మంగళవారం 11 ఆగస్టు 2020
Nipuna-education - Jul 15, 2020 , 02:56:36

సౌర భారత్‌

సౌర భారత్‌

దేశ ఆర్థిక అభివృద్ధిలో శక్తి వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. ఆ వనరులు శుద్ధమైనవీ, నాణ్యమైనవీ అయితే అభివృద్ధి మరింత సుస్థిరంగా సాగుతుంది. అందుకే పునరుత్పాధక ఇంధన వనరులపై ఎక్కువగా దృష్టి పెట్టింది భారత్‌. పునరుత్పాదక ఇంధన వనరుల్లోనూ మనకు అత్యంత అనువుగా ఉండే సౌర విద్యుత్‌కు ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. 

 • తాజాగా ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ని మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. మధ్యప్రదేశ్‌ లోని రేవా వద్ద నెలకొల్పిన ఈ సౌరవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ సామర్థ్యం 750 మెగావాట్లు. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా 2022 నాటికి భారత్‌ లక్ష్యమైనటువంటి 100 గిగావాట్ల సౌర విద్యుత్‌ లక్ష్యసాధనలో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. అలాగే ప్రపంచంలోనే అధిక సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న దేశాల సరసన భారత్‌ నిలిచింది. ప్రస్తుతం జర్మనీ, చైనా,జపాన్‌, ఇటలీ, అమెరికా అధిక సౌర విద్యుత్‌ ఉత్పత్తితో ముందు వరుసలో ఉన్నాయి. ఆర్థిక, సామాజిక, పర్యావరణ పరంగా సౌర విద్యుత్‌ కు ప్రాధాన్యం ఉంది.

ఆర్థికంగా 

 • దేశం ఆర్థికంగా రాణించాలంటే పారిశ్రామిక రంగంతోపాటు, వ్యవసాయరంగం వృద్ధి పథంలో సాగాలి. ఈ రెండు రంగాలకు కూడా విద్యుత్‌ అత్యవసర వనరు. అయితే మనం వృద్ధి పథంలో సాగుతున్నకొద్దీ విద్యుత్‌కు డిమాండ్‌ పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మనం వనరులని ఏర్పాటు చేసుకోవాలి. కానీ భారత్‌ ప్రస్తుతం సంప్రదాయ ఇంధన వనరులపై ఎక్కువగా ఆధారరపడి ఉంది. అవి శిలాజ వనరులపై ఆధారపడి ఉత్పత్తి అవుతాయి కాబట్టి శిలాజ ఇంధనాలు నానాటికీ తరిగిపోతుంటాయి. అంతేకాదు కొన్నింటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి వాటి వల్ల వ్యయం ఎక్కువ, కొన్ని సార్లు సరఫరాలో అనిశ్చితి ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటికి సౌర విద్యుత్‌ మంచి పరిష్కారం, చౌకగా నాణ్యమైన విద్యుత్‌ అందించే వెసులు బాటు ఉంటుంది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పినట్లు ఈ సౌరవిద్యుత్‌ శుద్ధమైనది, నాణ్యమైనది, భద్రమైనది. 

పర్యావరణపరంగా శుద్ధమైనది

 • ముఖ్యమైన విషయం ఏమిటంటే శిలాజ ఇంధన వనరులు విపరీతమైన కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనవనరులే సరైన ప్రత్యామ్నాయం. అందులోనూ మన భారతదేశ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సౌర విద్యుత్‌ ఇంకా అనువైనది. ఏడాదిలో దాదాపు 300 రోజులపాటు సూర్యరశ్మి ఉండే దేశం మనది. అంటే కావాల్సినంత ఉత్పత్తి సాధ్యమవుతుంది. కాలుష్యం లేని దీని స్వభావం వల్ల పర్యావరణానికి నష్టం కలగదు. సౌర విద్యుత్‌పై ఆధారపడటమంటే అటు ఆర్థిక వ్యవస్థని ఇటు పర్యావరణాన్ని రెండింటిని సమన్వయం చేసుకుంటూ వృద్ధి పథంలో సాగడం.

సౌర విద్యుత్‌తో సామాజిక అభివృద్ధి-ఉద్యోగిత

 • దేశంలో ఇప్పటికి కూడా సంప్రదాయ విద్యుత్‌ అందని ప్రాంతాలున్నాయి. ఇది వెనుకబాటుతనానికి చిహ్నంగా ఉంది. అలాంటి మారుమూల ప్రదేశాలకు సౌర విద్యుత్‌ అత్యంత అనువైన వనరు. ఇది ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి కారణమవుతుంది. సౌర విద్యుత్‌ ప్లాంట్లకు ఉద్యోగితను కల్పించే సామర్థ్యం ఉంది. ఒక అంచనా ప్రకారం ఒక గిగావాట్‌ ప్లాంట్‌ ప్రత్యక్షంగా పరోక్షంగా 4 వేల మందికి ఉద్యోగితను కల్పిస్తుంది. 

సౌర శక్తి సామర్థ్యం


 • భారత్‌ 2022 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇందులో 100 గిగావాట్లు సౌర విద్యుత్‌ ద్వారా మిగతాది ఇతర పునరుత్పాదక ఇంధనవనరుల ద్వారా సాధించాలనేది లక్ష్యం. అయితే ప్రస్తుతం భారత్‌లో సౌర విద్యుత్‌ సామర్థ్యం 34.6 గిగావాట్లు మాత్రమే ఉంది. దీనికి ఒక కారణం రూఫ్‌ టాప్‌ ద్వారా సాధించాలనుకున్న 40 గిగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌లో భారత్‌ పెద్దగా పురోగతి సాధించలేకపోయింది.

స్వావలంబన కావాలి

 • రేవా ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ సౌర విద్యుత్‌ రంగంలో స్వావలంబనని ఆకాంక్షించారు. నిజమే ఎందుకంటే 2018-19 కాలంలో దాదాపు 2 బిలియన్‌ డాలర్ల విలువైన సౌర విద్యుత్‌ పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. అందుకే ఈ రంగంలో దేశీయ పరిశ్రమలు ప్రగతి సాధించాలి. వీటికి ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. దేశీయంగా ఈ పరికరాల ధరలు తక్కువ ధరకు ఉత్పత్తి చేయగలిగితే సౌర విద్యుత్‌ ధర మరింత తగ్గుతుంది. అది మరింత వృద్ధిని సాధ్యపరుస్తుంది.

ఇప్పటికీ సంప్రదాయ వనరులదే పై చేయి

 • భారత్‌లో ఇప్పటికీ సంప్రదాయ ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌దే పై చేయి. మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన వనరుల వ్యవస్థాపక సామర్థ్యం 35.86 శాతం (మార్చి 31-2020నాటికి). ఈ సామర్థ్యంతో మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో 21.22 శాతం ఉత్పత్తి జరుగుతుంది.
 • మిగతా ఉత్పత్తి మొత్తం సంప్రదాయ వనరులపై ఆధారపడి చేస్తున్నాం. అయితే భవిష్యత్‌ ప్రాజెక్టులు పునరుత్పాదక ఇంధన వనరుల పాత్రను క్రమంగా పెంచబోతున్నాయి. షాజాపూర్‌, ఛత్తార్‌పూర్‌, నీముచ్‌ లలో సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు మోదీ.

ప్రభుత్వ చొరవ


పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ భారత్‌లో పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

ఇప్పటివరకు తీసుకున్న చర్యల్లో ముఖ్యమైనవి..

 • నేషనల్‌ సోలార్‌ మిషన్‌ ఏర్పాటు
 • భారతీయ పునరుత్పాదక శక్తి అభివృద్ధి ఏజెన్సీ ఏర్పాటు. ఇది పునరుత్పాదక శక్తి వనరుల ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణ సదుపాయం కల్పించే బ్యాంకింగేతర సంస్థ.
 • నేషనల్‌ సోలార్‌ ఏజెన్సీ: సౌర విద్యుత్‌ రంగంలో పరిశోధనల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.
 • సూర్యమిత్ర ప్రోగ్రాం: ఈ రంగంలో నిపుణులైన ఉద్యోగులను తయారు చేయడానికి ఉద్దేశించినది. ఇలా పలు రకాల చర్యలు చేపట్టింది. అంతేకాదు అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌ ని ఏర్పాటు చేసింది భారత్‌. ఇందులో 122 దేశాలకు భాగస్వామ్యం ఉంది.

భవిష్యత్‌లో సౌర విద్యుత్‌

 • సౌర విద్యుత్‌ నిల్వచేసే విషయంలో ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆ పరిశోధనలు ఫలించినప్పుడు సౌర విద్యుత్‌ రంగం, పునరుత్పాదక ఇంధన రంగం మాత్రమే కాదు మొత్తం ఇంధన రంగమే సమూలంగా మారిపోతుంది. 2035 నాటికి 8 శాతం వాటాతో ప్రపంచ సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో భారత్‌ కీలక వాటాదారుగా ఉంటుందని అంచనా. 

రేవా సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ వివరాలు

 • 750 మెగావాట్ల సామర్థ్యం (మొత్తం మూడు విభాగాలు, ఒక్కో విభాగం సామర్థ్యం 250 మెగావాట్లు)
 • దాదాపు 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు
 • మొత్తం ఉత్పత్తి అయిన విద్యుత్‌లో 24 శాతం ఢిల్లీ మెట్రోకు సరఫరా చేస్తారు.
 • రూ.4500 కోట్ల వ్యయంతో నిర్మాణం.
 • మధ్య ప్రదేశ్‌ ఊర్జా వికాస్‌ నిగమ్‌, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి.logo