సోమవారం 06 జూలై 2020
Nipuna-education - Jun 24, 2020 , 00:42:05

ఫిల్లర్స్‌.. మెమరీ పిల్లర్స్‌

ఫిల్లర్స్‌.. మెమరీ పిల్లర్స్‌

395 సంఖ్యాయుత ఆర్టికల్స్‌, సబ్‌క్లాజ్‌లు 100కు పైగా రాజ్యాంగ సవరణలు అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అన్ని స్థాయిల పోటీ పరీక్ష లకు పాలిటీ విభాగం కీలకం. యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ.. ఏ స్థాయి పరీక్ష అయినా సరే ఈ అంశానికి వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. ఆర్టికల్స్‌, రాజ్యాంగసవరణలు గుర్తుంచుకోవడం ఒకింత కష్టమే. మెమరీ టెక్నిక్స్‌తో చాలా తేలికగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఆర్టికల్స్‌ లేదా రాజ్యాంగసవరణలు ‘సంఖ్యలతో’ ముడిపడి ఉన్నాయి. ప్రతి సంఖ్యకు అక్షరాలను జోడిస్తాం. తర్వాత అక్షరాలతో కూడిన దృశ్యాలను సృష్టిస్తాం. సంఖ్యలకు జోడించిన అక్షరాలను పరిశీలిస్తే..

0 - s or z

1- t or d

2-n

3-m

4-r

5-L

6-J

7- k or g

8 - f or v

9 - p or b

 • ఇందులో జాగ్రత్తగా పరిశీలిస్తే మొత్తం 15 అక్షరాలకే సంఖ్యల కేటాయింపులున్నాయి. మిగతావాటిని ‘ఫిల్లర్స్‌'గా గుర్తించాలి. అవి a, e, i, o, u, c, h, q, w, x, y 
 • వీటి ఆధారంతో సంఖ్యలను అక్షరాలుగా, అక్షరాలను దృశ్యాలుగా మార్పు చేస్తాం. వాటి ద్వారా రాజ్యాంగంలోని వివిధ అధికరణలను గుర్తుంచుకోవచ్చు. ఉదాహరణకు 15 సంఖ్య తీసుకుంటే 1-t, 5-l అంటే 15=tl. ఇది అర్థవంతంగా లేదు. దీనిని tailగా మార్చుకుంటే సరి. మధ్యలో ఉన్న ai అక్షరాలకు ఎలాంటి విలువ లేదు. అంటే 15 అనే సంఖ్య టెయిల్‌గా మారింది. టెయిల్‌కు దృశ్యరూపం ఉంది. 15కు సంబంధించి నేర్చుకోవాలనుకుంది టెయిల్‌కు ముడిపెడతాం. ఆ విధంగా చేయవచ్చు. ఇంకో ఉదాహరణ పరిశీలించండి.
 • 21 సంఖ్యను తీసుకుందాం. ఇందులో 2 అంటే n, 1 అంటే t. అంటే 21 అనే సంఖ్యను nt గా కోడ్‌ చేయొచ్చు. దీనిని అర్థవంతమైన పదంగా మార్చాలి. net అంటే వల. దృశ్యం ఉంది. ఇందులో n విలువ 2, t విలువ 1. కానీ e కు ఎలాంటి విలువ లేదు. కాబట్టి 21 సంఖ్యకు మనం ఇచ్చిన దృశ్య రూపం నెట్‌ లేదా వల. 
 • అలాగే 52 సంఖ్యను పరిశీలిద్దాం. 5 అంటే L, 2 అంటే n. అంటే మొత్తం Ln, వీటి మధ్య io అనే రెండు అక్షరాలను జోడిస్తే Lion గా మారుతుంది. ఇందులో io లకు ఎలాంటి విలువ లేదు. ఇవి కేవలం ఫిల్లర్స్‌ మాత్రమే. అంటే 52 అనే సంఖ్యకు మనం ఇచ్చిన దృశ్య రూపం లయన్‌. ఇలా ప్రతి సంఖ్యను దృశ్యరూపంలోకి మార్చుకోవచ్చు. వీటి ద్వారా మొత్తం రాజ్యాంగపు ఆర్టికళ్లను కేవలం ఒక్కసారి చదివి గుర్తుంచుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ఎలాగో చూద్దాం..
 • ఆర్టికల్‌ 52- భారత దేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు. ఇప్పటికే మనం 52 అనే సంఖ్యకు దృశ్య రూపం ఇచ్చాం. మెమరీ కోడ్‌ భాషలో 52 అంటే లయన్‌. కాబట్టి భారతదేశానికి అత్యున్నత హోదాలో ఎవరు ఉంటారు? అంటే లయన్‌ అని గుర్తుంచుకోవాలి. లయన్‌ను డీకోడ్‌ చేస్తే ఆర్టికల్‌ 52 అని వస్తుంది. అంటే ఆర్టికల్‌ 52 ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు. 
 • 123- DNM. ఇది అసలు కోడ్‌. దీనిని అర్థవంతమైన పదంగా మారిస్తే DeNiMగా మార్చవచ్చు. DeNiM అనేది ఒక సబ్బు. ఆర్టికల్‌ 123 ప్రకారం భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్‌లు జారీచేస్తారు. ఆర్డినెన్స్‌ జారీ-DeNiM లను లింక్‌ చేసుకోవాలి. రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ జారీచేసినప్పుడల్లా ప్రజలందరూ DeNiM సబ్బుతో స్నానం చేయాలని లింక్‌ చేసుకుంటే సరిపోతుంది. ఆర్డినెన్స్‌ గుర్తుకు వచ్చినప్పుడల్లా DeNiM గుర్తుకురావాలి. దానిని డీకోడ్‌ చేస్తే 123 వస్తుంది. మరికొన్ని ఆర్టికళ్లను పరిశీలిద్దాం..
 • 53- భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహిస్తారు. మన కోడ్‌ భాషలో 53 అంటే లామా కాబట్టి భారతదేశ పరిపాలన అంతా లామా పేరుమీదుగా నిర్వహిస్తారని ఊహించండి. లామాను డీకోడ్‌ చేస్తే 53 వస్తుంది.
 • 54-రాష్ట్రపతి ఎన్నిక- (నిజానికి ఎలక్ట్రోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు సభ్యులు), ఎన్నికలో పాల్గొనే వారంతా లారీల్లో వెళ్లి ఓటు వేస్తున్నట్లు ఊహించుకోండి. లారీని డీకోడ్‌ చేస్తే 54 వస్తుంది. లేదా పోలింగ్‌బూత్‌ లారీలో ఏర్పాటు చేసినట్లు ఊహించుకోండి. ఇలా అన్ని అధికరణలను సందర్భోచితంగా కోడింగ్‌  చేసుకుంటూ వెళ్లండి.
 • 243-nrm nirma- ప్రజలకు నిర్మా కావాలంటే స్థానిక ప్రభుత్వాల దగ్గరే దొరుకుతాయి (మున్సిపాలిటీలు లేదా పంచాయతీలు), అధికరణం 243లో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇలా ప్రతి సంఖ్యలకు కోడ్‌ తయారు చేసుకోవచ్చు. సొంతంగా కూడా అభ్యర్థులు రూపొందించుకుంటే మంచిది.

కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి?

1) దేశానికి అధిపతిగా రాష్ట్రపతి ఏ ఆర్టికల్‌ ప్రకారం ఉంటారు? (లయన్‌ గుర్తుకు రావాలి. లయన్‌ను డీకోడ్‌ చేస్తే ఆర్టికల్‌ 52 వస్తుంది).

2) దేశంలో పాలన మొత్తం ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పేరుమీద జరుగుతుంది? (లామా అని చదువుకున్నాం. లామాను డీకోడ్‌ చేస్తే 53 వస్తుంది).

3) రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అధికరణం? (సభ్యులందరూ లారీలో వెళుతున్నారనుకున్నాం. లారీని డీకోడ్‌ చేస్తే 54 వస్తుంది)

ప్రాథమిక హక్కులు-కేసులతో అనుసంధానం

ప్రతి పోటీ పరీక్షకు సంబంధించి ప్రాథమిక హక్కులు చాలా కీలకం. అలాగే వీటితో ముడిపడి ఉన్న కేసులు కూడా చాలా ముఖ్యమే. కథనాల రూపంలో వాటిని తేలికగా గుర్తుంచుకోవచ్చు. గతంలో అంకెలు లేదా సంఖ్యలను ఎలా చిత్రాలుగా మలుచుకోవచ్చో ప్రస్తావించాం. అయితే ప్రాథమిక హక్కులను తేలికగా గుర్తుంచుకొనేందుకు ఒక చిన్న కథనం చదవండి..

మీరు ఒకసారి క్వాలిటీ ఐస్‌క్రీం కొనేందుకు ఐస్‌క్రీం పార్లర్‌కు వెళ్లారనుకుందాం..

ఐస్‌క్రీం కొనుక్కొని మీ ఫ్రీడం బైక్‌పై వస్తూ ఉన్నారు. దారిలో ఉన్న స్టేషన్‌ దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. జెన్‌ కార్ల ర్యాలీ  ఉన్నందున వెళ్లడం ఇబ్బందిగా ఉంది. ఆ తర్వాత, కొంత దూరం వచ్చాక, మరోసారి జామ్‌, ఈ సారి చిన్న పిల్లల ర్యాలీ (అందులో బౌద్ధ, సిక్కు, జైన. ఇస్లామ్‌, పార్శీ, క్రైస్తవ)తో జామ్‌ అయింది. పిల్లలు అందరూ రెడిమేడ్‌ డ్రస్సులు వేసుకున్నారు అని ఊహించండి.షెడ్యూళ్లను గుర్తు పెట్టుకుందామిలా..!

 • రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉన్నాయి. వీటిని చాలా తేలికగా గుర్తు పెట్టుకోవచ్చు. ఇప్పటికే మన మెదడులో నిక్షిప్తమై ఉన్న వాటితో కొత్తవి లింక్‌ చేసే పద్ధతిని తెలుసుకున్నాం. తాజాగా షెడ్యూళ్లను ఒకే ఒకసారి చదివి గుర్తుంచుకుందాం. 12 అంటే మనకు 12 నెలలు గుర్తుకు వస్తాయి. జనవరి నుంచి  డిసెంబర్‌ వరకు తడుముకోకుండా ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. వాటిని ఉపయోగించుకొని షెడ్యూళ్లను నేర్చుకోవచ్చు. మనకు ప్రతి నెలా ఒక పండుగ వస్తుంది. జనవరిలో సంక్రాంతి, ఫిబ్రవరిలో శివరాత్రి, మార్చి పరీక్షలు ఉండే నెల, ఏప్రిల్‌ ఫూల్స్‌ డే, మేలో కార్మికుల దినోత్సవం, జూన్‌లో విద్యాలయాలు తిరిగి ప్రారంభిం. ఇలా ఇవన్నీ మనకు తెలిసినవే. డిసెంబర్‌లో క్రిస్మస్‌ వస్తుంది. ఆయా వేడుకలకు షెడ్యూళ్లను అనుసంధానం చేయడం ద్వారా కొత్తవి తేలికగా గుర్తుంచుకోవచ్చు. 
 • ఉదాహరణకు అక్టోబర్‌ అంటే ఎవరికయినా గుర్తుకు వచ్చేది మహాత్మాగాంధీ. అక్టోబర్‌ 10వ నెల. దీనికి 10 షెడ్యూల్‌ను అనుసంధానం చేయాలి. మీరు తరచూ చూసే మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఊహించండి. ఆయన చేతిలో ఎప్పుడు కర్ర ఉంటుంది. కర్రతో ఆయన కొందరిని కొడుతూ ఉన్నారని ఊహించుకోండి. ఇది సాధ్యం కాదంటే ఇల్లాజికల్‌. కాబట్టే గుర్తుంటుంది. ఆయన పార్టీ మారేవాళ్లను తన కర్రతో కొడుతున్నారని ఊహించండి. ఎందుకంటే పదో షెడ్యూల్‌ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి తెలుపుతుంది. మీకు పరీక్షలో ఫిరాయింపు నిరోధక చట్టం ఏ షెడ్యూల్‌లో ఉందని అడిగితే వెంటనే పార్టీ మారేవాళ్లను గాంధీ కొడుతున్నారని మనసులో రావాలి. గాంధీ అక్టోబర్‌కు లింక్‌ అయి ఉన్నారు. కాబట్టి ఇది పదో షెడ్యూల్‌.
 • మరొకటి పరిశీలిద్దాం.. ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర దినోత్సవం. ఆ రోజున అన్ని భాషల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారని ఊహించండి. మీరు ఆ రోజు 22 మంది వ్యక్తులతో మాట్లాడారు. వారందరిది వేర్వేరు భాష. ఇలా లింక్‌  చేయడానికి కారణం ఆగస్ట్‌ ఎనిమిదో నెల. ఎనిమిదో షెడ్యూల్‌ భాషలకు సంబంధించింది. పరీక్షలో ఎనిమిదో షెడ్యూల్‌ దేనికి సంబంధించిందని అడిగితే మీ దృష్టి ఆగస్ట్‌ మీదకు వెళ్లాలి (ఆగస్ట్‌ ఎనిమిదో నెల కాబట్టి). వెంటనే 15వ తేదీ, ఆ రోజు అన్ని భాషల వ్యక్తులతో అన్ని భాషల్లో మాట్లాడారు. కాబట్టి ఆ షెడ్యూల్‌ భాషకు సంబంధించిందని గుర్తుకు వస్తుంది. 

కింది ప్రశ్నలకు సమాధానం గుర్తించండి..

 • మొదట మీరు ఎక్కడకు వెళ్లాలనుకున్నారు? (క్వాలిటీ ఐస్‌క్రీం పార్లర్‌కు)
 • మీకు ఏ బైక్‌ ఉంది? (ఫ్రీడం) 
 • ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కడ అయ్యింది? (స్టేషన్‌ దగ్గర)
 • చిన్న పిల్లలందరూ ఏం వేసుకున్నారు? (రెడీమేడ్‌ దుస్తులు)

తేలికగా గుర్తుకు వచ్చాయి కదా, గతంలో ప్రస్తావించిన ఒక టెక్నిక్‌ను ప్రస్తావిస్తున్నాం. నేర్చుకోవాల్సిన అంశాన్ని మనకు తెలిసిన పదంతో అనుసంధానం చేయాలని సూచించాం. దానినే ఇక్కడ ఉపయోగించాం. పదాలను ఎలా విడదీశామో చూడండి.

1. Right to equality (క్వాలిటీ ఐస్‌క్రీంతో అనుసంధానం, సమానత్వపు హక్కు, ఆర్టికల్స్‌ 14 నుంచి 18)

2. Right to freedom (ఫ్రీడమ్‌ బైక్‌,  స్వాతంత్య్రపు హక్కు ఆర్టికల్స్‌ 19 నుంచి 22)

3. Right against Exploitation (స్టేషన్‌ దగ్గర జాం, స్టేషన్‌, ఎక్స్‌ప్లాయిటేషన్‌, దగ్గరగా ఉన్నాయి. పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్స్‌ 23, 24)

3. Right to Religion (జెన్‌ కార్ల ర్యాలీ, ర్యాలీ, జెన్‌ అంటే రిలీజియన్‌. మత స్వాతంత్య్రపు హక్కు ఆర్టికల్స్‌ 25 నుంచి 28)

4. Cultural and Educational rights to minorities (వివిధ మతాల చిన్నారులను ప్రస్తావించాం. వారంతా మైనార్టీలు, అల్పసంఖ్యాక వర్గాలవారికి ప్రాథమిక హక్కులు, ఆర్టికల్స్‌ 29, 30)

5. Right to Constitutional Remidies (రెమిడీస్‌ అనే పదాన్ని, రెడీమేడ్‌తో అనుసంధానం, రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆర్టికల్‌ 32)

ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్న కేసులు కూడా చాలా కీలకం. వీటిని ఎలా అనుసంధానం చేయాలో చూడండి. కింద పేర్కొన్న కథను చదవండి.

మీరు క్వాలిటీ ఐస్‌క్రీం కొనేందుకు వెళ్లినప్పుడు, మీకు అక్కడ మీ మిత్రుడు చిరంజీవి కనిపించాడని ఊహించండి. అతడు కోల్‌ పట్టుకున్నాడని భావించండి. (కోల్‌ అంటే బొగ్గు, లేదా కోయిలను పట్టుకున్నాడని కూడా ఊహించొచ్చు). ఎక్కడి నుంచి వచ్చావని మీరు అతడిని అడిగితే విశాఖ నుంచి వచ్చానని చెప్పాడు. ఇప్పుడు ఆయా అంశాలను డీకోడ్‌ చేస్తే చిరంజీవి అంటే చిరంజిత్‌ లాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా. కోల్‌ అంటే బెన్నెట్‌ కోల్‌మన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా విశాఖ అంటే విశాఖ వర్సెస్‌ రాజస్థాన్‌ కేసు

చిరంజిత్‌ లాల్‌, బెన్నెట్‌ కొల్‌మన్‌ కేసులో సమానులను మాత్రమే సమానంగా చూడాలని తీర్పు చెప్పారు. విశాఖ కేసులో పనిచేసే ప్రదేశాల్లో మహిళల రక్షణకు సంబంధించింది. ఇలా అనుసంధానం ద్వారా, ఆయా హక్కులకు సంబంధించిన కోర్టు తీర్పులను గుర్తుంచుకోండి. 

వి.రాజేంద్ర శర్మ, 

ఫ్యాకల్టీ , 9849212411


logo