బుధవారం 03 జూన్ 2020
Nipuna-education - Mar 11, 2020 , 00:06:38

సీఎంఏ ఇలా సింపుల్‌

సీఎంఏ ఇలా సింపుల్‌

కామర్స్‌ విద్యార్థుల్లో అత్యధికమంది కల సీఏ లేదా సీఎంఏ. ఈ పరీక్షలు కాస్త కఠినమైనవే కానీ పక్కా ప్లాన్‌ ప్రకారం చదివితే సులువే. సీఎంఏ విద్యార్థులు ప్రిపరేషన్‌లో ఏ సబ్జెక్టును ఎలా సాధన చేయాలి అనే విషయాలు నిపుణ పాఠకుల కోసం


పేపర్‌-5: ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ 

  • ఈ పేపర్‌లో అకౌంటింగ్‌ స్టాండర్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి.
  • స్టడీ మెటీరియల్‌, స్కానర్‌లోని అన్ని లెక్కలు సాధన చేస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో అలాంటివి లేదా అదేరకమైన లెక్కలను పరీక్షల్లో ఇచ్చే అవకాశం ఉన్నది.
  • ప్రిపరేషన్‌ ఆఫ్‌ అకౌంట్స్‌, అకౌంటింగ్‌ ఫర్‌ స్పెషల్‌ ట్రాన్సాక్షన్‌, అకౌంటింగ్‌ ఫర్‌ బ్యాంకింగ్‌, ఎలక్ట్రిసిటీ అండ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీస్‌ వంటి చాప్టర్ల నుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశ ఉంది. కాబట్టి ఆ చాప్టర్లపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
  • ఈ పేపర్లో విద్యార్థి పరీక్ష రాసే విధానాన్ని బట్టి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి నిర్దేశిత సమయంలో సమాధానాలన్నీ వీలైనంత క్లుప్తంగా అంశాలవారీగా రాయాలి. పరీక్షలో తుది జవాబుకు మాత్రమే కాకుండా ప్రశ్నలోని అన్ని దశలకు మార్కులు ఉంటాయి. కాబట్టి విద్యార్థి వీలైనంత వివరంగా సమాధానం రాస్తే మంచిది.



పేపర్‌-6: లాస్‌, ఎథిక్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ 

  • యాక్ట్‌లో ఉండే నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి.
  • చదివిన నిబంధనలు ఎప్పటికప్పుడు చూడకుండా రాస్తే గుర్తుంటుంది.
  • పరీక్ష రాసేటప్పుడు నిబంధనలు, ఉదాహరణలు, ల్యాండ్‌మార్క్‌ కేసులు కూడా మిళితం చేస్తే బాగుంటుంది. ఇలా రాస్తే పరీక్ష రాసే మిగతావారితో పోలిస్తే మీ పేపర్‌ ప్రత్యేకంగా ఉంటుంది. దానివల్ల మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.
  • పరీక్షల్లో సెక్షన్‌ నంబర్ల రాసేటప్పుడు కచ్చితత్వం ఉండాలి. సెక్షన్‌ నంబర్లు గుర్తులేకపోతే తప్పులు రాసేకన్నా అవి రాయకుండా ఉండటమే మంచింది.
  • కార్పొరేట్‌ లాకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్‌ పుస్తకాన్ని తయారు చేసుకుని చదివితే పునశ్చరణ సులువుగా చేసుకోవచ్చు.


పేపర్‌-8: కాస్ట్‌ అకౌంటింగ్‌ 

  • విద్యార్థులు కాస్ట్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌కు, ఎలిమెంట్స్‌ ఆఫ్‌ కాస్ట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షల్లో వీటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
  • ఈ పేపర్‌లో థియరీకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ముఖ్యమైన సూత్రాలు, సైడ్‌ హెడ్డింగ్స్‌ను ముందుగానే రాసి ఉంచుకుని ఎగ్జామ్‌ ముందురోజు సబ్జెక్టు మొత్తాన్ని సులువుగా పునశ్చరణ చేసుకోడానికి వీలుంటుంది.
  • పరీక్ష రాసేటప్పుడు ప్రశ్నను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకున్న తర్వాత సమాధానం రాయాలి.

పేపర్‌-9: ఆపరేషన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ 

  • ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌: ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో విద్యార్థులు థియరీ, ప్రాబ్లమ్స్‌కు సమానమైన ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ప్రాబ్లమ్స్‌కు సంబంధించి, పబ్లిక్‌ పరీక్షల్లో తరుచుగా అడిగిన మోడల్స్‌ను అధ్యయనం చేయాలి.
  • దీనిలో గణిత ఆధారిత సమస్యలు ఉంటాయి. విద్యార్థి సులువుగా మంచి మార్కులను సాధించవచ్చు.
  • సమస్యలను సరైన, ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో సమాధానం రాయాలి.
  • పబ్లిక్‌ పరీక్షల్లో ప్రత్యామ్నాయ సమాధానాలు, పనిగమనికలు (వర్కింగ్‌ నోట్స్‌) మీ సమాధానంలో భాగంగా రాయాలి.
  • స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌: ఈ సబ్జెక్టులో ప్రశ్నలు తికమకగా అంటే నేరుగా కాకుండా రకరకాలుగా అడుగుతారు. పరీక్షకు ముందు సన్నద్ధత సమయంలో ఇలాంటి ప్రశ్నలు వీలైనన్ని ఎక్కువ చదివితే ఎటువంటి భయం లేకుండా పరీక్ష రాయవచ్చు.
  • ఈ సబ్జెక్టుల్లో పైన పేర్కొన్న విధంగా ప్రశ్నలను నేరుగా అడగరు. చాలావరకు విద్యార్థి ప్రశ్నలకు సొంతంగా సమాధానం రాయాలి. 
  • ప్రశ్నలు కచ్చితంగా ఇవే వస్తాయని కానీ, ఈ చాప్టర్‌ నుంచే వస్తాయని కానీ చెప్పలేం. కాబట్టి విద్యార్థి అన్ని చాప్టర్లపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి.
  • గత మూడు పరీక్షలకు సంబంధించిన ఎంటీపీ, ఆర్‌టీపీలను చదివితే మంచిది.
  • వర్క్‌బుక్‌లోని కాన్సెప్ట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

పేపర్‌-10 కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ అండ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (100 మార్కులు)

  • స్టడీ మెటీరియల్‌లో ఉండే ఉదాహరణలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.
  •  సీఎంఏ ఇంటర్‌లో పైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీతో పోలిస్తే కొంచెం సులువు. కాబట్టి విద్యార్థులు సులువుగా 50 మార్కులు సాధించవచ్చు.
  • కాస్ట్‌ రికార్డ్‌, కాస్ట్‌ ఆడిట్‌ విభాగంపై అశ్రద్ధ చూపవద్దు. దాని నుంచి 20 మార్కులు సులువుగా సాధించవచ్చు. గత పరీక్షలకు సంబంధించిన ఎంటీపీ, ఆర్‌టీపీలు చదివితే మంచిది.
  • కాస్ట్‌ అకౌంట్‌ రికార్డ్స్‌, కాస్ట్‌ ఆడిట్‌ వంటి అంశాలపట్ల జాగ్రత్త వహించాలి.
  • వర్క్‌బుక్‌లోని కాన్సెప్ట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.


పేపర్‌-11: ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సేషన్‌ 

  •   కాన్సెప్ట్స్‌, విధానాలు అర్థం చేసుకోవాలి. స్టడీమెటీరియల్‌లోని ఇచ్చిన ప్రశ్నలను అధ్యయనం చేయాలి.
  •  సమస్యాపూరితమైన ప్రశ్నలను సూచించిన/వర్తించే చట్టప్రకారం సమాధానం ఇవ్వాలి.
  •    సమాధానం మొదలుపెట్టే ముందు ప్రశ్నను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదవాలి.
  • మంచి మార్కుల కోసం జీఎస్టీపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
  • కస్టమ్స్‌ డ్యూటీస్‌లోని ప్రాబ్లమ్స్‌కు సంబంధించిన ప్రశ్నలపై ఎక్కువ దృష్టిపెట్టాలి.

పేపర్‌-12: కంపెనీ అకౌంట్స్‌ అండ్‌ ఆడిట్‌ 

  •  ఈ పేపర్‌లో అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి.
  •   షెడ్యూల్‌ 3 (ఫార్మాట్‌ ఆఫ్‌ బ్యాలెన్స్‌ షీట్‌ అండ్‌ ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ అకౌంట్‌)పై దృష్టిపెట్టాలి.
  • ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి.
  • ఆడిటింగ్‌ థియరీ సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో నేరుగా వచ్చే ప్రశ్నలను ముందుగానే ఊహించవచ్చు. స్కానర్‌లో ఉండే ప్రశ్నలను పరీక్షల్లో నేరుగా ఇచ్చే అవకాశం ఉంది. నిబంధనలు, వర్తించే చట్టాలు, అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ ఆన్‌ ఆడిటింగ్‌, విధానాలు, ప్రక్రియలపై దృష్టిపెట్టాలి.  



సరైన మార్గం ఎంచుకోవాలి

  •  సాధించాలన్న పట్టుదల ఉంటే ఎంతపెద్ద లక్ష్యమైనా చిన్నదైపోతుంది. దాసోహమంటుంది. జాతీయస్థాయిలో అత్యంత కఠినమైన పరీక్షలు కొన్నే ఉన్నాయి. వాటిల్లో ఒకటి సీఏ, సీఎంఏ. ఈ పరీక్షల్లో పాస్‌కావటం చాలా కష్టమనేది అపోహ మాత్రమేనని ఇటీవల జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు నిరూపించారు. ఇటీవల విడుదలైన సీఎంఏ ఇంటర్‌లో జాతీయస్థాయిలో మొదటిర్యాంకు సాధించి సత్తాచాటాడు దీపక్‌జైన్‌ కాంకారియా. మాస్టర్‌మైండ్స్‌లో సీఎంఏ చదివిన అతను ఈ పరీక్ష అంత కష్టమైనదేమీ కాదని నిరూపించాడు. తన తండ్రి మహావీర్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ కావటంతో తండ్రిబాటలోనే తనయుడు కూడా నడుస్తున్నాడు.
  • పదో తరగతిలో 600లకుగాను 556 మార్కులు సాధించిన దీపక్‌కు సీఏ చదవాలని మొదటి నుంచి కోరిక. సీఏ చేయాలంటే ఎంఈసీ సరైన మార్గం. కానీ అతనికి ఈ విషయం గురించి సరైన అవగాహనలేక ఇంటర్‌లో ఎంపీసీ తీసుకున్నాడు. ఇంటర్‌లో 975 మార్కులు సాధించాడు. 
  •   సీఏ/సీఎంఏ కోర్సులు చదవడానికి మాస్టర్‌మైండ్స్‌లో చేరిన దీపక్‌ సీఏ సీపీటీలో 200లకు 191 మార్కులు సాధించాడు. తర్వాత సీఏ ఇంటర్‌లో ఆలిండియా 21వ ర్యాంక్‌ సాధించాడు. సీఏతోపాటు సీఎంఏ కూడా సమాంతరంగా చదివాడు. సీఎంఏ ఇంటర్‌లో ఆలిండియా మొదటి ర్యాంక్‌ సాధించాడు. ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడు.


పేపర్‌-7: డైరెక్ట్‌ ట్యాక్సేషన్‌ 

  • డైరెక్ట్‌ ట్యాక్సేషన్‌కు సంబంధించి ప్రతి అంశంపై లోతైన అవగాహన అవసరం.
  • హెడ్స్‌ ఆఫ్‌ ఇన్‌కం, అసెస్‌మెంట్‌ ఆఫ్‌ డిఫరెంట్‌ పర్సన్స్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే ఎక్కువ మార్కులు సులువుగా సాధించవచ్చు.
  • పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతి ప్రశ్నను చిన్న చిన్న ప్రశ్నలుగా విభజిస్తారు. ఆ ప్రశ్నలకు రెండు లేదా 4 మార్కులు ఉంటాయి. కాబట్టి ఎక్కువ అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.


logo