గురువారం 24 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 12, 2020 , 00:06:40

కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్

తెలంగాణ

పద్యరచనామృత బోధిని ఆవిష్కరణ

తెలుగులో పద్య రచన నేర్పించే పుస్తకం ‘పద్యరచనామృత బోధిని’ పుస్తకాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 2న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అమెరికాలో స్థిరపడిన పెద్దపల్లి జిల్లా మంథని వాసి కొల్లారపు ప్రకాశరావు శర్మ రచించారు. ఈయన ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తూ ఎంతోమందిని కవులుగా తీర్చిదిద్దారు.

ఆలంబన్‌ యాప్‌

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రగతిభవన్‌ నుంచి మంత్రి కేటీఆర్‌ ‘ఆలంబన్‌ యాప్‌'ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ చేనేత కార్మికుల స్థితిగతులను అధ్యయనం చేసి, మార్కెటింగ్‌కు ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో, నేతకార్మికుల ఆరోగ్యం దెబ్బతినకుండా, రసాయనాల వినియోగం తగ్గించి, పర్యావరణహితంగా ఉత్పత్తులు సాగించేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)తో, చేనేత కార్మికులు, మహిళలకు జీవనోపాధి, వస్ర్తాల మార్కెటింగ్‌ కోసం యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ)తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 

జాతీయం

ఐసీడబ్ల్యూఏ నూతన కార్యవర్గం

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ వరల్డ్‌ అఫైర్స్‌ (ఐసీడబ్ల్యూఏ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు కేంద్రప్రభుత్వం ఆగస్టు 5న ఉత్తర్వులు జారీచేసింది. దీనికి అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ఉపాధ్యక్షులుగా విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయిసంఘం చైర్మన్‌ పీపీ చౌదరి, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌, సభ కార్యదర్శిగా ఐఎఫ్‌ఎస్‌ రిటైర్డ్‌ ఆఫీసర్‌ టీసీఏ రాఘవన్‌ నియమితులయ్యారు.

కరోనా ల్యాబొరేటరీ

దేశంలో తొలిసారిగా మొబైల్‌ కరోనా ల్యాబొరేటరీని ఆగస్టు 6న బెంగళూరులో ప్రారంభించారు. రోజుకు 400 ఆర్టీ పీజీఆర్‌ టెస్టులను నిర్వహించే సామర్థ్యంగల ఈ ల్యాబ్‌ త్వరగా వైరస్‌ నిర్ధారణ చేయగలదు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ దీన్ని ఆమోదించింది.

‘సిఫార్సు లేఖ’ పథకం

దేశవ్యాప్తంగా వీధి వర్తకులకు మేలుచేసే ‘సిఫార్సు లేఖ (ఎల్‌ఓఆర్‌)’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 7న ప్రారంభించింది. అర్హులైన వీధి వ్యాపారులకు ‘పీఎం స్వనిధి’ కింద రుణం పొందేందుకు ‘సిఫార్సు లేఖ (ఎల్‌ఓఆర్‌)’ కోసం పట్టణ స్థానిక సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. వీధి వ్యాపారుల కోసం జూన్‌ 1న ప్రధాన్‌మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి), జూలై 2న పీఎం స్వనిధి పోర్టల్‌ ప్రారంభమయ్యాయి.   

కిసాన్‌ రైలు

దేశంలో తొలిసారిగా కిసాన్‌ రైలును రైల్వే మంత్రి, పీయూష్‌ గోయల్‌, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఆగస్టు 7న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. త్వరగా పాడైపోయే పాలు, మాంసం, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులను వేగంగా ఈ రైలు ద్వారా రవాణా చేస్తారు. మహారాష్ట్రలోని దేవ్‌లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్‌ వరకు ఈ రైలు నడుస్తుంది. 1,519 కిలోమీటర్ల దూరాన్ని 32 గంటల్లో ప్రయాణిస్తుంది.

6వ జాతీయ చేనేత దినోత్సవం

కేంద్ర చేనేత శాఖ 6వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని ఆగస్టు 7న నిర్వహించింది. స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించి 100 ఏండ్లు పూర్తయిన సందర్భంగా 2015 నుంచి ఆగస్టు 7ను జాతీయ చేనేత రోజుగా గుర్తించారు. ప్రత్యక్షంగా చేనేత రంగంపై 43 లక్షల మంది ఆధారపడ్డారు. చేనేత వస్ర్తాల ఉత్పత్తి 15 శాతం ఉంది.

అంతర్జాతీయం

స్పేస్‌ ఎక్స్‌ రికార్డు

అమెరికాకు చెందిన ‘స్పేస్‌ ఎక్స్‌' సంస్థ రూపొందించిన డ్రాగన్‌ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎన్‌ఎస్‌) నుంచి ఇద్దరు వ్యోమగాములను ఆగస్టు 2న విజయవంతంగా భూమి మీదకు తీసుకువచ్చింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేటు నౌకగా గుర్తింపు పొందింది. పశ్చిమ ఫ్లోరిడాలోని పెన్సాకోలా (మెక్సికో అగాథం) తీరానికి చేరువలో ప్యారాచూట్ల సాయంతో సాఫీగా దిగింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వ్యోమగాములు ఇలా సముద్ర జలాలపై దిగడం 45 ఏండ్లలో ఇదే మొదటిసారి.

బాలిస్టిక్‌ క్షిపణి

అమెరికా వైమానిక దళం కాలిఫోర్నియాలోని వాండెన్‌ బర్గ్‌ నుంచి నిరాయుధ మూడు టెస్ట్‌ రీ ఎంట్రీ వాహనాల్లో అమర్చి ఎల్‌జీ ఎం-30 జీ మినిట్‌మ్యాన్‌ నుంచి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ఆగస్టు 4న ప్రయోగించారు. ఇది 6759 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. ఘన ఇంధనం వాడుతారు.

లైన్‌ లైన్‌ క్రెడిట్‌

భారత ప్రభుత్వం మాల్దీవుల ఇండస్ట్రియల్‌ ఫిషరీ కంపెనీ (ఎంఐఎఫ్‌సీఓ)లో సదుపాయాలను విస్తరించడానికి మాల్దీవులకు 18 మిలియన్‌ డాలర్ల విలువైన లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను విస్తరించడానికి ఆగస్టు 6న ఒప్పందం కుదుర్చుకుంది. 50 టన్నుల ఐస్‌ ప్లాంట్‌ను అభివృద్ధి చేయడానికి అలాగే 100 టన్నుల ఐస్‌ స్టోరేజ్‌ సదుపాయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. చేపల సేకరణవైపు పెట్టుబడులు, నిల్వ సామర్థాన్ని పెంచడానికి ఈ నిధులను ఆర్థిక సహాయంగా ఉపయోగపడుతాయి.

బీరుట్‌లో పేలుడు

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో జరిగిన పేలుడువల్ల రెండు వారాలపాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు లెబనాన్‌ ప్రభుత్వం ఆగస్టు 5న ప్రకటించింది. 2013లో స్వాధీనం చేసుకున్న 2,750కుపైగా టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను ఒక గోదాంలో ఉంచారు. అది పేలడంవల్లే ఈ ఘటన జరిగిందని లెబనాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహమ్మద్‌ ఫాహ్మి అభిప్రాయం వెలిబుచ్చారు. 

రాజపక్స పార్టీ విజయం

ఆగస్టు 7న విడుదలైన శ్రీలంక పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో శ్రీలంక పీపుల్స్‌ పార్టీ (ఎస్‌ఎల్‌పీపీ) విజయం సాధించింది. 255 స్థానాలున్న పార్లమెంటులో ప్రధాన మంత్రి మహింద రాజపక్స నేతృత్వంలోని ఎస్‌ఎల్‌పీపీ, దాని మిత్రపక్షాలు 150 స్థానాల్లో గెలిచాయి. ఎస్‌ఎల్‌పీపీ సొంతంగా 145 స్థానాలు దక్కించుకుంది. ఆగస్టు 9న రాజపక్స ప్రధానిగా నాలుగోసారి ప్రమాణం చేశారు.

వార్తల్లో వ్యక్తులు

దేదార్‌ సింగ్‌ గిల్‌

భారత సంతతికి చెందిన దేదార్‌ సింగ్‌ గిల్‌ సింగపూర్‌ సిటీ స్టేట్‌ హైకోర్టు జడ్జిగా ఆగస్టు 3న దేశాధ్యక్షురాలు అలియా యాకోబ్‌ సమక్షంలో ప్రమాణం చేశారు. ఆయన 2018లో జ్యుడీషియల్‌ కమిషనర్‌గా మొదట సుప్రీంకోర్టు బెంచ్‌లో చేరారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈవోగా శశిధర్‌

- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈవోగా శశిధర్‌ జగదీశన్‌ ఆగస్టు 5న నియమితులయ్యారు. ఈ బ్యాంక్‌ను 1994లో స్థాపించారు. శశిధర్‌కు బ్యాంకింగ్‌ రంగంలో 25 ఏండ్ల అనుభవం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత సీఈవో ఆదిత్య పూరి. 

లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా మనోజ్‌

- జమ్ముకశ్మీర్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా మనోజ్‌ సిన్హా ఆగస్టు 6న నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈయన మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. జమ్ముకశ్మీర్‌ తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అయిన గిరీష్‌చంద్ర ముర్ము ఇటీవల రాజీనామా చేశారు. జమ్ముకశ్మీర్‌, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రతిపాదించి 370 ఆర్టికల్‌ను రద్దుచేసి ఆగస్టు 5 నాటికి ఏడాది పూర్తయ్యింది. 

సాదియా మృతి

- ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అయిన సాదియా దెహ్‌ల్వి ఆగస్టు 6న క్యాన్సర్‌తో మరణించారు. 2017లో ఢిల్లీ వంటకాలపై ‘జాస్మిన్‌ అండ్‌ జిన్స్‌: మెమరీస్‌ అండ్‌ రెసిపీస్‌ ఆఫ్‌ మై ఢిల్లీ’ పేరుతో పుస్తకం రాశారు. కుశ్వంత్‌ సింగ్‌ రాసిన ఉమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ మై లైఫ్‌ పుస్తకాన్ని ఈమెకు అంకితమిచ్చారు. 

సారా గిడియోన్‌

- అమెరికాలో భారత సంతతికి చెందిన సారా గిడియోన్‌ మైనే రాష్ట్రం నుంచి డెమోక్రటిక్‌ పార్టీ నుంచి సెనెటర్‌గా పోటీచేస్తున్నారని అమెరికా మీడియా ఆగస్టు 6న తెలిపాయి. ఆమె గెలిస్తే సెనెటర్‌గా ఎన్నికైన భారత సంతతి రెండో మహిళగా గుర్తింపు పొందుతారు. తొలిసారిగా కాలిఫోర్నియా సెనెటర్‌గా కమలా హ్యారిస్‌ ఎన్నికయ్యారు.

క్రీడలు

సెప్టెంబర్‌ 19న ఐపీఎల్‌

ఆగస్టు 2న జరిగిన ఐపీఎల్‌ పాలకమండలి సమావేశంలో లీగ్‌ ఆరంభ, ముగింపు తేదీలను ఖరారు చేశారు. ఐపీఎల్‌-13 సెప్టెంబర్‌ 19న ఆరంభమై నవంబర్‌ 10న ముగుస్తుంది. దుబాయ్‌, అబుదాబి, షార్జా స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. యూఏఈలో లీగ్‌ నిర్వహించేందుకు బీసీసీఐ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది.

హామిల్టన్‌కు బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌

ఈ ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌ 1) సీజన్‌లోని నాలుగో రేసు బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రిలో బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. ఆగస్టు 2న ఇంగ్లండ్‌లోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన ఈ రేసును పోల్‌ పొజిషన్‌తో హామిల్టన్‌ నిర్ణీత 52 ల్యాప్‌లను అందరికంటే ముందుగా గంటా 28 నిమిషాల 01.283 సెకన్లలో ముగించాడు. మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) రెండో, చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. 


వేముల సైదులు జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నిపుణులు

ఆర్‌సీ రెడ్డి  స్టడీ సర్కిల్‌ 

హైదరాబాద్‌logo