ఆదివారం 07 జూన్ 2020
Nipuna-education - Apr 03, 2020 , 02:07:45

అంతరిక్షమంత అవకాశాలు స్పేస్‌ ఇంజినీరింగ్‌ @ ఐఐఎస్‌టీ

అంతరిక్షమంత అవకాశాలు స్పేస్‌ ఇంజినీరింగ్‌ @ ఐఐఎస్‌టీ

అంతరిక్షం.. మానవుడికి నిత్యం సవాలు విసిరే క్షేత్రం. ఆధునిక సాంకేతికత పెరిగేకొద్ది మానవుడి ఆలోచనలు భూమి మీద నుంచి అంతరిక్షంలోకి మళ్లుతున్నాయి. అంతరిక్ష శోధనతో మానవాళి జీవనాన్ని మరింత సుఖమయం చేయడానికి నిరంతరం అన్వేషిస్తున్నారు. ఇప్పటికి మనం సాధించింది రవ్వంత. సాధించాల్సింది అనంతమంత. ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన కోర్సులు చేస్తే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయనడంలో సందేహం లేదు. దేశంలో అంతరిక్షానికి సంబంధించి   ప్రామాణిక విద్యకు నెలవైన సంస్థ ఐఐఎస్టీ. ఆ సంస్థ అందించే కోర్సులు, ప్రవేశ విధానం, సీట్ల సంఖ్య తదితరాల గురించి నిపుణ పాఠకుల కోసం..

ఐఐఎస్‌టీ 

ఇది దేశంలో అంతరిక్ష విద్యను అందించడానికి ప్రారంభించిన మొదటి సంస్థ. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఐఐఎస్‌టీ ఒకటి. ఇది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ పరిధిలో డీమ్డ్‌ యూనివర్సిటీ, అటానమస్‌ బాడీ కలిగిన విద్యా సంస్థ. కేరళలోని వలిమల (తిరువనంతపురం దగ్గర)లో 100 ఎకరాల్లో క్యాంపస్‌ను 2007, సెప్టెంబర్‌ 14న నాటి ఇస్రో చైర్మన్‌ డా. జీ మాధవన్‌ నాయర్‌ దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ స్థాపించడానికి మాధవన్‌ నాయర్‌, బీఎస్‌ సురేష్‌ ముఖ్యులు. ఆ తర్వాత సంస్థ మొదటి డెర్టెక్టర్‌గా డా. బీఎన్‌ సురేష్‌ వ్యవహరించారు. 2010లో సొంత భవనంలోకి సంస్థను మార్చారు. ఈ సంస్థకు మొదటి వైస్‌ చాన్స్‌లర్‌గా మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్‌ కలామ్‌ వ్యవహరించడం విశేషం. 

ప్రస్తుతం ఈ సంస్థలో 98 మంది ఫ్యాకల్టీలు పనిచేస్తున్నారు. 23 శాతం మహిళా ఫ్యాకల్టీలు, 22 శాతం విద్యార్థినులు ఉండటం మరో విశేషం. దాదాపు 560 మంది అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు, 160 మంది ఎంటెక్‌/ఎంఎస్‌ విద్యార్థులు ఉన్నారు. 100కు పైగా పీహెచ్‌డీ స్కాలర్స్‌ ఉన్నారు. పశ్చిమ కనుమలకు దగ్గరలో ఉన్న ఈ క్యాంపస్‌ ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఈ సంస్థ బీటెక్‌, ఎంటెక్‌/ఎంఎస్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌ను అఫర్‌ చేస్తుంది. ముఖ్యంగా ఏరోస్పేస్‌, ఏవియానిక్స్‌, ఆస్ట్రానమి, ఆస్ట్రోఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎర్త్‌ సిస్టం సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, రిమోట్‌సెన్సింగ్‌ విభాగాల్లో స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్‌గా కోర్సులను అందిస్తుంది.

డ్యూయల్‌ డిగ్రీ చేసినవారికి బీటెక్‌ ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌తోపాటు ఎంఎస్‌/ఎంటెక్‌ (ఎన్నుకున్న సబ్జెక్టులో) డిగ్రీలను ప్రదానం చేస్తారు.

ఐదేండ్ల డ్యూయల్‌ డిగ్రీలో బీటెక్‌ (ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌) తర్వాత పీజీలో ఎంఎస్‌ ఇన్‌ సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌, ఎంఎస్‌ ఇన్‌ ఆస్ట్రానమి అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, ఎంఎస్‌ ఇన్‌ ఎర్త్‌ సిస్టం సైన్స్‌, ఎంటెక్‌ ఇన్‌ ఆప్టికల్‌ ఇంజినీరింగ్‌. 

ఎంపిక ఎలా 

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2020 స్కోర్‌ ద్వారా

నోట్‌: ఐఐఎస్‌టీకి దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంక్‌ ఆధారంగా కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు.

ఎవరు అర్హులు 

 • జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు 1995, అక్టోబర్‌ 1 లేదా తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 1990, అక్టోబర్‌ 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి.
 • ఇంటర్‌ (ఎంపీసీ)లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 
 • జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐఐఎస్‌టీ నిర్దేశించిన మార్కులు సాధించాలి. 
 • తప్పనిసరిగా ఐఐఎస్‌టీకి దరఖాస్తు చేసుకొన్నవారు మాత్రమే అర్హులు.

ఆర్థిక సహాయం 

ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సెమిస్టర్‌లో 10 సీజీపీఏకు 7.5 సీజీపీఏ సాధిస్తే వారు రెండో సెమిస్టర్‌ ఫీజులు చెల్లించనవసరం లేదు. ప్రతి సెమిస్టర్‌లో నిర్దేశిత సీజీపీఏను సాధిస్తే సెమిస్టర్‌ ఫీజు ఇతర ఖర్చులను సంస్థ భరిస్తుంది.

ఉద్యోగావకాశాలు 

 • నాలుగేండ్ల బీటెక్‌ లేదా ఐదేండ్ల డ్యూయల్‌ డిగ్రీని పూర్తిచేసుకొన్న అభ్యర్థులు కనీసం 7.5 సీజీపీఏ సాధిస్తే ఖాళీల సంఖ్యను బట్టి ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లో ఇస్రో లేదా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ కేంద్రాల్లో ఉద్యోగావకాశం కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇస్రో నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 
 • సైంటిస్ట్‌/ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ స్థాయి ఉద్యోగాన్నిస్తారు. ఈ ఉద్యోగం కేంద్ర ప్రభుత్వ ఏడో పే కమిషన్‌ ప్రకారం లెవల్‌ 10 స్థాయికి చెందినది.
 • ఉద్యోగంలో ప్రారంభవేతనం ఏడో పే కమిషన్‌ ప్రకారం నెలకు రూ.56,100 ఇస్తారు. వీటికి అదనంగా హెచ్‌ఆర్‌ఏ, టీఏ ఇస్తారు. వైద్య సౌకర్యం, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, ఎల్‌టీసీ, పెన్షన్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. 
 • ఇస్రో లేదా డీవోఎస్‌లో ఉద్యోగంలో చేరినవారు తప్పనిసరిగా మూడేండ్లు ఉద్యోగం చేస్తామనే బాండ్‌ను సమర్పించాలి.

ముఖ్యతేదీలు

 • దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 25 నుంచి
 • చివరితేదీ: జూన్‌ 12
 • అడ్మిషన్‌ బ్రోచర్‌ విడుదల: మే 1
 • వెబ్‌సైట్‌: https://www.iist.ac.in

నోట్‌: కరోనా ఎఫెక్ట్‌తో దేశంలోని అన్ని ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీలు మారనున్నాయి. దరఖాస్తు, చివరితేదీ ఇతర విషయాల కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను చూడవచ్చు. 

ఐఐఎస్‌టీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) డీమ్డ్‌ యూనివర్సిటీ

 • చాన్స్‌లర్‌: డా. బీఎన్‌ సురేష్‌
 • గవర్నింగ్‌ బాడీ ప్రెసిడెంట్‌:  డా. కే శివన్‌ (ఇస్రో చైర్మన్‌)
 • డైరెక్టర్‌: డా. వినయ్‌ కుమార్‌ దద్వాల్‌
 • క్యాంపస్‌ తిరువనంతపురానికి 20 కి.మీ. దూరంలో ఉంది.
 • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌, ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్స్‌ అఫిలియేషన్‌ ఉంది.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులవారీగా సీట్ల వివరాలు

బీటెక్‌ ప్రోగ్రామ్‌

 • ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌: ఇది నాలుగేండ్ల కోర్సు. సీట్ల సంఖ్య - 60+6*
 • ఈసీఈ (ఏవియానిక్స్‌): ఇది నాలుగేండ్లకోర్సు. సీట్ల సంఖ్య  - 60+6*
 • డ్యూయల్‌ డిగ్రీ (బీటెక్‌తోపాటు ఎంటెక్‌/ఎంఎస్‌): ఇది ఐదేండ్ల కోర్సు. సీట్ల సంఖ్య - 20+2*
 • నోట్‌: గతేడాది నుంచి ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్స్‌ (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద పెంచిన సీట్లు. 

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ


logo