గురువారం 22 అక్టోబర్ 2020
Nipuna-education - Oct 18, 2020 , 02:41:15

కష్టపడ్డారు.. సాధించారు!

కష్టపడ్డారు.. సాధించారు!

ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలతో రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఎంసెట్‌లో విద్యార్థులు ర్యాంకులు సాధించారు. తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చాలనే సంకల్పంతో టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో తమ సత్తా చాటారు. సమాజానికి, దేశ అభివృద్ధికి తమవంతు సహాయం అందిస్తామని వారు చెబుతున్నారు. ఇంకా తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల కృషితో  ర్యాంకులు సాధించామంటున్నారు. కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అనంతరం పరిశోధనవైపు వెళ్లాలని కొందరు భావిస్తుండగా.. మరికొందరు వ్యాపారం, ఇంకొందరు ఉన్నత చదువుల కోసం ఫారిన్‌ వెళ్లాలని కోరుకుంటున్నారు. ఇటీవల విడుదలైన టీఎస్‌ ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు నమస్తే తెలంగాణ నిపుణతో తమ మనోగతాలు పంచుకున్నారు. ఆ వివరాలు...

సైంటిస్ట్‌ కావాలన్నదే లక్ష్యం


సాయితేజ వారణాసి

కంబైండ్‌ స్కోర్‌- 93.3757

ఎంసెట్‌ మార్కులు- 147.2905

మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?  విద్యాభ్యాసం ఎక్కడ ఎలా సాగింది?

నాన్న విజయరామయ్య, అమ్మ శాంతకుమారి. ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ప్రాథమిక విద్య అంతా కూడా విజయనగరంలో సాగింది. అయితే 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌ మాదాపూర్‌లో సాగింది.

ఎంసెట్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినందుకు ఎలా ఫీలవుతున్నారు?

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే మొదటిర్యాంకు సాధించాను. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంటర్‌ పరీక్షల అనంతరం కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో కొంత ఆందోళనకు గురయ్యాను. అయినప్పటికీ తమ కాలేజీ ఆన్‌లైన్‌ క్లాసులతో ప్రత్యేక తరగతులు నిర్వహించడంవల్ల ప్రిపరేషన్‌ బాగా సాగింది. కాలేజీలో ఇచ్చిన షెడ్యూల్‌ను మిస్‌ కాకుండా చూసుకునేవాడిని. ఏకాగ్రతతో రోజుకు 8 గంటలు చదివాను. 

ఇప్పటివరకు మెరిట్‌ టెస్టులు అంటే ఒలింపియాడ్‌ స్కాలర్‌షిప్‌ లాంటి టెస్టులు రాశారా? అందులో ఏమైనా ర్యాంకులు సాధించారా?

మెరిట్‌ టెస్టులు చాలా రాశాను. 2020 బిట్‌శాట్‌ ఇండియా టాప్‌ స్కోరర్‌ అవార్డు, 23వ అంతర్జాతీయ ఆస్ట్రానమి ఒలింపియాడ్‌లో మెడల్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ IAPTలో గోల్డ్‌మెడల్‌, ఇంటర్నేషనల్‌ మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ (IMO) గోల్డ్‌మెడల్‌, పాఠశాల స్థాయి ఒలింపియాడ్‌ టెస్టులు, (INPHO) ఇండియన్‌ నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌, సైన్స్‌ ఒలింపియాడ్‌ ఫౌండేషన్‌ (SOE) గోల్డ్‌మెడల్‌, ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్‌ గోల్డ్‌మెడల్‌ (IOS), పాఠశాల స్థాయి ఒలింపియాడ్‌ పరీక్షల్లో 6 గోల్డ్‌ మెడల్స్‌, డా. ఏఎస్‌ రావు ఎగ్జామ్స్‌ 2017-18, 18-19, ఇండియన్‌ నేషనల్‌ మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌ బెస్ట్‌ అవార్డ్‌, కేవీపీవై (కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన) ఆల్‌ ఇండియా 36వ ర్యాంక్‌, బిట్స్‌ పిలాని స్కోర్‌ 442/445, ఇలా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులతో పాటు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో బీటెక్‌ కోర్సు ప్రవేశానికి ఎంపికయ్యాను.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌, మెయిన్‌లో ఎంత ర్యాంకు వచ్చింది?

జేఈఈ అడ్వాన్స్‌ ఓపెన్‌ కేటగిరీలో 51వ ర్యాంకు, జేఈఈ మెయిన్‌ 35వ ర్యాంక్‌ సాధించాను.

భవిష్యత్‌ లక్ష్యాలు ఏమిటి? విద్యార్థులకు మీరిచ్చే సలహాలు సూచనలు?

భవిష్యత్‌ లక్ష్యాలు అంటే బొంబాయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేసి అమెరికా ఎంఐటీలో ఎంఎస్‌ చేసి సైంటిస్ట్‌ కావాలన్నదే నా లక్ష్యం. ఇంకా ఐటీ స్టార్టప్‌ ప్రారంభించాలని ఉంది. 

విద్యార్థులకు నేనిచ్చే సలహా... కష్టపడి, ఇష్టపడి ప్రణాళికతో చదివితే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు.

నూతన ఆవిష్కరణలు అంటే ఇష్టం


కాపెల్లి యశ్వంత్‌ సాయి

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా

కంబైండ్‌ స్కోర్‌- 91.9234

ఎంసెట్‌ మార్కులు- 144.5225

కుటుంబ నేపథ్యం, చదువు

నాన్న సతీష్‌బాబు నా చిన్నప్పుడే మరణించారు. అమ్మ సరోజినీదేవి. చిరువ్యాపారం నిర్వహిస్తూ నన్ను మా బ్రదర్‌ని చదివిస్తున్నారు. మమ్మల్ని బాగా చదివించి మంచి స్థాయికి తీసుకురావాలన్నదే మా అమ్మ కోరిక. విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ చదివాను. ఇంటర్‌లో 984 మార్కులు సాధించాను. ఎంసెట్‌ ప్రిపరేషన్‌, కోచింగ్‌ 

తెలంగాణ  ఎంసెట్‌లో సెకండ్‌ ర్యాంకు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు.

కాలేజీ క్లాసులు, కాలేజీలో ఇచ్చిన షెడ్యూల్‌ను మిస్సవకుండా చూసుకునేవాడిని. ఏకాగ్రతతో రోజుకు 10 గంటలు చదివేవాడిని. అమ్మ ప్రోత్సాహం, టీచర్ల పర్యవేక్షణతో ఈ ర్యాంకు సాధించాను. 

మెరిట్‌ టెస్టులు అంటే 9 ఒలింపియాడ్‌ స్కాలర్‌షిప్‌ టెస్టులు రాశాను. NSEP, NSEC, NSEA ఎగ్జామ్స్‌ క్వాలిఫై అయ్యాను. ఇంకా INCHO కూడా సెలెక్ట్‌ అయ్యాను.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌, మెయిన్‌ టెస్ట్‌ ర్యాంక్స్‌

జేఈఈ మెయిన్‌ 110, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 32వ ర్యాంక్‌ సాధించాను.

భవిష్యత్‌ లక్ష్యాలు

బొంబాయి ఐఐటీలో కంప్యూటర్స్‌ చదివి.. స్టేట్స్‌లో ఎంఎస్‌ చేయాలన్నదే నా కోరిక. నూతన ఆవిష్కరణలు చేయాలన్నదే నా లక్ష్యం.

కంపెనీకి సీఈవో అవుతా


తమ్మనబోయిన మణివెంకట కృష్ణ

కంబైండ్‌ స్కోర్‌- 91.9234

ఎంసెట్‌ మార్కులు- 143.7478

విరవ గ్రామం పిఠాపురం మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్‌మీ కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం 

నాన్న శ్రీనివాసరావు రైతు. అమ్మ గృహిణి. పిఠాపురంలోనే వ్యవసాయం చేసేవారు. అయితే నా చదువు కోసం వారు విజయవాడకు వచ్చారు. ప్రైమరీ స్కూల్‌ అంతా కూడా పిఠాపురంలోనే సాగింది. 5 నుంచి 7వ తరగతి వరకు కాకినాడ, 8 నుంచి ఇంటర్‌ వరకు విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో చదివాను.

ఇంటర్‌ మార్కులు, ఎంసెట్‌ ప్రిపరేషన్‌

ఇంటర్‌లో 957 మార్కులు వచ్చాయి. ఎంసెట్‌ కోసం ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌కి ప్రిపేరవుతూ.. ఎంసెట్‌కు ప్రిపేరయ్యాను. మా ఫ్యాకల్టీ ఇచ్చిన వర్క్‌షీట్‌ను సమయానికి తగ్గట్లుగా పూర్తిచేస్తూ ప్రతిరోజు క్రమం తప్పకుండా 7 గంటలు చదివాను. అమ్మనాన్నల ప్రోత్సాహం, టీచర్ల సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి.

మెరిట్‌, స్కాలర్‌షిప్‌ టెస్టులు 

బిట్‌శాట్‌ ఎగ్జామ్‌లో మంచి మార్కులు సాధించాను. ఇంకా NSEP, NSEC, NSEA, KVPY పరీక్షలు రాశాను. వీటిలో అన్నింటికి రెండో లెవల్‌కు ఎంపికయ్యాను. తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉన్నది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌, మెయిన్‌ ర్యాంక్స్‌

జేఈఈ మెయిన్‌లో 358, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 457  ర్యాంక్‌ సాధించాను. దీంతోపాటు బీఆర్క్‌, బీప్లానింగ్‌ ఎగ్జామ్స్‌లో ఆలిండియా 121, 145 ర్యాంకులు సాధించాను.

భవిష్యత్‌ లక్ష్యాలు, విద్యార్థులకు సలహాలు సూచనలు 

భవిష్యత్తులో ఏదైనా ఒక మల్టీనేషనల్‌ కంపెనీకి సీఈవో కావాలన్నదే నా లక్ష్యం. ఐఐటీ కంప్యూటర్‌ సైన్స్‌ అత్యుత్తమ ప్రతిభ చూపడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను.  

కష్టంతో కాకుండా ఇష్టపడి సరిగా అర్థం చేసుకుంటూ చదివితే మంచి ర్యాంకులు వస్తాయి.

సొంతంగా ఆవిష్కరణలు చేయాలనేది లక్ష్యం

చాగరి కౌషల్‌ కుమార్‌ రెడ్డి

ఎంసెట్‌ ర్యాంకు- 4
కంబైన్డ్‌ స్కోర్‌- 91.8493
ఎంసెట్‌ మార్క్స్‌- 142.6118
మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? విద్యాభ్యాసం ఎక్కడ ఎలా సాగింది?
మాది సికింద్రాబాద్‌. లాన్సర్‌కాలనీ రైల్వే క్వార్టర్స్‌లో ఉంటున్నాం. అమ్మ శ్రీలత ట్రాన్స్‌కో ఉద్యోగిని. నాన్న నీలకంఠరెడ్డి సీనియర్‌ ప్రొఫెసర్‌ (IRISET). 8వ తరగతి వరకు సెయింట్‌ పాల్‌ హైస్కూల్‌, ఆ తర్వాత 9, 10 ఇంటర్‌ శ్రీచైతన్య స్కూల్‌ డీడీ కాలనీ హైదరాబాద్‌లో చదివాను. ఇంటర్‌లో 979 మార్కులు సాధించాను.
ఎంసెట్‌ ప్రిపరేషన్‌ ఏవిధంగా సాగింది? రోజుకు ఎన్ని గంటలు చదివారు?
రోజూ 8 నుంచి 9 గంటలు ప్రిపేరయ్యాను. ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. కాలేజీలో నిర్వహించే పరీక్షల్లో జరిగే తప్పులను గుర్తించి.. వాటిని పునరావృతం కాకుంగా చూసుకోవడం వల్ల ర్యాంకు వచ్చింది. తెలంగాణ ఎంసెట్‌ 4వ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా బెటర్‌ ర్యాంకు వస్తుందని నా నమ్మకం. ఏపీ ఎంసెట్‌లోనూ 6వ ర్యాంకు వచ్చింది. ఇంజినీరింగ్‌ విభాగంలో రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో సొంతంగా ఆవిష్కరణలు చేయాలనేది నా లక్ష్యం.
స్కాలర్‌షిప్‌ టెస్టులు రాశారా? అందులో ఏమైనా ర్యాంకులు సాధించారా? జేఈఈ అడ్వాన్స్‌డ్‌, మెయిన్‌లో ఎంత ర్యాంకు వచ్చింది?
మెరిట్‌ టెస్ట్‌లు రాశాను. KVPYలో 91వ ర్యాంక్‌ వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 327వ ర్యాంక్‌ వచ్చింది. 
ఎంసెట్‌లో ర్యాంకు సాధించినందుకు ఎలా ఫీలవుతున్నారు? భవిష్యత్‌ లక్ష్యాలు? విద్యార్థులకు మీరిచ్చే సలహాలు సూచనలు?
చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కాలేజీ అధ్యాపకుల సహకారంతో ఈ ర్యాంకు సాధించాను. నూతన ఆవిష్కరణలంటే ఎంతో ఇష్టం. ఆ దిశగానే నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుకుంటా.

ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తా


హార్థిక్‌ రాజ్‌పాల్‌
ఎంసెట్‌ ర్యాంక్‌- 5
కంబైన్డ్‌ స్కోర్‌- 89.8031
ఎంసెట్‌ మార్కులు- 139.2244
మీ కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం 
మిలానో టవర్స్‌ ఖానామెట్‌, హైటెక్స్‌, హైదరాబాద్‌. నాన్న జితేంద్ర రాజ్‌పాల్‌ సీనియర్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్‌, అమ్మ  విభా రాజ్‌పాల్‌ ప్రైవేట్‌ ఉద్యోగిని. టెన్త్‌, ఇంటర్‌  హైదరాబాద్‌ మాదాపూర్‌లో సాగింది.
ఎంసెట్‌ ప్రిపరేషన్‌
ప్రతి రోజూ 10 గంటల చదివాను. ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. కాలేజ్‌ నుంచి లెక్చరర్లు అన్ని విధాలా సహకరించారు. ఆన్‌లైన్‌ క్లాసులతో పాటు, టెస్ట్‌లు పెట్టి పరీక్షలకు ప్రిపేర్‌ చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కాలేజీ టీచర్ల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపకరించాయి.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌, మెయిన్‌
తెలంగాణ రాష్ట్రం నుంచి జేఈఈలో మొదటి ర్యాంకు, ఆలిండియా 6వ ర్యాంకు సాధించాను. ఎంసెట్‌ రాసిన తర్వాత నాకు మంచి ర్యాంకు వస్తుందన్న నమ్మకం వచ్చింది. జేఈఈలో 6వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో 5వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. 
భవిష్యత్‌ లక్ష్యాలు 
ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరుతాను. ఐటీ స్టార్టప్‌ కంపెనీ ప్రారంభించాలన్నది నా కోరిక.

సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలన్నదే లక్ష్యం


అన్నం సాయివర్ధన్‌
కంబైన్డ్‌ స్కోర్‌- 89.4362
ఎంసెట్‌ మార్క్స్‌- 138
మీ కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం 
అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. నాన్న జెడ్పీహెచ్‌ఎస్‌ కాసిపేట స్కూల్‌ అసిస్టెంట్‌, అమ్మ మంచిర్యాల జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సొంత గ్రామం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట. ప్రస్తుతం మాదాపూర్‌లో ఉంటున్నాం. 7వ తరగతి వరకు లక్సెట్టిపేట, 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు హైదరాబాద్‌ శ్రీచైతన్యలో చదివాను.
ఇంటర్‌లో మార్కులు, ఎంసెట్‌ ప్రిపరేషన్‌ ఏవిధంగా సాగింది? రోజుకు ఎన్ని గంటలు చదివారు?
ఇంటర్‌లో 964 మార్కులు వచ్చాయి. ఎంసెట్‌కు ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. జేఈఈ కోసం ప్రిపేరవుతూ ఎంసెట్‌ కూడా ప్రిపేరయ్యాను. రోజుకు 10 నుంచి 12 గంటలు చదివేవాడిని. ఇంకా లాక్‌డౌన్‌ కారణంగా దొరికిన సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకున్నా. తల్లిదండ్రులు చదువు విషయంలో పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పాటు ఎంతో ప్రోత్సాహించారు. కాలేజీ లెక్చరర్లు అన్ని విధాలా సహకరించారు. ఆన్‌లైన్‌ క్లాసులతో పాటు టెస్ట్‌లు పెట్టి పరీక్షలకు ప్రిపేర్‌ చేశారు. ప్రాక్టీస్‌ టెస్టులు బాగా రాశాను.
మెరిట్‌ టెస్టులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌, మెయిన్‌  ర్యాంకు 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా ర్యాంకు 93, ఆలిండియా ఓబీసీ ర్యాంకు 7, జేఈఈ మెయిన్‌ 204, ఓబీసీ కేటగిరీలో 32వ ర్యాంకు వచ్చింది. మెరిట్‌ టెస్టుల్లో NTSE స్కాలర్‌షిప్స్‌, KVPYలో ఆలిండియా 15వ ర్యాంకు వచ్చింది. NSEP, NSEC, NSEA క్వాలిఫై అయ్యాను.
ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించినందుకు ఎలా ఫీలవుతున్నారు? భవిష్యత్‌ లక్ష్యాలు ఏమిటి? విద్యార్థులకు మీరిచ్చే సలహాలు సూచనలు?
టీఎస్‌ ఎంసెట్‌లో 8వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఐఐటీలో చేరి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలన్నదే నా లక్ష్యం. ముందే లక్ష్యాన్ని నిర్ధారించుకొని తగిన ప్రణాళిక ప్రకారం చదవడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సిలబస్‌ను అనేకసార్లు రివిజన్‌ చేయడం అవసరం.  పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. ఎక్కువ సార్లు ప్రాక్టీస్‌ ఎగ్జామ్స్‌ రాయడం వల్ల మరింత సులువవుతుంది.

ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలని ఉంది 


పెనగమూరి వీ సాయిపవన్‌ హర్షవర్ధన్‌
కంబైన్డ్‌ స్కోర్‌- 82.2191
ఎంసెట్‌ మార్కులు- 138.6007
మీ కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం
మాది గుంటూరులోని ఏటీ అగ్రహారం. మానాన్న పీవైబీ రమేష్‌ కుమార్‌ దుబాయ్‌లో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ రామలక్ష్మి గృహిణి. విద్యాభ్యాసం అంతాగుంటూరులోనే సాగింది. ఇంటర్‌లో 965 మార్కులు వచ్చాయి.
ఎంసెట్‌ ప్రిపరేషన్‌
ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. జేఈఈ ప్రిపరేషన్‌లో భాగంగానే ఎంసెట్‌కూ ప్రిపేరయ్యాను. ప్రతిరోజు 12 నుంచి 14 గంటలు చదివాను. తల్లిదండ్రుల ప్రోత్సహించారు. టీచర్లు సపోర్ట్‌ అందించారు. ఆన్‌లైన్‌ క్లాసులతో పాటు టెస్టులు పెట్టి పరీక్షకు ప్రిపేర్‌ చేశారు.
ఒలింపియాడ్‌ స్కాలర్‌షిప్‌ లాంటి టెస్టులు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంక్‌ 
ఒలింపియాడ్‌ ASRAO, JVRAO టెస్టులు రాశాను. వీటిలో ర్యాంకు వచ్చింది. రామానూజన్‌, IMO పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాను. జేఈఈ మెయిన్‌లో 160, అడ్వాన్స్‌డ్‌లో 57వ ర్యాంకు సాధించాను.
భవిష్యత్‌ లక్ష్యాలు, విద్యార్థులకు మీరిచ్చే సలహాలు?
9వ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంటెక్‌ చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలనేది నా లక్ష్యం. 
చదివే ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి అది ఎందుకు సరైనదో అని ప్రశ్నించుకోవడం చాలా ముఖ్యం. అలా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మనం సరైన దారిలో వెళ్తున్నామని నా భావన.
logo