కులకచర్ల, ఏప్రిల్ 2 : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. గ్రూపుగా కాని, వ్యక్తిగతంగా కాని ఆర్థిక చేయూతనందించేందుకు శిక్షణ ఇస్తున్నారు. గ్రామాల్లోని ఒక్కో సంఘంలోని ఒక్కో మహిళకు రూ.50 వేల నుంచి 2 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలను అందజేస్తున్నారు. దీంతో సామూహికంగా ఆదాయాభివృద్ధికి పలు పనులు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. రూపాయి..రూపాయి పొదుపు చేసి… లక్షలు పోగుచేసి అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. ఇంటికే పరిమితం కాకుండా ప్రభుత్వ సాయంతో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ వారి కుటుంబాలను అభివృద్ది చేసుకుంటున్నారు. మహిళలు గతంలో 30 రోజులకు 30 రూపాయలను పొదుపు చేసేవారు. కానీ ప్రస్తుతం ప్రతీ నెలా రూ.100 నుంచి 200 వరకు పొదుపు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బ్యాంకు రుణాలు అవసరం లేకుండానే తమ సొంత డబ్బులు రుణాలు ఇచ్చుకునే స్థాయికి మహిళా సంఘాలు అభివృద్ధి చెందాయి.
లభిస్తున్న ఉపాధి…
సెర్ప్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. నిత్యావసర వస్తువులతో పాటు, వివిధ రకాల అవసరాలను గుర్తించి గ్రామాల్లో ఏర్పాటు చేసి మహిళలు ఉపాధి పొందుతున్నారు. గ్రామాల్లో సర్వే నిర్వహించి కావాల్సిన వసతులను గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేసి రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టింది.
సెర్ప్ నుంచి రుణాలు..
సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణాలను అందజేస్తున్నది. బ్యాంకులు, ఎన్ఆర్ఎల్ఎం, స్త్రీనిధి, గ్రామ సంఘాలు, మండల మహిళా సమాఖ్యల నుంచి రుణాలను అందిస్తున్నది.
వడ్డీలేని రుణాలు..
మహిళా సంఘాలు బ్యాంకులు, స్త్రీనిధి నుంచి వడ్డీలేని రుణాలను అందిస్తున్నది. ప్రభుత్వమే వడ్డీని భరిస్తుండడంతో మహిళా సంఘాలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. రుణాలను అందించేందుకు సెర్ప్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
రికవరీలోనూ ముందంజ..
తీసుకున్న రుణాలను మహిళా సంఘాలు సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు, స్త్రీనిధి సంస్థలు ముందుకొస్తున్నాయి. 98 శాతం రుణాలు రికవరీ అవుతున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. దీంతో మహిళా సంఘాల సభ్యులకు రూ.5లక్షల నుండి 10లక్షల వరకు రుణాలు అందుతున్నాయి.
కులకచర్ల మండలంలో 1106 సంఘాలు..
కులకచర్ల మండలంలో 1106 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 11,060 మంది సభ్యులు ఉన్నారు. 44 గ్రామపంచాయతీలకు గాను 38 గ్రామ సంఘాలు ఉన్నాయి. వీరికి మండలంలో వివిధ ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలను తయారు చేస్తున్నారు.
ఆదాయం పెరుగుతున్నది…
మహిళా సంఘం నుంచి రుణాలు తీసుకొని ఆదాయాన్ని పెంచుకుంటున్నాం. తీసుకున్న రుణాన్ని ప్రతీ నెలా చెల్లిస్తున్నాం. ప్రభుత్వం సెర్ప్ నుంచి రుణాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
సకాలంలో రుణాల చెల్లింపు..
మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. తద్వారా ప్రభుత్వం నుంచి వడ్డీలేని రుణాలు అందుతున్నాయి. బ్యాంకులు, స్త్రీనిధి నుంచి రుణాలు ఇస్తూ అవగాహన కల్పిస్తున్నాం. దీంతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు.
ఇవీ కూడా చదవండి
స్పైస్‌జెట్ ‘జీరో చేంజ్ ఫీ’ ఆఫర్
పాన్, ఆధార్ లింక్ తుది గడువు జూన్ 30కు పొడిగింపు
బిలియనీర్ సంజీవ్ గుప్తాకు బ్రిటన్ మొండిచేయి !
సూయజ్ బ్లాకేడ్: 54 బిలియన్ల డాలర్ల నష్టం!