శనివారం 06 మార్చి 2021
Nipuna-education - Jan 24, 2021 , 02:42:17

దేశంలో ఏకైక మిలిటరీ కాలేజీ ఆర్‌ఐఎంసీ

దేశంలో ఏకైక మిలిటరీ కాలేజీ ఆర్‌ఐఎంసీ

ప్రారంభం

 • రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌ (RIMC), ఇంటర్‌ సర్వీస్‌ కేటగిరీ ‘A’. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ట్రైనింగ్‌, ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌ దీని నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఈ కాలేజీని 1922, మార్చి 13లో ప్రారంభించారు. ప్రారంభంలో దీని పేరు ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాయల్‌ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ.
 • ఇది అప్పటి ఇంపీరియల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ (రాజ్వాడ క్యాంప్‌ అని కూడా పిలుస్తారు) ప్రాంగణంలో ఉంది. 138 ఎకరాల్లో పచ్చని గ్రామీణ ప్రాంతాల మధ్య, డెహ్రాడూన్‌ కంటోన్మెంట్‌లోని గర్హి గ్రామానికి ఆనుకుని ఉంది. 

చరిత్ర

 • దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ చదివిన అనేకమంది సైనికాధికారులే కాకుండా రాజకీయవేత్తలు, రాయబారులు, గవర్నర్లుగా ఎదిగిన వారు ఉన్నారు. నలుగురు చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌, నేవల్‌ చీఫ్‌ తదితర విశిష్ఠ స్థాయి వ్యక్తులను ఈ సంస్థ అందించింది.  

విజన్‌

 • ఈ సంస్థ ఉద్దేశం సైన్యంలో ఆఫీసర్‌ క్యాడర్‌ పోస్టులకు విద్యార్థులను తయారుచేయడం. ఇది ఒక పబ్లిక్‌ స్కూల్‌ తరహాలో నడుస్తుంది. సైనిక జీవితంలోని కఠినత, స్వీయ క్రమశిక్షణకు తగినట్లుగా ఇక్కడ చదివే విద్యార్థులను రూపొందించడం ఈ స్కూల్‌ ప్రధాన లక్ష్యం. 

ఆర్‌ఐఎంసీ ఎందుకు ?

 • ఎన్‌డీఏ, ఓటీఏ, ఐఎంఏ వంటి సంస్థలకు నర్సరీ ఆఫ్‌ లీడర్‌షిప్‌గా దీన్ని అభివర్ణిస్తారు. ఎన్‌డీఏ/ఎన్‌ఏవీఏసీ అకాడమీల్లో సింహభాగం ఇక్కడ చదివే విద్యార్థులు ఉండేలా శిక్షణనిస్తుంది ఈ సంస్థ. ఆర్‌ఐఎంసీలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా 11 1/2 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్సు బాలురను ఎంపిక చేస్తారు. సంపూర్ణ విద్యనే కాకుండా వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది.
 • ఎవరైనా విద్యార్థులు అనివార్యకారణాల వల్ల ఎన్‌డీఏ/ఎన్‌ఏవీఏసీలకు ఎంపిక కాకపోతే వారు అధికారులు, న్యాయవాదులు, ఇంజినీర్లు,  జర్నలిస్టులుగా మారేలా, నైపుణ్యాన్ని సాధించేలా శిక్షణ ఇస్తారు.

క్యాంపస్‌ విశేషాలు

 • ఏటా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సుమారు 250 మంది బాలురతో మినీ ఇండియాను తలపిస్తుంది. క్యాంపస్‌లో ట్యూడర్‌ స్టయిల్‌లో కొన్ని వారసత్వ భవనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని వంద సంవత్సరాల కన్నా ఎక్కువ పురాతనమైనవి ఉన్నాయి. వసతి గృహాల్లో విశాలమైన తరగతి గదులతో కూడిన ఎడ్యుకేషన్‌ బ్లాక్‌, స్మార్ట్‌ క్లాసులు, ప్రయోగశాలలతో ఉన్నాయి. అంతేకాకుండా ప్రొఫెషనల్‌ ఫ్యాకల్టీలు మెరుగైన విద్యను బోధిస్తున్నారు. ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:12.5గా ఉంది. అనేక రకాల ఆటస్థలాలు, కోర్టులు, 50 మీటర్ల ఒలింపిక్‌ సైజు స్విమ్మింగ్‌ పూల్‌, 10 మీటర్ల డైవింగ్‌ పూల్‌, ఇండోర్‌, అవుట్‌ డోర్‌ షూటింగ్‌ రేంజ్‌లు ఉన్నాయి. కో కరికులం యాక్టివిటీస్‌ కోసం సకల సౌకర్యాలు, వసతి, భోజనగదులు అన్ని ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు.

అఫిలియేషన్‌

 • కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్మీ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ట్రెయినింగ్‌ నిర్వహణ బాధ్యతను చూస్తుంది. ఈ స్కూల్‌లో మే, నవంబర్‌లో పదోతరగతి, పన్నెండో తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సర్టిఫికెట్‌ సీబీఎస్‌ఈ గుర్తింపు పొందింది. ఇక్కడ 10+2లో సైన్స్‌ స్ట్రీమ్‌ మాత్రమే ఉంది. అయితే యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ ఎగ్జామ్‌ అవసరాల దృష్ట్యా సోషల్‌ సైన్సెస్‌ను కూడా బోధిస్తారు.
 • కరికులం అత్యంత ఉత్తేజకరంగా ఉండేలా రూపొందించారు. ప్రతి ఒక్క యాక్టివిటీని సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించడం విశేషం.

ప్రవేశాలు

 • ప్రతి ఆరునెలలకు సుమారు 25 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. జనవరి 1 లేదా జూలై 1 నాటికి 11 1/2 ఏండ్లు నిండి ఉండాలి. 8వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. 
 • గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఏడోతరగతి చదువుతుండాలి లేదా ఉత్తీర్ణుడై ఉండాలి. 

ఎంపిక

 • జాతీయస్థాయిలో నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా చేస్తారు. ఈ పరీక్ష ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. వీటితోపాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉన్న బాలురు మాత్రమే ప్రవేశానికి అర్హులు.
 • సాధారణంగా ప్రతి రాష్ర్టానికి ఒక సీటు మాత్రమే కేటాయిస్తారు. అయితే ఎక్కువ జనాభా ఉన్న రాష్ర్టాలకు ఆయా పరిస్థితులను బట్టి రెండు సీట్లు కేటాయిస్తారు.

పరీక్ష విధానం

 • ఇంగ్లిష్‌ (125 మార్కులు), మ్యాథ్స్‌ (200 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌ (75 మార్కులు) నుంచి ప్రశ్నలు ఇస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి వైవా వాయిస్‌ టెస్ట్‌ 50 మార్కులకు నిర్వహిస్తారు.
 • కనీసం అర్హత మార్కులు ప్రతి సబ్జెక్టులో 50 శాతం సాధించాలి.

గమ్యం

 • భవిష్యత్తులో ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో సేవ చేయాలనే తపన ఉన్నవారు ఈ స్కూల్‌లో చేరితే వారి లక్ష్యాన్ని సునాయసంగా చేరుకోగలరు. ఒకవేళ ఇంటర్‌ తర్వాత వారు డిఫెన్స్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించకుంటే డిగ్రీ, టెక్నికల్‌ కోర్సుల్లో ప్రవేశించవచ్చు.

ఫీజు వివరాలు

 • ఏడాదికి రూ.62,400/ చెల్లించాలి.
 • ఈ స్కూల్‌కు ఎంపికైన రాష్ట్ర విద్యార్థికి ప్రభుత్వం ఏడాదికి రూ.26,400/- స్కాలర్‌షిప్‌గా ఇస్తుంది. 

పూర్వవిద్యార్థులు

 • పద్మభూషణ్‌ జనరల్‌ కేఎస్‌ తిమ్మయ్య, జీజీ బివూర్‌ (bewoor), వీఎన్‌ శర్మ, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎన్‌సీ సూరి, ఎస్‌ పద్మనాభం, బీఎస్‌ ధనోవా, ఎయిర్‌మార్షల్‌ పీపీ రెడ్డి తదితర ప్రముఖులు ఉన్నారు. 

నోట్‌: రాష్ట్ర విద్యార్థుల కోసం ఏటా తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ (ఆర్‌ఐఎంసీ) నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. 

ప్రత్యేక సౌకర్యాలు


 • 18 వేలకు పైగా జర్నల్స్‌, మేగజైన్స్‌ ఇతర పుస్తకాలతో విశాలమైన లైబ్రరీ అందుబాటులో ఉంది.
 • అధునాతన సాంకేతికతతో కూడిన రెండు కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. దీంతోపాటు ఫ్యాకల్టీ ఇతర సభ్యులతో సమాచార పంపిణీ తదితరాల కోసం సైబర్‌ కేఫ్‌ను ఏర్పాటు చేశారు.
 • ఒలింపిక్‌ సైజ్‌ స్విమ్మింగ్‌ పూల్‌, 10 మీటర్ల డైవింగ్‌ ప్లాట్‌ఫాంతో విద్యార్థులకు అందుబాటులో ఉంది. ఇంటర్‌ స్కూల్‌, ఇంటర్‌ సెక్షన్‌, జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థులకు శిక్షణనిస్తారు.
 • రెండు స్కాష్‌ కోర్టులు ఉన్నాయి.
 • హార్స్‌ రైడింగ్‌కు ప్రత్యేక శిక్షణనిస్తారు.

వివరాల కోసం

 •  https://tspsc.gov.in చూడవచ్చు.

కేవీఎస్‌ ..


VIDEOS

logo