బుధవారం 27 జనవరి 2021
Nipuna-education - Jan 03, 2021 , 02:36:12

రౌండప్‌ 2020.. అంతర్జాతీయం

రౌండప్‌ 2020.. అంతర్జాతీయం

  • అమెరికా ఎన్నికలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌ విజయం సాధించారు. నాలుగేండ్లకు ఒకసారి నవంబర్‌లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన కమలా ఈ పదవిని చేపట్టబోతున్న తొలి మహిళగా గుర్తింపు పొందనున్నారు.

కామెరూనియన్‌ 

కామెరూనియన్‌లో ఎన్నికలు ఫిబ్రవరి 9న నిర్వహించారు. అధికార పగ్గాలు చేపట్టిన కామెరూన్‌ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ పార్టీ 167 స్థానాలకుగాను 139 దక్కించుకుంది. అధ్యక్షుడిగా పాల్‌ బియా, ప్రధాన మంత్రిగా జోసెఫ్‌ ఎన్‌గుటే ఎన్నికయ్యారు. ఆ దేశ రాజధాని యాఔండే.

గినియా

గినియాలో అధ్యక్ష ఎన్నికలను అక్టోబర్‌లో నిర్వహించారు. అల్ఫా కాండే విజయం సాధించారు. 2010 నుంచి ఆయనే ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

మాలి

మాలిలో మార్చి 29, ఏప్రిల్‌ 19న జరిగిన ఎన్నికల్లో ర్యాలీ ఫర్‌ మాలి పార్టీ విజయం సాధించి బౌబాకర్‌ కీటా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆగస్ట్‌ 18న మిలిటరీ తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసింది. మిలిటరీకి చెందిన బాహ్‌ ఎన్‌డా ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 

బురుండి

బురుండిలో మే 20న జరిగిన ఎన్నికల్లో అధికార సీఎన్‌ఎన్‌-ఎఫ్‌డీడీ పార్టీ విజయం సాధించింది. ఎవరిస్టే ఎన్‌డాయిషిమియే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

సీషెల్స్‌

సీషెల్స్‌ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్‌ 22 నుంచి 24 మధ్య నిర్వహించారు. వేవెల్‌ రామ్‌కలావన్‌ విజయం సాధించారు. ఆయన లిన్యోన్‌ డెమొక్రటిక్‌ సెసెల్వా పార్టీకి చెందిన వ్యక్తి.

టాంజానియా

టాంజానియాలో అక్టోబర్‌ 28న ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చామా చా మాపిన్‌డుజీ పార్టీకి చెందిన జాన్‌ మగుఫులి విజయం సాధించారు.

ఘనా

ఘనాలో డిసెంబర్‌ 7న నిర్వహించిన ఎన్నికల్లో న్యూ పేట్రియాటిక్‌ పార్టీ (ఎన్‌పీపీ)కి చెందిన నానా అకుఫో-అడ్డో విజయం సాధించారు. జనవరి 2017 నుంచి ఆయనే ఆ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు

ఆసియా ఖండం
తైవాన్‌

తైవాన్‌లో ఈ ఏడాది జనవరి 11న ఎన్నికలు నిర్వహించారు. డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీకి చెందిన త్సాయి ఇంగ్‌-వెన్‌ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. 2016 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్న ఆమె ఈ దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలు.

తజకిస్థాన్‌

మధ్య ఆసియాలోని తజకిస్థాన్‌లో పార్లమెంటరీ ఎన్నికలు మార్చి 1, 2020న నిర్వహించారు. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ 63 సీట్లకుగాను 47 స్థానాలను దక్కించుకుంది. అధ్యక్షుడిగా ఎమోమలి రహమోన్‌, ప్రధానిగా కొఖిర్‌ రసుల్‌జోడా ఎన్నికయ్యారు.

సింగపూర్‌

సింగపూర్‌లో జూలైలో నిర్వహించిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ విజయం సాధించింది. ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొత్తం 18సార్లు ఎన్నికలు నిర్వహించగా వరుసగా 15వ సారి ఆ పార్టీనే  విజయం సాధించింది. 1959 నుంచి అధికారంలో ఉంది. ఇంత సుదీర్ఘ కాలం, ఎలాంటి విరామం లేకుండా అధికారంలో ఉన్న రెండో పార్టీ ఇదే. మెక్సికోకు చెందిన ఇన్‌స్టిట్యూషనల్‌ రెవల్యూషనరీ పార్టీ 71 ఏండ్లు అధికారంలో ఉంది. 

శ్రీలంక

శ్రీలంకలో ఆగస్ట్‌ 5న నిర్వహించిన ఎన్నికల్లో శ్రీలంక పీపుల్స్‌ ఫ్రీడమ్‌ అలయన్స్‌ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ కూటమి మొత్తం 225 స్థానాలకుగాను 145 స్థానాలను దక్కించుకుంది. మహిందా రాజపక్స ప్రధానిగా ఎన్నికయ్యారు. 

మయన్మార్‌

మయన్మార్‌ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించగా నోబెల్‌ బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్‌సూకీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ విజయం సాధించింది. స్టేట్‌ కౌన్సిలర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రి పదవితో ఇది సమానం

యూరప్‌ ఖండం

గ్రీక్‌

గ్రీక్‌లో జనవరిలో జరిగిన ఎన్నికల్లో కాతెరినా సకెల్లారొపౌలౌ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆ దేశానికి ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు. ఆ దేశ పార్లమెంట్‌లో ఆమెకు 261 ఓట్లు వచ్చాయి.

అజర్‌బైజాన్‌

ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించగా అధికారంలోని న్యూ అజర్‌బైజాన్‌ పార్టీ విజయం సాధించింది. 125 సీట్లకుగాను 72 గెలుచుకుంది.

ఐస్‌లాండ్‌

అధ్యక్ష ఎన్నికలను జూన్‌ నెలలో నిర్వహించగా గౌని జొహాన్నెసన్‌ 92% మెజారిటీ సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

బెలారస్‌

ఆగస్ట్‌ 9న జరిగిన ఎన్నికల్లో అలెగ్జాండర్‌ లుకాషెంకో ఆరోసారి గెలుపొందారు. 80% ఓట్లు సాధించారు. 1994 నుంచి ప్రతి అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలుస్తున్నారు. 

న్యూజిలాండ్‌

అక్టోబర్‌ 17న జరిగిన ఎన్నికల్లో ప్రధాని జసిండా ఆర్డెన్‌ నేతృత్వంలోని లేబర్‌పార్టీ మరోసారి విజయాన్ని సాధించింది.

దేశాలు-వివాదాలు

భారత్‌-చైనా 

అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో భాగమే అంటూ జూన్‌ 15 అర్ధరాత్రి గాల్వాన్‌ లోయలో భారత సైనికులపై చైనా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 20 మంది చనిపోగా అందులో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబు ఉన్నారు. 

 భారత్‌-నేపాల్‌

ఈ రెండు దేశాల మధ్య కాలాపానీ, లింపియాధురా, లిపులేక్‌ ప్రాంతాలకు సంబంధించి వివాదం ఉంది. ఈ ప్రాంతాలను కలుపుతూ నేపాల్‌ కొత్త మ్యాప్‌ను విడుదల చేయడంతో పాటు కొత్త చిత్రపటంతో పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించింది. బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాలో సుస్తా అనే ప్రాంతానికి సంబంధించి కూడా వివాదం ఉంది. కాలాపానీ ఇరు దేశాల మధ్య ప్రవహించే సరస్సు. 1816లో ఈస్టిండియా  పాలనలో ఉన్నప్పుడే ఇరు దేశాల మధ్య సగౌలి ఒప్పందం కుదిరింది. అయితే కాళీ నది జన్మస్థలంపై వివాదం ఉండటం, ఇరు దేశాల మధ్య సరిహద్దు నిర్ణయంలో ఇబ్బందులు ఏర్పడి వివాదాలకు దారితీసింది. సుస్తా ప్రాంతం గండక్‌ నది ఒడ్డున ఉంది. 

భారత్‌-పాకిస్థాన్‌

గిల్గిట్‌-బాల్టిస్థాన్‌లను పాకిస్థాన్‌ ప్రావిన్స్‌గా ప్రకటించి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇది ఒక స్వయంప్రతిపత్తి ఉన్న ప్రాంతం. చైనా నిర్మిస్తున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ ఈ ప్రాంతం గుండా వెళుతుంది. లద్దాక్‌కు ఇది వాయవ్యంగా వెళుతుంది. జమ్ము కశ్మీర్‌ సంస్థానంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేస్తూ నాటి సంస్థానాధిపతి మహరాజా హరిసింగ్‌ 1947, అక్టోబర్‌ 26న సంతకం చేశారు. అయితే అదే ఏడాది నవంబర్‌ 4న పాకిస్థాన్‌ దీనిని ఆక్రమించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం స్వయంప్రతిపత్తిగా ఉంది. 

అజర్‌బైజాన్‌-అర్మేనియా

నాగర్నో-కరబాక్‌ అనే ప్రాంతానికి సంబంధించి అజర్‌బైజాన్‌, అర్మేనియాల మధ్య వివాదం ఉంది. ప్రస్తుతం వివాదాస్పద ప్రాంతం అజర్‌బైజాన్‌ ఆధీనంలో ఉంది. అర్మేనియా జాతికి చెందిన జనాభా ఎక్కువగా ఉండటం, ఇది తమదని అర్మేనియా అంటుంది. 

చైనా-అమెరికా

టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో ఉన్న చైనా రాయబార కార్యాలయాన్ని మూసి వేయాలని అమెరికా ఆదేశించింది. ఆ కార్యాలయం గూఢచర్య కార్యకలాపాలకు, మేధో హక్కుల అపహరణకు పాల్పడుతుందని అమెరికా ఆరోపణ. చైనాకు చెందిన పలు యాప్‌లను కూడా అమెరికా నిషేధించింది. ప్రతిస్పందనగా చెంగ్డూలోని కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికాను చైనా ఆదేశించింది.

బ్లూనైల్‌ డ్యామ్‌

నైలు నదికి ఉపనది బ్లూనైల్‌. దీనిని అబ్బే నది అని కూడా అంటారు. ఈ నదిపై ఇథియోపియా డ్యాం నిర్మిస్తుండటాన్ని సూడాన్‌, ఈజిప్ట్‌ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. 4.5 బిలియన్‌ డాలర్లతో 2011లో నిర్మాణాన్ని ఇథియోపియా చేపట్టింది. ఇది పూర్తయితే తమ వార్షిక వాటాలో 55.5 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు దక్కదని ఈజిప్ట్‌ వాదన. 

ఇతర అంశాలు యూఏఈ

న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించడంతో పాటు అంగారక గ్రహంపైకి హోప్‌ పేరుతో స్పేస్‌ క్రాఫ్ట్‌ను యూఏఈ ప్రయోగించింది. ఈ రెండు విజయాలు సాధించిన తొలి అరబ్‌ దేశంగా నిలిచింది. 

లెబనాన్‌

పశ్చిమాసియా దేశం లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఆగస్ట్‌ 4న భారీ పేలుడు సంభవించింది. 200కుపైగా పౌరులు మృతిచెందారు. ఇక్కడ నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్‌ వల్లే ఇది జరిగిందని గుర్తించారు. 

టర్కీ

ఇస్తాంబుల్‌లోని చారిత్రాత్మక హగియా సోఫియాని టర్కీ ప్రభుత్వం మసీదుగా మార్చింది. మొదట ఇది చర్చి. 1454లో మసీదుగా మార్చారు. ఆ తర్వాత 20వ శతాబ్దంలో మ్యూజియంగా మార్చారు. తాజాగా దీనిని మసీదుగా చేశారు. అదే విధంగా టర్కీ తీరానికి దగ్గర్లో నల్ల సముద్రంలో 85 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మేర సహజవాయు నిక్షేపాలను కనుగొన్నారు.  

రష్యా

2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ కొనసాగేందుకు రాజ్యాంగాన్ని సవరించారు. ఇందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరగగా సవరణలకు అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు. 

ఫిన్లాండ్‌

ఫిన్లాండ్‌ ప్రధానిగా సనా మారిన్‌ ఎన్నికయ్యారు. ఆ దేశానికి అతిచిన్న వయస్సులోనే ఆమె ప్రధాని అయ్యారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిచిన్న ప్రధానుల్లో ఆమె నాలుగో స్థానంలో ఉన్నారు. 

ఆస్ట్రేలియా

మలబార్‌ విన్యాసాల్లో ఆస్ట్రేలియాకు అవకాశం దక్కింది. ఇప్పటి వరకు ఈ విన్యాసాల్లో భారత్‌, అమెరికా, జపాన్‌ దేశాలు పాల్గొంటున్నాయి.  

పాండమిక్‌, కరోనా

  • డిక్షనరీ.కామ్‌, మెరియం-వెబ్‌స్టర్‌ అనే సంస్థల ప్రకారం 2020 ఏడాది పదం పాండమిక్‌. అదేవిధంగా 2020 ఏప్రిల్‌నాటికి అత్యధికంగా ఉపయోగించిన ఇంగ్లిష్‌ పదం కరోనా అని ఆక్స్‌ఫర్డ్‌ లాంగ్వేజెస్‌ సంస్థ ప్రకటించింది.
  • 2020ని నర్సుల సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
  • ఆహార వృథాను అరికట్టడానికి చైనా ఆపరేషన్‌ ఎంప్టీ ప్లేట్‌ను అమలు చేసింది.
  • చైనా కట్టడికి ఎనిమిది దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అవి.. అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్‌, నార్వే, యూరోపియన్‌ పార్లమెంట్‌.
  • శ్రీలంక స్వాతంత్య్ర వేడుకల్లో కేవలం సింహళ జాతీయ గీతాన్నే పాడాలని, తమిళ జాతీయ గీతాన్ని తొలగించాలని ఆ దేశం నిర్ణయించింది.

75 ఏండ్ల సంఘటనలు - సంస్థలు ట్రినిటీ పరీక్ష

ఈ ఏడాది జూలై 16 నాటికి ప్రపంచంలోనే తొలి అణుబాంబును పరీక్షించి 75 ఏండ్లు అయ్యింది. దీనినే ట్రినిటీ టెస్ట్‌ అంటారు. దీనిని తయారు చేయడానికి చేపట్టిన ప్రాజెక్టే మాన్‌హటన్‌ ప్రాజెక్ట్‌. గాడ్జెట్‌ అనే పేరుతో దీనిని అభివృద్ధి చేశారు. మాన్‌హటన్‌ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహించింది రాబర్ట్‌ ఒపెనిమెర్‌. ఆయననే అణుబాంబు పితగా పిలుస్తారు. ఈ అణుబాంబును అలామగోర్డో బాంబింగ్‌ శ్రేణిలో పరీక్షించారు. ప్రస్తుతం అణుబాంబులను కలిగి ఉన్న దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, భారత్‌, చైనా, యూకే, ఇజ్రాయెల్‌, పాకిస్థాన్‌, ఉత్తరకొరియా.

లిటిల్‌ బాయ్‌, ఫ్యాట్‌ మ్యాన్‌ 

ఆగస్ట్‌ 6, 1945న లిటిల్‌ బాయ్‌ పేరుతో జపాన్‌లోని హిరోషిమాపై యురేనియం బాంబును అమెరికా వేసింది. ఈ ఘటనలో సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబుకే లిటిల్‌ బాయ్‌ అని పేరు. మూడురోజుల తర్వాత అంటే ఆగస్ట్‌ 9న మరో అణుబాంబును నాగసాకి నగరంపై వేశారు. దీనికి ఫ్యాట్‌మ్యాన్‌ అని పేరుపెట్టారు. దీంతో రెండో ప్రపంచ యుద్ధం కూడా ముగిసింది. 

ఐక్యరాజ్య సమితి

అక్టోబర్‌ 24 నాటికి ఈ సంస్థ ఆవిర్భవించి 75 ఏండ్లు పూర్తయ్యింది. జనరల్‌ అసెంబ్లీ, భద్రతా మండలి, ఆర్థిక-సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, ధర్మకర్తృత్వ మండలి, సచివాలయం ఇలా ఐక్యరాజ్య సమితికి ప్రధానంగా ఆరు అంగాలు ఉన్నాయి. పర్యావరణ మెరుగు కోసం 1992లో రియోడిజనీరోలో సదస్సును నిర్వహించింది. 1956లో సూయజ్‌ కాలువ వివాదాన్ని పరిష్కరించింది. 

ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌

ఇటలీలోని రోమ్‌ కేంద్రంగా ఉన్న దీనిని అక్టోబర్‌ 16, 1945లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఏర్పడి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రధాని మోదీ రూ.75 స్మారక నాణేన్ని విడుదల చేశారు. 

యునెస్కో

యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ను నవంబర్‌ 16, 1945లో ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్‌లోని పారిస్‌ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కో భారత వారసత్వ ప్రదేశాలపై పోస్టల్‌  స్టాంపులను విడుదల చేసింది. అవి.. అహ్మదాబాద్‌, గోవా చర్చ్‌లు, పట్టడకల్‌ దేవాలయాలు, ఖజురహో కట్టడాలు, కుతుబ్‌మినార్‌.

యూఎన్‌ఎస్‌సీలో భారత్‌

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి నాన్‌పర్మినెంట్‌ సభ్యత్వ దేశంగా భారత్‌ ఎంపికయ్యింది. జూన్‌లో నిర్వహించిన ఎన్నికల్లో 192 సభ్యదేశాలకుగాను భారత్‌కు 184 దేశాలు మద్దతు పలికాయి. జనవరి 1, 2021 నుంచి భారత్‌ నాన్‌ పర్మినెంట్‌ దేశంగా సభ్యత్వాన్ని పొందనుంది. భద్రతా మండలిలో భారత్‌ ఈ హోదా పొందడం ఇది ఎనిమిదో సారి.   


logo