల ఇప్పటి వరకు 3730 లోకల్ చాప్టర్లను ప్రారంభించింది. ఇందులో 15 నుంచి 20 లోకల్ చాప్టర్లు విదేశాల్లో ఉన్నాయి. ఈ కార్యక్రమంలోని వివిధ కోర్సుల వీడియోలను బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ, తెలుగు భాషల్లో అనువదించే కార్యక్రమం కూడా చేపట్టారు. ఇప్పటికే సుమారు 3099 గంటల నిడివి గల వీడియోలు అనువదించారు. ఇంకా 2000 గంటల నిడివి గల వీడియోల అనువాద కార్యక్రమం చురుగ్గా జరుగుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఎక్కువ లాభం చేకూరుతుంది. ఈ కోర్సులు 4, 8, 12 వారాలు నిడివి కలిగి ఉన్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు స్వయంగా కోర్సుల్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.
చక్కటి పరిష్కార వేదిక
సాంకేతిక పరిజ్ఞానం చాలా వేగంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఎన్పీటీఈఎల్ చక్కటి పరిష్కార వేదికగా నిలుస్తుంది. నాణ్యతలో రాజీపడకుండా గత ఏడేండ్లుగా వివిధ వర్గాల వారిని ఆకర్షిస్తూ అందరికి ఉపయోగపడే కోర్సులను అందిస్తున్నాం. మరింత మంది ఈ ఎన్పీటీఈఎల్పై అవగాహన పెంచుకొని, లాభపడాలని ఆశిస్తున్నాం. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో లోకల్ చాప్టర్‌ను ప్రారంభించి, విద్యార్థులను, అధ్యాపకులను నూతన కోర్సుల అధ్యయనానికి ప్రోత్సహిస్తున్నాం.
-డాక్టర్ ఏ రామస్వామిరెడ్డి డైరెక్టర్, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ
అందరూ అర్హులే..
2014లో 3 కోర్సులతో మొదలైన ఎన్పీటీఈఎల్ నేడు 2000 కోర్సులను అందించే స్థాయికి చేరింది. ఈ కోర్సులను అభ్యసించే వారిలో విద్యార్థులు, అధ్యాపకులే కాకుండా వివిధ వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, గృహిణులు కూడా ఉన్నారు. ఏడాదిలో ప్రథమ, ద్వితీయార్థాల్లో రెండుసార్లు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు కోటి మంది వివిధ కోర్సుల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. దాదాపు 11.8 లక్షల మంది వరకు వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరి 18న ప్రథమార్ధానికి సంబంధించిన ఎన్పీటీఈఎల్ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఈ సెమిస్టర్లో రాకెట్ ప్రొపల్షన్ నుంచి జౌళి సాంకేతిక పరిజ్ఞానం వరకు సుమారు 500 పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కోర్సుల వివరాలను https: //nptel.ac.in/Local Chapter/ referenc document courselist. html ద్వారా తెలుసుకోవచ్చు. నిత్యం కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఊపిరి పోసుకున్న పైథాన్ ప్రోగ్రామింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అంశాలపై కూడా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎన్పీటీఈఎల్ కోర్సులకు 900 మిలియన్ మంది వీక్షకులు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్‌కు సుమారు 1.6 మిలియన్ సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు.
-తిరుపతి గజ్వేల్, మేడ్చల్ రూరల్
తాజావార్తలు
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..
- గోల్డెన్ రేజర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న సెలూన్ ఓనర్
- ఈ శుక్రవారం విడుదలవుతున్న 9 సినిమాలు ఇవే!
- బంగారం వద్దు ఇల్లే ముద్దు.. 70 % మంది మహిళల మనోగతం!