మంగళవారం 07 జూలై 2020
Nipuna-education - Jun 02, 2020 , 23:51:35

అల్లికలతో అపార జ్ఞానం

అల్లికలతో అపార జ్ఞానం

గత సంచికల్లో గంగా, సింధు నదుల విశేషాలను ఎలా నేర్చుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ నదుల ఉపనదులను వేగంగా నేర్చుకుంటూ శాశ్వతంగా గుర్తు పెట్టుకుందాం.

బ్రహ్మపుత్ర 

ఎడమ ఉపనదులు- లోహిత్‌, ధన్‌సిరి, కోలాంగ్‌

కుడి ఉపనదులు- కామెంగ్‌, మానస్‌, బెకి, రైడాక్‌, జాల్ధాకా, తీస్తా, సుబాన్‌సిరి

ఎడమ ఉపనదులు: బ్రహ్మపుత్రనదిలో బ్రహ్మ ఉంది. కాబట్టి ఈ నదికి అదే కోడ్‌. బ్రహ్మ దేవుడు ఈశాన్యం నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తున్నాడని ఊహించండి. ఆయన వస్తుండగా ఎడమ వైపున క్రికెట్‌ మ్యాచ్‌ కనిపించింది. రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తూ ఉన్నాడు. ఆయన సిక్సర్లు బాదుతున్నాడు. ధన్‌.. ధన్‌.. ధన్‌.. ధన్‌ ఇలా ఒకదాని వెనుక ఒకటి గాలిలో బౌండరీని దాటుతున్నాయి. బ్రహ్మదేవుడు కామెంట్రీ వింటున్నారు. ప్రతిసారి ‘బాల్‌ గాన్‌ సోలాంగ్‌' అని చెబుతున్నారు. అంటే బాల్‌ చాలా దూరం వెళ్లిందని అర్థం. ఇప్పుడు కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

బ్రహ్మ దేవుడు వస్తుండగా ఎడమ వైపున కనిపించిన క్రికెట్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నదెవరు? (రోహిత్‌ శర్మ, దీనిని లోహిత్‌ నదికి కోడ్‌గా భావించండి)

రోహిత్‌ శర్మ సిక్సర్లు ఎలా బాదుతున్నాడు?  (ధన్‌.. ధన్‌...ధన్‌.. ఇది ధనసిరి ఉపనదికి కోడ్‌) 

కామెంటేటర్‌ ఏం చెబుతున్నాడు? (బాల్‌ గాన్‌ సోలాంగ్‌, సోలాంగ్‌ అనేది కోలాంగ్‌ ఉపనదికి కోడ్‌)

కుడి ఉపనదులు: ఎడమవైపు సిక్సర్లతో రణగొణ ధ్వనిలా ఉండగా, బ్రహ్మదేవుడు కుడివైపు చూడగా చాలా కామ్‌గా ఉన్న కింగ్‌ (రాజు)ను చూశాడు. బ్రహ్మదేవుడు అతడి దగ్గరికి వెళ్లి ఎందుకు నువ్వు కామ్‌ కింగ్‌వి, మనసు బాగలేదా అని అడిగాడు. అప్పుడు రాజు తనకు బేకరీలో రైతా (పెరుగుతో చేసే ఒక పదార్థం) కావాలన్నాడు. బ్రహ్మదేవుడు దానిని సృష్టించి, జల్దీ ఖా (త్వరగా తిను అని అర్థం) అని చెప్పాడు. రాజు మొత్తం తిన్నాక, బ్రహ్మదేవుడు, అతడికి ఒక బస్తా రైతా ఇచ్చి, హర్‌ సుభా యే ఖాయాతో సిరి ఆయేగా (ప్రతి రోజూ పొద్దున ఇది తింటే సిరి వస్తుందని అర్థం) అని చెప్పాడు. ఇప్పుడు కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

బ్రహ్మదేవుడు కుడివైపున ఏం చూశాడు? (కామ్‌గా ఉన్న కింగ్‌, కామెంగ్‌ నదికి ఇది కోడ్‌)

కామ్‌ కింగ్‌ని బ్రహ్మ దేవుడు ఏమి అడిగాడు? (మనసుకు ఏం అయిందని, మానస్‌ నదికి ఇది కోడ్‌)

రాజు ఏం చెప్పాడు? (బేకరీలో రైతా కావాలన్నాడు, బేకరీ, బేకీ అనే ఉపనదికి కోడ్‌ కాగా, రైడాక్‌ ఉపనదికి రైతా కోడ్‌)

రైతాను సృష్టించి బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు (జల్దీ ఖా అన్నాడు. ఇది జల్ధాకా అనే ఉపనదికి కోడ్‌)

ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఎంత రైతా ఇచ్చాడు? (బస్తా, ఇది తీస్తా నదికి కోడ్‌)

బస్తా రైతా ఇచ్చి బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? (సుభా ఖాయేతో సిరి ఆయేగా, సుభా+సిరి= సుబాన్‌ సిరి)

ఇలా చాలా తేలికగా, అతి తక్కువ సమయంలో బ్రహ్మపుత్ర నది ఎడమ, కుడి ఉపనదులను నేర్చుకున్నాం. అయితే నేర్చుకున్న అంశాలకు సంబంధం ఉన్న ప్రతిదానిని కథల రూపంలోకి తెచ్చి, అల్లికలను ఏర్పాటు చేయగలిగితే నేర్చుకోవాలన్న ఆసక్తి పెరగడంతో పాటు పరీక్షలకు అవసరమైనవి నేర్చుకోవచ్చు. కుడివైపున ఉండే ఉపనది ధన్‌సిరి, ఎడమ వైపున ఉండే సుభాన్‌ సిరి బ్రహ్మపుత్ర నదిని కలిసే దగ్గర ప్రపంచంలోనే అతి పెద్దదైన మజులీ ద్వీపం ఉంది. అల్లికల్లో దీనిని కూడా భాగం చేస్తే మంచి పరిజ్ఞానం ఉంటుంది. అలాగే భారత దేశంలో నీటిపై నిర్మించిన వంతెనల్లో అతి పొడవైనది ‘భూపేన్‌ హజారికా సేతు’. దీనిని లోహిత్‌ నదిపై నిర్మించారు. దీనిని కూడా కథనంలో భాగం చేయాలి. మొదట అన్ని ఉపనదులను నేర్చుకొని తర్వాత వాటికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కథనాల్లోకి చొప్పించాలి. అలాగే బస్తా అనేకోడ్‌తో తీస్తా నదిని ప్రస్తావించాం. ఈ నది నీటిని బంగ్లాదేశ్‌ అడుగుతుంది. భారత్‌-బంగ్లాదేశ్‌  మధ్య ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా దీనిని కూడా భాగం చేయవచ్చు.

గోదావరి నది

ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన నది. 

ఎడమ ఉపనదులు: బన్‌గంగా, శివానా, పూర్ణ, కడెం, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి

కుడి ఉపనదులు: నాసర్ది, దర్న, ప్రవర, సింద్‌ఫానా, మంజీర, మానేరు, కిన్నెరసాని

గోదావరికి ‘గోద్రెజ్‌ ఫ్రిజ్‌' ను కోడ్‌గా తీసుకుందాం. మీ ఇంట్లో ఉండే ఫ్రిజ్‌ను ఊహించుకుంటే ఇంకా మంచిది. ఫ్రిజ్‌లో ఎడమవైపున పూర్తిగా బ్యాంగిల్స్‌ (గాజులు)తో నిండి ఉందని భావించండి. శివుడు వచ్చి వాటిని తీసుకుంటుండగా, పూర్ణ అనే ఒక మహిళ వచ్చింది. ఆమె టీచర్‌ కాబట్టి అందరూ మేడం అంటారు. అందుకే గాజులపైన మేడం అని రాసుంటారు. ఆమె శివుడికి మొరపెట్టుకుంది. ఆ గాజులు తన ప్రాణమని తీసుకెళ్లొద్దని కోరుకుంది. దీంతో శివుడు ఆమెను ఇంద్రుడిని కోరుకోమన్నాడు. శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఇంద్రుడి దగ్గరకు వెళ్లొచ్చని సూచించాడు. ఇప్పుడు కింది ప్రశ్నలకు సమాధానం కనుగొనండి.

గోద్రెజ్‌ ఫ్రిజ్‌కు ఎడమవైపున ఏం ఉన్నాయి? (బ్యాంగిల్స్‌, ఇది బన్‌గంగాకు కోడ్‌)

బ్యాంగిల్స్‌ను తీసుకోడానికి వచ్చేదెవరు? (శివా, శివానా నదికి ఇదికోడ్‌)

అదే సమయంలో వచ్చింది ఎవరు? (పూర్ణ, ఈ పేరుతోనే ఉపనది ఉంది)

గాజులపైన ఏం రాసుంది? (మేడం, కడెం ఉపనదికి కోడ్‌)

పూర్ణా మేడం ఏమని మొరపెట్టుకుంది? (ఆ గాజులు ప్రాణమని చెప్పింది, ఇది ప్రాణహితకు కోడ్‌)

ఎవరి దగ్గరకు వెళ్లమని శివుడు సూచించాడు? (ఇంద్రుడు, ఇంద్రావతి నదికి ఇది కోడ్‌)

ఏ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లమన్నాడు? (శబరి, ఇది ఒక ఉపనది)

గోద్రెజ్‌ ఫ్రిజ్‌లో కుడివైపున అన్ని మందులు ఉన్నాయి. దీంతో మీ స్నేహితుడు ఆ మందులు ఎందుకని అడిగాడు. నా సర్ది (సర్ది అంటే జలుబు)కి అని చెప్పాడు. ఇంతలో సర్ది మందులన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. మాకు కావాలంటూ చాలామంది ధర్నా చేయడానికి వచ్చారు. దీంతో మీరు ఇక్కడ గొడవ చేయకండి అని ప్రార్థించారు. జీరా తినడం వల్ల సర్ది తగ్గుతుందని చెప్పారు. దానిని తినడం మానకండి, మానితే ఇబ్బంది అని చెప్పారు. కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

ఫ్రిజ్‌కు కుడివైపున మందులు ఎందుకంటే మీరేం చెప్పారు? (నా సర్దికి. నాసర్ధి అనే ఉపనదికి ఇది కోడ్‌)

సర్ది మందులన్నీ మీ దగ్గరే ఉండటంతో జనం వచ్చి ఏం చేశారు? (ధర్నా, ఇది ఉపనది)

మీరేం చేశారు? (గొడవ చేయకండని ప్రార్థన, ప్రవర ఉపనదికి ఇది కోడ్‌)

ఏం తింటే తగ్గుతుందని సలహా ఇచ్చారు? (జీరా, ఇది మంజీరాకు కోడ్‌)

ఇబ్బంది ఎప్పుడంటూ మీరు చెప్పారు? (తినడం మానితే, మానేరు ఉపనదికి ఇది కోడ్‌)

కృష్ణా నది

ఎడమ ఉపనదులు: భీమా, డిండి, మూసీ, పాలేరు

కృష్ణా నదికి కోడ్‌ కృష్ణుడు. కృష్ణుడి ఎడమ చేతిలో ఎప్పుడూ పిల్లనగ్రోవి ఉంటుంది. అది అతను తన ఎడమవైపున ఉన్న భీముడికి పట్టుకోమని ఇచ్చాడు. అలా ఇయ్యడాన్ని అక్కడే ఒకరు హ్యాండీకామ్‌తో ఫొటో తీశారు. ఆ పిల్లనగ్రోవిని మూసి ఉన్న ఒక గిన్నెలోకి విసిరివేయమని కృష్ణుడు చెప్పడంతో భీముడు అలాగే చేశాడు. ఆ గిన్నె మూతను తీయగా, పాలు ఏరులా పొంగాయి. ఇప్పుడు కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

పిల్లనగ్రోవిని కృష్ణుడు ఎవరికి ఇచ్చాడు? (ఎడమవైపున ఉన్న భీముడికి, భీమా అనేది ఉపనది)

పిల్లనగ్రోవి ఇవ్వడాన్ని దేనితో ఫొటో తీశారు? (హ్యాండీకామ్‌, ఇది డిండికి కోడ్‌)

పిల్లనగ్రోవిని దేనిలోకి విసిరివేయమన్నారు? (మూసి ఉన్న గిన్నెలోకి, మూసీ అనేది ఉపనది)

ఆ గిన్నెలో నుంచి ఏం వచ్చాయి? (పాలు ఏరులా వచ్చాయి, పాలేరు)

కుడి ఉపనదులు: కోయినా, పంచ్‌గంగా, దూద్‌గంగా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర

కృష్ణుడు ఒక భవంతిపై 15వ అంతస్తులో ఉన్నాడని ఊహించండి. అనుకోకుండా అక్కడ నుంచి తన కుడిచేతిలోని పిల్లనగ్రోవి కింద పడిపోయింది. దీంతో దానిని పట్టుకొనేందుకు ఆయన అరుస్తున్నాడు ‘కోయి హయినా’ (ఎవరన్నా ఉన్నారా) అంటూ అరిచాడు. 

ఐదుగురు కలిసి దానిని పట్టుకున్నారు. కృష్ణుడు వాళ్ల గురించి అడగగా, అందరి పేర్లు గంగా అని చెప్పారు. వారందరికీ మాలను బహుమతిగా ఇచ్చాడు. అలాగే దూద్‌ (పాలు)ను కూడా ఇచ్చారు. అయితే వాళ్లు కృష్ణుడి సహాయం అడిగారు. వెళ్లేందుకు ఘాట్‌రోడ్‌ ఉందని ఇబ్బందిగా ఉందని అడిగితే, తుంగభద్ర నదిలో వెళ్లమని చెప్పాడు. ఇప్పుడు కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

పిల్లనగ్రోవి కింద పడుతుండగా కృష్ణుడు ఏమని అరిచాడు? (కోయి హైనా, ఇది కోయినా అనే ఉపనదికి కోడ్‌)

ఎంతమంది దానిని పట్టుకున్నారు, వారి పేర్లేంటి? (ఐదుగురు- హిందీలో పాంచ్‌, వాళ్లందరి పేర్లు గంగా, పంచ్‌గంగా)

బహుమతిగా ఏం ఇచ్చాడు? (మాల, మలప్రభ, దూద్‌ (పాలు) దూద్‌గంగా)

వాళ్లు ఏ రోడ్‌లో వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు? (ఘాట్‌ రోడ్‌, ఘటప్రభ)

వాళ్లను ఏనదిలో వెళ్లమని చెప్పాడు? (తుంగభద్ర)

ఒక్కరూపాయికే జేఈఈ కోచింగ్‌ !

దేశంలో ఐఐటీ  జేఈఈ పరీక్ష కోచింగ్‌కు ప్రసిద్ధి చెందిన సూపర్‌-30 ఒక్కరూపాయికే  ఆన్‌లైన్‌లో  కోచింగ్‌ను అందించడానికి సన్నాహాలు చేస్తుంది. గ్రామీణ ప్రాంత  విద్యార్థుల కోసం ఈ ప్రోగ్రామ్‌ను రూపొందిస్తున్నారు. దీనికోసం సూపర్‌-30 ఆనంద్‌కుమార్‌  సీఎస్‌సీ ఈ గవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ  విద్యార్థుల కోసం దీన్ని అందిస్తున్నారు.  ముఖ్యంగా విద్యార్థులకు సైన్స్‌, మ్యాథ్స్‌  సబ్జెక్టులపై ఆసక్తి పెంచేలా కొత్తరకమైన  బోధనాపద్ధతుల్లో ఈ ప్రోగ్రామ్‌ను  డిజైన్‌ చేస్తున్నట్లు సీఎస్‌సీ వెల్లడించింది.

వి.రాజేంద్ర శర్మ, 

ఫ్యాకల్టీ ,9849212411


logo