శనివారం 28 నవంబర్ 2020
Nipuna-education - Nov 15, 2020 , 10:34:32

కళల కోర్సులు ఉపాధి మార్గాలు

కళల కోర్సులు ఉపాధి మార్గాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, జానపద విజ్ఞానం తదితర రంగాల్లో వారి అవసరాలను తీర్చాలనే సమున్నత లక్ష్యంతో 1985లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ఈ విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, పత్రికారచన, లలిత కళలు వంటి అనేక రంగాల్లో విశేష కృషి చేస్తుంది. ముఖ్యంగా దేశంలో ఉన్న ఐదు భాషా విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కేంద్రం హైదరాబాద్‌తోపాటు  వరంగల్‌, ఏపీలోని శ్రీశైలం, రాజమండ్రి, కూచిపూడిలో ఈ విశ్వవిద్యాలయానికి ప్రాంతీయ ప్రాంగణాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంగణంలో భాష, లలితకళలు, పత్రికా రచన, జ్యోతిష్యం, తులనాత్మక అధ్యయనం, అనువాదం వంటి అధ్యయనాంశాల్లో వివిధ స్థాయిల్లో కోర్సులు ఉన్నాయి. ఇటీవల తెలుగు యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో వాటి గురించి నిపుణ పాఠకుల కోసం..

  • బోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ సేవలే లక్ష్యంగా విశ్వవిద్యాలయం మొత్తం ఆరు పీఠాలు, ఒక కళాశాల, పదహారు శాఖలు, ఐదు కేంద్రాలతో తన కార్యకలపాలు కొనసాగిస్తుంది.  ఇవేకాక ప్రభుత్వానికి చెందిన పన్నెండు సంగీత, నృత్య కళాశాలల విద్యాత్మక పర్యవేక్షణ కూడా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. పరిశోధన, పీజీ, పీజీ డిప్లొమా అండ్‌ సర్టిఫికెట్‌ స్థాయల్లో 59 కోర్సులను రెగ్యులర్‌ విధానంలో విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అందిస్తున్న సంప్రదాయ, విలక్షణమైన కోర్సులను ప్రపంచవ్యాప్తంగా తెలుగువారందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దూరవిద్యాకేంద్రాన్ని కూడా నెలకొల్పారు. దేశంలోనే ప్రప్రథమంగా పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను దూరవిద్యాకేంద్రం నిర్వహిస్తుంది. 
   2020-21 విద్యాసంవత్సరానికి విశ్వవిద్యాలయం నిర్వహించే బీఎఫ్‌ఏ శిల్పం/చిత్రలేఖనం/ప్రింట్‌ మేకింగ్‌, ఎంఏ అనువర్తిత భాషాశాస్త్రం, ఎంఏ కమ్యూనికేషన్‌ & జర్నలిజం, ఎంఏ జ్యోతిషం, ఎంఏ కర్ణాటక సంగీతం (గాత్రం/మృదంగం/ వీణ/ వయోలిన్‌), ఎంపీఏ కూచిపూడి నృత్యం/ ఆంధ్రనాట్యం, ఎంపీఏ రంగస్థల కళలు, ఎంపీఏ జానపదకళలు, ఎంఏ తెలుగు (హైదరాబాద్‌, రాజమండ్రి) ఎంఏ చరిత్ర, పురావస్తు శాస్త్రం (శ్రీశైలం) ఎంపీఏ కూచిపూడి నృత్యం (కూచిపూడి) వివిధ పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తివివరాలు www.teluguuniversity& www.pstucet.org వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. (అన్ని కూడా రెండేండ్ల కాల వ్యవధి. 4 సెమిస్టర్లు. బీఎఫ్‌ఏకు మాత్రం నాలుగేండ్ల కాలవ్యవధి 8 సెమిస్టర్లు ఉంటాయి. ఆయా కోర్సులను బట్టి అర్హతలు ఉండాలి. వీటితో పాటు మరికొన్ని రెగ్యులర్‌ కోర్సులను సాయంకాలం అందిస్తుంది.)
   ప్రవేశ విధానం
   • రెగ్యులర్‌ కోర్సులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. అయితే నిర్ణీత సీట్ల సంఖ్య కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన కోర్సులకు ప్రవేశ పరీక్ష లేకుండానే మార్కుల ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారు. సాయంత్రం అందించే కోర్సులన్నింటికీ మౌఖిక పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
   • ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. అన్ని కోర్సుల్లో ప్రవేశానికి కనీసం 36 శాతం (ఎస్సీ, ఎస్టీ, వికాలాంగ అభ్యర్థులకు 15 శాతం) మార్కులు పొందినవారు అర్హులు. ప్రదర్శన కళల కోర్సుల్లో సిద్ధాంతం, ప్రాయోగికం పరీక్షల్లో విడివిడిగా కనీస నిర్ణీత అర్హత మార్కులు 18+18 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 7.5+7.5) పొందినవారు ప్రవేశానికి అర్హులు.
   • ముఖ్యమైన తేదీలు
   • దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
   • చివరితేదీ: నవంబర్‌ 19
   • రూ.100 ఫైన్‌తో చివరితేదీ: నవంబర్‌ 26
   • పరీక్ష కేంద్రాలు
   • హైదరాబాద్‌, వరంగల్‌ (తెలంగాణ) 
   • రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడి (ఏపీ)
   దూరవిద్య కోర్సులు
   • 2020-21 విద్యాసంవత్సరానికి గాను దూరవిద్యా కేంద్రం ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
   • కోర్సుల వివరాలు
   • పీజీ డిప్లొమా కోర్సులు
   • పీజీ డిప్లొమా టెలివిజన్‌ జర్నలిజం
   • అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత
   • కోర్సు కాలవ్యవధి- ఏడాది
   • పీజీ డిప్లొమాజ్యోతిర్వాస్తు
   • అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత
   • కోర్సు కాలవ్యవధి- ఏడాది
   • డిప్లొమా కోర్సులు
   • డిప్లొమా ఇన్‌ లైట్‌ మ్యూజిక్‌
   • అర్హత: తెలుగు రాయడం, చదవడంతో పాటు మ్యూజిక్‌ ఆప్టిట్యూడ్‌ ఉండాలి.
   • కోర్సు కాల వ్యవధి- రెండేండ్లు
   • డిప్లొమా ఇన్‌ ఫిల్మ్‌ రైటింగ్‌
   • అర్హత: పదో తరగతి లేదా తత్సమాన అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత
   • కోర్సు కాల వ్యవధి- ఏడాది
   • డిప్లొమా ఇన్‌ జ్యోతిషం
   • అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత
   • కోర్సు కాల వ్యవధి- ఏడాది
   • సర్టిఫికెట్‌ కోర్సులు
   • సర్టిఫికెట్‌ కోర్సు ఇన్‌ జ్యోతిషం
   • అర్హత: పదో తరగతి లేదా తత్సమాన అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత
   • కోర్సు కాలవ్యవధి- ఏడాది
   • సంగీత విశారద
   • అడ్మిషన్‌ పొందేనాటికి 12 ఏండ్లు నిండి ఉండాలి.
   • కోర్సు కాలవ్యవధి- ఆరేండ్లు
   • సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ మోడ్రన్‌ తెలుగు
   • అర్హత: పదో తరగతి లేదా తత్సమాన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత
   • కోర్సు కాలవ్యవధి- ఏడాది
   • దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
   • చివరితేదీ: నవంబర్‌ 30
   • ఆలస్య రుసుముతో- డిసెంబర్‌ 31
   • రిజిస్ట్రేషన్‌ ఫీజు- రూ.300
 • కోర్సులు పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి?
  పీజీ డిప్లొమా కోర్సులు, డిప్లొమా కోర్సులు అంటే ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, మోడల్‌ స్కూల్స్‌, గురుకులాలు, ప్రైవేటు స్కూల్స్‌ అండ్‌ కాలేజీలు, టీటీసీ, బీఈడీ కాలేజీలు,  వీటిల్లో ఫైన్స్‌ ఆర్ట్స్‌, ఫోక్‌ ఆర్ట్స్‌ అంటే మ్యూజిక్‌, డాన్స్‌కు సంబంధించి తప్పకుండా ఏదో ఒక టీచర్‌గా ఉపాధి లభిస్తుంది. చాలామంది సొంతంగా ఇన్‌స్టిట్యూట్‌ పెట్టుకొని ఉపాధి పొందుతున్నారు. ఇవేకాకుండా సినిమా, టీవీ రంగాల్లో రాణిస్తున్నారు. 
  వాస్తు, జ్యోతిష్యంలో రాణించవచ్చా?
  జ్యోతిష్యంలో డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశంలో ఏ యూనివర్సిటీ కూడా జ్యోతిష్యం కోర్సు అందించడం లేదు. ఒక్క హైదరాబాద్‌ తెలుగు విశ్వవిద్యాలయం మాత్రమే అందిస్తుంది. ఈ కోర్సుకు డిమాండ్‌ బాగా ఉంది. వ్యక్తిగత, నివాసగృహాలతో పాటు కార్పొరేట్‌ కార్యాలయాలు కూడా వాస్తుప్రకారం నిర్మిస్తున్నారు. రియల్‌ఎస్టేట్‌ సంస్థలు వాస్తు ప్లానర్లను నియమించుకుంటున్నాయి. ప్రజలు తమ ఇంటి దోషాలను సరిచేసుకునేందుకు నిపుణులను సంప్రదిస్తున్నారు. పత్రికలు, టీవీ చానళ్ల వంటి ప్రసార మాధ్యమాలు వాస్తును విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో ప్రజలకు దీనిపై అవగాహన పెరుగుతుంది. అందుకే పెట్టుబడి లేకుండానే మంచి రాబడి పొందవచ్చు. 
  సర్టిఫికెట్‌ కోర్సుల ప్రయోజనాలు ఏమిటి?
  చాలా ప్రయోజనం ఉన్నది. ట్రైనింగ్‌ అయిన వారు కూడా సర్టిఫికెట్‌ కోర్సుల్లో చాలామంది చేరుతున్నారు. భవిష్యత్తులో సర్టిఫికెట్‌ ఉంటే ఎంప్లాయ్‌మెంట్‌కు చాలా ఉపయోగపడుతుంది.
  బీఎఫ్‌ఏ కోర్సు ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి?
  ఈ కోర్సు చదువుకుంటూనే సంపాదించుకోవచ్చు. విద్యార్థి నైపుణ్యాన్ని బట్టి సంపాదన ఉంటుంది. మ్యూజియం, పబ్లికేషన్స్‌, అడ్వర్‌టైజింగ్‌, మీడియా సంస్థలు, డ్రామా థియేటర్స్‌, ఆర్ట్‌ స్టూడియోస్‌, ప్రొడక్షన్‌ హౌస్‌లలో పలు హోదాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. సంగీతం, నృత్యం విభాగాలవారు టెలివిజన్‌, సినిమా రంగాల్లో స్థిరపడవచ్చు. ప్రభుత్వ పరంగా ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌, దూరదర్శన్‌, ఆకాశవాణి, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ వంటి రంగాల్లో అవకాశాలుంటాయి. ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో మ్యూజిక్‌, డాన్స్‌ టీచర్లుగా సేవలందించవచ్చు. బీఎఫ్‌ఏలో నిష్ణాతులైన ఫ్యాకల్టీ క్లాసులు చెప్తున్నారు. వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నాం. 
  జానపద కళలకు సంబంధించి కోర్సుల వివరాలు..
  • ఫోక్‌ ఆర్ట్స్‌లో స్పెషలైజేషన్‌ అంటే.. నాదస్వరం, బుర్రకథ, చిందు ఇలా అంతరించిపోతున్న కళారూపాలకు పునర్‌వైభవం తెచ్చేందుకు కృషిచేస్తున్నాం. వీటిని బోధించేందుకు రెగ్యులర్‌, సాయంత్రం క్లాసులు నిర్వహిస్తున్నాం. థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సులను అతి తక్కువ ఫీజులతో అందిస్తున్నాం.
  • సాహితి, సాంస్కృతిక అంశాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది తెలుగు విశ్వవిద్యాలయం. సాహిత్యం, సంగీతం, నృత్యం, రంగస్థలం, జానపదం మొదలైన లలితకళలకు సంబంధించి వివిధ కోర్సులను వర్సిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక్కడ ప్రత్యేకంగా నిర్మించిన చిత్రవాణి స్టూడియోను ఉపయోగించుకుని చాలామంది లఘుచిత్రాలు రూపొందించారు. వీటిల్లో చాలావాటికి విశేష ప్రజాదరణ దక్కింది.
  • విద్యాత్మక ప్రణాళిక 2020-21
  • ఆలస్యపు రుసుం లేకుండా ప్రవేశ దరఖాస్తు- నవంబర్‌ 30
  • ఆలస్య రుసుం రూ.200తో- డిసెంబర్‌ 31
  • కాంటాక్టు తరగతులు: ప్రవేశం పొందిన విద్యార్థులకు మే/జూన్‌ నెలలో ఎస్‌ఎంఎస్‌ ద్వారా, విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ ద్వారా సమచారం ఇస్తాం.
  • వార్షిక పరీక్షలు- సెప్టెంబర్‌/ అక్టోబర్‌ 2021