మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nipuna-education - Sep 15, 2020 , 23:39:12

సకల కళా కోర్సులు కళాత్మక కొలువులు

సకల కళా కోర్సులు కళాత్మక కొలువులు

  • జేఎన్‌ఏఎఫ్‌ఏయూ.. ఫైన్‌ ఆర్ట్స్‌ & డిజైన్‌ ఎంట్రన్స్‌- 2020

వివిధ రంగాల్లో కొలువులకు విపరీతమైన పోటీ నెలకొంటున్న ప్రస్తుత తరుణంలో (ఫైన్‌ ఆర్ట్స్‌) నృత్యం, సంగీతం, స్కల్‌ప్చర్‌ (శిల్పం), చిత్రలేఖనం ఇలా కళాత్మకమైన టాలెంట్‌ అనేక అవకాశాలకు మార్గాలవుతున్నాయి. వీటికి ఉన్నత విద్యావకాశాలతో పాటు ఉపాధి కూడా కొదువలేదు. అందుకే ఈ కోర్సులకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతుంది. వీటిని పలు యూనివర్సిటీలు ఫైన్‌ ఆర్ట్స్‌ పేరుతో సంబంధిత అంశాల్లో ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో అర్హత సాధిస్తే పలు రంగాల్లో కెరీర్‌ ప్రారంభించవచ్చు. ఆకర్షణీయమైన వేతనాలు, గుర్తింపు, స్వయం ఉపాధి ఇందులో ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌ (శిల్పం), ఫొటోగ్రఫీ, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, యానిమేషన్‌ తదితర కోర్సులు ఫైన్‌ ఆర్ట్స్‌ పరిధిలోకి వస్తాయి. వీటిని ప్రధానంగా హైదరాబాద్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ఈ కోర్సులను ఆఫర్‌ చేస్తుంది. 

ఇంటర్‌లో ఏ గ్రూప్‌ చదివినవారైనా ఈ కోర్సుల్లో చేరవచ్చు. సాధారణ డిగ్రీ కోర్సుల వ్యవధి మూడేళ్లయితే.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (BFA) నాలుగేళ్లు. కొన్ని సంస్థలు బీఏ ఫైన్‌ ఆర్ట్స్‌ పేరుతో మూడేళ్ల కోర్సులను కూడా అందిస్తున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఈ విభాగంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదువుకోవచ్చు. వివిధ యూనివర్సిటీల్లో ప్రత్యేక విభాగంగా ఫైన్‌ ఆర్ట్స్‌ ఉన్నది. ఇందులో యూజీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీలను సైతం అందిస్తున్నాయి. ఎగ్జామ్‌ నిర్వహించి అందులో మెరిట్‌ ఆధారంగానే కోర్సులోకి తీసుకుంటున్నారు. ఇంకా కొన్ని సంస్థలు ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా యూజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఉపాధి పొందే వీలుంది. ఇంకా ఆసక్తి ఉంటే పీజీలో చేరవచ్చు. ఉన్నత విద్య ద్వారా సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్‌ కోర్సులు ఎంచుకోవచ్చు. ఇంకా రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల్లోనే కాకుండా జాతీయస్థాయి సంస్థల్లోనూ ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుకునే అవకాశం ఉన్నది. 

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) అప్లయిడ్‌ ఆర్ట్స్‌ పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, ఫొటోగ్రఫీ తదితర కోర్సులను తెలుగు రాష్ర్టాల్లో పలు విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. అయినా హైదరాబాద్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులకు పెట్టింది పేరు. 

జేఎన్‌ఏఎఫ్‌ఏయూ అందిస్తున్న కోర్సులు

జేఎన్‌ఏఎఫ్‌ఏయూ నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. బీఎఫ్‌ఏ (పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, యానిమేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ఆరు పేపర్లు ఉంటాయి. 

ఉన్నత విద్యాఅవకాశాలు

బీఎఫ్‌ఏ అనంతరం ఉన్నత విద్యాఅవకాశాలు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధితో ఎంఎఫ్‌ఏ కోర్సులు చేయవచ్చు. ఫైన్‌ ఆర్ట్స్‌, విజువల్‌ ఆర్ట్స్‌, పెయింటింగ్‌, ప్రింట్‌ మేకింగ్‌, స్కల్‌ప్చర్‌, ఆర్ట్‌ హిస్టరీ అండ్‌ విజువల్‌ స్టడీస్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, ప్లాస్టిక్‌ ఆర్ట్స్‌, పోటరీ అండ్‌ సిరామిక్స్‌, టెక్స్‌టైల్స్‌ డిజైన్‌ తదితర కోర్సులను పీజీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఫైన్‌ ఆర్ట్స్‌లో యూజీ కోర్సులు అందిస్తున్న సంస్థలన్నీ దాదాపు పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో యూజీ లేకపోయినా పీజీలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీజీ, పీహెచ్‌డీ స్థాయిల్లో కోర్సులు నిర్వహిస్తుంది. ఎంఎఫ్‌ఏ అనంతరం ఎంఫిల్‌ లేదా నేరుగా పీహెచ్‌డీ కోర్సులు చేయవచ్చు. 

ఉపాధి

ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు చేసిన వారికి వివిధరంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మంచి ఆదాయంతో పాటు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతున్న రంగం ఫైన్‌ ఆర్ట్స్‌. విభాగాన్ని బట్టి సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ సంస్థలు, అడ్వైర్టెజింగ్‌ కంపెనీలు, గ్రాఫిక్‌, ప్రింటింగ్‌, పబ్లిషింగ్‌, ఫ్యాషన్‌ సంస్థలు, ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీ, టెక్స్‌టైల్స్‌, ఫిల్మ్‌ అండ్‌ థియేటర్‌, మల్టీమీడియా, యానిమేషన్‌ తదితర సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. ఆర్ట్‌ గ్యాలరీల్లో వీరిని నియమించుకుంటారు. టెక్స్‌టైల్‌ కోర్సులు చదివినవారు వస్త్ర పరిశ్రమల్లో ఉపాధి పొందవచ్చు. ఫొటోగ్రఫీ చేసినవారికి అన్ని చోట్లా అవకాశాలుంటాయి. చాలామంది ఫ్రీలాన్సింగ్‌, స్వయం ఉపాధి (వర్క్‌షాప్‌ నడపడం) ద్వారా పెద్దమొత్తంలో ఆర్జిస్తున్నారు. ఎండోమెంట్‌, ఆర్కియాలజికల్‌ విభాగాల్లో వీరికి ఉద్యోగాలు లభిస్తాయి. ఆసక్తి ఉంటే టెలివిజన్‌, ఫ్యాషన్‌ రంగాల్లో ప్రవేశించవచ్చు. అకడమిక్‌, ఆర్కిటెక్చర్‌, సినిమా పరిశ్రమల్లోనూ అవకాశాలున్నాయి. సృజనాత్మక విభాగాలైన మేగజీన్లు, అడ్వైర్టెజింగ్‌ ఏజెన్సీలు, వార్తాపత్రికల్లోని కొన్ని విభాగాల్లో పనిచేయవచ్చు. మ్యూజియాలు, ప్రైవేటు గ్యాలరీల్లోనూ అవకాశాలు లభిస్తాయి. 

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో ఇంటీరియర్‌ డిజైన్‌ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. 

ప్రస్తుతంలో ఇల్లు, ఆఫీసుల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ఇంటీరియర్‌ డిజైన్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కోర్స్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ కోర్స్‌ పూర్తిచేసినవారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ప్రైవేటు రంగం లో బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. ఆర్ట్‌ డైరెక్టర్స్‌, ఫ్లోరల్‌ డిజైనర్స్‌, ఇండస్ట్రియల్‌ డిజైనర్స్‌, ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్ట్‌గా అవకాశాలు ఉంటాయి. కార్పొరేట్‌ ఇంటీరియర్‌ సంస్థల్లోనూ మంచి అవకాశాలతో పాటు ఫ్రీలాన్స్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌గా రాణించవచ్చు.

యానిమేషన్‌

అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణత లేదా తత్సమానం

కాలవ్యవధి: 4 ఏండ్లు 

అప్లయిడ్‌ ఆర్ట్స్‌

అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణత లేదా తత్సమానం

కాలవ్యవధి: 4 ఏండ్లు 

ఫొటోగ్రఫీ

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమానం

కాలవ్యవధి: 4 ఏండ్లు 

పెయింటింగ్‌

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమానం

కాలవ్యవధి: 4 ఏండ్లు 

స్కల్‌ప్చర్‌

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమానం

కాలవ్యవధి: 4 ఏండ్లు

నోటిఫికేషన్‌

ప్రవేశపరీక్ష: ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (FADEE) 2020

కోర్సులు

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (BFA) అప్లయిడ్‌ ఆర్ట్‌, పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, యానిమేషన్‌, ఫొటోగ్రఫీ.

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌- ఇంటీరియర్‌ డిజైన్‌

అర్హత: ఇండర్మీడియట్‌ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1200, ఎస్సీ, ఎస్టీ రూ.600

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: సెప్టెంబర్‌ 30

పరీక్ష తేదీ: 2020, అక్టోబర్‌ 18, 19

- సత్యం గౌడ్‌ సూదగాని


logo