శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 23, 2020 , 03:39:11

ప్రాక్టీసే సక్సెస్‌ మంత్ర

ప్రాక్టీసే సక్సెస్‌ మంత్ర

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ ఎంపికకు సంబంధించిన ప్రిలిమ్స్‌ పరీక్ష అక్టోబర్‌ 4న జరుగనున్నది. అభ్యర్థి తన లక్ష్యం చేరుకోవడానికి ప్రిలిమ్స్‌ తొలి మెట్టు. అయితే ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించి మొదటి సారి ఈ పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థులతోపాటు గతంలో ఒకటి రెండు సార్లు రాసిన అభ్యర్థులకు కూడా అనేక సందేహాలు, భయాందోళనలు ఉంటాయి. కానీ కాస్త ప్రణాళిక ప్రకారం చదివితే ప్రిలిమ్స్‌ గట్టెక్కడం చాలా సులువు. ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలంగా మన చుట్టూ జరుగుతున్న, సబ్జెక్ట్‌ సంబంధింత పరిణామాలపై అవగాహన ఉంటే చాలు. ముందుగా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఈ ఏడాది వార్తల్లో ఉన్న ముఖ్యమైన అంశాల జాబితా సిద్ధం చేసుకోవాలి. ఒక్కో సబ్జెక్ట్‌ రెండు రోజులు కేటాయించేలా ప్రణాళిక వేసుకుని అన్ని సబ్జెక్టులని పూర్తి చేయాలి. 

ఉదా: ఇండియన్‌ పాలిటీకి సంబంధించి గత ఏడాదిన్నర నుంచి వార్తల్లో ఉన్న అంశాల జాబితా ఒకసారి చూద్దాం...

 • ద్రవ్య బిల్లు
 • రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌
 • కొత్తగా ఏర్పాటు చేసిన ఓబీసీ కమిషన్‌
 • గత ఏడాదిగా సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పులు
 • అధికార భాష, దానికి సంబంధించిన అధికరణలు
 • పంచాయతీలు-మున్సిపాలిటీలకు సంబంధించినవి 
 • రాజ్యాంగ అంశాలు
 • కార్మిక చట్టాల క్రోడీకరణ
 • పార్లమెంటరీ పదజాలం ఉదా: జీరో అవర్‌
 • పార్లమెంటరీ కమిటీలు
 • వార్తల్లో ఉన్నటువంటి రాజ్యాంగ బద్ధ సంస్థలు
 • వార్తల్లో ఉన్న రాజ్యాంగ అధికరణలు. ఉదా: గవర్నర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 163
 • కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలు
 • ప్రాథమిక హక్కులు- పరిమితులు
 • ఆదేశిక సూత్రాలు
 • నాగాలకు సంబంధించిన అంశాలు
 • రియాంగ్‌ గిరిజనులకు సంబంధించిన వార్తలు
 • ఈమధ్య కాలంలో పార్లమెంట్‌ చేసిన నూతన చట్టాలు. ఉదా: వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం.
 • క్యాబినెట్‌ కమిటీలు
 • లోక్‌ పాల్‌ చట్టం, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు
 • ఈ గవర్నెన్స్‌కు సంబంధించి షిల్లాంగ్‌ డిక్లరేషన్‌
 • స్పీకర్‌కు సంబంధించిన అంశాలు, పౌరసత్వం,
 • కోర్టు ధిక్కరణ
 • రిజర్వేష్లకు సంబంధించిన అంశాలు
 • 99వ రాజ్యాంగ సవరణ నుంచి 104 వరకు రాజ్యాంగ సవరణలు
 • షెడ్యూల్డ్‌ కులాలకు, షెడ్యూల్డ్‌ తెగలకు సంబంధించిన అంశాలు
 • అలాగే అంతర్జాతీయ సంబంధాలు, అంశాలకు 
 • సంబంధించి ఈ ఏడాది ముఖ్యమైనవి
 • భారత్‌ 8వ సారి ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికకావడం
 • భారత్‌ సభ్యురాలిగా ఉన్న ఐరాస సంస్థలు
 • యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ఐరాస ఇతర ముఖ్యమైన సంస్థలు
 • భారత్‌ చైనా సంబంధాలు. ముఖ్యంగా రెండు దేశాల సరిహద్దులు-వివాదాస్పద ప్రాంతాలు
 • చైనాతో మహాబలిపురం, వుహాన్‌లో చర్చలు (మహాబలిపురం, వుహాన్‌ అంశాలు చూసుకోవాలి)
 • భారత్‌-నేపాల్‌ సరిహద్దు సమస్యలు. ఉదా: కాలాపాని అంశం
 • భారత్‌ బంగ్లాదేశ్‌ సరిహద్దులు
 • భారత్‌-అమెరికా సంబంధాలు
 • అమెరికా ఎన్నికలు
 • దక్షిణ అమెరికాకు సంబంధించి బ్రెజిల్‌లోని అమెజాన్‌ 
 • అడవులకు సంబంధించిన అంశాలు
 • ఇజ్రాయెల్‌ - పాలస్తీనా అంశాలు
 • ఇరాన్‌ - అమెరికా వైరం
 • ఇజ్రాయెల్‌ - యూఏఈ ఒప్పందాలు
 • ఆఫ్రికా-ఆసియా గ్రోత్‌ కారిడార్‌
 • భారత్‌ సాయుధదళాలు ఇతర దేశాల దళాలతో కలిసి చేపడుతున్న విన్యాసాలు. ఉదా: మలబార్‌ ఎక్సర్‌ సైజ్‌
 • సింధు జలాల ఒప్పందం
 • రైసీనా డైలాగ్‌
 • షాంఘై కోపరేటివ్‌ ఆర్గనైజేషన్‌- భారత్‌ సభ్యత్వం
 • హిందూ మహాసముద్ర కమిషన్‌
 • శ్రీలంక ఎన్నికలు, రాజ్యాంగ సవరణలు
 • పసిఫిక్‌ సముద్రపు దీవులు
 • దక్షిణ చైనా సముద్రంలో వివాదాలు
 • థాయ్‌లాండ్‌లో మలక్కా సంధి
 • వార్తల్లో ఉన్న అగ్నిపర్వతాలు
 • బ్రిక్స్‌, బిమ్‌స్టెక్‌, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఇలాంటి అంశాలు చూసుకోవాలి.
 • ఇలా ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి ఈ ఏడాది ముఖ్యమైన అంశాల జాబితాను రూపొందించుకుని సన్నద్ధం కావాలి. ఇది మీ ప్రిపరేషన్‌ ప్రక్రియని చాలా సలువుగా మార్చేస్తుంది.

నిరంతర సాధనే ముఖ్యం

ప్రిలిమ్స్‌ పరీక్ష పాసవడానికి అభ్యర్థి విస్తృతంగా చదవడం ఎంతముఖ్యమో, ప్రాక్టీస్‌ అంతకంటే ముఖ్యం. రోజుకు ఒక నమూనా పరీక్ష అయినా పరీక్షకు ముందురోజు వరకు ప్రాక్టీస్‌ చేస్తూనే ఉండాలి. ఇలా చేయడం ద్వారా పరీక్ష  హాల్‌లోకి వెళ్లే నాటికి పరీక్షని ఎదుర్కోవాల్సిన విధానంపై అవగాహన పెరగడంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి గందరగోళానికి లోను కాకుండా పరీక్షకు ముందున్న ఈ కొన్ని రోజులను వీలైనంత మెరుగ్గా ఉపయోగించుకోండి.

ఎం బాలలత

సివిల్స్‌ ఫ్యాకల్టీ

హైదరాబాద్‌logo