రౌండప్ 2020.. నూతన విద్యా విధానం

నూతన విద్యా విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు ఆమోదించిన సుస్థిరాభివృద్ధి నాలుగో లక్ష్య సాధనకు అనుగుణంగా కొత్త విధానం ఉంది. 21వ శతాబ్దంలో ఇది తొలి విద్యా విధానం. ఇప్పటి వరకు 1986 నాటి విద్యా విధానాలే అమలులో ఉన్నాయి.
ముఖ్య అంశాలు
- సార్వత్రిక విద్య 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కూడా విస్తరించడం, ఇప్పటి వరకు ఇది 6-14 సంవత్సరాలవాళ్లకే అందుతుంది.
- 10+2+3 స్థానంలోనే 5+3+3+4 విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఐదేండ్లు ఫౌండేషన్ దశ, మూడేండ్లు ప్రిపరేటరీ స్టేజ్, ఆ తర్వాతి మూడేండ్లు మధ్య దశ, నాలుగేండ్లు ఉన్నత విద్య దశ ఉంటుంది.
- నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ- న్యూమరసీని ప్రాథమిక పాఠశాలల దశలోనే ప్రవేశపెడుతారు. 2025 నాటికి గ్రేడ్ 3 స్థాయి బాలలకు ఇది అందుబాటులో ఉంటుంది
- 2030 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి 30% సాధించాలని లక్ష్యం
- పీఏఆర్‌ఏకేహెచ్ (పర్ఫామెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్) ఏర్పాటు. అత్యున్నత ప్రమాణాలను ఇది ఏర్పాటు చేస్తుంది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
- ఐదో గ్రేడ్ వరకు, ఇంకా వీలైతే ఎనిమిదో గ్రేడ్ వరకు మాతృభాషలోనే బోధన.
- 2030 నాటికి ఉపాధ్యాయులకు కనీస అర్హతగా నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు.
- ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా మూడు వ్యవస్థల గొడుగుకు కిందికి వస్తాయి. అవి.. 1. రిసెర్చ్ యూనివర్సిటీలు 2. టీచింగ్ యూనివర్సిటీలు 3. అటానమస్ డిగ్రీ- గ్రాంటింగ్ కాలేజీలు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై జీడీపీలో 6% మేర వెచ్చిస్తాయి. నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన తొలి రాష్ట్రం కర్నాటక.
- మాతృభాషలో సాంకేతిక విద్య: సాంకేతిక విద్యను మాతృభాషలో చదివే అవకాశానికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను రూపొందించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను నియమించారు. ఉన్నత విద్యా కార్యదర్శి అమిత్ ఖారే దీనికి నేతృత్వం వహిస్తారు.
మిషన్ కర్మయోగి
సివిల్ సర్వీసెస్ అధికారుల సామర్థ్యాన్ని పెంచడం కోసం మిషన్ కర్మయోగికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 46 లక్షల కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు రూ.510.86 కోట్లు 2020-21 నుంచి 2024-25 మధ్య వెచ్చిస్తారు.
వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం
వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం జూలై 20న అమలులోకి వచ్చింది. దీని ప్రకారం వస్తువులు, సేవల ధరలు, నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత తదితర అంశాల్లో వాస్తవాలను ప్రకటనల రూపంలో ఇవ్వాలి. షరతులను కూడా పెద్ద అక్షరాలతో, ప్రకటన ఏ భాషలో ఉందో ఆ భాషలోనే ఇవ్వాలి.
డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విలీనం
కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను విలీనం చేశారు. ఇది జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో దేశంలో ప్రస్తుతం 28 రాష్ర్టాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.
ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్
సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశ సైనిక విభాగాల్లో మహిళా అధికారుల శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తూ జూలై 23న ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల పదవీ విరమణ పొందే వరకు సైన్యంలో కొనసాగే వీలుంటుంది. అంతేకాకుండా మహిళలకు కమాండ్ హోదా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
రామమందిరానికి భూమిపూజ
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్ట్ 5న భూమిపూజ నిర్వహించారు. ఈ మందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు అధ్యక్షుడిగా మహంత్ నృత్యగోపాల్‌దాస్, ప్రధాన కార్యదర్శిగా చంపత్‌రాయ్ ఎన్నికయ్యారు. నగర శైలిలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
కుమార్తెలకు ఆస్తిహక్కు
కుమార్తెలకు ఆస్తిని పొందే హక్కు ఉంటుందని ఆగస్ట్‌లో సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది. 1956లో చట్టాన్ని సవరిస్తూ 2005లో పార్లమెంట్ కొత్త చట్టాన్ని చేసింది.
జనాభా గణాంకాలు
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం లింగ నిష్పత్తిలో అత్యుత్తమ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1084 మహిళలు ఉన్నారు. ఆ తర్వాత నాగాలాండ్, మిజోరం, కేరళ, కర్నాటక రాష్ర్టాలు ఉన్నాయి. అతి తక్కువగా మణిపూర్‌లో 757 మందే ఉన్నారు.
ఎన్నికలు
ఈ ఏడాది ఢిల్లీ, బీహార్ శాసనసభలకు ఎన్నికలు నిర్వహించారు. ఢిల్లీలో ఆమ్ఆద్మీపార్టీ 70 శాసనసభ స్థానాలకుగాను 62 స్థానాల్లో విజయం సాధించింది. రెండోసారి సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం చేశారు. బీహార్‌లో 243 శాసనసభ స్థానాలకుగాను 126 స్థానాల్లో ఎన్డీఏ గెలుపొందింది. అతిపెద్ద పార్టీగా రాష్ట్రీయ జనతా దళ్ అవతరించింది. ఆ పార్టీ 75 స్థానాలను దక్కించుకుంది.
మంత్రిత్వ శాఖల పేర్లు మార్పు
గతంలోని మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యాశాఖగా మార్చారు. ప్రారంభంలో ఈ మంత్రిత్వ శాఖ పేరు విద్యాశాఖగానే ఉంది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1985లో దీనిని మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చింది. నూతన విద్యా విధానంలో భాగంగా మళ్లీ దీనిని విద్యాశాఖగా మార్చారు. అలాగే నౌకాయాన శాఖ పేరును నౌకాశ్రయాలు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖగా మార్పు చేశారు.
నూతన పార్లమెంట్
న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నాలుగు అంతస్థుల్లో 64,500 చ.మీ. వైశాల్యంలో నిర్మించనున్నారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలుంటుంది. 2022లో భారత్ స్వాతంత్య్రం సాధించి 75 ఏండ్లు పూర్తి కానుంది. అప్పటికి పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తవుతుంది.
పౌరసత్వ సవరణ చట్టం
పౌరసత్వ సవరణ చట్టం ఈ ఏడాది జనవరి 10 నుంచి అమలులోకి వచ్చింది. నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. 2019, డిసెంబర్ 10న లోక్‌సభ, డిసెంబర్ 11న రాజ్యసభ ఈ చట్టాన్ని ఆమోదించాయి. డిసెంబర్ 12న రాష్ట్రపతి దీనిపై సంతకం చేశారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ల నుంచి భారత్‌కు 2014, డిసెంబర్ 31 తర్వాత వచ్చిన హిందు, సిక్కు, బౌద్ధ, జైన, క్రైస్తవ మతాలకు చెందినవారికి భారత పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో ఈ చట్టాన్ని చేశారు.
చట్టసభలో ్లరిజర్వేషన్ల పొడిగింపు
లోక్‌సభతో పాటు రాష్ర్టాల్లోని శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు మరో పదేండ్ల పాటు రిజర్వేషన్‌ను పొడిగిస్తూ ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. తాజా బిల్లులో ఆంగ్లో-ఇండియన్ల ప్రస్తావన లేదు. జనవరి 25, 2030 వరకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎస్సీలకు 84, ఎస్టీలకు 47 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. అన్ని శాసనసభల్లో 614 స్థానాలు ఎస్సీలకు, 554 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు.
గిన్నిస్‌బుక్‌లో దీపోత్సవం
దీపావళి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. సరయు నదీ తీరాన 6,06,569 దీపాలను వెలిగించారు. గతేడాది 4,10,000 దీపాలు వెలిగించి ఇదే ప్రదేశంలో నెలకొల్పిన రికార్డు స్థానంలో కొత్త రికార్డ్ చేరింది.
కోర్టు తీర్పులు ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు
ఇంటర్నెట్ పొందడం అనేది ఆర్టికల్ 19లోని భావప్రకటన స్వేచ్ఛలో భాగం అని సుపీ్రంకోర్ట్ తీర్పు చెప్పింది. జమ్ము కశ్మీర్లో సుదీర్ఘ కాలం ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసినందున దాఖలైన వ్యాజ్యం విచారణలో భాగంగా సుప్రీంకోర్ట్ ఈ తీర్పును వెలువరించింది.
భావ ప్రకటన స్వేచ్చాపరిమితులు
మతాల మధ్య ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చే మాటలను భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సూఫీ సాధువు క్వాజా మొయినుద్దీన్ చిస్తీపై ఒక టీవీ యాంకర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ తీర్పును సుప్రీంకోర్ట్ చెప్పింది.
ప్రపంచ కట్టడాల జాబితాలో భారత అంశాలు
- చారిత్రాత్మక నీటి పారుదల కట్టడాల
(వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్)లో భారత్‌కు చెందిన నాలుగు కట్టడాలకు గుర్తింపు లభించింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నీటిపారుదల కాల్వలు ఉన్నాయి. అవి. 1. కంభం చెరువు 2. కేసీ కాలువ 3. పోరుమామిళ్ల చెరువు 4. ధామాపూర్ చెరువు
కంభం చెరువు: ప్రకాశం జిల్లా కంభం చెరువు చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది. గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణదేవారాయల కాలంలో నిర్మించిన ఈ చెరువు ఆసియాలోనే రెండో అతిపెద్ద సాగునీటి చెరువు. 500 సంవత్సరాల కింద నిర్మించిన ఈ చెరువు కింద 10,300 ఎకరాల ఆయకట్టు ఉంది.
పోరుమామిళ్ల చెరువు: కడపజిల్లా పోరుమామిళ్లలోని చెరువుకు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. 1903లో బయటపడిన శాసనం ఆధారంగా ఈ చెరువు చరిత్ర వెలుగుచూసింది. 3864 ఎకరాల ఆయకట్టు ఈ చెరువుకు ఉంది.
కేసీ కాలువ: బ్రిటిష్ హయాంలో 1863-70 సంవత్సరాల మధ్య రవాణా, సాగునీటి అవసరాల కోసం తవ్వారు. తుంగభద్రపై కర్నూలు జిల్లాలో నిర్మించిన సుంకేశుల బ్యారేజీ నుంచి కడప జిల్లా కృష్ణరాజపురం వరకు ఈ కాలువ ఉంటుంది. సర్ ఆర్థర్ కాటన్ సూచన మేరకు రవాణా తగ్గించడంతో సాగునీటి ప్రాజెక్ట్‌గా మారింది. తుంగభద్ర-పెన్నా నదులను కలిపేలా 305.60 కిలోమీటర్ల దూరం ఈ కాలువ ఉంది.
ధామాపూర్ చెరువు: దీనిని 1530లో గ్రామస్థులు నిర్మించారు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన నాగేశ్ దేశాయ్ అనే మండలాధ్యక్షుడు సాయం చేశాడు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉంది. సంవత్సరం అంతా ఇందులో నీరు అందుబాటులో ఉంటుంది.
2018లో ఈ జాబితాలో కామారెడ్డి జిల్లాలోని పెద్ద చెరువు ట్యాంక్, నిర్మల్ జిల్లాలోని సదర్మట్ ఆయకట్టు చోటు సంపాదించాయి.
యునెస్కో వారసత్వ సంపదలో
గ్వాలియర్, ఓర్చా: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, ఓర్చాలు ప్రపంచ వారసత్వ సంపద నగరాల జాబితాలో చోటు సంపాదించాయి. ఓర్చా అంటే రహస్య రాజభవనం అని అర్థం. 16వ శతాబ్దంలో బుందేల్ ఖండ్ రాజవంశానికి ఓర్చా రాజధానిగా ఉంది. ఈ నగరంలో రాజ్‌మహల్, జహంగీర్ మహల్, రామ్‌రాజా దేవాలయం, రాయ్ ప్రవీణ్ మహల్, లక్ష్మీనారాయణ్ మందిర్ ప్రసిద్ధి పొందాయి. గ్వాలియర్ నగరాన్ని తొమ్మిదో శతాబ్దంలో నిర్మించారు. గుర్జర ప్రతిహారులు, తోమరులు, సింధియా తదితర రాజవంశాలు దీనిని పాలించాయి, సాస్ బహుకా మందిర్ ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇప్పటికే ఈ జాబితాలో ఉన్న భారత నగరాలు అహ్మదాబాద్, జైపూర్.
తాజావార్తలు
- 'ఆందోళన నుంచి వైదొలుగుతున్నాం'
- అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు
- బిగ్‌బాస్ ఫేం మెహబూబ్ 'ఎవరురా ఆ పిల్ల' వీడియో సాంగ్ కేక
- ఏపీలో కొత్తగా 111 మందికి కరోనా
- టాప్ 10 ఐటీ సేవల బ్రాండ్ ‘’ ఇన్ఫోసిస్
- రైతు సంఘాల్లో చీలిక.. వైదొలగిన రెండు సంఘాలు
- సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు
- 1000మంది గర్ల్ఫ్రండ్స్..1075 ఏళ్ల జైలు శిక్ష
- ఎస్ఐఎఫ్సీఏ కన్వీనర్‌గా పిట్టల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక
- 11 లక్షల పీఎం కిసాన్ నగదు బదిలీలు విఫలం