శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nipuna-education - Oct 17, 2020 , 23:54:55

కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్

జాతీయం

పెట్రోలింగ్‌ నౌక

తమిళనాడులోని కట్టుపల్లి నౌకాశ్రయంలో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ ఆఫ్‌షోర్‌ పెట్రోలింగ్‌ నౌక ‘విగ్రహ’ను అక్టోబర్‌ 7న ప్రారంభించారు. దీనిని లార్సన్‌ అండ్‌ టూబ్రో కంపెనీ రూపొందించింది.

సిక్కిం మిర్చికి జీఐ

సిక్కింలో పండే, డలే ఖుర్సాని అని పిలిచే రెడ్‌ చెర్రీ మిరపకాయకు అక్టోబర్‌ 9న భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌ లభించింది. ప్రపంచంలోనే అధిక ఘాటుగల మిరపకాయల్లో దీనిని ఒకటిగా పరిగణిస్తారు. స్థానిక మార్కెట్‌లో ఈ మిరపకాయల ధర కేజీ రూ.480.

వైమానిక దళం వేడుకలు

88వ జాతీయ వైమానిక దళం వార్షిక వేడుకలను ఉత్తరప్రదేశ్‌లోని హిందాన్‌ ఎయిర్‌పోర్టులో అక్టోబర్‌ 8న నిర్వహించారు. ఈ వేడుకలో సుఖోయ్‌-30, మిగ్‌-21, తేజస్‌, రాఫెల్‌ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. 

రుద్రం-I ప్రయోగం

భారత్‌ కొత్తతరం యాంటీ రేడియేషన్‌ క్షిపణి రుద్రం-I ను అక్టోబర్‌ 9న విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్‌లో సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానం నుంచి దీన్ని ప్రయోగించారు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణి శత్రు దేశపు రాడార్లు, గగనతల రక్షణ వ్యవ్యవస్థలు, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయగలదు.   

అంతర్జాతీయం

క్వాడ్‌ సమావేశం


భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన ‘క్వాడ్‌' కూటమి సమావేశం టోక్యోలో అక్టోబర్‌ 6న జరిగింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జై శంకర్‌, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, జపాన్‌ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోతెగి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిసె పేన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై న్యాయబద్ధమైన హక్కులు కలిగి ఉన్న దేశాల భద్రత, సైబర్‌ సెక్యూరిటీ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక అంశాలపై చర్చించారు. 

భారత్‌, జపాన్‌ ఒప్పందం

భారత్‌, జపాన్‌ల మధ్య 5జీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన ఒప్పందం అక్టోబర్‌ 8న కుదిరింది. దీంతోపాటు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఇండోపసిఫిక్‌లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం, సముద్ర వాణిజ్యం, పెట్టుబడులు, తయారీ రంగం, మౌలిక వసతుల కనెక్టివిటీ వంటి అంశాలపై చర్చించారు.

దక్షిణాసియా ఆర్థికంపై నివేదిక

దక్షిణాసియా ప్రాంతం ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన ‘దక్షిణాసియా ఆర్థిక పరిస్థితిపై దృష్టి’ అనే నివేదికను అక్టోబర్‌ 8న ప్రపంచ బ్యాంక్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థ గడిచిన ఐదేండ్లలో వార్షికంగా 6 శాతం వృద్ధి నమోదు చేసుకోగా.. 2020లో 7.7 శాతం క్షిణించనుంది. అయితే 2021లో 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకోవచ్చు. 

నోబెల్‌ ప్రైజ్‌

వైద్యశాస్త్రంలో

అమెరికాకు చెందిన హార్వీ జే ఆల్టర్‌, చార్లెస్‌ ఎం రైస్‌, బ్రిటన్‌కు చెందిన మైఖేల్‌ హౌటన్‌లు అక్టోబర్‌ 5న ఎంపికయ్యారు. ప్రైజ్‌మనీని ముగ్గురికి సమానంగా పంచుతారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి కారణమవుతున్న ‘హెపటైటిస్‌ సి’ వైరస్‌ను కనుగొన్నందుకు వీరికి ఈ అవార్డు లభించింది. 

భౌతిక శాస్త్రంలో

బ్రిటన్‌కు చెందిన రోజర్‌ పెన్‌రోజ్‌, జర్మనీ సైంటిస్ట్‌ రెయిన్‌హార్డ్‌ గెంజెల్‌, అమెరికా సైంటిస్ట్‌ ఆండ్రియా గెజ్‌లు అక్టోబర్‌ 6న ఎంపికయ్యారు. 
విశ్వంలో అత్యంత నిగూఢ ఆకృతులుగా గుర్తింపు పొందిన కృష్ణబిలాల (బ్లాక్‌హోల్స్‌) గుట్టు విప్పినందుకు వీరికి ఈ అవార్డు లభించింది. 

రసాయన శాస్త్రంలో

ఫ్రాన్స్‌కు చెందిన ఇమాన్యుయెల్లె చార్పెంటియర్‌, అమెరికా సైంటిస్ట్‌ జెన్నిఫర్‌ ఎ డౌడ్నాలు అక్టోబర్‌ 7న ఎంపికయ్యారు.  జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల డీఎన్‌ఏలో అవసరమైన మార్పులను (జీన్‌ ఎడిటింగ్‌) అత్యంత కచ్చితత్వంతో చేయగల ‘క్రిస్పర్‌ కాస్‌ 9’ సాంకేతికతను వీరు సంయుక్తంగా అభివృద్ధి చేసినందుకు ఈ  పురస్కారం లభించింది.  

సాహిత్యంలో

అమెరికా కవయిత్రి లూయిసీ గ్లక్‌ అక్టోబర్‌ 8న ఎంపికయ్యారు. 2006లో ఈమె రాసిన ‘అవెర్నో’ కవతా సంకలనానికి ఈ బహుమతి లభించింది. ఆమె యేల్‌ యూనివర్సిటీలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 1993లో ఆమె రాసిన ‘ది వైల్డ్‌ ఐరిస్‌' నవలకు పులిట్జర్‌ ప్రైజ్‌ లభించింది.

ఐరాసకు శాంతి నోబెల్‌ 

ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) నోబెల్‌ శాంతి బహుమతికి అక్టోబర్‌ 9న ఎంపికయ్యింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి డబ్ల్యూఎఫ్‌పీ చేస్తున్న కృషికి ఈ అవార్డు లభించింది. 88 దేశాల్లో ప్రతి ఏటా 9.70 కోట్ల మందికి డబ్ల్యూఎఫ్‌పీ ఆహారాన్ని అందిస్తుందని అంచనా.

అర్థశాస్త్రంలో

అమెరికా ఆర్థికవేత్తలు పార్‌ ఆర్‌ మిల్‌గ్రోమ్‌, రాబర్ట్‌ బీ విల్సన్‌లకు అక్టోబర్‌ 12న ప్రకటించారు. వేలం సిద్ధాంతం, కొత్త వేలం ప్రక్రియలను కనిపెట్టినందుకుగాను వీరికి ఈ అవార్డు లభించింది.

వార్తల్లో వ్యక్తులు

దినేష్‌ కుమార్‌ ఖారా

ఎస్‌బీఐ నూతన చైర్మన్‌గా దినేష్‌ కుమార్‌ ఖారా అక్టోబర్‌ 7న నియమితులయ్యారు. ఆయన మూడేండ్లు ఈ పదవిలో ఉంటారు. ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. భారతీయ మహిళా బ్యాంక్‌, ఐదు అనుబంధ బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేయడంలో ప్రధానపాత్ర పోషించారు. 1955, జూలై 1న ఎస్‌బీఐని స్థాపించారు. గతంలో ఇంపీరియల్‌ బ్యాంక్‌ అని పిలిచేవారు.

రాజేశ్వరరావు

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వరరావు అక్టోబర్‌ 8న నియమితులయ్యారు. ఆయన ఆర్‌బీఐలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుత ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు బీపీ కనుంగో, ఎంకే జైన్‌, ఎం పత్రా, ఎం రాజేశ్వరరావు. ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ పనిచేస్తున్నారు. 1935, ఏప్రిల్‌ 1న స్థాపించిన ఆర్‌బీఐని 1949లో జాతీయం చేశారు.

రాంవిలాస్‌ పాశ్వాన్‌ మృతి

  దళిత దిగ్గజ నేతగా పేరొందిన కేంద్ర మంత్రి లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్‌ పాశ్వాన్‌ (74) అక్టోబర్‌ 8న మరణించారు. 1946, జూలై 5న బీహార్‌లో జన్మించిన ఆయన సోషలిస్ట్‌ పార్టీ తరఫున 1969లో తొలిసారిగా బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1974లో లోక్‌దళ్‌ ఏర్పాటైనప్పుడు అందులో చేరి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1977లో జనతా పార్టీలో చేరి బీహార్‌ హాజీపూర్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. 

వైజీ ప్రసాద్‌

నాగ్‌పూర్‌లోని జాతీయ పత్తి పరిశోధనా సంస్థ డైరెక్టర్‌గా వైజీ ప్రసాద్‌ అక్టోబర్‌ 8న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని వ్యవసాయ సాంకేతిక పరిశోధనా సంస్థ  (అటారి, దక్షిణ ప్రాంత) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

క్రీడలు

యశస్వినికి బంగారు పతకం

అంతర్జాతీయ ఆన్‌లైన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో యశస్విని దేశ్‌వాల్‌కు బంగారు పతకం లభించింది. అక్టోబర్‌ 4న జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విబాగంలో 241.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పతకం సాధించింది. ఆన్‌లైన్‌ షూటింగ్‌లో ఆమెకు ఇది రెండో టైటిల్‌. ఇదే ఏడాది మేలో జరిగిన ఐఓఎస్‌సీ టోర్నీలోనూ స్వర్ణ పతకం గెలిచింది.

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు రికార్డు

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు వన్డే క్రికెట్‌లో వరుసగా 21 విజయాలు సాధించి.. ఆస్ట్రేలియా పురుషుల జట్టు నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది. మెగ్‌ లానింగ్‌ సారథ్యంలోని జట్టు న్యూజిలాండ్‌తో అక్టోబర్‌ 7న జరిగిన మ్యాచ్‌లో 232 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఈ రికార్డును సృష్టించింది. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్‌ జట్టు రికీ పాంటింగ్‌ నాయకత్వంలో 2003లో 21 వరుస విజయాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

స్వియాటెక్‌కు ఫ్రెంచ్‌ ఓపెన్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను పోలెండ్‌ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్‌ (19) గెలుచుకుంది. అక్టోబర్‌ 10న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా)ను స్వియాటెక్‌ ఓడించింది. గ్రాండ్‌ స్లామ్‌ నెగ్గిన తొలి పోలెండ్‌ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.  logo