గురువారం 04 జూన్ 2020
Nipuna-education - Mar 17, 2020 , 23:21:00

కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్

వింగ్స్‌ ఇండియా

హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టులో ‘వింగ్స్‌ ఇండియా 2020’ సదస్సు మార్చి 12న ప్రారంభమైంది. మార్చి 13న ఈ సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్‌ పౌరవిమానయాన రంగంలో చేసిన సేవలకుగాను వివిధ సంస్థలు, వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేశారు. మోస్ట్‌ డెడికేటెడ్‌ ఔట్‌లుక్‌ ఫర్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీ అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ (ట్రూజెట్‌)కు బెస్ట్‌ ఉడాన్‌ ఎయిర్‌లైట్‌ అవార్డు దక్కింది. 2.5 కోట్లకుపైగా ప్రయాణికుల విభాగంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ అవార్డును బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అందుకుంది. బెస్ట్‌ డొమెస్టిక్‌ ఎయిర్‌లైన్‌ అవార్డు (షెడ్యూల్డ్‌) విస్తారాకు లభించింది. ఏవియేషన్‌ సస్టెయినబిలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అవార్డును స్పైస్‌జెట్‌, జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అందుకుంది.


సుజాతకు అవార్డు

రక్షణ శాఖ ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక ఆయుధ భూషణ్‌ అవార్డు ఎద్దుమైలారం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ సుజాత గోగినేనికి మార్చి 9న లభించింది. మెదక్‌, చెన్నై, కోల్‌కతా తదితర  ప్రాంతాల్లోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో వివిధ హోదాల్లో ఆమె పనిచేశారు.

ప్రవీణ్‌రావుకు అవార్డు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ వీ ప్రవీణ్‌రావు ఎంఎస్‌ స్వామినాథన్‌ అవార్డుకు మార్చి 12న ఎంపికయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్‌ లిమిటెడ్‌ ఈ అవార్డును అందిస్తున్నాయి.

ఉత్తమ విమానాశ్రయంగా శంషాబాద్‌

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ (శంషాబాద్‌) విమానాశ్రయం 2019కు గాను ఎయిర్‌పోర్ట్‌ సర్వీస్‌ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) పురస్కారానికి మార్చి 9న ఎంపికైంది. ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో, ఏడాదికి 1.5 2.5 కోట్ల మంది ప్రయాణించే విమానాశ్రయాల విభాగంలో భద్రతతో కూడిన మెరుగైన సేవలందించడం, పర్యావరణం, పచ్చదనానికి పెద్దపీట వేస్తుండటానికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.

ఆర్‌ఈపీలో కర్ణాటక మొదటిస్థానం

కాలుష్యాన్ని తగ్గించి వెలుగునిచ్చే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి (ఆర్‌ఈపీ)లో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర నూతన, సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) మార్చి 10న విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ 6, తెలంగాణ 8వ స్థానాల్లో నిలిచాయి. చిన్నస్థాయి జలవిద్యుత్‌, జీవ ఇంధనాలు, పవన, సౌర విద్యుత్‌లన్నీ కలిపి ‘సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి (ఆర్‌ఈపీ)’గా పరిగణిస్తారు. దేశం మొత్తంమీద ఆర్‌ఈపీ కేంద్రాల స్థాపిత సామర్థ్యం రికార్డు స్థాయిలో 86,321 మెగావాట్లకు చేరింది. 2022కల్లా దీన్ని 1.75 లక్షల మెగావాట్లకు చేర్చాలని ఎంఎన్‌ఆర్‌ఈ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతమున్న 86,321 మెగావాట్లలో వరుసగా కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లు తొలి ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి.

తొలి కొవిడ్‌ కేసు

కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ సిద్దిఖీ కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతూ మార్చి 11న మరణించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు మార్చి 12న వెల్లడించారు. జనవరిలో సౌదీ అరేబియాకు వెళ్లిన ఆయన ఫిబ్రవరి 29న తిరిగి ఇండియాకు వచ్చారు. దీంతో భారత్‌లో తొలి కొవిడ్‌ కేసు నమోదైంది.

ఆయుధాల కొనుగోళ్లలో భారత్‌కు రెండో ర్యాంక్‌

ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) మార్చి 12న విడుదల చేసిన నివేదికలో తేలింది. 2015-19 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆయుధ క్రయవిక్రయాలను పరిగణనలోకి తీసుకుని సిప్రి ఈ నివేదికను రూపొందించింది. ఆయుధాల దిగుమతిలో సౌదీ అరేబియా, భారత్‌, ఈజిప్ట్‌, ఆస్ట్రేలియా, చైనా వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత ఆయుధ మార్కెట్‌లో రష్యా వాటా 72 శాతం నుంచి 56 శాతానికి తగ్గినప్పటికీ రష్యానే భారత్‌కు అదిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. మ్యూజియంగా అంబేద్కర్‌ నివాసం

భారత రాజ్యాంగ రూపకర్త బీఆర్‌ అంబేద్కర్‌ బ్రిటన్‌లోని లండన్‌లో నివసించిన ఇంటిని మ్యూజియంగా కొనసాగించడానికి బ్రిటన్‌ ప్రభుత్వం మార్చి 13న అంగీకరించింది. నివాస ప్రాంతానికి సంబంధించిన ప్లానింగ్‌ నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలతో ఆ ఇంటిని మూసివేయాలని తొలుత బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకంది. దీన్ని వ్యతిరేకిస్తూ భారత్‌ చేసిన అప్పీలును బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదించింది. 1921-22లో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో విద్యను అభ్యసించిన సమయంలో అంబేద్కర్‌ ఇక్కడ నివాసం ఉన్నారుప్రపంచవ్యాప్త మహమ్మారిగా కొవిడ్‌

దాదాపు 125 దేశాల్లో వేగంగా విస్తరించిన కొవిడ్‌ -19 (కరోనా) వైరస్‌ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్చి 11న ప్రకటించింది. పలు దేశాలు ఈ వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రెస్‌ అధనోమ్‌ గెబ్రియేసుస్‌ తెలిపారు. చైనా వెలుపల కొవిడ్‌ కేసులు 13 రెట్లు పెరిగాయన్నారు. 

గ్రహంలో ఐరన్‌ వర్షం

సౌర కుటుంబానికి వెలుపల, 650 కాంతి సంత్సరాల దూరంలో ఉన్న ఓ గ్రహంపై అసాధారణ రీతిలో ఐరన్‌ వర్షం కురుస్తుందని సైంటిస్టులు మార్చి 11న గుర్తించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా యూనివర్సిటీతో కలిసి నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఆ గ్రహానికి ‘డబ్ల్యూఏఎస్‌పీ-76బీ’గా పేరుపెట్టారు. దీనిపై పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపు 2400 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు 5 గంటల సమయం తీసుకుంటే డబ్ల్యూఏఎస్‌పీ-76బీ మాత్రం తన మాతృ నక్షత్రానికి దగ్గరగా ఉండటంతో పరిభ్రమణానికి కేవలం 48 గంటలు పడుతుందన్నారు.

కోసియుస్కోను అధిరోహించిన తుకారాం

తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు ఆంగోత్‌ తుకారాం ఆస్ట్రేలియా ఖండంలోనే ఎత్తయిన పర్వతం కోసియుస్కోను మార్చి 10న అధిరోహించాడు. ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఉన్న ఆయన ఇప్పటికే నాలుగు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించాడు. కోస్సియుస్కోను అధిరోహించిన ఆయన ఐదు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించాడు. 2018 జూలైలో ఆఫ్రికాలోని కిలిమంజారో, 2019 మేలో మౌంట్‌ ఎవరెస్ట్‌, 2019 జూలైలో యూరప్‌లోని ఎల్‌బ్రస్‌, 2020 జనవరిలో ఉత్తర అమెరికాలోని అకన్‌గువా పర్వతాలను అధిరోహించాడు.భారత్‌ నుంచి ఐదుగురు యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌

ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్‌) మార్చి 11న విడుదల చేసిన ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌' జాబితాలో భారత్‌ నుంచి ఐదుగురికి చోటు లభించింది. బైజుస్‌ క్లాసెస్‌ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌, జొమోటో సహ వ్యవస్థాపకుడు గౌరవ్‌ గుప్తా, అంతారా సీనియర్‌ లివింగ్‌ సీఈవో తారా సింగ్‌ వాచానీ, వినతి ఆర్గానిక్స్‌ ఎండీ, సీఈవో వినతి, లోరా ఎకలాజికల్‌ సొల్యూషన్స్‌ సీఈవో స్వపన్‌ మెహ్రాలు ఈ జాబితాలో ఉన్నారు. 52 దేశాల్లో వివిధ రంగాల్లో అనూహ్య మార్పులు తెచ్చిన 115 మంది యువకుల (40 ఏండ్లలోపు)తో కూడిన జాబితాను జెనీవాకు చెందిన డబ్ల్యూఈఎఫ్‌ రూపొందించింది.


గ్రీస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా కేటరీనా

గ్రీస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి కెటరీనా సకెల్లార్‌పౌలూ మార్చి 13న ప్రమాణస్వీకారం చేశారు. జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. కేటరీనా ఐదేండ్లపాటు దేశాధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. 


ఒలింపిక్స్‌ జ్యోతి

టోక్యో ఒలింపిక్స్‌ క్రీడా జ్యోతిని గ్రీసులోని ప్రాచీన ఒలింపియాలో మార్చి 12న వెలిగించారు. గ్రీకు నటి జాంతి జార్జియో జ్యోతిని వెలిగించగా.. రియో ఒలింపిక్స్‌ షూటింగ్‌ స్వర్ణ విజేత అనా కొరాకకి మొదటగా జ్యోతిని అందుకుంది. అక్కడి నుంచి జపాన్‌కు జ్యోతిని పంపనున్నట్లు ఐవోసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ తెలిపాడు.రంజీ చాంపియన్‌గా సౌరాష్ట్ర

భారత దేశవాళీ క్రికెట్‌ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీని సౌరాష్ట్ర జట్టు గెలుచుకుంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మార్చి 13న బెంగాల్‌ జట్టుతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కారణంగా సౌరాష్ట్ర జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.  


logo