మంగళవారం 07 జూలై 2020
Nipuna-education - Jun 02, 2020 , 23:51:28

ఇంగ్లిష్‌తో.. ఇస్మార్ట్‌గా..

ఇంగ్లిష్‌తో.. ఇస్మార్ట్‌గా..

చదువుకైనా, విదేశాల్లో కొలువుకైనా ఇంగ్లిష్‌ అవసరం. ఇంగ్లిష్‌పై పట్టు ఉంటే దేనిలోనైనా రాణించవచ్చు. చాలామందికి సబ్జెక్టు నాలెడ్జ్‌ ఘనంగా ఉంటుంది. కానీ ఇంగ్లిష్‌ మాత్రం అథమంగా ఉంటుంది. ఇంగ్లిష్‌ స్కిల్స్‌ లేకపోతే సబ్జెక్టు ఎంత వచ్చినా ఫలితం శూన్యం. అందుకే పతిఒక్కరూ ఇంగ్లిష్‌పై పట్టుసాధించాలి. అలా అని మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే తప్పులు లేకుండా మాతృభాష వస్తే ఇంగ్లిష్‌ చదవడం పెద్ద కష్టమేమి కాదు. చాలా సులభం. అందుకే ఇంగ్లిష్‌ నేర్చుకుని ఇస్మార్ట్‌గా ఉండండి.

  • నచ్చిన చదువైనా, కొలువైనా రావాలంటే ఇంగ్లిష్‌లో నైపుణ్యం ఉండాలి. ఐఐటీలు, ఐఐఎంలు, నైపర్‌ తదితర జాతీయ విద్యాసంస్థల నుంచి రాష్ట్రస్థాయి కాలేజీల్లో చదివిన విద్యార్థుల వరకు ఇంగ్లిష్‌ చదవడం, రాయడం వస్తే అవకాశాలు అపారంగా ఉంటాయి. అంతేకాదు ఏ కంపెనీ అయినా, ఏ ఉద్యోగ ప్రకటన చూసినా ముందుగా ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. భాషపై పట్టు పెంచుకుంటేనే భవిష్యత్తులో మెట్టు మెట్టు ఎదుగుతాం. ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం. 
  • చాలామందికి అన్ని అర్హతలున్నా ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదు. ఎందుకంటే ఏ ఉద్యోగం చేయాలన్నా తప్పనిసరిగా ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలని నిబంధన ఉండటమే. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎంస్‌లు మొదలుకొని స్థానికంగా ఉండే పెద్ద కాలేజీల్లో ఎక్కడ చదివినా, ఉపాధినిచ్చే కోర్సు పూర్తిచేసినా ఇంగ్లిష్‌లో నైపుణ్యం లేకుంటే అవకాశం అందడం కష్టమే. ఒకవేళ వచ్చినా ఎక్కువకాలం ఉండటం కష్టమే అవుతుంది. 
  • రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ, సంస్థలు అంతర్జాతీయంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు ఎంతో ప్రాధాన్యం పెరిగింది. దేశ, విదేశాల్లోని సంస్థల వినియోగదారులతో సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సంస్థల క్లయింట్లను ఆకట్టుకోవాలంటే సబ్జెక్టు నాలెడ్జ్‌తోపాటు ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌ తప్పనిసరిగా ఉండాలి.

బేసిక్‌ స్కిల్స్‌

ఇంగ్లిష్‌ నేర్చుకునేటప్పుడు బేసిక్‌ స్కిల్స్‌ ఉండాలి. నాలుగు అంశాలపై దృష్టిసారిస్తే ఇంగ్లిష్‌ బేసిక్‌ స్కిల్స్‌ మెరుగవుతాయి. అవి.. లిజనింగ్‌, రీడింగ్‌, స్పీకింగ్‌, రైటింగ్‌.

రీడింగ్‌

  • విద్యార్థులు, ఔత్సాహికులు ఇంగ్లిష్‌ నేర్చుకోవాలంటే రీడింగ్‌ అలవాటు నిరంతరం కొనసాగించాలి. అప్పుడే భాషను నేర్చుకోడానికి సులువుగా వీలవుతుంది. ప్రతిరోజూ గంట సమయం కేటాయించుకుని ఒక టాపిక్‌ను తీసుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు చదవకుండా అదే టాపిక్‌ను పదేపదే చదవుతుండాలి. చదివేటప్పుడు లౌడ్‌ రీడింగ్‌ (బిగ్గరగా చదవడం) చాలా ముఖ్యం ఇలా చదవడంవల్ల చదివినది బాగా గుర్తుంటుంది. 
  • పుస్తకాలు, దినపత్రికలు, సమాచారానికి సంబంధించినవి ఏదైనా సరే అర్థం చేసుకుంటూ చదవాలి. తెలియని పదాలను అర్థం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నించాలి. ఏదైనా భాషలోని ఓ టాపిక్‌ను చదివి, దాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా సొంత పదాలతో వివరించాలి. రీడింగ్‌లో ఉచ్ఛారణను సాధన చేయాలి. 
  • వొకాబులరీతోపాటు సంబంధిత సబ్జెక్టు గ్రామర్‌ను తెలుసుకుంటూ చదువుతుండాలి. స్పీడ్‌గా కాకుండా నెమ్మదిగా చదువుతూ పదాలపై దృష్టిసారించాలి. చదువుతున్నప్పుడు లోతుగా వెళ్లకుండా తెలియని పదాలను షార్ట్‌ వేలో అర్థం చేసుకోవాలి. దీంతోపాటు స్పెల్లింగ్‌పై ఫోకస్‌ చేయాలి. ఇంగ్లిష్‌లో నచ్చిన అంశాన్ని ఎంచుకొని చదవడంవల్ల త్వరగా నేర్చుకోడానికి అవకాశాలు ఉంటాయి.

స్పీకింగ్‌

  • ఇంగ్లిష్‌ మాట్లాడే క్రమంలో ఎన్నో తప్పులు దొర్లుతుంటాయి. అలా అని మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే భాషపై ఎప్పటికీ పట్టు సాధించలేరు. మాట్లాడుతున్నప్పటికీ చేసిన తప్పులు చేయకుండా ఉండాలి. స్పీకింగ్‌లో పర్‌ఫెక్షన్‌ కంటే ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ ముఖ్యం. సమయం కుదిరినప్పుడు వీలైనంతవరకు ఎక్కువగా ఇంగ్లిష్‌లోనే ఇతరులతో మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఇలా ప్రతిరోజూ చేయడంవల్ల భాష క్రమంగా మెరుగుపడుతూ సులువుగా మాట్లాడగలుగుతారు. చాలామంది విద్యార్థులకు గ్రామర్‌పై పట్టున్నా మాట్లాడలేరు. దీనికి కారణం ఇతరులతో కమ్యూనికేట్‌ కాకపోవడమే.
  • భాష నేర్చుకునే క్రమంలో బెస్ట్‌ స్పీకర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారో, ఏ విధంగా ఉచ్ఛరిస్తున్నాడో పరిశీలిస్తుండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే బెస్ట్‌ స్పీకర్స్‌ను ఇమిటేట్‌ చేయడంవల్ల సులువుగా ఇంగ్లిష్‌పై పట్టు సాధించవచ్చు. అయితే మాట్లాడాలని ఉత్సాహం ఉన్నా సరైన సపోర్ట్‌ ఉండకపోవచ్చు. కాబట్టి మీకు సరైన పార్ట్‌నర్‌ను వెతికి పట్టుకొని రెగ్యులర్‌గా వారితో మాట్లాడాలి. స్పీకింగ్‌లో భాగంగా కన్వర్జేషన్‌ రికార్డ్‌ చేసుకొని వింటుండాలి. దీనివల్ల మనం చేసిన తప్పులేంటో తెలుస్తాయి. ఇంగ్లిష్‌  సినిమాలు చూడటం ద్వారా కూడా సులువుగా భాష నేర్చుకునే అవకాశముంటుంది.

రైటింగ్‌ 

ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలంటే రైటింగ్‌ కూడా ముఖ్యమే. రీడింగ్‌ స్కిల్స్‌తోపాటు రైటింగ్‌ స్కిల్స్‌ను ఇంప్రూవ్‌ చేసుకోవడంవల్ల కఠిన పదాలు తెలుసుకోవడంతోపాటు కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పెరుగుతాయి. చదువుతున్నప్పుడు తెలియని పదాలు ఉంటే వాటిని నోట్‌ చేసుకొని చదవాలి. డిక్షనరీ సహాయంతో అర్థాలు తెలుసుకోవాలి. చదవడానికి ఎంత సమయం కేటాయిస్తున్నారో, రాయడానికి కూడా అంతే సమయం కేటాయిస్తూ ఉండాలి.

ముందుగా నచ్చిన అంశాలను నోట్‌ చేసుకోవాలి. దీంతో మంచి రైటింగ్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. ఇతరులతో చర్చించిన అంశాలను రాయడానికి ప్రయత్నించాలి. చదివిన అంశాలను యధావిధిగా రాయకుండా మీ సొంత మాటల్లో, వాక్యాల్లో రాస్తే బాగుంటుంది. ఏదైనా టాపిక్స్‌ను రాయాలనుకున్నప్పుడు బేసిక్‌ పాయింట్లపై దృష్టిసారించాలి. రాయడానికి ఇబ్బందులు పడుతున్నట్లయితే రైటింగ్‌ వర్క్‌షాప్‌లో జాయిన్‌ కావచ్చు. దీంతో రైటింగ్‌పై ఆసక్తి కలిగి ఎక్కువగా రాయగలుగుతారు.

లిజనింగ్‌ 

మాట్లాడటం, రాయడంతోనే ఇంగ్లిష్‌పై పట్టు సాధించలేం. వినడం ద్వారా కూడా ఎక్కువగా నేర్చుకోవచ్చు. ఎంత ఎక్కువగా వింటే అంత ఎఫెక్టివ్‌గా మాట్లాటగలం. ఇంగ్లిష్‌ను ఆసక్తిగా వినాలి. దీనికోసం ప్రతిరోజూ గంట సమయం కేటాయించుకోవాలి. ఇష్టమైన టాపిక్స్‌ను నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని ఫోన్‌లో వింటుండాలి. ఒక్కోసారి నిర్ణీత సమయంలో వినడానికి కుదరకపోవచ్చు. సబ్జెక్టును డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. కాబట్టి సమయం ఉన్నప్పుడల్లా వింటుండాలి. విన్న తర్వాత అదే టాపిక్‌ను బయటకు చదువుతూ ఇమిటేట్‌ చేస్తుండాలి. 

లిజనింగ్‌లో ప్రక్రియలో భాగంగా సినిమాలు, టీవీ సిరీస్‌లు బాగా ఉపయోగపడుతాయి. కమ్యూనికేట్‌ కావడానికి బెస్ట్‌ సోర్స్‌ ఇవి. ఇంగ్లిష్‌ ప్రోగ్రామ్స్‌ను చూసి, వినడంవల్ల పర్‌ఫెక్షన్‌ వస్తుంది. అకడమిక్‌ బుక్స్‌ కూడా ఆడియో రూపంలో లభిస్తుంటాయి. ఇవి వినడంవల్ల  భాషపై పట్టు సాధించవచ్చు. ఏదైనా సమావేశాలు, సెమినార్లకు హాజరైనప్పుడు ప్రముఖుల ప్రసంగాలను నిశితంగా వినాలి. వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో గమనిస్తూ ఉండాలి. రిలాక్స్‌గా వింటూ భాషపై ఫోకస్‌ చేయాలి.

స్పోకెన్‌ ఇంగ్లిష్‌

ఇంగ్లిష్‌ భాషపై పట్టు పెంచుకోడానికి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ చాలా ఉపయోగపడుతుంది. లిజనింగ్‌, రైటింగ్‌లపై పట్టు సాధించినప్పటికీ మాట్లాడటంలో తడబడుతుంటారు. అలాంటివారు పట్టుదలతో ప్రయత్నిస్తే స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో నైపుణ్యాలు పెంచుకోవచ్చు. ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే ముందుగా ఒక అంశాన్ని ఎంచుకోవాలి. ఆ విషయానికి సంబంధించి అప్పటివరకు ప్రచురితమైన వ్యాసాలు, వార్తలు చదవాలి. అందులో వినియోగించిన పదజాలం, వాక్య నిర్మాణాలను పరిశీలించాలి. స్థూలంగా దాని సారాంశం తెలిసిన తర్వాత ఆ టాపిక్‌ను తమకు నచ్చిన రీతిలో పాయింట్లవైజ్‌గా రాసుకోవాలి. వాటిని కుటుంబ సభ్యులు, స్నేహితులతో సిగ్గుపడకుండా మాట్లాడాలి. ఇలా వారికి అర్థమయ్యేవిధంగా మాట్లాడుతున్నామా లేదా అని గమనించాలి. ఆ తర్వాత కొత్తవారితో ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. ఇలా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ మెరుగుపడుతుంది. లేదంటే స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. వీటిలో చేరి కూడా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ను మెరుగుపర్చుకోవచ్చు.    

పై విధంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ మెరుగుపడినంక ఇంగ్లిష్‌ కమ్యూకేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవాలనే తపన ఉన్నవారితో కలిసి గ్రూప్‌ డిస్కషన్‌ పెట్టుకోవాలి. దీనివల్ల ఎవరు బాగా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. దీంతో ఇంగ్లిష్‌ మాట్లాడటానికి మెరుగవడంతోపాటు ఇతరులతో కాని, నలుగురిలో కాని మాట్లాడేటప్పుడు ఉండే భయం పోతుంది. ఇందుకు పాఠశాల, కాలేజీ స్థాయి నుంచే ఉన్న పరిజ్ఞానంతో డిబేట్స్‌ పెట్టుకుంటే చాలా మేలు కలుగుతుంది.

వొకాబులరీపై పట్టు సాధించాలి

 ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే వొకాబులరీపై పట్టు సాధించడం ఎంతో అవసరం. వాటిని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలుసుకోవాలి. ఇంగ్లిష్‌ స్కిల్స్‌ పెంచుకునే విషయంలో గ్రామర్‌పై అవగాహన ఉండాలి. టెన్సెస్‌, డైరెక్ట్‌, ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌, యాక్టివ్‌, ప్యాసివ్‌ వాయిస్‌లపై పట్టు సాధించాలి. దీంతో ఒక విషయాన్ని కమ్యూనికేట్‌ చేసే క్రమంలో స్కిల్స్‌ పెరుగుతాయి. పదాలకు అర్థం తెలియాలంటే డిక్షనరీ ఉపయోగించాలి. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి డిక్షనరీలలో పదానికి అర్థంతోపాటు ఆ పదాన్ని ఎలా పలకాలో ఉంటాయి. అంతేకాకుండా వ్యతిరేకార్థాలు కూడా ఉంటాయి.  

లాంగ్వేజ్‌ టెస్టులు

ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉద్యోగాలకే కాకుండా ఇతర విషయాల్లోనూ చాలా అవసరం. అంటే విదేశాల్లో చదవాలనుకునేవారికి ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ ఉండాలి. ఆయా దేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టుల్లో ప్రతిభ చూపాలి. టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, పీటీఈ వంటి స్టాండర్డ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టుల్లో లిజనింగ్‌, స్పీకింగ్‌, రీడింగ్‌, రైటింగ్‌లు కీలకం. స్పోకెన్‌, రైటింగ్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యాలు మెరుగ్గా ఉంటేనే లాంగ్వేజ్‌ టెస్టుల్లో రాణించవచ్చు.

ప్రజెంటేషన్‌ స్కిల్స్‌

ఇంగ్లిష్‌ స్కిల్స్‌ పెరిగితే ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ కూడా పెరుగుతాయి. ఇది కొలువు సాధించడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దాదాపు కంపెనీలన్నీ ఉద్యోగానికి సంబంధించిన టాపిక్‌పై ప్రజెంటేషన్‌ను అడుగుతున్నాయి. కాబట్టి ఇంగ్లిష్‌ ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ అనేవి కంపల్సరీగా మారాయి. అదేవిధంగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లలో నిర్వహించే గ్రూప్‌ డిస్కషన్‌ కూడా ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోటే నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షల్లో కూడా ఇంగ్లిష్‌ భాషపై ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాకుండా స్టార్టప్‌ స్టార్ట్‌ చేయాలనుకునే ఔత్సాహికులు తమ ప్రాజెక్ట్‌ రిపోర్టులను ప్రజెంట్‌ చేయాలంటే ఇంగ్లిష్‌ స్కిల్స్‌ అవసరం. కాబట్టి విద్యార్థులు కోర్సులో చేరినప్పటి నుంచి ఇంగ్లిష్‌ను నేర్చుకుంటూ ఇస్మార్ట్‌గా ఆ భాషపై పట్టు సాధించాలి.

-సత్యం చాపల


logo