సోమవారం 30 నవంబర్ 2020
Nipuna-education - Oct 25, 2020 , 13:33:21

కరంట్‌ అఫైర్స్‌

కరంట్‌ అఫైర్స్‌

జాతీయం

ఏకసభ్య కమిటీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌తో ఏకసభ్య కమిటీని అక్టోబర్‌ 16న ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రాంతంలో వాయు కాలుష్యానికి కారణమైన పంట వ్యర్థాల దహనాన్ని నివారించేందుకు పంజాబ్‌, హర్యానా, యూపీ తీసుకుంటున్న చర్యలను ఈ కమిటీ పరిశీలించనున్నది.  

మిషన్‌ శక్తి

మహిళల భద్రత కోసం ‘మిషన్‌ శక్తి’ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అక్టోబర్‌ 18న ప్రారంభించారు. మహిళల భద్రతతోపాటు వారి సాధికారిత కోసం చర్యలు తీసుకుంటారు. ఉపాధ్యాయులు, వలంటీర్లు, స్వయం సహాయక బృందాలు ఈ కార్యక్రమంలో పనిచేస్తాయి.

పుస్తకావిష్కరణ

15వ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ రాసిన ‘పోట్రేయిట్స్‌ ఆఫ్‌ పవర్‌' పుస్తకాన్ని అక్టోబర్‌ 19న ఆవిష్కరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఆవిష్కరించిన ఈ పుస్తకంలో అధికార బాధ్యతల్లో ఎన్‌కే సింగ్‌ తన అనుభవాలకు సంబంధించిన విషయాలను రాశారు.

సేఫ్‌ సిటీ

లక్నోలో మహిళల భద్రత ప్రచారం కోసం సేఫ్‌ సిటీ ప్రాజెక్టును అక్టోబర్‌ 20న ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు 180 రోజులపాటు జరిగే ప్రచారం కింద పోలీసులు, ఇతర విభాగాల్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను బలోపేతం చేయడానికి కృషిచేస్తాయి. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో ఎంపికయ్యాయి.

బ్రహ్మోస్‌ విజయవంతం

భారత్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ నౌకాదళ వెర్షన్‌ను అక్టోబర్‌ 18న విజయవంతంగా పరీక్షించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్టెల్త్‌ యుద్ధనౌక నుంచి అరేబియా సముద్రంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 

లాజిస్టిక్స్‌ పార్క్‌

నితిన్‌ గడ్కరీ భారత్‌ తరఫున మొట్టమొదటి మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ను అసోంలో అక్టోబర్‌ 20న శంకుస్థాపన చేశారు. రూ.4694 కోట్ల బడ్జెట్‌ అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. రహదారి, రైలు ద్వారా ప్రత్యక్ష కనెక్టివిటీకి అందిస్తుంది.

నాగ్‌ పరీక్ష

నాగ్‌ యాంటీ ట్యాంక్‌ మిసైల్‌ తుది ట్రయల్స్‌ను అక్టోబర్‌ 22న విజయవంతంగా పరీక్షించారు. డీఆర్‌డీవో పోఖ్రాన్‌లో ఫైరింగ్‌ రేంజ్‌ ఈ పరీక్షలు నిర్వహించారు.

కశ్మీర్‌లో పంచాయతీరాజ్‌ చట్టం

జమ్ముకశ్మీర్‌లో పంచాయతీరాజ్‌ చట్టం- 1989 అమలు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ అక్టోబర్‌ 21న ఆమోదించింది. దీంతో మూడంచెల పంచాయతీరాజ్‌ విధానం కశ్మీర్‌లోనూ అమలు కానుంది. 

మేరి సహేలి

మహిళల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ‘మేరి సహేలి’ కార్యక్రమాన్ని అక్టోబర్‌ 21న ప్రారంభించారు. మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌పీఎఫ్‌ మహిళ కానిస్టేబుళ్ల బృందం లేడీస్‌ కోచ్‌లతో సహా అన్ని కోచ్‌లలో మహిళలకు భద్రతనిస్తారు.

అంతర్జాతీయం

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌

ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌)ను 107 దేశాలతో అక్టోబర్‌ 17న విడుదల చేశారు. చైనా, బెలారస్‌, ఉక్రెయిన్‌, టర్కీ, క్యూబా, కువైట్‌ వంటి 17 దేశాలు అయిదులోపు ర్యాంకుల్ని పంచుకొని టాప్‌ ర్యాంకింగ్‌లు సాధించాయి. ఆఫ్ఘనిస్థాన్‌ 99, భారత్‌ 94, పాకిస్థాన్‌ 88, బంగ్లాదేశ్‌ 75, నేపాల్‌ 73, శ్రీలంక 64వ ర్యాంకుల్లో నిలిచాయి.

అతిపెద్ద కాఫీ పెయింటింగ్‌

సౌదీ అరేబియాకు చెందిన ఓహుద్‌ అబ్దుల్లా ఆల్మాల్కి అనే మహిళా ఆర్టిస్ట్‌ 4.5 కిలోల పనికిరాని కాఫీ పొడితో సౌదీ అరేబియా స్థాపకులైన కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌, షేక్‌ జైద్‌ల చిత్రాలను అక్టోబర్‌ 18న గీశారు. జెడ్డాలో ఏడు వస్ర్తాల కాన్వాస్‌పై 220 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ పెయింటింగ్‌ను వేశారు. ‘నసీజ్‌-1’గా పిలుస్తున్న ఈ పెయింటింగ్‌ గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కడంతో పాటు అతిపెద్ద కాఫీ పెయింగ్‌గా నిలిచింది.

పీఎం 2.5 

అమెరికాకు చెందిన హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ రూపొందించిన ‘స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ (ఎన్‌ఓజీఏ) నివేదిక 2020’ను అక్టోబర్‌ 21న విడుదల చేశారు. గాలిలో కాలుష్యకారకమైన అతి సూక్ష్మమైన ధూళి కణాలు పీఎం (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌) 2.5 అంశంలో భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. గాలిలో పీఎం 2.5 75 నుంచి 85 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు లెక్క. భారత్‌ 83.2, నేపాల్‌ 83.1, రిపబ్లిక్‌ ఆఫ్‌ నైగర్‌ 80.1, ఖతార్‌ 76.0, నైజీరియా 70.4 స్థాయిలో ఉన్నాయి.

ఒసిరిస్‌ రెక్స్‌

నాలుగేండ్ల ప్రయాణం తర్వాత నాసా ప్రయోగించిన రోబోటిక్‌ అంతరిక్ష నౌక ‘ఒసిరిస్‌ రెక్స్‌' అక్టోబర్‌ 21న ‘బెన్నూ’ అనే గ్రహశకలంపై వాలింది. అమెరికా కొలరాడోలోని డెన్వర్‌ ప్రాంతంలో ఉన్న లాక్‌హీడ్‌ మార్టిన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఒసిరిస్‌ రెక్స్‌ను ప్రయోగించారు. భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలో బెన్నూ గ్రహశకలం ఉంది. 11 అడుగుల పొడవైన రోబోటిక్‌ చేతితో బెన్నూ ఉత్తర ధ్రువ ప్రాంతంలోని రాళ్లను సేకరించింది.

 స్లినెక్స్‌-20 

భారత్‌, శ్రీలంక స్లినెక్స్‌-20 పేరుతో యుద్ధ విన్యాసాలను శ్రీలంకలోని త్రికోణమాలిలో అక్టోబర్‌ 19 నుంచి 21 వరకు నిర్వహించారు. దీనిలో భారత్‌కు చెందిన ఏఎస్‌డబ్ల్యూ కార్వెట్స్‌, కమార్టో, కిల్తాన్‌, శ్రీలంకకు చెందిన సయిరా, బహుగజ యుద్ధనౌకలు పాల్గొన్నాయి.

క్రీడలు

హాఫ్‌ మారథాన్‌లో పెరెస్‌ రికార్డు

ప్రపంచ అథ్లెటిక్స్‌ హాఫ్‌ మారథాన్‌ చాంపియన్‌షిప్‌ను అక్టోబర్‌ 17న పోలెండ్‌లోని గిడినియా నగరంలో నిర్వహించారు. ఈ రేసులో మహిళల విభాగంలో 27 ఏండ్ల పెరెస్‌ జెప్‌చిర్చిర్‌ (కెన్యా) 21.0975 కి.మీ దూరాన్ని గంటా 5 నిమిషాల 16 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో 2020, సెప్టెంబర్‌ 5న ప్రేగ్‌లో గంటా 5 నిమిషాల 34 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును పెరెస్‌ తిరగరాసింది. కెజెటా (జర్మనీ), యాలెమ్‌జెర్ఫ్‌ యెహుఅలావ్‌ (ఇథియోపియా)లు రజత, కాంస్య పతకాలను సాధించారు.

పురుషుల విభాగంలో జాకబ్‌ కిప్లియో (ఉగాండా) చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ హాఫ్‌ మారథాన్‌లో టైటిల్‌ నెగ్గిన తొలి ఉగాండా రన్నర్‌గా కిప్లియో గుర్తింపు పొందాడు.

మెస్సీ రికార్డు

వరుసగా 16 చాంపియన్స్‌ లీగ్‌ సీజన్లలో గోల్‌ చేసిన తొలి ప్లేయర్‌గా లియోనల్‌ మెస్సీ రికార్డు సృష్టించాడు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో అక్టోబర్‌ 21న ఫెరాస్కరోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఈ ఘనత సాధించాడు. మాంచెస్టర్‌ యునైటెడ్‌ మాజీ వింగర్‌ ర్యాన్‌ గిగస్‌ కూడా 16 సీజన్లలో గోల్‌ చేసినప్పటికీ.. వరుస సీజన్లలో గోల్‌ చేసిన ఆటగాడు మెస్సీనే కావడం విశేషం.

వార్తల్లో వ్యక్తులు

న్యూజీలాండ్‌ ప్రధానిగా జసిండా

న్యూజీలాండ్‌ దేశానికి ప్రధానిగా జసిండా ఆర్డెన్‌ వరుసగా రెండోసారి అక్టోబర్‌ 17న ఎన్నికయ్యారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లేబర్‌ పార్టీ ఎన్నికల్లో 49 శాతం ఓట్లతో గెలుపొందింది. ప్రతిపక్ష నేషనల్‌ పార్టీకి 27 శాతమే ఓట్లు వచ్చాయి. 24 ఏండ్ల క్రితం న్యూజీలాండ్‌లో దామాషా ఓటింగ్‌ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత ఓ పార్టీ ఒంటరిగా అధికారంలోకి రావడం ఇదే తొలిసారి.

ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షరాలిగా సీమా

భారత ఎడిటర్స్‌ గిల్డ్‌ నూతన అధ్యక్షురాలిగా ‘ది సిటిజెన్‌' ఎడిటర్‌ సీమా ముస్తఫా అక్టోబర్‌ 17న ఎన్నికయ్యారు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఎన్నికల ఫలితాల్లో ఆమె గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా ‘హార్డ్‌ న్యూస్‌' ఎడిటర్‌ సంజయ్‌కపూర్‌, కోశాధికారిగా ‘ది కారవాన్‌' ఎడిటర్‌ అనంత్‌నాథ్‌ ఎన్నికయ్యారు.

మేటిసైంటిస్ట్‌ సూర్యనారాయణ

అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పదార్థ విజ్ఞాన శాస్ర్తానికి సంబంధించి ప్రపంచంలోనే మేటి వంద మంది సైంటిస్టుల జాబితాను అక్టోబర్‌ 17న విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీకి చెందిన చల్లపల్లి సూర్యనారాయణకు 55వ స్థానం లభించింది. 1988 నుంచి అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడాలో విధులు నిర్వర్తిస్తున్నారు.

అమర్త్యసేన్‌కు అవార్డు

2020కుగాను జర్మనీ దేశ బుక్‌ట్రేడ్‌ శాంతి బహుమతిని అమర్త్యసేన్‌కు అక్టోబర్‌ 20న అందుకున్నారు. ఈ అవార్డును 1950లో స్థాపించారు. ఈ అవార్డు కింద 25 వేల యూరోలు అందిస్తారు. ప్రపంచ న్యాయం, విద్య, సామాజిక అసమానతలు, ఆరోగ్య సంరక్షణ అంశాల్లో కృషిచేసినవారికి ఈ అవార్డు ఇస్తారు.

విజయలక్ష్మి మృతి

వింగ్‌ కమాండర్‌గా పనిచేసిన విజయలక్ష్మి రమణన్‌ అక్టోబర్‌ 21న మరణించారు. ఈమె భారత వాయుసేనలో తొలి మహిళా ఆఫీసర్‌గా రికార్డులకెక్కారు. 1979లో రిటైర్‌ అయ్యారు.

వేముల సైదులు

జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నిపుణులు

ఆర్‌సీ రెడ్డి  స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌