మంగళవారం 11 ఆగస్టు 2020
Nipuna-education - Jul 15, 2020 , 02:45:38

సీబెస్ట్‌ కోర్స్‌.. కామర్స్‌

సీబెస్ట్‌ కోర్స్‌.. కామర్స్‌

పదో తరగతి అందరూ పాసయ్యారు. పది తరువాత ఏ కోర్సు చదవాలి, ఏది చదివితే భవిష్యత్తు బాగుంటుందని 

విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఇంటర్‌లో సైన్స్‌ గ్రూపు చదవాలా, ఆర్ట్స్‌ గ్రూపు చదవాలా? అని దీర్ఘాలోచన చేస్తుంటారు. ఎక్కువ శాతం ఇంజినీరింగ్‌, డాక్టర్‌ కోర్సులు చదవాలని కోరుకుంటారు. వీటికంటే కూడా ఎన్నో 

పదిలమైన సీఏ, సీఎంఏ, సీఎస్‌ వంటి కాసులు కురిపించే కామర్స్‌ కోర్సులు కూడా ఉన్నాయి. వీటిని చదివితే వందకు వందశాతం జీవితంలో స్థిరపడవచ్చు. ఈ కోర్సుల గురించిన వివరాలు నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం..

 • ఆర్థికరంగాన్ని శాసించే కోర్సులు.. కామర్స్‌ కోర్సులు. కామర్స్‌లో ఏ కోర్సు తీసుకున్నా, చదివినా జీవితంలో స్థిరపడవచ్చు. సామాన్య గుమాస్తా నుంచి దేశ ఆర్థిక రంగాన్ని శాసించే ఆర్థిక నిపుణుల వరకు ఈ రంగం ఎన్నో అవకాశాలున్నాయి. 21 ఏళ్లకే మంచి హోదా, గౌరవం, అంతస్తు తెచ్చే కోర్సులు... సీఏ, సీఎంఏ, సీఎస్‌.
 • జీఎస్టీ అమలు, నోట్ల రద్దు వల్ల కామర్స్‌ అవకాశాలు బాగా పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. నోట్ల రద్దు వల్ల కొన్ని కోట్ల మంది అదనంగా ఆదాయపు పన్ను పరిధిలోనికి వచ్చారు. నగదు రహిత విధానం కారణంగా రాబోయే రోజుల్లో బ్యాంకింగ్‌ రంగంలో చాలా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని నిపుణుల చెబుతున్నారు.
 • సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సులు చదవాలంటే ఇంటర్మీడియట్‌లో ఎంఈసీ లేదా సీఈసీ తీసుకుని చదవడమే సరైన మార్గం. ఐఐటీలో సీటు సాధించాలంటే 7th క్లాస్‌ నుంచే ఐఐటీ పునాది అవసరం అంటున్నారు. అలాగే భవిష్యత్తులో సీఏ, సీఎంఏ, సీఎస్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదవాలంటే కామర్స్‌ ఫౌండేషన్‌ కూడా అవసరమే. తెలుగు రాష్ర్టాల్లో 10వ తరగతిలోపు ఆ అవకాశం లేదు కాబట్టి కనీసం ఇంటర్‌లోనైనా ఎంఈసీ, సీఈసీ గ్రూపును తీసుకుని చదివితే కామర్స్‌పై మంచి పట్టుసాధించి భవిష్యత్తులో సీఎ, సీఎంఏ, సీఎస్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులకు మార్గం సుగమం చేసుకోవచ్చు.


ఎంఈసీ ప్రాముఖ్యం

 • ఎంఈసీ ప్రత్యేకమైన గ్రూపుగా చెప్పవచ్చు. సహజంగా మ్యాథ్స్‌ అంటే ఇష్టం ఉన్నవారు ఎంపీసీ తీసుకుని చదువుతారు. అలాగే కామర్స్‌ చదవాలనుకున్నవారు సీఈసీ గ్రూపు తీసుకుని చదువుతారు. కానీ మ్యాథ్స్‌ అంటే ఇష్టం ఉండి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అంటే భయపడేవారు కామర్స్‌ అంటే ఇష్టం ఉండి లాజికల్‌గా ఉండే మ్యాథ్స్‌ కూడా కావాలి, భవిష్యత్తులో ఏ కోర్సు చదవాలన్నా అవకాశం ఉండాలనుకునే వారికి ఎంఈసీ బెస్ట్‌ చాయిస్‌.
 • సివిల్స్‌, గ్రూప్స్‌ వంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్నా కామర్స్‌పై పట్టు తప్పనిసరి. భవిష్యత్తులో ఒక సంస్థను నెలకొల్పాలన్నా, మంచి వ్యాపారవేత్తగా స్థిరపడాలన్నా కామర్స్‌ పరిజ్ఞానం అవసరం. ఇంటర్‌లో ఎంఈసీ తీసుకోవడం వల్ల వ్యాపారానికి అవసరమైన ఆర్థిక, వాణిజ్య రంగాలకు సంబంధించిన అన్ని అంశాలపై మంచి పట్టు సాధించవచ్చు.
 • సీఈసీ కామర్స్‌, ఎకనామిక్స్‌, సివిక్స్‌ వంటి మూడు ప్రధాన సబ్జెక్టుల కలయిక. చాలామంది సైన్స్‌ గ్రూపువారికి ఉన్నన్ని ఉద్యోగ అవకాశాలు సీఈసీ గ్రూపు చదివిన వారికి ఉండవని భావిస్తుంటారు. కాని అది అవాస్తవం. సీఈసీ చదివిన వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్‌లో సీఈసీ చదివి డిగ్రీ పూర్తిచేసి అనేకరంగాల్లోకి ప్రవేశించవచ్చు. లా పూర్తిచేయడానికి, సివిల్స్‌ రావడానికి అన్ని రకాల కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ రాయడానికి సీఈసీ గ్రూపులోని సబ్జెక్ట్స్‌ కీలకం. ఎక్కువ శాతం జనరల్‌ నాలెడ్జ్‌, సమాజానికి సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించి ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ అంశాలతో కామర్స్‌ను కూడా అనుసంధానం చేయడం వల్ల ఈ గ్రూపుకి ప్రాధాన్యత మరింతగా పెరిగింది. కామర్స్‌ కెరీర్‌ కావాలి కానీ మ్యాథ్స్‌ అంటే భయం అనుకునే వారు నిశ్చితంగా సీఈసీ గ్రూపుని తీసుకోవచ్చు. సీఈసీ గ్రూపు తీసుకొని సీఏ, సీఎమ్‌ఏ, సీఎస్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేయవచ్చు.
 • కామర్స్‌ కోర్సుల్లో సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సులను ప్రధానమైనవిగా చెప్పవచ్చు.

సీఏ దశలు

మొదటి దశ: సీఏ ఫౌండేషన్‌

 • ఇంటర్‌ లేదా 10+2 లేదా తత్సమాన పరీక్ష రాసినవారు ఎవరైనా సీఏ ఫౌండేషన్‌కు నమోదు చేయించుకోవచ్చు. నమోదు చేసుకోవచ్చు. నాలుగు నెలలకు సీఏ ఫౌండేషన్‌ పరీక్ష రాయవచ్చు. 
 • ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ 50 శాతం డిస్క్రిప్టివ్‌, 50 శాతం మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది. 
 • నేటి పరిస్థితులకు అనుగుణంగా సీఏ విద్యార్థికి అన్ని రకాల నైపుణ్యాలు ఉండాలన్న ఉద్దేశంతో సిలబస్‌ను రూపొందించారు.

సబ్జెక్టులు: మార్కులు

 • పేపర్‌-1: ప్రిన్సిపుల్స్‌ అండ్‌ ప్రాక్టీస్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌. 100 మార్కులు 3గంటల వ్యవధి.
 • పేపర్‌-2: బిజినెస్‌ లాస్‌ (60), బిజినెస్‌ కరస్పాండెన్స్‌ అండ్‌ రిపోర్టింగ్‌ (40). 100 మార్కులు. 3గంటల వ్యవధి
 • పేపర్‌-2: బిజినెస్‌ మ్యాథమెటిక్స్‌ (40), లాజికల్‌ రీజనింగ్‌ (20), స్టాటిస్టిక్స్‌ (40). 100 మార్కులు. 3గంటల వ్యవధి
 • పేపర్‌-3: బిజినెస్‌ ఎకనామిక్స్‌ (60), బిజినెస్‌ అండ్‌ కమర్షియల్‌ నాలెడ్జ్‌ (40). 100 మార్కులు. 3గంటల వ్యవధి
 •  పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో, పేపర్‌-3, పేపర్‌-4 పరీక్షలు అబ్జెక్టివ్‌ పద్ధతిలో జరుగుతాయి.
 • సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు ప్రతి ఏడాది మే, నవంబర్‌లలో నిర్వహిస్తారు.
 • సీఏ ఫౌండేషన్‌ పరీక్ష నవంబర్‌లో రాయాలంటే అదే ఏడాది జూన్‌ 30లోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. మే నెలలో పరీక్ష రాయాలంటే ముందు ఏడాది డిసెంబర్‌ 31లోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.
 • ప్రొవిజినల్‌ రిజిస్ట్రేషన్‌ అనే నూతన విధానాన్ని సీఏ ఇన్‌స్టిట్యూట్‌ ప్రవేశపెట్టనున్నది. ఇది అమల్లోకి వస్తే విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు మార్చిలో రాసి మే నెలలో జరిగే సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు కూడా రాయవచ్చు. మే నెలలో పరీక్షలు రాయడానికి సిద్ధంగా లేరనుకుంటే నవంబర్‌లో పరీక్ష రాసే అవకాశం ఉంది.

రెండో దశ: సీఏ ఇంటర్‌

 • సీఏ ఇంటర్‌ను గతంలో సీఏ-ఐపీసీసీ అని పిలిచేవారు.
 • సీఏ ఫౌండేషన్‌ పూర్తిచేసినవారు సీఏ ఇంటర్‌ చదవడానికి అర్హులు.
 • సీఏ ఇంటర్‌లో గ్రూప్‌-1లో నాలుగు పేపర్లు, గ్రూప్‌-2లో నాలుగు పేపర్లు మొత్తం 8 పేపర్లుగా సిలబస్‌ రూపొందించారు. ఒక్కో పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది.
 • నూతన విధానంలో కూడా విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూప్‌ 6 నెలల వ్యత్యాసంలో రాయవచ్చు.
 • సీఏ ఇంటర్‌ పరీక్ష ఏడాదికి రెండుసార్లు మే, నవంబర్‌ నెలలో ఉంటుంది.

సబ్జెక్టులు: మార్కులు

గ్రూప్‌-1

 • పేపర్‌-1: అకౌంటింగ్‌. 100 మార్కులు. 3గంటల వ్యవధి
 • పేపర్‌-2: కార్పొరేట్‌ లాస్‌ (60), అదర్‌ లాస్‌ (40). 100 మార్కులు. 3గంటల వ్యవధి
 • పేపర్‌-3: కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌. 100 మార్కులు. 3గంటల వ్యవధి
 • పేపర్‌-4: ట్యాక్సేషన్‌- ఇన్‌కం ట్యాక్స్‌ (60), ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సేషన్‌ (40). 100 మార్కులు. 3గంటల వ్యవధి

గ్రూప్‌-2

 • పేపర్‌-5: అడ్వాన్స్‌డ్‌ అకౌంటింగ్‌. 100 మార్కులు. 3గంటల వ్యవధి
 • పేపర్‌-6: ఆడిటింగ్‌ అండ్‌ అస్యూరెన్స్‌. 100 మార్కులు. 3గంటల వ్యవధి
 • పేపర్‌-7: ఎంటర్‌ప్రైజెస్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (50), స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ (50). 100 మార్కులు. 3గంటల వ్యవధి
 • పేపర్‌-8: ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (60), ఎకనామిక్స్‌ ఫర్‌ ఫైనాన్స్‌ (40). 100 మార్కులు. 3గంటల వ్యవధి
 • సీఏ ఇంటర్‌ పూర్తిచేసినవారు మూడేండ్ల ఆర్టికల్‌షిప్‌ (ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) చేయాలి.

సీఏ కోర్సు


 • నిర్వహణ సంస్థ: ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI)
 • వెబ్‌సైట్‌: icai.org
 • కామర్స్‌ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయమైన రంగం చార్టర్డ్‌ అకౌంటెన్సీ( సీఏ) అంటే తొమ్మిది, పదేళ్లు పడుతుందని చాలా మంది విద్యార్థులు భయపడుతుంటారు. ఇటీవల కాలంలో ఫలితాలు చూస్తే 21-22 సంవత్సరాలకే చాలా మంది సీఏ పూర్తిచేస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు సీఏ వైపు వస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ. ఇంటర్మీడియట్‌ తర్వాత సీఏ ఫౌండేషన్‌ కోర్సు చేసి సీఏ కోర్సులోకి ప్రవేశించడం ద్వారా సీఏ త్వరగా పూర్తిచేయవచ్చు. గత నాలుగైదేళ్లలో అమ్మాయిలు ఎక్కువగా పాసవుతున్నారు. వృత్తిరిత్యా లభించే గౌరవం, సామాజిక హోదా, ఆదాయ వనరులు బాగా ఉండటం వల్ల సీఏ కోర్సు ఆకర్షిణీయంగా మారింది.

సీఏ ఎవరు చదవవచ్చు

 • ఒకప్పుడు డిగ్రీ తర్వాత సీఏలో ప్రవేశించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇంటర్‌ పూర్తయిన తర్వాత సీఏ చదవవచ్చు.
 • పదో తరగతి తర్వాత సీఏకి నమోదు చేసుకొని ఇంటర్‌ పూర్తికాగానే సీఏ ఫౌండేషన్‌ పరీక్ష రాసే అవకాశం కల్పించాలనే ఆలోచనలో సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు ఉన్నారని సమాచారం. సీఏ చేయాలనుకునే చాలామంది విద్యార్థులు ఇంటర్‌లో ఎంఈసీ లేదా సీఈసీ గ్రూపుతోపాటు సీఏ కూడా ఏకకాలంలో చదవడానికే సుముఖత చూపిస్తున్నారు. ఇలా ఇంటర్‌తోపాటు సీఏ ఫౌండేషన్‌ సమాంతరంగా చదవడంవల్ల సీఏ ఫండమెంటల్స్‌పై మంచి పట్టు సాధించవచ్చు.

సీఏలకు అవకాశాలు

 • పన్ను గణన, అకౌంటింగ్‌, డాటా విశ్లేషణ విభాగాల్లో సీఏలకు ఉద్యోగావకాలు లభిస్తున్నాయి. జీఎస్టీ అమలువల్ల కూడా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
 • విదేశాల్లో కూడా సీఏలకు డిమాండ్‌ ఉంది. అక్కడి కంపెనీలకు మేనేజింగ్‌ డైరెక్టర్లుగా, ఫైనాన్స్‌ కంట్రోలర్‌, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌, ఫైనాన్స్‌, అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌, ప్లాంట్‌ అకౌంటెంట్స్‌, సిస్టమ్‌ ఇంప్లిమెంటార్స్‌, టెక్నో ఫంక్షనిస్టులుగా అవకాశాలు పొందవచ్చు. ట్రస్టీగా, అడ్మినిస్ట్రేటర్‌గా, వ్యాల్యూయర్‌గా, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా, ట్యాక్స్‌ కన్సల్టెంట్లుగా ఉద్యోగాలు లభిస్తాయి.logo