మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 05, 2020 , 03:47:36

కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్

తెలంగాణ

పుస్తకావిష్కరణ

రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి రాసిన ‘ఎకో-టి కాలింగ్‌' పుస్తకాన్ని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ జూలై 30న ఆవిష్కరించారు.

సీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శిగా కృష్ణచైతన్య

కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఎఫ్‌ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్‌కు చెందిన కాసుల కృష్ణచైతన్య జూలై 30న ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న కోచింగ్‌ సెంటర్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న ఉద్దేశంతో తొలిసారిగా సీఎఫ్‌ఐని ఏర్పాటు చేశారు. దీనికి జాతీయ అధ్యక్షుడిగా మృత్యుంజయ్‌ నారాయణ్‌, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 

జాతీయం

కుమహర్‌ సశక్తీకరణ్‌ యోజన

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుమహర్‌ సశక్తీకరణ్‌ యోజన కార్యక్రమాన్ని జూలై 26న ప్రారంభించారు. దీనిలో భాగంగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషనర్‌ ఆధ్వర్యంలో 100 ఎలక్ట్రికల్‌ పాట్‌ వీల్స్‌ను పంపిణీ చేశారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో అట్టడుగున ఉన్న కుమ్మరి వర్గానికి చెందినవారికి వీటిని అందజేశారు. ఈ పథకం కుమ్మరులకు అధునాతన కుండల ఉత్పత్తులు, మార్కెట్‌ అనుసంధానాల కోసం ఉద్దేశించింది. 

ది ఇండియా వే

విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ రచించిన ‘ది ఇండియా వే: స్ట్రాటజీస్‌ ఫర్‌ యాన్‌ అన్‌సర్టెయిన్‌ వరల్డ్‌' పుస్తకాన్ని జూలై 28న విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని హార్పర్‌ కొలిన్స్‌ పబ్లికేషన్‌ ప్రచురించింది.

అదేవిధంగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రాసిన ‘క్వెస్ట్‌ ఫర్‌ రీస్టోరింగ్‌ ఫైనాన్షియల్‌ స్టేబిలిటీ ఇన్‌ ఇండియా’ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. దీన్ని SAGE పబ్లికేషన్స్‌ ప్రచురించింది.  

ఇంటర్నేషనల్‌ టైగర్స్‌ డే

జూలై 29న ఇంటర్నేషనల్‌ టైగర్స్‌ డే (అంతర్జాతీయ పులుల దినోత్సవం)ను నిర్వహించారు. ఈ ఏడాది థీమ్‌ ‘వాటి మనుగడ మనలో ఉంది.’ 2010లో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పులుల సంరక్షణలో భాగంగా జూలై 29ను టైగర్స్‌ డేగా గుర్తించారు. 2018 లెక్కల ప్రకారం దేశంలో పులుల సంఖ్య 2967. 1973లో జాతీయ పులుల సంరక్షణ ప్రాజెక్టును ఆమోదించే నాటికి 9 పులుల సంరక్షణ కేంద్రాలు ఉండేవి. ఇప్పుడు 50 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచంలో 13 దేశాల్లో ఉన్నాయి. దేశంలో పులుల జనాభా ఏడాదికి 6 శాతం పెరిగింది. ప్రతి నాలుగేండ్లకోసారి పులుల గణన చేస్తారు.

పది భావజాలాలు పుస్తకావిష్కరణ

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి రాసిన ది టెన్‌ ఐడియాలజీస్‌ తెలుగు అనువాదం ‘పది భావజాలాలు’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆన్‌లైన్‌ ద్వారా జూలై 28న ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో వర్తమాన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ఆధునిక సైద్ధాంతిక దృక్పథం అవసరమని వివరించారు. ఈ పుస్తకాన్ని ఓరియంట్‌ బ్లాక్‌ స్వాన్‌ సంస్థ ప్రచురించింది.

నూతన విద్యావిధానానికి కేబినెట్‌ ఆమోదం

జాతీయ విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ-2020)ను ప్రధాన మంత్రి అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్‌ జూలై 29న ఆమోదించింది. పాఠశాల, ఉన్నత విద్యారంగాల్లో పరివర్తన, సంస్కరణలను పెద్ద ఎత్తున చేయడమే ఈ విధానం లక్ష్యం. ఇది 21వ శతాబ్దపు మొదటి విద్యావిధానం. నేషన్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020 34 ఏండ్ల తర్వాత నేషనల్‌ పాలసీ ఆన్‌ ఎడ్యుకేషన్‌-1986ని భర్తీ చేస్తుంది. కస్తూరి రంగన్‌ కమిటీ సూచన మేరకు మానవ వనరుల శాఖను విద్యామంత్రిత్వ శాఖగా మార్చారు. 

అంతర్జాతీయం

కరెన్సీ స్వాప్‌

మాల్దీవులకు సాయం చేసేందుకు భారత్‌ 400 మిలియన్‌ డాలర్ల కరెన్సీ స్వాప్‌ (మార్పిడి)ని ప్రకటించిందని మాలేలో ఇండియన్‌ హై కమిషనర్‌ సంజయ్‌ సుధీర్‌ జూలై 26న వెల్లడించారు. కరోనాను ఎదుర్కొనేందుకు మెడికల్‌ సప్లయ్స్‌, మెడికల్‌ టీమ్స్‌, అత్యవసర ఆహార సరఫరాల్లో లిక్విడిటీ షార్టేజ్‌ను అధిగమించేందుకు ఇది తోడ్పడుతుంది.

సైక్లింగ్‌, వాకింగ్‌ డ్రైవ్‌

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కరోనా పోరులో భాగంగా స్థూలకాయానికి వ్యతిరేకంగా 2 బిలియన్ల సైక్లింగ్‌, వాకింగ్‌ డ్రైవ్‌ను జూలై 30న నిర్వహించారు. నాటింగ్‌హామ్‌లోని బీస్టన్‌ వద్ద ఉన్న సెంటర్‌లో సైకిల్‌ తొక్కుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఊబకాయాన్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో బ్రిటన్‌ ప్రభుత్వం ఆహార పదార్థాలపై వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ను నిషేధించారు.

అంగారకగ్రహంపైకి నాసా రోవర్‌

అంగారకగ్రహంపై జీవనం ఆనవాళ్లను గుర్తించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ‘పెర్‌సెవరెన్స్‌' అనే రోవర్‌ను జూలై 30న వియజయవంతంగా ప్రయోగించింది. కేప్‌ కెనవెరాల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద లాంచ్‌ కాంప్లెక్స్‌ 41 నుంచి అట్లాస్‌ వీ-541 రాకెట్‌ ద్వారా 6 చక్రాలతో ఉన్న ఈ రోవర్‌ను నింగిలోకి పంపారు. ఇది 2021, ఫిబ్రవరి 18న గ్రహంపై దిగుతుంది. 

భారత్‌కు ఏడీబీ సాయం

కరోనాపై పోరాడేందుకు 3 మిలియన్ల అమెరికా డాలర్ల సాయాన్ని భారత్‌కు అందివ్వనున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) జూలై 30న తెలిపింది. థర్మల్‌ స్కానర్లు, వ్యాధి పర్యవేక్షణ, ముందస్తుగా గుర్తించడం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, చికిత్స కోసం ఈ నిధులను వినియోగిస్తారు. ఏడీబీని 1966, డిసెంబర్‌ 19న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం మనీలాలో ఉంది.

మారిషస్‌ సుప్రీంకోర్టు కొత్త భవనం

మారిషస్‌ సుప్రీంకోర్టు కొత్త భవనాన్ని భారత ప్రధాని మోదీ, మారిషస్‌ ప్రధాని ప్రవీంద్‌ జగన్నాథ్‌ సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జూలై 30న ప్రారంభించారు. భారత్‌ సహకారంతో ఈ భవనాన్ని నిర్మించారు. హిందూ మహాసముద్ర ప్రాంతాల అభివృద్ధి విధానమైన సాగర్‌-సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఫర్‌ రీజియన్‌ అంశాలపై చర్చించారు. 

గిన్నిస్‌లోకి జిరాఫీ

క్వీన్స్‌లాండ్‌లోని ఆస్ట్రేలియన్‌ జూలో ఉన్న 12 ఏండ్ల వయస్సున్న జిరాఫీ జూలై 30న గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల పుస్తకంలోకి ఎక్కింది. ఈ జిరాఫీ 18 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినదిగా రికార్డు సృష్టించింది. ఇది 2007లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ జూలో జన్మించింది. రెండేండ్ల తరువాత ఆస్ట్రేలియన్‌ జూకు తరలించారు.   

వార్తల్లో వ్యక్తులు

అర్చన సొరెంగ్‌

యూఎన్‌వో ప్రధాన కార్యదర్శికి పర్యావరణ పరిస్థితిని వివరించేందుకు, మెరుగు పరిచేందుకు నియమించిన సలహా మండలికి భారత్‌ నుంచి అర్చన సొరెంగ్‌ జూలై 28న ఎంపికయ్యారు. ఏడుగురు సభ్యులుగల ఈ సలహా మండలికి 18 నుంచి 28 ఏండ్లలోపు ఉన్నవారిని ఎంపికచేశారు. పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడం, ఆదివాసులు ఉపయోగిస్తున్న పద్ధతులను వారి సంప్రదాయ నైపుణ్యాన్ని పరిరక్షించేందుకు అర్చన పరిశోధనలు చేస్తున్నారు. ఈమె టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌-ముంబై నుంచి రెగ్యులేటరీ గవర్నెన్స్‌ పూర్తిచేశారు. 

బీఎస్‌ బజాజ్‌ మృతి

బయోటెక్‌ రంగ ప్రముఖుడు డాక్టర్‌ బీఎస్‌ బజాజ్‌ (93) జూలై 28న మరణించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆసియా బయోటెక్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏబీఏ) వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేసిన ఆయన హైదరాబాద్‌లో జీనోమ్‌ వ్యాలీ ఏర్పాటుకు, 2019లో జరిగిన బయో-ఆసియా సదస్సుకు కృషిచేశారు. 2019లో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు స్వీకరించారు. 1999లో హైదరాబాద్‌లో బయోటెక్నాలజీ స్థాపనకు బజాజ్‌ ఒక ప్రమోటర్‌గా పనిచేశారు.

ప్రీతమ్‌ సింగ్‌

భారత సంతతికి చెందిన ప్రీతమ్‌ సింగ్‌ సింగపూర్‌లో ప్రతిపక్ష నేతగా జూలై 28న నియమితులయ్యారు. ఆయన వర్కర్స్‌ పార్టీకి చెందినవారు. జూలై 10న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 93 పార్లమెంటరీ సీట్లకు వర్కర్స్‌ పార్టీ 10 సీట్లను గెలుచుకుంది. 

మోదీ ప్రైవేటు సెక్రటరీగా హార్దిక్‌

ప్రధాని మోదీకి ప్రైవేటు సెక్రటరీగా హార్దిక్‌ సతీష్‌చంద్ర షా జూలై 30న నియమితులయ్యారు. 2010 గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌కు చెందిన ఆయన 2019, ఆగస్టు 31న పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా నియమియతులయ్యారు. ఇదివరకు ప్రకాశ్‌ జవదేకర్‌ వద్ద ప్రైవేటు కార్యదర్శిగా పనిచేశారు. గుజరాత్‌ యూనివర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు.

క్రీడలు

నాస్‌డాక్‌ బిల్‌బోర్డుపై బగాన్‌ క్లబ్‌ లోగో

భారత్‌కు చెందిన ఫుట్‌బాల్‌ జట్టు మోహన్‌ బగాన్‌ క్లబ్‌ను ప్రారంభించి జూలై 29 నాటికి 131 ఏండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ క్లబ్‌ లోగోను, టీం రంగులను న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక టైమ్స్‌ స్కేర్‌లో నాస్‌డాక్‌ బిల్‌ బోర్డులపై ప్రదర్శించారు. భారత్‌ నుంచి ఏ క్రీడలకు సంబంధించిన జట్టు గురించి ఇలా నాస్‌డాక్‌ బిల్‌ బోర్డుపై ప్రదర్శించడం ఇదే తొలిసారి.  

బీల్‌ చెస్‌ టోర్నీ విజేతగా వొజ్తాసెక్‌

స్విట్జర్లాండ్‌లోని బీల్‌ నగరంలో జూలై 29న జరిగిన బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌ టోర్నీ ఫైనల్‌లో రాడోస్లా వొజ్తాసెక్‌ (పోలాండ్‌) 37 పాయింట్లతో టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో పెంటేల హరికృష్ణ 36.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్‌కు 10 వేల స్విస్‌ ఫ్రాంక్‌ (రూ.8.20 లక్షలు)లు, రన్నరప్‌కు 7,500 ఫ్రాంక్‌ (రూ.6.15 లక్షలు)లు ప్రైజ్‌మనీగా అందించారు.

వేముల సైదులు

జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నిపుణులు

ఆర్‌సీ రెడ్డి  స్టడీ సర్కిల్‌ ,హైదరాబాద్‌


logo