గురువారం 22 అక్టోబర్ 2020
Nipuna-education - Oct 18, 2020 , 02:48:54

ప్రతిభకు ప్రోత్సాహం.. ఎన్‌టీఎస్‌ఈ

ప్రతిభకు ప్రోత్సాహం.. ఎన్‌టీఎస్‌ఈ

ప్రతిభావంతుల అన్వేషణకు పరీక్ష నిర్వహించి, అర్హత సాధించినవారి  చదువుకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో నిర్వహించే పరీక్షే నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌ (ఎన్‌టీఎస్‌ఈ). ఈ పరీక్షను రెండుదశల్లో నిర్వహించి వాటిలో అర్హత సాధించినవారికి ఇంటర్‌ నుంచి పీహెచ్‌డీ వరకు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. ఎన్‌టీఎస్‌ఈ -2020 నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో వాటి వివరాలు...

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎన్‌సీఈఆర్‌టీఈ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. 1963లో మొదట ఈ ప్రోగ్రామ్‌ను నేషనల్‌ సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కీం (ఎన్‌ఎస్‌టీఎస్‌ఎస్‌)గా ఢిల్లీలో నిర్వహించారు. పదకొండో తరగతి చదివే 10 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ను అందించారు. 1964 నుంచి దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు దీన్ని విస్తరించి 350 స్కాలర్‌షిప్స్‌ను ఇచ్చారు. స్కాలర్‌షిప్స్‌ ఎంపిక కోసం రాతపరీక్ష, ప్రాజెక్ట్‌ రిపోర్టు, ఇంటర్వ్యూ నిర్వహించేవారు. 

మొదట్లో ఈ పరీక్షను సైన్స్‌ విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి నిర్వహించేవారు. తదనంతర కాలంలో విద్యావ్యవస్థ 10+2+3 విధానంలోకి వెళ్లింది. దీంతో 1976లో ఎన్‌టీఎస్‌ఎస్‌ స్కీంలో మార్పులు చేశారు. బేసిక్‌ సైన్సెస్‌తోపాటు సోషల్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విభాగాలకు దీన్ని విస్తరించారు. అదేవిధంగా ఈ స్కీంను X, XI, XII  తరగతులకు విస్తరించారు. స్కాలర్‌షిప్స్‌ సంఖ్యను 500కు పెంచారు. పరీక్ష విధానాన్ని మార్చారు. పరీక్షలో రెండు విధాలైన ఆబ్జెక్టివ్‌ అంశాలపై ప్రశ్నలను ఇవ్వడం ప్రారంభించారు. అవి.. మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (మ్యాట్‌), స్కొలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (శాట్‌). వీటిలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేసేవారు. 

1981లో స్కాలర్‌షిప్స్‌ సంఖ్యను 500 నుంచి 550కి పెంచారు. పెంచిన 50 స్కాలర్‌షిప్స్‌ ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. అనంతరం 1983లో స్కాలర్‌షిప్స్‌ను 750కి పెంచారు. 2000లో స్కాలర్‌షిప్స్‌ సంఖ్యను 1000కి పెంచారు. 2008లో ఎన్‌టీఎస్‌ ఎగ్జామ్‌ను 8వ తరగతికి నిర్వహించడం ప్రారంభించారు. చివరగా 2010లో ఈ పరీక్షను కేవలం పదోతరగతి విద్యార్థులకు మాత్రమే పరిమితం చేసింది ఎన్‌సీఈఆర్‌టీఈ. 

2012-13 నుంచి ఎన్‌టీఎస్‌ఈ కేవలం పదోతరగతి విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్నారు. రెండు దశల్లో పరీక్ష ఉంటుంది. ఒకటి రాష్ట్ర స్థాయి లెవల్‌- 1, రెండోది జాతీయస్థాయి లెవల్‌- 2.

ప్రస్తుతం ఏటా జాతీయస్థాయిలో 2000 మందికి స్కాలర్‌షిప్స్‌ అందిస్తున్నారు.

స్కాలర్‌షిప్స్‌ 

లెవల్‌- 1, లెవల్‌- 2లో క్వాలిఫై అయినవారికి కింది పద్ధతిలో ఉపకారవేతనాలను అందిస్తారు. 

XI, XII తరగతులు చదువుతున్నప్పుడు నెలకు రూ. 1250/-

అండర్‌గ్రాడ్యుయేట్స్‌, పీజీ చదువుతున్నప్పుడు నెలకు రూ.2000/- ఇస్తారు.

పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు యూజీసీ నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్‌ ఇస్తారు.

స్టేజ్‌ -I 

మొదటి దశ రాష్ట్రస్థాయిలో జరుగుతుంది. దీనిలో క్వాలిఫై అయినవారిని రెండో దశ (లెవల్‌-II)కు ఎంపికచేస్తారు.

క్వాలిఫయింగ్‌ మార్కులు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ విద్యార్థులకు 32 శాతం మార్కులు రావాలి. 

అర్హతలు: స్టేజ్‌- I పరీక్ష రాయడానికి ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్నవారు అర్హులు. ఓపెన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ పద్ధతిలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా పరీక్ష రాయవచ్చు. 

దరఖాస్తు:  స్టేజ్‌- I (రాష్ట్రస్థాయి) పరీక్ష ఆయా రాష్ర్టాల ఎస్‌ఎస్‌సీ బోర్డులు పర్యవేక్షణలో జరుగుతుంది. నోటిఫికేషన్‌ వివరాల కోసం https://www.bse. telangana.gov.in చూడవచ్చు.

పరీక్షతేదీ: 2020, డిసెంబర్‌ 13

స్టేజ్‌- II 

పరీక్ష దేశంలోని అన్ని రాష్ర్టాలు, యూటీల్లో 2021, జూన్‌ 13న నిర్వహిస్తారు. స్టేజ్‌- Iలో అర్హత సాధించినవారికి ఎన్‌సీఈఆర్‌టీఈ నేరుగా స్టేజ్‌- II హాల్‌టికెట్స్‌ పంపిస్తుంది. ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు.

రాష్ట్రంలోని విద్యార్థులు సందేహాల నివృత్తి కోసం లేదా పూర్తి సమాచారం కావాలంటే కింది చిరునామాలో సంప్రదించవచ్చు.

Deputy Commissioner, Director of Govt. Examinations, Chapel Road, Hyderabad, Telangana-500001.E-Mail: [email protected]

వెబ్‌సైట్‌: https://ncert.nic.in/national-talent-examination.php
logo