మంగళవారం 11 ఆగస్టు 2020
Nipuna-education - Jul 15, 2020 , 02:27:12

నాగరికతల నాడీ పట్టేద్దామిలా!

నాగరికతల నాడీ పట్టేద్దామిలా!

 • సింధు నాగరికతలోని ఏ నగరంలో గుర్రపు అవశేషాలు కనిపించాయి?
 • రుగ్వేదంలో ఏ మండలంలో గాయత్రి మంత్రం ఉంది?
 • కౌముది మహోత్సవం పుస్తకం రాసింది ఎవరు?
 • అశోకుడు ఏ శాసనంలో కళింగ యుద్ధం గురించి పేర్కొన్నాడు?
 • భారత దేశంలో తొలి సంస్కృత శాసనాన్ని వేయించింది ఎవరు?
 • కనౌజ్‌ కోసం జరిగిన త్రిముఖ పోరులోని రాజ్యాలేవి?
 • ఢిల్లీ సుల్తాన్‌ల వరుస క్రమం?
 • బెంగాల్‌ తొలి గవర్నర్‌?
 • బెంగాల్‌ చివరి గవర్నర్‌ లేదా బెంగాల్‌ తొలి గవర్నర్‌ జనరల్‌?

ఇలా చరిత్రలో ఎన్నో అంశాలను అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి. వేర్వేరు రాజవంశాల పాలన కాలంలో ఉండే సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులు, సాహిత్యం, పురావస్తు ఆధారాలు వివిధ నగరాలు, విశేషాలు, వ్యక్తులు ఎంతో సమాచారం ఉంటుంది. అయితే మెమరీ టెక్నిక్స్‌ ఉపయోగించడం ద్వారా అలాంటి వాటిని తేలికగా గుర్తుంచుకోవచ్చు. చరిత్రలో స్టాక్‌గా ఉండే అంశాలు, అంటే రాజుల వంశ క్రమం, పుస్తకాలు-రచయితలు, శాసనాలు ఇలాంటి వాటిని త్వరగా నేర్చుకుంటే చరిత్రపై పట్టు లభిస్తుంది. ఆ తర్వాత ఇంతకు ముందు చెప్పినట్లు సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారా చర్రితలో ఎలాంటి ప్రశ్న వచ్చినా జవాబు కనుగొనవచ్చు. సింధు నాగరికతలో ఎన్నో నగరాలు బయటపడ్డాయి. ఒక్కో నగరానిది ఒక్కో విశిష్టత. వాటన్నింటినీ గుర్తుంచుకోవాలి. అయితే మెమరీ టెక్నిక్స్‌తో వాటిని తేలికగా ఎలా నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం. చరిత్రలో ముందు పటాలతో అధ్యయనం చేయాలని గత వారం ప్రస్తావించాం. సింధు నాగరికత కాలం నుంచి 1947 వరకు పటాల అధ్యయనం ద్వారా ఎవరు? ఎక్కడ? ఎప్పుడు? అధికారంలో ఉన్నారన్న విషయం అవగాహన వస్తుంది. ఆ తర్వాత కాలక్రమం ఆధారంగా వివిధ అంశాలను నేర్చుకోవచ్చు. ఇందులో ప్రతి నగరానికి ఒక కోడ్‌ ఇచ్చి ఆ తర్వాత ఆ కోడ్‌తో నగరంలోని విశేషాలను అల్లడం ద్వారా తేలికగా గుర్తుంచుకోవచ్చు. 

లోథాల్‌: దీనికి ‘లోటా’ కోడ్‌ వర్డ్‌గా నిర్ణయిద్దాం. లోటా అంటే గ్లాస్‌ అని అర్థం. ఈ నగరం గురించి నేర్చుకొనే అంశాలన్నీ లోటాతో ముడిపెట్టాలి. మీ మిత్రుడు రావ్‌ మీకు ఒక లోటాలో నీళ్లు తెచ్చి, చాలా తీయగా ఉన్నాయని ఇవి తాగు అని చెప్పాడు. మీరు వాటిని తీసుకున్నారు? ఇవి ఏ నదివి అని అడిగారు, భోగవా నది అని అతడు చెప్పాడు. నీళ్లు బాగున్నాయి కాబట్టి, మీరు అక్కడకు వెళదాం అనుకున్నారు. ఇది గుజరాత్‌లో ఉంది. మీరు అక్కడకు వెళ్లేందుకు వరితో అన్నం చేసుకున్నారు. రైలులో ఆడుకోడానికి ఒక చెస్‌ బోర్డ్‌ కూడా తీసుకున్నారు. అక్కడ దిగగానే మీకు చాలా పూసలు లభించాయి. వాటన్నింటిని మీరు కొలబద్దతో కొలిచారు. ఇంతలో వరద వచ్చి ఆనకట్ట తెగి, పూసలు కొట్టుకుపోయాయి. 

ఇప్పుడు కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి?

 • మీకు లోటా నీళ్లు ఇచ్చింది ఎవరు? (రావ్‌, ఈ నగరాన్ని కనుగొన్న వ్యక్తి ఎస్‌ఆర్‌ రావ్‌)
 • అక్కడకు వెళ్లేటప్పుడు మీ వెంట ఏం తీసుకెళ్లారు? (వరి-వరి గింజలు ఇక్కడ లభించాయి, చెస్‌బోర్డ్‌ కూడా ఇక్కడ కనిపించింది)
 • అక్కడ దిగగానే మీకు ఏం లభించాయి? (పూసలు, ఈ నగరం పూసల తయారీకి పేరుపొందింది)
 • మీరు వాటిని ఏం చేశారు? (కొలబద్దతో కొలిచారు-ఇక్కడ కొలబద్ద కూడా దొరికింది)
 • వరద రావడానికి కారణం? (ఆనకట్ట తెగడం, లోథల్‌-సింధు నాగరికత ప్రజల సహజ  ఓడరేవు నగరం)
 • ఈ విధంగా సింధు నాగరికత నగరాలన్నింటినీ కథల రూపంలోకి మలిచి నేర్చుకోవచ్చు. మొహంజొదారో, బన్వాలీ, చాన్హుదారో, రాఖీ గర్హి, కాళీబంగన్‌ తదితర నగరాలకు సొంతంగా టెక్నిక్స్‌ యత్నించి గుర్తు పెట్టుకోండి.

హరప్పా

ఈ పదం ఊతప్పకు దగ్గరగా ఉంది. కాబట్టి హరప్పాను ఊతప్పగా ఊహించి చదువుదాం. మీకో మిత్రుడు ఉన్నాడు, వాళ్ల ఇల్లు రావి చెట్టులో ఉంది. ఒక రోజు మీరు అతడి ఇంటికి వెళ్లారు. అతను మీకు ఊతప్పలే చేయడంతో పాటు వాళ్ల ఇంటిని చూపాడు. ఇల్లు పెద్దగా ఉండటంతో మీరు పొడవు వెడల్పులను కొలబద్దతో లెక్కించారు. అలాగే ప్రతి గదిలో కాంస్యంతో చేసిన దర్పణాలు మీరు చూశారు.  ఇల్లు రెండు వరుసల్లో ఉంది. ప్రతి వరుసలో ఆరు గదులు ఉన్నాయి. అంటే మొత్తం 12 ఉన్నాయన్నమాట. ఒక గదిలో మీరు చాలా భయపడ్డారు. కారణం అక్కడ తలలేని పురుషుడు మీకు కనిపించాడు. దీంతో మీ మిత్రుడిని, పట్టుకున్నారు. ‘దయ’ చూపి అక్కడ నుంచి తీసుకువెళ్లమన్నారు.

పై కథలో హరప్పా నగర విశేషాలు ఉన్నాయి. కింది ప్రశ్నలకు సమాధానం చెబుతూ వాటిని తెలుసుకోండి.

 • 1. మీ మిత్రుడి ఇల్లు ఏ చెట్టులో ఉంది? (రావి, హరప్పా నగరం రావి నది ఒడ్డున ఉంది)
 • 2. మీ మిత్రుడు మీకు ఇచ్చిన అల్పాహారం (ఊతప్ప, ఇది హరప్పా నగరం అని మీకు గుర్తుండటానికి)
 • 3. ఇల్లు చూసాక మీరు ఏం చేశారు? (కొలబద్దతో కొలిచారు. ఈ నగరంలో కొలబద్ద దొరికింది)
 • 4. ప్రతి గదిలో మీరు ఏం గమనించారు? (దర్పణం- ఈ నగరంలో దర్పణాలు లేదా అద్దాలు కనిపించాయి)
 • 5. గదుల అమరిక ఎలా ఉంది? (రెండు వరుసల్లో వరుసకు ఆరు చొప్పున ఉన్నాయి. ఈ నగరంలో 12 ధాన్యాగారాలు ఉన్నాయి)
 • 6. మీరు భయపడటానికి కారణం? (తలలేని పురుషుడు కనిపించడం- ఈ నగరంలో తలలేని పురుష విగ్రహం బయల్పడింది)
 • 7. మీ మిత్రుడిని మీరు ఏం అడిగారు? (‘దయ’ చూపి తీసుకెళ్లమన్నారు-ఈ నగరాన్ని కనుగొన్న వ్యక్తి-దయారాం సాహ్ని)
 • మరోసారి చదవండి, హరప్పా విశేషాలు ఎప్పటికీ గుర్తుంటాయి. 


logo