మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 05, 2020 , 04:10:43

బట్టీకి స్వస్తి

బట్టీకి స్వస్తి

 • నూతన జాతీయ విద్యావిధానం-2020

మార్పు అనేది ప్రకృతి సహజం. మార్పునకు తగినట్లుగా మసులుకోకపోతే మన మనగడకే ముప్పు. ఈ సంస్కరణల కోసం విద్యారంగం చాలాకాలం నుంచి ఎదురుచూస్తుంది. రాబోయే రోజుల్లో లక్షల మంది జీవితాలను ఈ విధానం మార్చబోతుంది. విద్యతో 

మనదేశం మరింతగా కాంతులీనాలి. సుసంపన్నత సాధించాలి.

- ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

 • విద్యారంగంలో మార్పుల కోసం 2017లో డాక్టర్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలో నియమించిన కమిటీ 2018, డిసెంబర్‌లో 484పేజీల నివేదికను కేంద్రమానవ వనరుల అభవృద్ధిశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌కు అందచేసింది. దీంతో నూతన విద్యావిధానం ముసాయిదాపై కేంద్ర కేబినెట్‌ 2020, జూలై 29న అమోదించింది. దీనిని 22 భాషల్లోకి అనువదించారు. 
 • దేశంలో జాతీయ విద్యావిధానాన్ని తొలుత 1968లో తర్వాత 1986లో రూపొందించారు. 1986 జాతీయ విద్యావిధానానికి 1992లో పరిమితంగా సవరణలు చేశారు. 1986 జాతీయ విద్యావిధానమే కొనసాగుతూ వచ్చింది.  

ప్రధానాంశాలు

 • మూడేండ్ల నుంచే చదువు మొదలు
 • మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరు విద్యా మంత్రిత్వశాఖగా మార్పు
 • 3 నుంచి 18 ఏండ్ల వరకు ఉచిత నిర్బంధ విద్య. అంటే ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యాహక్కు.
 • 5వ తరగతి వరకు మాతృభాషలో బోధన. వీలైతే 8వ తరగతి వరకు  
 • 6వ తరగతి నుంచే కోడింగ్‌, పోగ్రామింగ్‌, వృత్తివిద్య కోర్సులు 

వినూత్న సబ్జెక్టులతో కాంబినేషన్‌

 • బహుభాషల బోధన దిశగా నూతన విద్యావిధానం.
 • సంస్కృతాన్ని పాఠశాలల్లోని అన్ని స్థాయిల్లో ఐచ్ఛికంగా 3 భాషల విధానం భాగంలో ఎంచుకోవచ్చు. 
 • పాఠశాల విద్యలో ఇంటర్‌ విద్య విలీనం. 
 • స్కూల్‌ పీజుల నియత్రణకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటు 
 • విద్యార్థులపై కరికులం భారం తగ్గించాలి. 
 • ఐఐటీ లాంటి ఉన్నత విద్యాసంస్థలు 2040 నాటికి సంపూర్ణ విద్య (హోలిస్టిక్‌ ఎడ్యుకేషన్‌)ను అందించడమే లక్ష్యంగా ఎన్నుకోవాలి. 
 • ఏటా పరీక్షలు ఉండవు. 3, 5, 8 తరగతి విద్యార్థులకు మాత్రమే పరీక్షలు. 
 • ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు ప్రాధాన్యం. 
 • ఎన్‌ఈపీ-2020 కింద బడి వెలుపల ఉన్న సుమారు 2 కోట్ల మందిని పాఠశాలల్లోకి రప్పించాలి.
 • ఏ సంవత్సరంలోనైనా పాఠశాలలో చేరవచ్చు. బయటకు రావచ్చు. 
 • ఎంతమేర చదువుకుంటే అంతవరకు సర్టిఫికెట్‌. ప్రతి ఏడాది ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ జారీచేసే విధానం. 
 • డిగ్రీ విద్యార్థి ఏ సంవత్సరంలో చదువు మానేసినప్పటికీ ప్రయోజనం పొందేలా కీలకమైన సంస్కరణలు తీసుకువచ్చారు. డిగ్రీ మధ్యలో మానేసిన సర్టిఫికెట్‌.
 • డిగ్రీకోర్సు కాలవ్యవధి మూడేండ్ల నుంచి నాలుగేండ్లుగా మార్పు. బోర్డు పరీక్షల ప్రాధాన్యాన్ని తగ్గించి నైపుణ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహించే చర్యలు తీసుకొంటారు. 
 • డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశం. 
 • దేశంలో అగ్రశ్రేణి విదేశీ సంస్థల క్యాంపస్‌లు.
 • కాలేజీలన్నీ 15 ఏండ్లలో ‘అటానమస్‌' కావాలి.
 • వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష. 
 • ఇప్పటివరకు ఇంగ్లిష్‌, హిందీలకే పరిమితమైన ఈ-కంటెంట్‌ను తెలుగుతో పాటు 8 భారతీయ భాషల్లో అభివృద్ధిచేసి అమల్లోకి తెస్తారు.
 • ఎంఫిల్‌ కోర్సుల తొలిగింపు.
 • లా, వైద్య విద్య మినహా అన్నింటికీ ఒకే రెగ్యులేటరీ వ్యవస్థ.  
 • వెనుకబడిన ప్రాంతాలు, వర్గాల కోసం స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ జోను.్ల
 • విద్యారంగానికి జీడీపీలో కేటాయిస్తున్న 4 శాతం నిధులను 6 శాతానికి పెంచాలి.
 • 2030 నాటికి జిల్లాకు ఒకటి చొప్పున బహుళ శాస్త్రాల విద్యాసంస్థలను నెలకొల్పాలి. 


ఫౌండేషన్‌ కోర్సు (3 నుంచి 8 ఏండ్లు)

 • ప్రీ ప్రైమరీతో పాటు 1, 2 తరగతులు ఉంటాయి. ఐదేండ్ల ఫౌండేషన్‌ కోర్సులో మొదటి మూడేండ్లు 3-6 సంవత్సరాల వారికి ప్లే స్కూల్‌ ఉంటుంది. 3-6 ఏండ్ల విద్యార్థులకు పూర్వప్రాథమిక విద్యను అంగన్‌వాడీలు, బాలవాడీల ద్వారా నిర్వహిస్తారు. 3-6 ఏండ్లు మానసిక వికాసానికి అనువైనదిగా అంతర్జాతీయంగా గుర్తించారు. పూర్వప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఇక ఒకే పాఠ్యప్రణాళిక ఉంటుంది. దీంతో ప్రీ ప్రైమరీ విద్య చట్టబద్ధమైనది. ప్రాథమిక స్థాయిలో అక్షరాలు, భాషలు, అంకెలు, సంఖ్యలు, లెక్కలు, రంగులు, ఫిలాసాఫికల్‌ థింకింగ్‌, లాజికల్‌ థింకింగ్‌, ప్రాబ్లం సాల్వింగ్‌, డ్రాయింగ్‌, పెయింటింగ్‌, విజువల్‌ ఆర్ట్స్‌ తదితర అంశాలు దీనిలో ఉంటాయి.   
 • ప్రిపరేటరీ స్టేజీ (8-11)
 • 8-11 సంవత్సరాల వయస్సువారికి 3, 4, 5 తరగతులు ఉంటాయి. మాతృ/ప్రాంతీయ/స్థానిక భాషలో బోధించాలి.
 • మిడిల్‌ స్టేజ్‌ (11-14)
 • 11-14 సంవత్సరాల వయస్సువారికి 6, 7, 8 తరగతులు ఉంటాయి. ఆరో తరగతి నుంచే వృత్తివిద్య, కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌ నేర్పుతారు. 
 • సెకండరీ స్టేజీ (14-18)
 • 14-18 సంవత్సరాల వయస్సువారికి 9, 10, 11, 12 తరగతులు ఉంటాయి. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు ఏ కూర్పు సబ్జెక్టులైనా తీసుకోవచ్చు. అంటే ఫిజిక్స్‌తో పాటు చరిత్ర లేదా వృత్తివిద్య కోర్సులు నేర్చుకోవచ్చు. సెకండరీ స్థాయిలో కొరియన్‌, జపనీస్‌, థాయ్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, పోర్చుగీస్‌, రష్యన్‌ భాషలను భోధించవచ్చు.  
 • కస్తూర్బా పాఠశాలల్లో 11, 12 తరగతులు ప్రారంభిస్తారు.
 • యూజీసీ, ఏఐసీటీఈ ఉండవు: ప్రస్తుతం విద్యావ్యవస్థ నియంత్రణ కోసం యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపాధ్యాయ మండలి లాంటి వ్యవస్థలున్నాయి. వీటన్నింటిని విలీనం చేసి మొత్తం ఉన్నత విద్యావ్యవస్థ నియంత్రణకు ‘హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ను ఏర్పాటు చేస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే నిబంధనలు ఏర్పాటు చేస్తారు. 

మానవవనరుల మంత్రిత్వశాఖ పేరు మార్పు

‘కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ’ పేరును 1986లో రాజీవ్‌గాంధీ హయాంలో ‘మానవవనరుల మంత్రిత్వ శాఖ’గా మార్చారు. తొలి మానవ వనరుల విద్యాశాఖ మంత్రి పీవీ నర్సింహారావు. ఇప్పుడు మళ్లీ దానిని ‘కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ’గా మార్చారు.

పరీక్షలు 

 • 3, 5, 8 తరగతుల్లో మాత్రమే పరీక్షలు రాచాలి. 10, 12 బోర్డు పరీక్షలు ఇక సులభతరం. నేషనల్‌ సెంటర్‌ పర్‌ఫామెన్స్‌ అసెస్‌మెంట్‌ రివ్యూ అండ్‌ అనాలసిస్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ ఫర్‌ హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ (పీఏఆర్‌కేఏహెచ్‌)ను ఏర్పాటు చేస్తారు. ఇది విద్యార్థుల మూల్యాంకనానికి సంబంధించిన ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందిస్తుంది. అలాగే స్టేట్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలకు మార్గనిర్దేశం చేస్తుంది. నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలను నిర్వహిస్తుంది. దాంతోపాటు దేశంలో లెర్నింగ్‌ అవుట్‌కమ్స్‌ను పర్యవేక్షిస్తుంది.   
 • ఉపాధ్యాయులు: టీచర్లకు నేషనల్‌ ప్రొఫెషనల్‌ స్టాండర్డ్స్‌ను రూపొందిస్తారు. నాలుగేండ్ల బీఈడీ చదివితేనే ఉపాధ్యాయ కొలువులకు అర్హులు. సబ్జెక్ట్‌ టీచర్ల నియామకంలో టెట్‌ స్కోర్‌, ఎన్‌టీఏ టెస్ట్‌ స్కోర్‌, తరగతిలో బోధన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 
 • పురోగతి నివేదికలు (ప్రోగ్రెస్‌ కార్డు): ఈ ప్రోగ్రెస్‌ కార్డులో సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, పీర్‌ అసెస్‌మెంట్‌, టీచర్‌ అసెస్‌మెంట్‌ ఉంటాయి. దీనిలో ప్రాజెక్ట్‌ బెస్ట్‌ లెర్నింగ్‌, ఎంక్వైరీ బెస్ట్‌ లెర్నింగ్‌, క్విజెస్‌, రోల్‌ప్లేస్‌, గ్రూప్‌ వర్క్‌, పోర్టుఫోలియో వంటివాటికి ప్రాధాన్యం ఉంటుంది. 


లక్ష్యాలు

 • 2022 నాటికి జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాల (ఎన్‌పీఎస్‌టీ) రూపకల్పన చేయాలి.
 • 2025 నాటికి మూడేండ్ల నుంచి ఆరేండ్ల వయస్సుగల వారందరికి అక్షరాలు, అంకెలు తెలిసి ఉండాలి. 
 • 2025 నాటికి కనీసం 50 శాతం మంది విద్యార్థులకు వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశం ఉండాలి. 
 • 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. 100 శాతం యువత వయోజన అక్షరాస్యతను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 
 • 2035 నాటికి ఉన్నతవిద్యలో స్థూల ఎన్‌రోల్‌మెంట్‌ నిష్పత్తి (జీఈఆర్‌)ని 2035 నాటికి 50 శాతానికి చేర్చాలి. 

కొత్త విద్యాసంస్థలు

 • మేరు: ప్రతి జిల్లా లేదా సమీప జిల్లాలో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్‌ రిసెర్చ్‌ వర్సీటీల ఏర్పాటు.
 • ప్రతి రాష్ట్రంలో రాష్ట్రస్థాయి రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుచేయాలి. 
 • ఎన్‌ఆర్‌ఎఫ్‌: అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పెంచేలా నేషనల్‌ రిసెర్చ్‌ పౌండేఫన్‌ నెలకొల్పుతారు.
 • ఎన్‌ఈటీఎఫ్‌: విద్యారంగంలో సాంకేతిక వినియోగం పెంచేందుకు నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ఫోరం ఏర్పాటు చేశారు.    

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఈసీఐ)

 • మొత్తం ఉన్నత విద్యావ్యవస్థ పాలనా వ్యవహారాల కోసం  హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఈసీఐ) ఏర్పాటు చేయనున్నారు. వైద్య, న్యాయ విద్య మాత్రం మినహాయింపు. హెచ్‌ఈసీఐకి నాలుగు స్వతంత్ర విభాగాలుంటాయి. అవి నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ కౌన్సిల్‌ (ఎన్‌హెచ్‌ఈఆర్‌సీ) అనేది రెగ్యులేషన్‌ కోసం, ప్రమాణాలు నిర్దేశించడం కోసం జనరల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (జీఈసీ), ఫండింగ్‌కు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ గ్రాంట్స్‌ కౌన్సిల్‌ (హెచ్‌ఈజీసీ), అక్రెడిటేషన్‌కు నేషనల్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఏసీ) ఏర్పాటవుతాయి. రెగ్యులేషన్‌, అక్రెడిటేషన్‌, అకడమిక్‌ ప్రమాణాలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థలన్నింటికి ఒకే నిబంధనలు వర్తిస్తాయి.
 • ప్రధానమంత్రి నేతృత్వంలో రాష్ట్రీయ విద్యా ఆయోగ్‌ లేదా జాతీయ విద్యా కమిషన్‌ ఏర్పడుతుంది.   

అనంతారపు కృష్ణయ్య జడ్‌పీహెచ్‌ఎస్‌ రామాపురం

నడిగూడెం (మం) సూర్యాపేట (జిల్లా) 9948750605


logo