శనివారం 28 నవంబర్ 2020
Nipuna-education - Nov 15, 2020 , 10:58:11

ఇంటర్‌తో కేంద్ర కొలువు

ఇంటర్‌తో కేంద్ర కొలువు

ఇంటర్‌ ఉత్తీర్ణులై జీవితంలో త్వరగా ప్రభుత్వ కొలువులో చేరాలనుకునేవారికి ఇదొక సువర్ణావకాశం. గ్రేడ్‌ ఏ స్ధాయిలో కేంద్ర ప్రభుత్వ కొలువు. మంచి జీతభత్యాలు, పదోన్నతులకు అవకాశం. వీటన్నింటి సమాహారమే కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ఎగ్జామ్‌. 2020కి సంబంధించిన ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణు పాఠకుల కోసం...

సీహెచ్‌ఎస్‌ఎల్‌ మూడుదశల్లో నిర్వహిస్తారు. టైర్‌-1, 2 తర్వాత స్కిల్‌టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలో పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కేవలం ఇంటర్‌ విద్యార్థులే కాకుండా డిగ్రీ అయినవారు కూడా ఈ పరీక్ష రాస్తారు. సరైన ప్రణాళికతో ఈ పరీక్షకు సిద్ధమైతే విజయం సాధించడం సులభం. ప్రస్తుత నోటిఫికేషన్‌ ప్రకారం.. టైర్‌-1కు ఆరునెలల కాలం మిగిలి ఉంది. పరీక్ష స్వరూపం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గురించి తెలుసుకుందాం...

టైర్‌-1 

 • పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. మొత్తం 60 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి. ఇందులో నాలుగు విభాగాలు అర్థమెటిక్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు, ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 200 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులు తగ్గిస్తారు. 
 • ఇందులో సెక్షన్‌వైజ్‌ కటాఫ్‌ ఉండదు. 200 మార్కుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా కటాఫ్‌ నిర్ణయిస్తారు. 
 • ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అంటే దీనిప్రకారం ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానాన్ని గుర్తిస్తే చాలు. కాబట్టి సబ్జెక్టును పూర్తిగా ఒకటికి రెండుసార్లు చదివితే మంచిది.

అర్థమెటిక్‌ 

 • ఇది అత్యంత ముఖ్యమైన విభాగం. ఇందులో ముఖ్యమైన చాప్టర్లు నంబర్‌ సిస్టమ్‌, నిష్పత్తులు, శాతాలు, నష్టాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అలాగే జామెట్రీ, మెన్సురేషన్‌, ట్రిగ్నామెట్రీల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. ఆర్‌ఎస్‌ అగర్వాల్‌, అరిహంత్‌ సిరీస్‌ పుస్తకాల్లో చాప్టర్ల వారీగా అన్ని చదువుతూ ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ప్రశ్నలు ఎక్కువగా కాన్సెప్ట్‌ ఆధారంగా ఉంటాయి. అంటే షార్ట్‌కట్స్‌ కంటే సబ్జెక్ట్‌ మీద అవగాహన ముఖ్యం. 
 • కిరణ్‌/ఇతర పుస్తకాల్లో చివరి రెండు లేదా మూడేండ్లలో జరిగిన అన్ని ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయాలి. దీంతో ప్రశ్నలపై ఒక అవగాహన వస్తుంది. బాగా చదివితే కచ్చితంగా మార్కులు వచ్చే విభాగం ఇది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అవసరం. 

రీజనింగ్‌ 

ఈ విభాగం నుంచి వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ ప్రశ్నలు వస్తాయి. నంబర్‌ సిరీస్‌, కోడింగ్‌, అనాలజీ, డయాగ్రమ్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. గతేడాది ప్రశ్నపత్రాల ఆధారంగా ఆ టాపిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలను ఆర్‌ఎస్‌ అగర్వాల్‌ రీజనింగ్‌ బుక్‌ నుంచి చదవాలి. ఇందులో తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్‌ చేయవచ్చు. 

ఇంగ్లిష్‌ 

ఇందులో మూడు భాగాలు ఉంటాయి. గ్రామర్‌ (ఫైండింగ్‌ ఎర్రర్స్‌), వొకాబులరీ (ఇడియమ్స్‌, వన్‌ వర్డ్స్‌, మొదలైనవి), ప్యాసేజ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. గ్రామర్‌కి raymond murphy book బాగుంటుంది. తర్వాత ప్రాక్టీస్‌కు కిరణ్‌ ఎస్‌ఎస్‌సీ ఇంగ్లిష్‌ బుక్‌ రెఫర్‌ చేయాలి. 

జనరల్‌ అవేర్‌నెస్‌ 

 • ఇందులో సైన్స్‌, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ నుంచి ప్రశ్నలు వస్తాయి. కరెంట్‌ అఫైర్స్‌ నుంచి కూడా రెండు నుంచి మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అరిహంత్‌ సిరీస్‌లో బుక్స్‌ చదవాలి. దీంతోపాటు ఎన్‌సీఈఆర్‌టీ (సీబీఎస్‌ఈ) స్కూల్‌ బుక్స్‌లో బిట్లు ప్రాక్టీస్‌ చేయాలి. ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లు చదవడం వల్ల ఇంగ్లిష్‌ విభాగంలో, కరెంట్‌ అఫైర్స్‌ రెండింటికీ ఉపయోగపడుతుంది. 
 • టైర్‌-1లో వచ్చిన మార్కుల ఆధారంగా కటాఫ్‌ తీసి కొందరిని టైర్‌-2కి ఎంపికచేస్తారు. టైర్‌-1లో ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులు కోత విధిస్తారు. అందువల్ల వచ్చిన ప్రశ్నలకే జవాబులు గుర్తించడం మంచిది. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులు చివరి సెలక్షన్‌లో కలుపుతారు. కాబట్టి ప్రతిమార్కు ముఖ్యమైనదే. 

టైర్‌-2 ప్లాన్‌

 • ఇది డిస్క్రిప్టివ్‌ పరీక్ష. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌పై నిర్వహించే ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. గంటలో పరీక్షను పూర్తి చేయాలి. 200 నుంచి 250 పదాల్లో ఎస్సే, 150-200 పదాల్లో లెటర్‌ రాయాలి.  
 • మెయిన్‌ నుంచి తర్వాతి రౌండ్‌కి వెళ్లాలంటే కనీసం 33 శాతం మార్కులు రావాలి. అంటే 100కి 33 మార్కులు స్కోర్‌ చేయాలి. దీనికోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్‌లో కొన్ని టాపిక్స్‌, రాజకీయాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌ వంటివాటిపై ఎస్సే రాయమని అడగవచ్చు.
 • ఒక ప్రాంతంలో సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాయడం, నీటి సమస్యపై స్పందించడం వంటి ప్రశ్నలు లెటర్‌ రైటింగ్‌లో అడుగుతారు. ఇందులో సిన్‌టెక్ట్స్‌ బాగా రాస్తే మార్కులు ఎక్కువగా వస్తాయి. 
 • టైర్‌-2ని హిందీ లేదా ఇంగ్లిష్‌లో రాయవచ్చు. 

స్కిల్‌టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌

ఇది స్కిల్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌. టైర్‌-1, 2 పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పరీక్షకు పిలుస్తారు. ఇది కేవలం క్వాలిఫయింగ్‌ పరీక్ష మాత్రమే.

డీఈఓలకు స్కిల్‌ టెస్ట్‌ 

 • డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్ట్‌కి కచ్చితంగా స్కిల్‌ టెస్ట్‌ రాయాలి. 15 నిమిషాల్లో 2000-2200 Keys టైప్‌ చేయాలి. దీనికి ఇంగ్లిష్‌లో ఒక ప్యాసేజ్‌ ఇస్తారు. 
 • కాగ్‌ డిపార్ట్‌మెంట్‌లోని డీఈఓ పోస్టు కోసం 15 నిమిషాల్లో 3700-4000 Keys టైప్‌ చేయాలి. 
 • ఎల్‌డీసీ/పోస్టల్‌ అసిస్టెంట్‌ లాంటి పోస్టులకు 1 నిమిషంలో 35 పదాలు టైప్‌ చేయాలి.
 • మూడు రౌండ్లు పూర్తయ్యాక డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ చేస్తారు. 
 • టైర్‌-1 మార్కులు + టైర్‌-2 మార్కులు కలిపి ఫైనల్‌ మెరిట్‌లిస్ట్‌ తీస్తారు. 

రిఫరెన్స్‌ బుక్స్‌

  అర్థమెటిక్‌: ఆర్‌ఎస్‌ అగర్వాల్‌, M.Tyra, అరిహంత్‌ సిరీస్‌, సీబీఎస్‌ఈ పుస్తకాలు (ప్యూర్‌ మ్యాథ్స్‌ కోసం)

  రీజనింగ్‌: ఆర్‌ఎస్‌ అగర్వాల్‌, MK Pandey

  ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఎస్‌పీ బక్షి, ఆర్‌ఎస్‌ అగర్వాల్‌, ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లు

  జనరల్‌ అవేర్‌నెస్‌: లూసెంట్‌ జీకే, అరిహంత్‌, మ్యాగజైన్లు ప్రీవియస్‌ పేపర్లు కిరణ్‌ పబ్లికేషన్స్‌లో నుంచి ప్రాక్టీస్‌ చేయాలి. 151 Essay by Gupta, న్యూస్‌ పేపర్ల నుంచి, ఇంటర్నెట్‌ నుంచి కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఎస్సేలను తీసుకోవాలి. డీమానిటైజేషన్‌, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన, బేటీ బచావో-బేటీ పడావో, కేంద్ర బడ్జెట్‌, జీఎస్‌టీ వంటి అంశాలను ఒకసారి చూసుకోవాలి. లెటర్లు అయితే ఆఫీసర్లకు, ప్రిన్సిపల్‌కి, పోలీస్‌, ఎడిటర్‌కి ఎలా రాస్తారు అని అడగవచ్చు. 

  నోట్‌: పైన చెప్పిన పుస్తకాలు గతంలో విజేతలు, నిపుణులు ఆయా సందర్భాల్లో చెప్పినవి. మీకు నచ్చిన ప్రామాణిక పుస్తకాలను చదవుకోవచ్చు. కేవలం అవగాహనకు మాత్రమే ఆయా పుస్తకాలను, పబ్లిషర్స్‌ పేర్లను పేర్కొన్నాం.