బుధవారం 25 నవంబర్ 2020
Nipuna-education - Oct 25, 2020 , 17:10:36

లిటిల్‌ సోల్జర్స్‌ సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌-2021

లిటిల్‌ సోల్జర్స్‌ సైనిక్‌ స్కూల్‌  ఎంట్రన్స్‌-2021

దేశ రక్షణలోని త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను స్కూల్‌ లెవల్‌ నుంచే తయారుచేయాలనే లక్ష్యంతో కేంద్రం సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణను సైనిక్‌ స్కూల్స్‌ సొసైటీ (ఎస్‌ఎస్‌ఎస్‌) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్‌ స్కూళ్లలో ఆరు, తొమ్మిదో తరగతి ప్రవేశాల ప్రవేశపరీక్ష ప్రకటన విడుదలైంది. ఈ వివరాలు నిపుణ పాఠకుల కోసం...

ప్రవేశాలు కల్పించే తరగతులు

ఆరు, తొమ్మిదో తరగతిలలో ప్రవేశాలు కల్పిస్తారు.

స్కూల్‌ ప్రత్యేకతలు

సైనిక్‌ స్కూల్‌లో ప్రవేశాలు పొందినవారికి సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను, వసతిని ఉచితంగా అందిస్తారు. 

పూర్తిస్థాయిలో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంతోపాటు, దేశభక్తిని పెంపొందించే విధంగా ఇక్కడి బోధన ఉంటుంది. 

త్రివిధ దళాల్లోకి  ప్రవేశించడానికి  అవసరమైన నైపుణ్యాలను పాఠశాల దశ  నుంచే  నేర్పిస్తారు. 

ఎంపిక: జాతీయస్థాయిలో నిర్వహించే ఆల్‌ ఇండియా సైనిక్‌ సూల్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ) ద్వారా.

సైనిక్‌ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం పరీక్షను నిర్వహించే బాధ్యతను కేంద్రం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి అప్పగించింది. ఎన్‌టీఏ రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌లిస్ట్‌ను తయారుచేస్తుంది. 

పరీక్ష విధానం

ఎంట్రన్స్‌ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.

ఆరోతరగతి 

ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఇస్తారు.

మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష కాలవ్యవధి 150 నిమిషాలు. 

మ్యాథ్స్‌-50X3=150 మార్కులు, 

ఇంటెలిజెన్సీ-25X2=50 మార్కులు, లాంగ్వేజ్‌-25X2=50 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌-25X2=50 మార్కులు.

పరీక్ష ఇంగ్లిష్‌, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఎవరు ఏ భాషలో రాయాలనుకుంటే ఆ భాషలో పరీక్ష రాయవచ్చు. 

తొమ్మిదో తరగతి

దీనిలో ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఇస్తారు.

మొత్తం 400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షలో మ్యాథ్స్‌-200, ఇంటెలిజెన్స్‌-50, ఇంగ్లిష్‌-50, జనరల్‌ సైన్స్‌-50, సోషల్‌ సైన్స్‌-50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. 

నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు.

పరీక్ష కేవలం ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే నిర్వహిస్తారు.

నోట్‌: తెలంగాణ రాష్ర్టానికి చెందిన విద్యార్థులను ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్స్‌కు హోమ్‌ స్టేట్‌ కింద పరిగణనలోకి తీసుకుంటారు. 

సీట్ల కేటాయింపు

ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్‌ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ర్టాలవారికి 33% సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన  

విద్యార్థులకు 27% రిజర్వేషన్‌ ఉంటుంది. మిగిలిన 50.50% సీట్లలో 25% మాజీ డిఫెన్స్‌ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25% ఇతర రాష్ర్టాలు/  కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయించవచ్చు. ఈ కోటాలో ఒకే రాష్ర్టానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీలు లేదు.

నోట్‌: సాధారణంగా ప్రశ్నలు కనీస అర్హత తరగతి స్థాయిలో ఉంటాయి. నోటిఫికేషన్‌లో ఇచ్చిన సిలబస్‌ ప్రకారం ఆ తరగతుల్లోని అంశాలను చదివితే సరిపోతుంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది.

ఎవరు అర్హులు?

ఆరో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయస్సు మార్చి 31, 2021 నాటికి 10-12 ఏండ్ల మధ్యలో ఉండాలి. అంటే  ఏప్రిల్‌ 1, 2009 నుంచి మార్చి 31, 2011 మధ్యలో జన్మించినవారు అర్హులు. వయస్సు ధ్రువీకరణపత్రాన్ని సమర్పించాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.  

తొమ్మిదో తరగతిలోకి ప్రవేశాల కోసం మార్చి 31, 2021 నాటికి 13-15 ఏండ్ల మధ్యలో ఉండాలి. అంటే 2006, ఏప్రిల్‌ 1 నుంచి 2008 మార్చి 31 మధ్యలో జన్మించిన వారికే అర్హత లభిస్తుంది.  ఎనిమిదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దారుఢ్యపరీక్ష, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.