మంగళవారం 11 ఆగస్టు 2020
Nipuna-education - Jul 15, 2020 , 02:31:54

ఆన్‌లైన్‌ బోధన మరింత అవసరం

ఆన్‌లైన్‌ బోధన మరింత అవసరం

కొవిడ్‌ నేపథ్యంలో కొత్త విద్యావిధానం

మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ డా. డీఎన్‌ రెడ్డి

కాలం మారుతున్నది. సాంకేతికతను బోధనలోనూ ప్రవేశపెడుతున్నారు. దీంతో విద్యాబోధనలో సాంకేతికత అవసరం పెరుగుతున్నది. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో విద్యాబోధనలో ఈ సాంకేతికత అవసరం మరింత పెరిగిందని అంటున్నారు డాక్టర్‌ డీఎన్‌ రెడ్డి. జేఎన్‌టీయూ వైస్‌ ఛాన్స్‌లర్‌గా, డీఆర్‌డీఓ ఆర్‌ఏసీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం మల్లారెడ్డి యూనివర్సిటీకి ఛాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో విద్యాబోధన ఎలా ఉండాలన్న అంశంపై 

నమస్తే తెలంగాణతో ఆయన పంచుకున్న విషయాలు.. ఆయన మాటల్లోనే..

l ఆన్‌లైన్‌ విద్యాబోధనలు ఇంతకుముందు కూడా ఉన్నాయి. రెండు మూడేండ్లుగా వర్చువల్‌ యూనివర్సిటీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 8 వర్చువల్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందులో అప్లికేషన్ల దగ్గరి నుంచి తరగతులు, పరీక్షలు అన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే సాగుతాయి. విద్యాబోధనలో సాంకేతికతను మూడు రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి ఇంటర్నెట్‌. రెండోది ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ). మూడోది, అతి ముఖ్యమైనది ఇన్‌ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ). టెక్నాలజీనంతా క్లాస్‌రూమ్‌లో ఉపయోగించడమే ఐసీటీ. డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లో ఒక ఎల్‌సీడీ ఉంటుంది. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఉంటాయి. ఒక పక్క బోధన జరుగుతుంటే మరో పక్క దానికి సంబంధించిన ఉదాహరణలు కనిపిస్తుంటాయి. ఈ డిజిటల్‌ తరగతి గదులనే ఫ్లిప్‌ క్లాస్‌రూమ్స్‌ అంటారు. విద్యాబోధనలో ఐసీటీ వాడాలన్న అవగాహన మనదేశంలో ఇప్పుడిప్పుడే వచ్చింది. ఉన్నత స్థాయి విద్యలో ఇది అందుబాటులో ఉంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌లో కూడా దీన్ని ఉపయోగిస్తే పిల్లలు కాన్సెప్ట్‌ను బాగా అర్థం చేసుకోగలుగుతారు. 

బ్లెండెడ్‌ లెర్నింగ్‌.. బెస్ట్‌!

l సాధారణ తరగతి గదిలో విద్యార్థులకు ఎదురుగా ఫేస్‌ టు ఫేస్‌ బోధన ఉంటుంది. దీనివల్ల ఉపాధ్యాయుడికి, విద్యార్థికి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. అంతేకాదు.. విద్యార్థి బాడీ లాంగ్వేజీని అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. చెప్పే విషయాన్ని పిల్లలు అర్థం చేసుకుంటున్నారో లేదో వారి ముఖ కవళికలు, శరీర భాషను బట్టి తెలుసుకోవచ్చు. ఎవరైనా దృష్టిపెట్టకపోతే వెంటనే తగినవిధంగా వాళ్లను అలర్ట్‌ చేయవచ్చు. కానీ ఆన్‌లైన్‌ బోధనలో ఈ వెసులుబాటు ఉండదు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఈ ప్రయోజనాలేవీ ఉండవు. ఇదంతా వన్‌సైడ్‌ అయిపోతుంది. కాబట్టి మొత్తం ఆన్‌లైన్‌ బోధన కూడా సబబు కాదు. అందుకే ఈ రెండూ కలిపిన బోధన ఉండాలని చెప్పేదే బ్లెండెడ్‌ లెర్నింగ్‌. ఓ సర్వే ప్రకారం మిగిలిన యూనివర్సిటీల్లో కూడా 40 శాతం ఆన్‌లైన్‌లో, 60 శాతం ముఖాముఖి విద్యాబోధన ఉండాలని తేలింది. 

l తరగతి గదిలో పిల్లలకు 25 శాతం మాత్రమే అర్థమవుతుందని సైకాలజిస్టులు కనుక్కున్నారు. కొందరికి అది కూడా అర్థం కాదు. వీళ్లను ప్యాసివ్‌ లిజనర్లు అంటారు. ఇలాంటివాళ్లను కూడా యాక్టివ్‌ లిజనర్లుగా మారుస్తుంది టెక్నాలజీ. కళ్లకు ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి దానిపై దృష్టిపెడతారు. దీంతో నేర్చుకోవడం సులువవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టీవీ, ఎల్‌సీడీ, కంప్యూటర్‌ ఇస్తున్నారు. కానీ ఇవి సరిపోవు. వీటితో పాటు పవర్‌పాయింట్‌, ఇంటర్నెట్‌, ఆడియో విజువల్‌ ఎయిడ్స్‌, గ్రాఫికల్‌ మోడల్స్‌ లాంటి వాటితో పూర్తి స్థాయి డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ రావాలి. అన్నింటికి మించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులుండాలి. 

నేర్చుకోవడం ముఖ్యం

l బోధన సరైన పద్ధతిలో జరిగినప్పుడే పిల్లల్లో పరిశోధనాత్మక, సృజనాత్మక నైపుణ్యాలు పెరుగుతాయి. అప్పుడే వాళ్ల చదువు సార్థకమవుతుంది. మార్కులతో డిగ్రీ పొందితే ఉపయోగం లేదు. చదివింది జీవితానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేవిధంగా ఎలా అన్వయించుకోవాలో తెలియాలి. ఇందుకు కావాల్సింది మార్కులు కాదు.. నేర్చుకునే తత్వం. ఇప్పుడు అందించే విద్య రీడింగ్‌, అండర్‌స్టాండింగ్‌ అనే రెండు అంశాలపైనే నడుస్తున్నది. కానీ బ్లూమ్‌ టాక్సానమీ పద్ధతిలో ఈ రెండింటితో పాటుగా అనలైజింగ్‌, అప్లికేషన్‌ తరువాత ఇంటెలిజెంట్‌ కూడా ఉంటాయి. బట్టీ చదువులు కాకుండా విషయాన్ని అర్థం చేసుకుని, అన్వయించుకోగలగాలంటే నేర్చుకోవడం ముఖ్యం. దీన్ని టెక్నాలజీ సులభతరం చేస్తుంది. బోధించే విషయాన్ని ఉదాహరణలతో, మోడల్స్‌తో వివరించినప్పుడు వాళ్లు బాగా అర్థం చేసుకుంటారు. బోధనా పద్ధతి పిల్లలను తనవైపు ఆకర్షించుకునేలా ఉండాలంటే టెక్నాలజీని వినియోగించుకోవాలి. 

టీచింగ్‌-లెర్నింగ్‌ ప్రాక్టీస్‌

l టీచర్‌ బోధనలో టీచింగ్‌-లెర్నింగ్‌ ప్రాక్టీస్‌ చేసినప్పుడు పిల్లలకు ఉన్నత స్థాయిలో బోధించడం సాధ్యమవుతుంది. సిలబస్‌లోని పుస్తకాలు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటుండాలి. టెక్నాలజీకి అప్‌డేట్‌ అవుతుండాలి. రోజురోజుకో కొత్త టెక్నాలజీ వస్తున్నది. ఉపాధ్యాయులు వీటిని నేర్చుకోగలిగితేనే విద్యార్థులకు సంపూర్ణాత్మక విద్యను అందించగలరు. అయితే సాంకేతికాంశాలే కాకుండా కమ్యూనికేషన్‌, భాష, మాట్లాడే తీరు కూడా నేర్చుకోవడంలో భాగమే. నాయకత్వ లక్షణాలు, టీమ్‌ వర్క్‌ స్పిరిట్‌ రావడానికి ఇవే నాంది. వీటినే ఇప్పుడు సాఫ్ట్‌ స్కిల్స్‌ అంటున్నారు. 

కొవిడ్‌లో.. విద్య ఎలా?

l ప్రస్తుతం కరోనా మహమ్మారివల్ల ముఖాముఖి విద్యాబోధన సాధ్యం కాదు. అందుకే 70 శాతం ఆన్‌లైన్‌ బోధన జరిపి, 30 శాతం ఇంటరాక్టివ్‌ సెషన్లు అందించాలి. ఈ సెషన్ల కోసం ప్రత్యేక స్లాట్స్‌ పెట్టాలి. ఈ సమయంలో పిల్లలు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారు. అలా ప్రశ్నోత్తరాలు లేకుండా వీడియో కాన్ఫరెన్సులు విని చదువుకోవాలంటే అర్థం కాదు. దాదాపు అన్ని ఇంజినీరింగ్‌, ఇతర కాలేజీల్లో కూడా డిసెంబర్‌ వరకు ఆన్‌లైన్‌ బోధన అని చెప్పారు. ఈ సెమిస్టర్‌లో ముఖాముఖి బోధన లేదు. మనదేశంలో ఒక్కరోజు క్లాసు మిస్సయినా ఆ తరువాతి రోజు పాఠం ఏమీ అర్థం కాదు. ఇందుకోసం అమెరికాలో ఒక వెసులుబాటు ఉంది. అక్కడి కొన్ని యూనివర్సిటీల్లో వీడియో రికార్డు చేసి పంపిస్తారు. విద్యార్థి దాన్ని చూసి, అర్థం చేసుకుని మరుసటి రోజు క్లాసుకి వస్తాడు. దాంతో పాఠం అర్థం కాకపోవడమన్నది ఉండదు. ఇలాంటి బోధన ఈ కొవిడ్‌ సమయంలో పనికొస్తుంది. 

l సాధారణంగా వృత్తి విద్యలో సెమిస్టర్లుంటాయి. కరోనా ప్రభావం వల్ల ఈ సంవత్సరం సెమిస్టర్లు తీసేసి, మొత్తం ఏడాది చదువుగా మార్చాలన్నది ఐఐటీ కాలేజీల భావన. మరొక పద్ధతి ఏంటంటే, డిసెంబర్‌ వరకు ఆన్‌లైన్‌ బోధన పూర్తి చేసి, జనవరి నుంచి ముఖాముఖి బోధన ప్రారంభించవచ్చు. ల్యాబ్‌ తరగతులు కూడా జనవరి తరువాత ప్లాన్‌ చేయవచ్చు. ఇలా బ్లెండెడ్‌ లెర్నింగ్‌ పూర్తి చేయవచ్చు.logo