బుధవారం 05 ఆగస్టు 2020
Nipuna-education - Jul 29, 2020 , 01:11:47

ఇంటర్వ్యూ-‘ఆర్కిటెక్‌'తో ఆకాశమంత అవకాశాలు

ఇంటర్వ్యూ-‘ఆర్కిటెక్‌'తో ఆకాశమంత అవకాశాలు

విద్యార్థులకు ఇంటర్‌ తర్వాత ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలనిచ్చే కోర్సులు చాలా ఉన్నాయి. అందులో బీఆర్క్‌, బీప్లానింగ్‌ ప్రత్యేకమైనవి. అందమైన ఆకాశ హర్మ్యాలు, అద్భుతమైన కట్టడాలు రూపుదిద్దుకోవడం వెనుక ఆర్కిటెక్చర్‌ పాత్ర ఎంత కీలకమో చెప్పాల్సిన పనిలేదు. మారుతున్న పరిస్థితుల్లో ఆధునిక నిర్మాణ శైలికి అవసరమైన అవగాహనకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలకు ఆర్కిటెక్చర్‌ కోర్సుల అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో ఈ కోర్సులపై ఆసక్తిచూపే విద్యార్థుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. అలాంటి ఆర్కిటెక్‌ కోర్సులైన బీఆర్క్‌, బీప్లానింగ్‌లో ప్రవేశాలు, వాటికి సంబంధించిన అవకాశాల గురించి జేన్‌ఎఫ్‌ఏయూ కాలేజీ ప్రిన్సిపాల్‌ కుమార్‌ నిపుణ పాఠకులకు అందిస్తున్న వివరాలు.

బీఆర్క్‌ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి? 

-బీఆర్క్‌ అందిస్తున్న కాలేజీలు దేశవ్యాప్తంగా 463 కాలేజీలు ఉన్నాయి. మన దగ్గర చూస్తే తెలంగాణలో 14 కాలేజీలు ఉన్నాయి. మనది స్పా(SPA) జేఎన్‌ఎఫ్‌ఏయూ ప్రభుత్వ కాలేజీ. ఇది కాకుండా 11 జేఎన్‌ఎఫ్‌ఏయూ అఫిలియేటెడ్‌ కాలేజీలు ఉన్నాయి. ఇంకా రెండు ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. 

ఇతర ఏ రాష్ర్టాలు బీఆర్క్‌ను అందిస్తున్నాయి?

-ఆంధ్రప్రదేశ్‌ 9, గుజరాత్‌ 30కి పైగా, కర్ణాటక 40, తమిళనాడు 70కి పైగా, కేరళ 30కి పైగా, మహారాష్ట్రలో 100కు పైగా కాలేజీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇంకా స్పా(SPA) లెవల్లో అంటే స్పా(SPA) ఢిల్లీ,  విజయవాడ, భోపాల్‌ కాకుండా ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఖరగ్‌పూర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తిరుచ్చి, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నాగ్‌పూర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రాయ్‌పూర్‌, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ భోపాల్‌, మాలవీయ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జైపూర్‌ ఇలా దేశంలోని పలు ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌ అందిస్తున్నాయి.

ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందడమెలా?

-బీఆర్క్‌లో ప్రవేశాలు పొందాలంటే మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఓవరాల్‌గా అన్ని సబ్జెక్టులతో కలిపి 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వీరే కాకుండా 10+3 డిప్లొమా చేసినవారు కూడా అర్హులే. అయితే మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌ తప్పనిసరై ఉండటంతో పాటు 50శాతం మార్కులు వచ్చిఉండాలి. ఇంకా నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (NATA ) పరీక్ష రాయాలి. లేదా జేఈఈ(JEE) మెయిన్‌ పేపర్‌-2 రాయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి రాయాలి (వీటిలో దేనిలో ఎక్కువ వస్తే దానిని పరిగణలోకి తీసుకుంటారు). ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఆధారంగా ఆర్కిటెక్చర్‌లో ర్యాంకును కేటాయిస్తాం. బీప్లానింగ్‌ ప్రవేశానికి మాత్రం మన కాలేజీలో ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా డైరెక్ట్‌గా సీటు కేటాయిస్తాం. అయితే బీప్లాన్‌లో నేషనల్‌ లెవల్లో అంటే స్పా(SPA)ఢిల్లీ, విజయవాడ, భోపాల్‌లో సీటు కావాలంటే మాత్రం జేఈఈ పేపర్‌-2 రాయాలి. 

ఈ సారి బీఆర్క్‌ అడ్మిషన్స్‌లో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది? వాస్తవమేనా?

-వాస్తవమే.  ఈ సారి బీఆర్క్‌ అడ్మిషన్లలో కొన్ని మార్పులు జరిగాయి. ఒక పేపర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, మ్యాథమెటికల్‌ రీజనింగ్‌, సెర్చ్‌ అండ్‌ రిలేషన్స్‌ ఇవన్ని కూడా ఆబ్జెక్టివ్‌టైపు ఉంటాయి. ఇంకో పేపర్‌ మాత్రం డ్రాయింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. దీంట్లో ఎబిలిటీ టు స్కెచ్‌, లైట్‌ అండ్‌ షేడ్‌ ఢిపెక్ట్స్‌, హౌటు కంపోజ్డ్‌ త్రీడీ ఆర్కిటెక్ట్స్‌, స్కేల్‌ అండ్‌ ప్రపోషన్‌, కలర్స్‌, మెమరీ డ్రాయింగ్‌ ఇలా సెన్సాఫ్‌ ప్రాస్పెక్టివ్‌ ఉండేది. అయితే కొవిడ్‌-19 కారణంగా ఈసారి డ్రాయింగ్‌ టెస్ట్‌ పెట్టలేకపోతున్నారు. దీంతో ఈసారి ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఇంట్లోనే ఉండి రాసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 

పరీక్షలో ఎలాంటి మార్పులు చేస్తున్నారు? విద్యార్థులు ఎలా తెలుసుకోవాలి? మారిన విధానం ఎలా ఉండబోతుంది?

-దీనికి అనుగుణంగా సిలబస్‌ కూడా రివైజ్‌ చేశారు. డ్రాయింగ్‌ టెస్ట్‌ సిలబస్‌ను మార్చారు. దీంతో స్కెచింగ్‌ ఉండటం లేదు. దీనికి మరో ప్రత్యామ్నాయం చూస్తున్నారు. స్కెచింగ్‌లో చేసే లైట్‌ అండ్‌ షేడ్‌, త్రీడీ కాంపోజిషన్‌ ఇవన్నీ కూడా మరో విధంగా అంటే విజువల్స్‌ ప్రిన్సిపుల్స్‌ కాంపోజిషన్‌, అండర్‌స్టాండింగ్‌ విత్‌ జామెట్రీ అంటే జామెట్రిక్‌ పజిల్స్‌ ఇచ్చి అర్థం చేసుకునేలా.. విజువలైజేషన్‌ షేడింగ్‌ డ్రాయింగ్‌ ఎలాంటి షేడ్స్‌ ఉన్నాయనేది విద్యార్థులు కనుక్కోవాలి. కలర్స్‌ స్కీమ్స్‌, కలర్‌ థీయరీ మీద కొన్ని ప్రశ్నలు, ఎలాంటి కలర్స్‌ (వామ్‌ కలర్సా, కూల్‌ కలర్స్‌) ఇలా వీటిపైనా ప్రశ్నలు ఉంటాయి. అలాగే కాగ్నిటివ్‌ ఎబిలిటీ, విజువల్‌ సిస్టమ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ ఇలా మరికొన్నింటి మీద ప్రశ్నలు ఉంటాయి. ముందు విధానం ప్రకారం ఫిజికల్‌గా  ఆఫ్‌లైన్‌ డ్రాయింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేసే పద్ధతి ఉండేది. కొవిడ్‌తో ఆ పద్ధతి ఈసారి ఉండటం లేదు. అంతా ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుంది. అది కూడా ఇంట్లోనే ఉండి రాయవచ్చు. 

బీఆర్క్‌, బీప్లానింగ్‌ పూర్తయ్యాక ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి?

-చాలా వరకు పీజీ కోర్సెస్‌ చేసే అవకాశముంది. ఆర్కిటెక్చర్‌ చేశాక ఎమ్మార్క్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సు చేయవచ్చు. ఎమ్మార్క్‌ అర్బన్‌ డిజైన్‌, ఎమ్మార్క్‌ ల్యాండ్‌ స్కేప్‌ ఆర్కిటెక్చర్‌, ఎమ్మార్క్‌ కన్జర్వేషన్‌ (హిస్టారిక్‌ బిల్డింగ్స్‌ పరిశీలన, ప్రొటెక్ట్‌ చేయడం ఇలా), ఎమ్మార్క్‌ ఆర్కిటెక్‌ ఎడ్యుకేషన్‌ ఇలా పలు కోర్సులు చేయవచ్చు. వీటితో పాటు డిజైన్‌ కోర్సెస్‌ మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులు చేయవచ్చు. ఇండస్ట్రియల్‌ డిజైన్‌, ప్రోడక్ట్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ డిజైన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌ ఇలా చాలావరకు చేయవచ్చు. అదేవిధంగా ప్లానింగ్‌ అనే కోర్సు కూడా ఉంది. దీంట్లో మాస్టర్స్‌ కూడా చేయవచ్చు. దీంట్లో అర్బన్‌, రీజినల్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌ ఇలా స్పెషలైజేషన్‌ ఉన్నాయి. ఎన్విరాన్‌మెంటల్‌, హౌజింగ్‌ అండ్‌ కమ్యూనిటీ ప్లానింగ్‌, ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ప్లానింగ్‌ వంటి ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ తీసుకున్నా కూడా బిల్డింగ్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ మేనేజ్‌మెంట్‌, రియల్‌ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ ఇలా స్పెషలైజేషన్‌ ఉన్నాయి.

ఇంటర్న్‌షిప్‌ ఉందా?

-కచ్చితంగా ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ప్రాక్టికల్స్‌ ట్రైనింగ్‌ తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని కాలేజీల్లో ఒక సెమిస్టర్‌లో ఉంటుండగా.. మరికొన్ని కాలేజీల్లో రెండో సెమిస్టర్స్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. దీంతో పాటు ఇంటర్న్‌షిప్‌ చేసిన ఆఫీసుల్లోనే చాలావరకు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. కొంతమంది విద్యార్థులు సొంతంగా కూడా ప్రాక్టీస్‌ మొదలుపెడుతున్నారు. కొంతమంది టీచింగ్‌ వైపు వెళ్తున్నారు.

కరోనా కారణంగా వాయిదా పడిన ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఎప్పుడు జరుగనుంది? 

-కరోనా కారణంగా ఎగ్జామ్‌ను వాయిదా వేయడం జరిగింది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం ఆగస్ట్‌ 1 న జరగాల్సి ఉండగా కోవిడ్‌ కారణంగా దానిని ఆగస్ట్‌ 29కు వాయిదా పడింది. ఆగస్ట్‌ 29న పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా ఇంట్లోనే కూర్చుని రాసే విధంగా ఏర్పాట్లు 

చేస్తున్నారు.

బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సులను అందిస్తున్న కాలేజీలు ఎన్ని ఉన్నాయి?

-మన రాష్ట్రంలో 14 కాలేజీల్లో బీఆర్క్‌ కోర్సు ఉన్నది. యానివర్సిటీ కాలేజీలో 80 సీట్లు ఉన్నాయి. యానివర్సిటీ పరిధిలో 11 కాలేజీలు ఉన్నాయి. ఇందులో కొన్ని కాలేజీల్లో 120, మరికొన్నింటిలో 80, ఇంకా 40 సీట్లు ఇలా 800కు పైగా బీఆర్క్‌ సీట్లు ఉన్నాయి. బీప్లానింగ్‌ అనేది మనదగ్గర ప్రభుత్వ కాలేజీలోనే ఉన్నది. ఇందులో 40 సీట్లు మాత్రమే ఉన్నాయి. బీప్లానింగ్‌ కోర్సులు ప్రైవేటు కాలేజీల్లో ఎక్కడా లేవు. ఈ కోర్సు దేశవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం 30 కాలేజీలకు పైగా ఉన్నాయి. స్పా(SPA) ఢిల్లీ, విజయవాడ, భోపాల్‌ అలాగే అమిటీ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, ప్రైవేటు యూనివర్సిటీ, ఇషాన్‌ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ డెవలప్‌మెంట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం డెహ్రాడూన్‌తోపాటు పలు ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఈ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. గురురామ్‌దాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌(GNDU)-అమృత్‌సర్‌ అందిస్తుంది. దాదాపుగా 35 కాలేజీలు ఈ కోర్సును ఆఫర్‌ చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటేడ్‌ (ఐదేండ్లు) ప్రోగ్రామ్స్‌ ఉన్నాయి. బీప్లానింగ్‌ను మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌తో కలిపి ఫైవ్‌ ఇయర్స్‌ ఇంటిగ్రేటేడ్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. గుజరాత్‌లోని నిర్మా యూనివర్సిటీ దీన్ని ఆఫర్‌ చేస్తుంది.


ఉపాధి అవకాశాలు

-ఉపాధి పరంగా చూస్తే గతంలోలాగా కేవలం రెసిడెన్షియల్‌ బిల్డింగ్స్‌ డిజైన్‌కే పరిమితం కాకుండా ఆర్కిటెక్ట్‌ల విధలు ప్రస్తుతం విస్తరించాయి. పబ్లిక్‌ పార్కులు, షాపింగ్‌ సెంటర్లు, హాస్పిటల్స్‌, బ్రిడ్జెస్‌, ఎయిర్‌పోర్టులు, పార్కులు, క్రీడా మైదానాలు, ఎకలాజికల్‌ పార్కుల నిర్మాణంలో ఆర్కిటెక్చర్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. దీంతో  ఆర్కిటెక్చర్లకు  డిమాండ్‌ పెరిగింది. కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు, ఆర్కిటెక్చర్‌ ఫర్మ్స్‌, కన్సల్టెన్సీలు, ఇన్‌ఫ్రా కంపెనీలు, బిల్డింగ్‌ ఆర్గనైజేషన్స్‌ ఇలా చాలా ఉన్నాయి.

-ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టార్‌లో కూడా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా చూస్తే సెంట్రల్‌ ఆర్కిటెక్చర్‌ సర్వీసెస్‌ (సీఏఎస్‌) (గ్రూపు-ఏ) పరీక్షలో విజయం సాధిస్తే సీపీడబ్ల్యూడీ (సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్‌)లో డిప్యూటీ ఆర్కిటెక్ట్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. ఆ  తర్వాత డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి వరకు ఎదగవచ్చు. ఇంకా రక్షణ మంత్రిత్వశాఖ, నేషనల్‌ బిల్డింగ్‌ ఆర్గనైజేషన్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌, రైల్వేలు, పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆర్గనైజేషన్‌, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌ (పీఎస్‌యూ) నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రాష్ట్రస్థాయిలో హెచ్‌ఎండీఏ, కార్పొరేషన్స్‌, జీహెచ్‌ఎంసీల్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. 

విదేశాల్లో..

-అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్కిటెక్ట్‌లకు మంచి డిమాండ్‌ ఉంది. గల్ఫ్‌ దేశాలు, థాయిలాండ్‌, సింగపూర్‌, మలేషియా లాంటి ఆసియా దేశాలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఇంకా జీఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ వంటి సంస్థలు విదేశాల్లో మౌలిక వసతులకు సంబంధించి భారీ ప్రాజెక్టులను దక్కించుకోవడం ఇందుకు మరో కారణంగా చెప్పవచ్చు.


గత సంవత్సరం జేఈఈ మెయిన్స్‌ కటాఫ్‌ ఎక్కడ వరకు ఉంది?

-గత సంవత్సరం కటాఫ్‌ చూస్తే...నాటా (నేషనల్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌) అనే ఎగ్జామ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ న్యూఢిల్లీ కండక్ట్‌ చేస్తారు. జేఈఈ మెయిన్‌ పేపర్‌ -2 నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ న్యూఢిల్లీ కండక్ట్‌ చేస్తారు. రెండు అడ్మిషన్స్‌ టెస్ట్‌లు కూడా ఎగ్జామ్స్‌ జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. అందులో స్కోర్‌ ఇవ్వబడుతుంది. ఉన్నత విద్యామండలి అడ్మిషన్స్‌ నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్స్‌లో 300 స్కోర్‌ చేస్తే దానిలో పర్సంటేజ్‌  పరంగా చేసి ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇస్తాం. నాటా టెస్ట్‌, జేఈఈ మెయిన్స్‌, ఇంటర్‌ వెయిటేజి మార్కులు యావరేజిగా చూస్తే ఇప్పటి వరకు అత్యధికంగా 85-90శాతం వచ్చింది. ఇంకా 50-52శాతం వచ్చిన వారికి కూడా సీటు వచ్చింది. అయితే నాటా టెస్ట్‌, జేఈఈ మెయిన్స్‌లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సీటు వచ్చే అవకాశం ఉంటుంది.


సత్యంగౌడ్‌ సూదగాని


logo