మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 05, 2020 , 04:10:41

జాతీయోద్యమం

జాతీయోద్యమం

  • ప్రారంభంలో జాతీయ కాంగ్రెస్‌ పూర్తిగా మితవాద సంస్థ. లక్ష్యాలు మితమైనవి. నాయకులు మితవాదులు. వారు అనుసరించిన పద్ధతులు కూడా మితవాదమే. ఆ నాటి కాంగ్రెస్‌ లక్ష్యాల్లో ముఖ్యమైనవి దేశప్రజల్లో స్నేహం, అన్యోన్యం పెంచడం, ప్రజల్లో జాతి, కుల, మత, ప్రాంతీయ విభేదాలు తొలగించడం, ప్రజాభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి తెలియజేయడం.
  • 1885 నుంచి 1947 వరకు మూడు దశల్లో భారత జాతీయోద్యమం జరిగింది.
  • i. 1885 నుంచి 1905 వరకు మితవాద దశ
  • ii. 1905 నుంచి 1919 వరకు అతివాద దశ
  • iii. 1919 నుంచి 1947 వరకు గాంధీ యుగం
  • మితవాద జాతీయత (1885-1905)
  • ఈ కాలంలో మితవాదులు భారతపాలనా యంత్రాంగంలో అంచెలవారీ సంస్కరణలు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
  • మితవాద నాయకుల్లో సురేంద్రనాథ్‌ బెనర్జీ, దాదాభాయ్‌ నౌరోజీ, బద్రుద్దీన్‌ త్యాబ్జీ, ఫిరోజ్‌షామెహతా, గోపాలకృష్ణ గోఖలే, ఆనందాచార్యులు ముఖ్యులు
  • ఈ కాలంలో జాతీయ కాంగ్రెస్‌ తమ కోర్కెలను తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది. ఉద్యోగుల వద్దకు అర్జీలతో తమ ప్రతినిధి వర్గాలను పంపేవారు. ఇవన్నీ వినయపూర్వకంగా ఉండేవి. వారి క్యార్యక్రమాలు కేవలం ప్రార్థన, విజ్ఞప్తి, నిరసనలకు పరిమితమయ్యాయి.
  • ప్రభుత్వం వీరి విన్నపాలను పెద్దగా పట్టించుకునేదికాదు. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ ఆఖరివారంలో ఏదో ఒక పెద్దనగరంలో మూడు రోజులపాటు జరిగే వార్షిక సమావేశాల్లో దేశానికి సంబంధించిన అనేక విషయాలు చర్చించి తీర్మానాలు చేసేవారు. అయితే కాంగ్రెస్‌ వార్షిక సమావేశాలకు హాజరయ్యేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండేది.
  • మితవాద నాయకులందరికీ బ్రిటిష్‌ ప్రజాస్వా మ్య వ్యవస్థ మీద, వారి ప్రభుత్వంపట్ల సదభిప్రాయం ఉండేది. వారు దేశ ప్రజలకు బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి న్యాయపరమైన హక్కులు కోరేవారేకాని స్వరాజ్యాన్ని కోరలేదు.
  • మితవాదుల విజయాలు
  • వీరు తమ ప్రసంగాలు, రచనల ద్వారా దేశ ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడంలో కొంతమేరకు విజయాన్ని సాధించారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో ప్రాంతీయ, జాతి, మత, కుల, సంకుచిత భావాలను తొలగించి, జాతీయ భావాలను, ప్రజస్వామిక భావాలను వ్యాపింపజేశారు. అందువల్ల మితవాద కాలాన్ని జాతీయోద్యమంలో బీజదిశగా వర్ణిస్తారు.
  • 1892లో ప్రభుత్వం ‘బ్రిటిష్‌ ఇండియా కౌన్సిల్‌' చట్టాన్ని ప్రవేశపెట్టి కేంద్ర, ప్రాంతీయ శాసనమండలిలో సభ్యుల సంఖ్యను పెంచింది. మితవాద కాంగ్రెస్‌ నాయకులు రాజ్యంగా సంస్కరణల కోసం చేసిన ప్రయత్నాలవల్లనే ఆ చట్టాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం అమలుపరిచింది.
  • ఈ చట్టంవల్ల కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో సభ్యుల సంఖ్య పెరిగింది. బడ్జెట్‌ను చర్చించే హక్కు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నలు అడిగే హక్కులు సభ్యులకు లభించాయి.
  • 1905 వరకు జాతీయవాదులు ప్రతినిధి వర్గాలను తీసుకెళ్లి విజ్ఞాపన పత్రాలను సమర్పించి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి, తమ కోర్కెలు సమంజసమైనవని మెప్పించడానికి ప్రయత్నించారు. ఈ పద్ధతిని రాజకీయ యాచకత్వం అని కొందరు ఎగతాళి చేశారు.
  • ఈ కాలంలో వీరు చట్టబద్ధమైన పద్ధతులను అనుసరించి, సంస్కరణలను సాధించడానికి ప్రయత్నించారు.



సాసాల మల్లికార్జున్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల

9492 575 006


logo