బుధవారం 02 డిసెంబర్ 2020
Nipuna-education - Sep 30, 2020 , 03:57:42

కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్

జాతీయం

కార్గో ఫెర్రీ సేవలు

భారత్‌-మాల్దీవుల మధ్య కార్గో ఫెర్రీ సేవలు సెప్టెంబర్‌ 21న ప్రారంభమయ్యాయి. కేంద్ర షిప్పింగ్‌ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, మాల్దీవుల రవాణా, పౌర విమానయాన శాఖ మంత్రి ఐషాత్‌ నహులా సంయుక్తంగా ఈ సేవలను ప్రారంభించారు.

9 హైవే ప్రాజెక్టులు

ప్రధాని మోదీ బీహార్‌లో 9 హైవే ప్రాజెక్టులు, ఇంటింటికి ఫైబర్‌ స్కీమ్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సెప్టెంబర్‌ 21న ప్రారంభించారు. హైవే ప్రాజెక్టులో రూ.14,258 కోట్లతో 350 కి.మీ. మేర రహదారులను నిర్మించనున్నారు. ఇంటింటికి ఫైబర్‌ పథకం కింద బీహార్‌లోని 45,945 గ్రామాలను అనుసంధానం చేయనున్నారు. 

ఏటీజీఎం పరీక్ష

దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్‌ పరిజ్ఞాన ఆధారిత ట్యాంకుల విధ్వంసక క్షిపణి (ఏటీజీఎం) సెప్టెంబర్‌ 23న విజయవంతంగా పరీక్షించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న ఆర్మర్డ్‌ కోర్‌ సెంటర్‌ అండ్‌ స్కూల్‌ (ఏసీసీఎస్‌)లో అర్జున్‌ యుద్ధ ట్యాంక్‌ నుంచి ఈ మిసైల్‌ను ప్రయోగించారు.

వాయిస్‌ ఆఫ్‌ డిసెంట్‌

ప్రముఖ రచయిత్రి రోమిలా థాపర్‌ రచించిన ‘వాయిస్‌ ఆఫ్‌ డిసెంట్‌' పుస్తకాన్ని పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా, సీగల్‌ బుక్స్‌ సంయుక్తంగా సెప్టెంబర్‌ 23న ప్రచురించాయి. పౌరసత్వ చట్టం, నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌కు వ్యతిరేకంగా భారత్‌లో జరిగిన అంశాలపై ఈ పుస్తకంలో రాశారు. ఏ హిస్టరీ ఆఫ్‌ ఇండియా (1966), ఇంటర్‌ప్రిటింగ్‌ ఎర్లీ ఇండియా (1992), ఎర్లీ ఇండియా: ఫ్రమ్‌ ది ఒరిజిన్‌ టు ఏడీ 1300 (2003) వంటి చారిత్రక నవలు రాశారు. 

నౌకాబిల్లుకు ఆమోదం

దేశంలోని ప్రధాన నౌకాశ్రయాలకు మరింత స్వయం ప్రతిపత్తి కలిగించడానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ సెప్టెంబర్‌ 23న ఆమోదించింది. నౌకాశ్రయాల పాలకమండళ్లలో వర్క్‌ ఫ్రొఫెషనళ్లను నియమించడానికి, అవి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. విశాఖపట్నం, కాండ్లా (దీన్‌ దయాళ్‌), ఎన్నూర్‌ (కామరాజర్‌), ముంబై, నవీ ముంబై (జవహర్‌లాల్‌ నెహ్రూ), కోల్‌కతా (హల్దియా), న్యూ మంగళూరు, మార్మగోవా, చెన్నై, కొచ్చిన్‌, పారదీప్‌, టుటికోరిన్‌ (వీవో కామరాజర్‌) నౌకాశ్రయాలకు ఈ బిల్లు వర్తిస్తుంది. 1963 నాటి మేజర్‌ పోర్ట్‌ట్రస్ట్‌ల చట్టాన్ని రద్దుచేసి మేజర్‌ పోర్ట్‌ అథారిటీస్‌ బిల్లు-2020ను నౌకాయాన సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 

పృథ్వీ-II

ఒడిశా బాలాసోర్‌లోని అబ్దుల్‌ కలాం వీలర్‌ దీవి నుంచి పృథ్వీ-II నైట్‌ ట్రయల్‌ను సెప్టెంబర్‌ 24న విజయవంతంగా పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈక్షిపణి పరిధి 350 కి.మీ.

కిసాన్‌ కల్యాణ్‌ యోజన

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎం కిసాన్‌ కల్యాణ్‌ యోజనను సెప్టెంబర్‌ 23న ప్రారంభించారు. దీనివల్ల 80 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ప్రస్తుత లబ్ధిదారులకు ఏడాదికి రూ.6,000 ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సహాయంగా రూ.10 వేలు వార్షికానికి ప్రకటిస్తున్నాయి. 

అంతర్జాతీయం

శాంతి దినోత్సవం

అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్‌ 21న నిర్వహిస్తారు. ఈ ఏడాది అంతర్జాతీయ శాంతి దినోత్సవం నినాదం.. ‘కలిసి శాంతిని రూపొందించడం’. కరోనాను రూపుమాపే ఉద్దేశంతో ఆశ, దయ, కారుణ్యాన్ని వ్యాప్తి చేయడం ఈ నినాదం ఉద్దేశం.

ఎమ్మి అవార్డులు

72వ ఎమ్మి అవార్డుల కార్యక్రమాన్ని లాస్‌ఏంజెల్స్‌లోని ఓ థియేటర్‌లో సెప్టెంబర్‌ 21న జిమ్మి కిమ్మిల్‌ నిర్వహించారు. ఈ ఏడాది షిట్స్‌ క్రీక్‌, సక్‌సెషన్‌, వాచ్‌మన్‌ చిత్రాలు ప్రధానమైనవి. క్రీక్‌ మొత్తం 7 ట్రోఫీలతో అత్యధిక విజయాలు సొంతం చేసుకుంది. సక్‌సెషన్‌, వాచ్‌మన్‌ చిత్రాలు 4 చొప్పున ట్రోఫీలను గెలుచుకున్నాయి. డ్రామా సిరీస్‌లో ఉత్తమ సహాయ నటిగా జూలాయి గార్నర్‌ (ఓజార్క్‌), సహాయక నటుడిగా బిల్లీ క్రుడప్‌ (ది మార్నింగ్‌ షో) నిలిచారు.  

టైమ్స్‌ ప్రభావంతమైన వ్యక్తులు

టైమ్స్‌ పత్రిక ప్రపంచంలో ప్రభావంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను సెప్టెంబర్‌ 23న ప్రకటించింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు, డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, కమలా హ్యారిస్‌, జో బిడెన్‌, మెర్కెలా ఏంజెల్‌లకు చోటు లభించింది. భారత్‌ నుంచి ప్రధాని మోదీ, బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా, ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్న బిల్కిస్‌ (82)లు చోటు దక్కించుకున్నారు.

భారత్‌లో బ్రిటిష్‌ కంపెనీ

బ్రిటిష్‌కు చెందిన ఆయుధాల తయారీ కంపెనీని వెబ్లీ అండ్‌ స్కాట్‌ ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో నిర్మించనున్నట్లు ఆ కంపెనీ సెప్టెంబర్‌ 23న ప్రకటించింది. రెండు ప్రపంచ యుద్ధాల్లో మిత్రపక్ష కూటమి దళాలకు ఆయుధాలను సరఫరా చేసిన ఘనత ఈ కంపెనీకి ఉంది. ఈ కంపెనీ దాదాపు 15 

దేశాలకు ఆయుధాలను సరఫరా చేస్తుంది.  

భారత్‌-ఆస్ట్రేలియా నౌకాదళ వ్యాయామం

భారత్‌-ఆస్ట్రేలియా నౌకాదళాలు సెప్టెంబర్‌ 23న పాసేజ్‌ ఎక్సర్‌సైజ్‌ను తూర్పు హిందూమహాసముద్రంలో నిర్వహించారు. ఎయిర్‌ వార్‌ఫేర్‌ డిస్ట్రాయర్‌ హెచ్‌ఎంఏఎస్‌ హాంబర్డ్‌, సిల్త్‌, ప్రిగేట్‌, ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్‌ కర్ముక్‌ యుద్ధ నౌకలు ఈ వ్యాయామంలో పాల్గొన్నాయి. 

హార్లే డేవిడ్‌సన్‌ ప్లాంట్‌ మూసివేత

అమెరికాకు చెందిన మోటార్‌ సైకిళ్ల తయారీ కంపెనీ హార్లే డేవిడ్‌సన్‌ భారత్‌ నుంచి నిష్క్రమించినట్లు సంస్థ సెప్టెంబర్‌ 24న తెలిపింది. హర్యానాలోని బవాల్‌లోని తయారీ ప్లాంటును మూసివేసిందిది. మొత్తం కంపెనీ విక్రయాల్లో భారత అమ్మకాలు 5 శాతం కంటే తక్కువగా ఉండటంతో నిష్క్రమించక తప్పడంలేదని సంస్థ వెల్లడించింది.

క్రీడలు

నొవాక్‌ జకోవిచ్‌

టెన్నిస్‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్‌ అత్యధిక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెప్టెంబర్‌ 21న జరిగిన ఇటాలియన్‌ టైటిల్‌ను గెలిచి ఈ రికార్డు సాధించాడు. మొత్తం 36 టైటిళ్లు గెలిచాడు. 35 మాస్టర్‌ టైటిళ్ల విజేత రఫెల్‌ నాదల్‌ రెండోస్థానంలో ఉన్నాడు. 

డీన్‌ జోన్స్‌ మృతి

ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌, ప్రముఖ క్రికెట్‌ కామెంటేటర్‌ డీన్‌ జోన్స్‌ (59) సెప్టెంబర్‌ 24న మరణించాడు. ప్రస్తుతం ఆయన స్టార్‌ స్పోర్ట్స్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబర్‌ 23న ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌కు డగౌట్‌ వ్యాఖ్యాతగా 

వ్యవహరించాడు. 


వార్తల్లో వ్యక్తులు

సిమాంచల్‌ దాస్‌

ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ (ఐఎంఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు సలహాదారుగా సిమాంచల్‌ దాస్‌ సెప్టెంబర్‌ 23న నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేండ్లు ఉంటారు. ఐఎంఎఫ్‌ 1945, డిసెంబర్‌ 27న ఏర్పడింది.

ఖుషీ చిందలియా

  టున్‌జా ఎకో జనరేషన్‌ ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం భారత్‌లో రాయబారిగా 17 ఏండ్ల ఖుషీ చిందలియాను యూఎన్‌ఈపీ సెప్టెంబర్‌ 24న నియమించింది. సూరత్‌కు చెందిన ఖుషీ 2021, ఫిబ్రవరి వరకు వివిధ పర్యావరణ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ప్రచారం చేస్తుంది.

ఇష్మాయిల్‌ తొరామా

పపువా న్యూగినియాలోని స్వయంప్రతిపత్తి ప్రాంతమైన బౌగెయిన్‌విల్లే అధ్యక్షుడిగా ఇస్మాయిల్‌ తొరామా సెప్టెంబర్‌ 24న ఎన్నికయ్యారు. బౌగెయిన్‌విల్లే దక్షిణ పసిఫిక్‌లో ఖనిజ సంపదకు ప్రసిద్ధిగాంచింది. దీని రాజధాని బుకా.

ఎస్పీ బాలు మృతి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సెప్టెంబర్‌ 25న మరణించారు. 1946, జూన్‌ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు బాలు జన్మించారు. ఆయన ఆరు జాతీయ అవార్డులతోపాటు 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ అందుకున్నారు.

ఎన్‌ఎంసీ చైర్మన్‌గా సురేష్‌చంద్ర

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చైర్మన్‌గా డాక్టర్‌ సురేష్‌చంద్ర శర్మ సెప్టెంబర్‌ 24న నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు ఉంటారు. 

వేముల సైదులు

జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నిపుణులు

ఆర్‌సీ రెడ్డి  స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌