బుధవారం 25 నవంబర్ 2020
Nipuna-education - Oct 25, 2020 , 16:54:59

మిసైల్‌ మిషన్‌

మిసైల్‌ మిషన్‌

క్షిపణి ప్రయోగాల్లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో దూకుడుగా వ్యవరిస్తుంది. వరుస పరీక్షలతో దూసుకెళ్తుంది. చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌ అమ్ములపొది శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాలు చేస్తుంది. 35 రోజుల్లోనే 10 క్షిపణి ప్రయోగాలు చేసి తన సత్తాను చాటుతుంది. స్వదేశీ పరిజానంతో రూపొందించిన సంప్రదాయ క్షిపణులతో పాటు అణు క్షిపణుల తయారీకి కృషిచేస్తుంది. నాలుగు రోజులకొకటి చొప్పున పరీక్షిస్తూ తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి పోటీ పరీక్షల్లో క్షిపణి ప్రయోగాలపై పలు ప్రశ్నలు వస్తుంటాయి. దీనికి సంబంధించిన పలు అంశాలు నిపుణ పాఠకుల కోసం...

అభ్యాస్‌ విమానపరీక్ష

అభ్యాస్‌-హై స్పీడ్‌ ఎక్స్‌పెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌ (హీట్‌) ఒడిశాలోని బాలాసోర్‌ మధ్యంతర పరీక్ష క్షిపణి క్షేత్రం నుంచి సెప్టెంబర్‌ 22న డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి వాహకనౌక పరీక్షలను ప్రయోగించింది. అభ్యాస్‌ పేరుతో రూపొందించిన క్షిపణులను ప్రయోగించడానికి అవసరమయ్యే గగనతల వాహనాలను డీఆర్‌డీవో డెవలప్‌ చేసింది.
విశేషాలు
భూ ఉపరితలం నుంచి ఐదు కి.మీ. ఎత్తు వరకు వెళ్లగలిగే శక్తి సామర్థ్యం
0.5 మ్యాక్‌ శబ్దంలో సగం వేగంతో ప్రయాణం
ల్యాప్‌టాప్‌ ఆధారిత భూ నియంత్రణ కేంద్రం ద్వారా ప్రయోగం
సుమారు 30నిమిషాల పాటు అదే వేగంతో ప్రయాణం
మైక్రో- ఎలక్ట్రోమెకానికల్‌ సిస్టంతో (ఎంఈఎంస్‌), నావిగేట్‌ ఫ్లైట్‌ కంట్రోల్‌ కంప్యూటర్‌ వ్యవస్థతో అనుసంధానం
హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌ వెహికిల్‌ (హెచ్‌ఎస్‌టీడీవీ)
సెప్టెంబర్‌ 7న ఒడిశా తీరం అబ్దుల్‌ కలాం లాంచ్‌ కాంప్లెక్స్‌లో ప్రయోగం
ఈ ప్రయోగంతో హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులు అభివృద్ధిచేసే అమెరికా, చైనా సరసన భారత్‌

లేజర్‌ గైడెడ్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌  క్షిపణి (ఏటీజీఎం)

లేజర్‌ గైడెడ్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌  క్షిపణి (ఏటీజీఎం) ని 2020, సెప్టెంబర్‌ 22న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఆర్మర్డ్‌ కార్ప్స్‌ సెంటర్‌ స్కూల్‌ (ఏసీసీ, ఎస్‌) రేంజ్‌ నుంచి ఎంబీటీ అర్జున్‌ ట్యాంక్‌ ద్వారా విజయవంతంగా పరీక్షించారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఏటీజీఎం విజయవంతంగా ఛేదించింది. లేజర్‌ గైడెడ్‌ ఏటీజీఎం ఏటీజీఎంలు లేజర్‌ సూచించిన దిశగా కచ్చితమైన గురి నిర్ధారించుకుని లక్ష్యాలను లాక్‌చేసి ట్రాక్‌ చేస్తాయి. ఎక్స్‌ప్లోజివ్‌ రియాక్టివ్‌ ఆర్మర్‌ (ERA) రక్షిత సాయుధ వాహనాలను ధ్వంసం చేయడానికి క్షిపణి ఒక హీట్‌ వార్‌హెడ్‌ను ఉపయోగిస్తుంది. దీనిని బహుళ ప్లాట్‌ఫాం ప్రయోగ సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. పుణెలోని హై ఎనర్జి మెటీరియల్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (HEMRL), ఇన్‌స్ట్రుమెంట్స్‌ రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (IRDE) డెహ్రాడూన్‌ ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి.

పృథ్వీ-2

సెప్టెంబర్‌ 23, 2020న డీఆర్‌డీవో పృథ్వీ-2 పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అణ్వస్త్ర క్షిపణిని రాత్రివేళ ప్రయోగించారు. ఒడిశాలోని చాందీపూర్‌ వేదికగా ప్రయోగం నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యాలు ఛేదించడంలో ఈ క్షిపణి విజయవంతమైంది. ద్రవ ఇంధనంతో నడిచే పృథ్వీ భారత్‌లోనే మొట్టమొదటి అణుసామర్థ్యమున్న క్షిపణి. 500 నుంచి 1000 కిలోల పేలోడ్‌ మోసుకెళ్లే సత్తా పృథ్వీ-2కు ఉన్నది.
రాత్రివేళలో కూడా 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఉపరితలంపై నుంచి ఉపరితలంపై ప్రయోగించే తొలి దేశీయ క్షిపణి.

యాంటీ రేడియేషన్‌ క్షిపణి రుద్రం

ఈ క్షిపణిని అక్టోబర్‌ 9, 2020న ఒడిశా తీరంలోని వీలర్‌ ద్వీపంలో విజయవంతంగా పరీక్షించారు. సుఖోయ్‌-30 యుద్ధ విమానం నుంచి ఈ మిసైల్‌ను ప్రయోగించారు. దేశంలోని మొట్టమొదటి స్వదేశీ రేడియేషన్‌ వ్యతిరేక క్షిపణి అయిన రుద్రంను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. రేడియో తరంగాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రాడార్లాను ఈ మిసైల్‌ గుర్తించగలదు.
ప్రత్యేకతలు
ఎత్తును బట్టి 100-250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల ఛేదిస్తుంది. గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 
భవిష్యత్తులో మిరేజ్‌-2000, జాగ్వార్‌, తేజస్‌ మార్క్‌-2 యుద్ధ విమానాలతో అనుసంధానం
0.6 మ్యాక్‌ నుంచి 2 మ్యాక్‌ వేగం
ధ్వని కంటే రెండు రెట్లు ఎక్కువ వేగం
ఈ మిసైల్‌ 500 మీటర్ల నుంచి 1500 మీటర్ల నుంచి ప్రయోగించవచ్చు.
2017లో ఈ తరహా క్షిపణిని అమెరికా నావికా రంగంలో ప్రవేశపెట్టింది.

సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ మిసైల్‌ బ్రహ్మోస్‌ 

400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల ఈ మిసైల్‌ను సెప్టెంబర్‌ 30న విజయవంతంగా పరీక్షించారు.
డీఆర్‌డీవో పీజే-10 ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా చాందీపూర్‌ బేస్‌ వద్ద ప్రయోగించారు.
బ్రహ్మోస్‌ పరిధి విస్తరించిన తర్వాత రెండోసారి పరీక్ష నిర్వహించారు.
2017 మార్చిలో మొదటిసారి పరీక్ష 
క్షిపణిలో ఉపయోగించిన బూస్టర్‌, ఎయిర్‌ఫ్రేమ్‌ దేశీయంగా తయారు చేశారు.
భారత్‌ (డీఆర్‌డీవో) రష్యా (ఫెడరల్‌ స్టేట్‌ యూనిటరీ ఎంటర్‌ప్రైజ్‌ ఎన్పీవో మషినోస్ట్రోనియా)
భూమి, సబ్‌మెరైన్స్‌, యుద్ధనౌకలు, ఫైటర్‌ జెట్‌ విమానాల నుంచి ప్రయోగించే సౌకర్యం
ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగం
గంటకు 3,457 కిలోమీటర్ల వేగం
75 డిగ్రీల వరకు వంపు తిరిగి దూసుకెళ్లే సామర్థ్యం
వేగం 2.8 మ్యాక్‌
ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి

లేజర్‌ గైడెడ్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌

లేజర్‌ గైడెడ్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణి (ఏటీజీఎం)ని సెప్టెంబర్‌ 22న అహ్మద్‌నగర్‌లోని అర్జున్‌ ట్యాంక్‌ రేంజ్‌ నుంచి ఈ క్షిపణి పరీక్ష నిర్వహించారు.
దేశీయంగా తయారైన ట్యాంక్‌ విధ్వంసక మిసైల్‌
మిసైల్‌ రేంజ్‌ 5 కి.మీ.
సెప్టెంబర్‌ 22 ఒకసారి ప్రయోగం
22న విజయవంతమైన ట్రయల్‌.
పూర్తిస్థాయిలో అక్టోబర్‌ 1న ప్రయోగించారు.

సూపర్‌సోనిక్‌ శౌర్య స్ట్రాటజిక్‌ మిసైల్‌

అణ్వస్ర్తాలను మోసుకుపోగల సామర్థ్యం ఉన్న శౌర్య మిసైల్‌ను సక్సెస్‌ఫుల్‌గా డీఆర్‌డీవో ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్‌ నుంచి ఈ క్షిపణి టెస్ట్‌ నిర్వహించారు.
800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా
శౌర్య క్షిపణికి మరింత ఆధునీకరణ జోడింపు
అక్టోబర్‌ 3న కొత్త వెర్షన్‌ ప్రయోగం
అత్యంత తేలికైన క్షిపణి
స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన
ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో ప్రయోగం

సూపర్‌సోనిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టార్పెడో (స్మార్ట్‌) వ్యవస్థ

అక్టోబర్‌ 5, 2020 న దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ మిసైల్‌ ప్రయోగాన్ని ఒడిశాలోని భద్రక్‌ జిల్లాలో ఉన్న ఏపీజే అబ్దుల్‌ కలాం ఐలాండ్‌లో నిర్వహించారు. సముద్ర జలాల్లో సంచరించే శత్రు జలాంతర్గాములను పసిగట్టేందుకు ఈ అస్త్రం ఉపయోగపడుతుంది. దీనిని డీఆర్‌డీవో రూపొందించింది. ఇందులో తేలికపాటి టార్పిడో వ్యవస్థను ఒక సూపర్‌సోనిక్‌ క్షిపణికి జోడించడంతో... సాధారణ టార్పిడోలు చేరలేని దూరానికి ఇది చేరుకోగలుగుతుంది.
సూపర్‌సోనిక్‌ క్షిపణులు, టార్పెడోల వ్యవస్థల అనుసంధానం
యుద్ధనౌకలు, తీరంలోని ట్రక్కుల నుంచి ప్రయోగించే వెసులుబాటు
మామూలు టార్పెడో గరిష్ట దూరం 50 నుంచి 150 కి.మీ మాత్రమే
స్మార్ట్‌ విధానంలో 600 కి.మీ పైగా దూసుకెళ్లే సామర్థ్యం
అమెరికా ఉపయోగించే ఆస్‌రాక్‌ టార్పెడో దూరం 25 కి.మీ మాత్రమే

రుస్తుం-2

డీఆర్‌డీవో దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత డ్రోన్‌ యుద్ధవిమానం రుస్తుం-2 ప్రయోగం విజయవంతమైంది. దేశంలోని ఏకైక మానవ రహిత యుద్ధవిమానాల పరీక్ష కేంద్రం కర్ణాటక చిత్రదుర్గం జిల్లాలోని ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఏటీఆర్‌)లో అక్టోబర్‌ 11 ఉదయం 6.30గంటలకు టేకాఫ్‌ తీసుకుంది. నిరంతరాయంగా 8 గంటలపాటు ఆకాశంలో 16వేల అడుగుల ఎత్తులో సుమారు 40వేల కిలోమీటర్ల పరిధిలో వాయుయానం చేసి మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్ణీత ప్రదేశంలో దిగింది. మరో గంట పాటు వాయుయానానికి సరిపడే ఇంధనం మిగిలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఇజ్రాయెల్‌ హీరాన్‌ డ్రోన్‌లకు రుస్తుం ప్రత్యామ్నాయం అయినందున దేశానికి ఎంతో ధనం ఆదా అవుతుంది.