శనివారం 04 జూలై 2020
Nipuna-education - Jul 01, 2020 , 02:44:01

కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్

తెలంగాణ

పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక

తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదిక 2019-20ను జూన్‌ 23న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. జాతీయ జీఎస్‌డీపీ (స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి) సగటుతో పోల్చుకుంటే రాష్ట్రం 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 2018-19లో 4.55 శాతం నమోదు కాగా 2019-20లో అది 4.76 శాతానికి పెరిగిందని చెప్పారు. టీఎస్‌-ఐపాస్‌ ద్వారా ఇప్పటివరకు రూ.1,96,404 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అనుమతించిన 12,021 పరిశ్రమల్లో 75 శాతం పైగా కార్యకలాపాలను ప్రారంభించాయని మంత్రి వెల్లడించారు.

ఆరో విడత హరితహారం

సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో జూన్‌ 25న అల్ల నేరేడు మొక్కను నాటి ఆరో విడత హరితహారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 30 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా అర్బన్‌ ఫారెస్ట్‌ను ప్రారంభించారు.

జాతీయం


అంతర్జాతీయ యోగా డే

ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 21ను అంతర్జాతీయ యోగా డేగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరపాలని ప్రధాని మోదీ 2014, సెప్టెంబర్‌ 27న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సూచించారు. దీంతో 2015 నుంచి జూన్‌ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది యోగా డే థీమ్‌ ‘యోగా ఫర్‌ హెల్త్‌-యోగా ఎట్‌ హోం’

టీబీ వార్షిక నివేదిక

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, సహాయ మంత్రి అశ్వనికుమార్‌ చౌబే జూన్‌ 24న న్యూఢిల్లీలో టీబీ వార్షిక నివేదిక-2020ను విడుదల చేశారు. నేషనల్‌ టీబీ ఎలిమినేషన్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌టీఈపీ)-2019లో అత్యుత్త పనితీరుకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకులను ఇచ్చింది. 50 లక్షలకు పైబడిన జనాభాగల పెద్ద రాష్ర్టాల కేటగిరీలో గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అత్యుత్తమ పనితీరు కనబరిచి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. 50 లక్షల కంటే తక్కువ జనాభా కలిగిన చిన్న రాష్ర్టాల కేటగిరీలో త్రిపుర, నాగాలాండ్‌ అత్యుత్తమ పనితీరు కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.

అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌

ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా భారతీయ అంతరిక్ష రంగంలో ప్రయోగాలు, కార్యకలాపాల్లో ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యానికి కేంద్ర కేబినెట్‌ జూన్‌ 24న ఆమోదించింది. భారత అంతరిక్ష రంగ మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలు వినియోగించుకునేందుకు అనుసంధాన సంస్థగా ఏర్పాటు చేసిన ‘ఇండియన్‌ స్పేస్‌, ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌)’కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

స్టార్టప్‌లకు అనువైన నగరాలు 

బెంగళూరు, ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా విజయవంతమయ్యేలా స్టార్టప్‌లను ఏర్పాటు చేయడానికి అత్యంత అనుకూలమైన పర్యావరణ వ్యవస్థలు ఉన్న జాబితాను స్టార్టప్‌ జీనోమ్‌ ఓ నివేదికను జూన్‌ 25న విడుదల చేసింది. ‘ది గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ రిపోర్ట్‌-2020’ పేరుతో రూపొందించిన ఈ జాబితాలో మొత్తం 40 ప్రధాన నగరాలకు ర్యాంకులు ప్రకటించింది. వీటిలో భారత్‌ నుంచి బెంగళూరుకు 26, ఢిల్లీకి 36వ ర్యాంకులు లభించాయి. కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ మొదటి స్థానంలో నిలిచింది.

అంతర్జాతీయ విమానాశ్రయంగా కుషినగర్‌

ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు కేంద్ర కేబినెట్‌ జూన్‌ 25న ఆమోదం తెలిపింది. ఈ విమానాశ్రయం శ్రవస్తి, కపిలవస్తు, లుంబిని వంటి బౌద్ధ సాంస్కృతిక ప్రదేశాల సమీపంలో ఉంది.

వంతెనలు ప్రారంభం

జమ్ముకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌, దోడా జిల్లాల్లో దేవిక, పుణేజా అనే రెండు వంతెనలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ జూన్‌ 25న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. 10 మీ. పొడవుగల దేవిక వంతెనను రూ.75 లక్షలతో నిర్మించారు.

అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

ఒడిశాలోని పారాదీప్‌లో ప్రొడక్ట్‌ అప్లికేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూన్‌ 25న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దీనిని రూ.43 కోట్లతో ఇండియన్‌ ఆయిల్‌ ఏర్పాటు చేసింది.

అంతర్జాతీయం


విక్టరీ పరేడ్‌

1941-45లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ ప్రజల విజయానికి గుర్తుగా 75 ఏండ్ల విక్టరీ పరేడ్‌ వేడుకలను మాస్కోలో జూన్‌ 21న నిర్వహించారు. ఈ వేడుకలో రష్యా సైనిక దళాల్లో 75 మంది భారత సైనికులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అజయ్‌ కుమార్‌, డీబీ వెంకటేశ్‌ శర్మ హాజరయ్యారు.

రిక్‌ సమావేశం

రష్యా, భారత్‌, చైనా దేశాల విదేశాంగ మంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌ రిక్‌ (RIC) పేరుతో జూన్‌ 23న జరిగింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్జ్‌ లాలోవ్‌, భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ గల్వాన్‌ లోయలో చైనా బలగాల దాడి, ప్రపంచ రాజకీయ స్థితిగతులతోపాటు ఆర్థిక వ్యవహారాలపై చర్చించారు. 

అమెరికాలో యోగా యూనివర్సిటీ

ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం (2020, జూన్‌ 21) సందర్భంగా అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో వివేకానంద పేరుతో యోగా యూనివర్సిటీని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి వీ మురళీధరన్‌, విదేశీ వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పీపీ చౌదరీ జూన్‌ 23న ప్రారంభించారు. ఇది భారత్‌ వెలుపల తొలి యోగా యూనివర్సిటీ. దీనికి ప్రముఖ యోగా గురువు డాక్టర్‌ హెచ్‌ఆర్‌ నాగేంద్ర తొలి చైర్మన్‌గా నియమితులయ్యారు. 

ఐరాస పేదరిక నిర్మూలన కూటమిలో భారత్‌

ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన కూటమిలో జూన్‌ 25న భారత్‌కు చోటు దక్కింది. ఐరాస 74వ జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు టిజాన్‌ మహమ్మద్‌ బాందె జూన్‌ 30న అధికారికంగా ఈ కూటమిని ప్రారంభించనున్నారు.

నాసా కేంద్రానికి మేరీ జాక్సన్‌ పేరు

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ఉన్న నాసా కేంద్రానికి అక్కడ పనిచేసిన తొలి నల్లజాతి ఇంజినీర్‌ మేరీ జాక్సన్‌ పేరు పెట్టినట్టు నాసా అధికారులు జూన్‌ 24న తెలిపారు. ఆఫ్రికన్‌ అమెరికన్లకు ముఖ్యంగా మహిళలకు ఇంజినీరింగ్‌ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించడానికి ఉన్న అవాంతరాలను జాక్సన్‌ సుగమం చేశారు. 

పాలస్తీనా శరణార్థులకు సాయం

పశ్చిమాసియా ప్రాంతంలోని పాలస్టీనా శరణార్థులకు జూన్‌ 25న భారత్‌ భారీ సాయం ప్రకటించింది. వారి కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి రిలీఫ్‌ అండ్‌ వర్క్‌ ఏజెన్సీ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ)కి 10 మిలియన్‌ డాలర్లు (రూ.75.61 కోట్లు) ఇవ్వనున్నట్లు తెలిపింది. వచ్చే రెండేండ్లలో ఈ నిధులను సమకూర్చనున్నట్లు వెల్లడించింది. నైపుణ్య శిక్షణ, మన్నికైన సంస్థలను నిర్మించడం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచడమే ఈ సహాయ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేసింది. 

వార్తల్లో వ్యక్తులు


ఎన్‌ఎస్‌ఎఫ్‌ అధిపతిగా సేతురామన్‌

భారత సంతతికి చెందిన ప్రముఖ సైంటిస్ట్‌ సేతురామన్‌ పంచనాథన్‌ను ప్రతిష్ఠాత్మక అమెరికా జాతీయ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌)కు డైరెక్టర్‌గా జూన్‌ 20న ఎంపికయ్యారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో ప్రాథమిక పరిశోధనకు ఈ సంస్థ నిధులు అందిస్తుంది. ఈ ఫౌండేషన్‌ వార్షిక బడ్జెట్‌ 740 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ స్థాయిని చేరుకున్న రెండో భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు. ఇంతకుముందు సుబ్రా సురేశ్‌ ఈ సంస్థకు సేవలందించారు.

నీతా అంబానీ

అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజీన్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ 2020కు అత్యంత వితరణశీలుల జాబితాను జూన్‌ 21న విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి నీతా అంబానీకి చోటు దక్కింది. కరోనా నేపథ్యంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా చేపట్టిన పలు సేవాకార్యక్రమాలను గుర్తించి నీతాకు ఈ గౌరవం ఇచ్చినట్లు మ్యాగజీన్‌ నిర్వాహకులు తెలిపారు. ఈ జాబితాలో నీతాతోపాటు టిమ్‌ కుక్‌, ఓప్రా విన్‌ఫ్రే, లారిన్‌ పావెల్‌ జాబ్స్‌, ది లాడర్‌ ఫ్యామిలీ, మైఖేల్‌ బ్లూంబర్గ్‌, లియో డికాప్రియో వంటి ప్రముఖులు ఉన్నారు.

ఎంసీసీ పీఠంపై కానర్‌

మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ)కు ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ క్లేర్‌ కానర్‌ అధ్యక్షురాలిగా జూన్‌ 24న ఎన్నికైంది. 233 ఏండ్ల చరిత్ర ఉన్న ఎంసీసీకి అధ్యక్షురాలిగా ఎన్నికయిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న శ్రీలంక క్రికెటర్‌ కుమార సంగక్కర 2021లో పదవి నుంచి దిగిపోయిన తర్వాత కానర్‌ ఆ బాధ్యతలు చేపడుతారు.

క్రీడలు


ఉత్తరాఖండ్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌గా జాఫర్‌

టీం ఇండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ ఉత్తరాఖండ్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా జూన్‌ 23న నియమితులయ్యాడు. రెండు దశాబ్దాలపాటు క్రికెట్‌లో కొనసాగిన ఆయన 2020, మార్చిలో రిటైరయ్యాడు.

సంజితకు అర్జున అవార్డు

భారత వెయిట్‌లిఫ్టర్‌ సంజిత చానుకు 2018లో నిలిపిన అర్జున అవార్డును ఇవ్వనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ జూన్‌ 25న ప్రకటించింది. ఆమె డోపింగ్‌కు పాల్పడలేదని అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) ప్రకటించడంతో ఈ అవార్డును ఇవ్వనున్నారు. 2014, 2018 కామన్‌వెల్త్‌ క్రీడల్లో సంజిత స్వర్ణ పతకాలు సాధించింది.

ఈపీఎల్‌ చాంపియన్‌ లివర్‌పూల్‌

ఇంగ్లిష్‌ ప్రీమియన్‌ లీగ్‌ (ఈపీఎల్‌) 2019-20 సీజన్‌ చాంపియన్‌గా లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ నిలిచింది. జూన్‌ 26న లివర్‌పూల్‌లో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్‌ సిటీ జట్టు 1-2 గోల్స్‌తో చెల్సీ ఎఫ్‌సీ జట్టుపై ఓడింది. దీంతో లివర్‌పూల్‌ టీంకు టైటిల్‌ లభించింది. టైటిల్‌ గెలవాలంటే ఓటమి నుంచి తప్పించుకోవాల్సిన మ్యాచ్‌లో మాంచెస్టర్‌ సిటీ ఓడిపోవడంతో కరోనా విరామం అనంతరం బరిలోకి దిగకుండానే లివర్‌పూల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఈపీఎల్‌ చరిత్రలో ఓ జట్టు ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే చాంపియన్‌గా అవతరించడం ఇదే తొలిసారి. 


logo