శుక్రవారం 05 జూన్ 2020
Nipuna-education - Mar 01, 2020 , 23:50:17

నిమ్‌సెట్‌-2020

నిమ్‌సెట్‌-2020

డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ పూర్తయి కంప్యూటర్‌సైన్స్‌లో ప్రొఫెషనల్‌ కోర్సు చేద్దామనుకునేవారికి, జాతీయ ప్రాముఖ్యం కలిగిన విద్యాసంస్థల్లో కంప్యూటర్‌కోర్సు చేయాలనుకునేవారికి సువర్ణావకాశం నిమ్‌సెట్‌. ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన పది ఎన్‌ఐటీలలో ఎంసీఏ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...

  • ఎన్‌ఐటీలలో ఎంసీఏ

నిమ్‌సెట్‌: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) ఎంసీఏ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌. ఈ టెస్టును ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఈ ప్రవేశపరీక్ష ద్వారా మాస్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) మూడేండ్ల కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి నిమ్‌సెట్‌ను రాయపూర్‌ నిట్‌ నిర్వహిస్తుంది.

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో కింది ఏదైనా ఒక కోర్సు ఉత్తీర్ణత.

మూడేండ్ల ఫుల్‌టైం బీఎస్సీ/బీఎస్సీ (ఆనర్స్‌), బీసీఏ, బీఐటీ/బీవొకేషనల్‌ (కంప్యూటర్‌సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ఉత్తీర్ణత.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ/బీటెక్‌

నోట్‌: ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా పై మూడేండ్ల డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైనవారు కూడా అర్హులే. అయితే ఆ కోర్సు యూజీసీ/ఏఐసీటీఈ అనుమతి గుర్తింపు పొందినదై ఉండాలి.

పరీక్ష విధానం

120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. 

దీనిలో మ్యాథ్స్‌-50, అనలిటికల్‌ ఎబిలిటీ&లాజికల్‌ రీజనింగ్‌-40, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌-10, జనరల్‌ ఇంగ్లిష్‌-20 ప్రశ్నలు ఇస్తారు.

ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒకమార్కు కోతవిధిస్తారు. 

పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 22 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌లో సెంటర్లు ఉన్నాయి.

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మార్చి 6 నుంచి ప్రారంభం

చివరితేదీ: మార్చి 31 (సాయంత్రం 5 వరకు)

దరఖాస్తు ఫీజు: రూ.2,500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.1,250/-

అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్‌: మే 11 నుంచి 22 వరకు

పరీక్షతేదీ: మే 24 (ఉదయం 10 నుంచి 12 వరకు)

ఫలితాల వెల్లడి: జూన్‌ 8 లోపు చేస్తారు

వెబ్‌సైట్‌: https://nimcet.in


నిమ్‌సెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే ఎన్‌ఐటీలు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అగర్తలా, అలహాబాద్‌, భోపాల్‌, కాలికట్‌, జంషెడ్‌పూర్‌, కురుక్షేత్ర, రాయ్‌పూర్‌, సూరత్‌కల్‌, తిరుచిరాపల్లి, వరంగల్‌. వీటితోపాటు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ కూడా నిమ్‌సెట్‌ ద్వారా ఎంసీఏలో ప్రవేశాలు కల్పిస్తారు.

మొత్తం సీట్ల సంఖ్య -871 (కురుక్షేత్రలోని సెల్ఫ్‌ఫైనాన్సింగ్‌ సీట్లతో కలిపి)


ఎంసీఏ చేసినవారికి వందశాతం ప్లేస్‌మెంట్స్‌

ఎన్‌ఐటీలలో ఎంసీఏ చేస్తే మంచి భవిష్యత్‌ ఉంటుంది. దేశంలోని 31 ఎన్‌ఐటీలలో పది ఎన్‌ఐటీలు ఎంసీఏను ఆఫర్‌ చేస్తున్నాయి. సౌత్‌ ఇండియాలో నాలుగు ఎన్‌ఐటీలు ఎంసీఏను అందిస్తున్నాయి. వరంగల్‌లో 54 సీట్లు ఉన్నాయి. వరంగల్‌ నిట్‌లో సుమారు మూడుదశాబ్దాలుగా ఈ కోర్సును అందిస్తున్నాం. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యార్థులతో సమానంగా, కొన్ని సందర్భాల్లో మరికొంత ఎక్కువగానే ప్లేస్‌మెంట్స్‌ లభిస్తున్నాయి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సీటీసీ చూస్తే 8 నుంచి 20 లక్షల వరకు ప్యాకేజీ వస్తుంది. ఏటేటా ఈ ప్లేస్‌మెంట్స్‌, సీటీసీలు పెరుగుతున్నాయి. ఎంసీఏ సిలబస్‌లో సాంకేతికతలో వస్తున్న కొత్త అంశాలను కూడా అందిస్తున్నాం. 


ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో విద్యార్థులు దీన్ని పట్టించుకోకపోవడం విచారించాల్సిన అంశం. ఉత్తరభారతప్రాంత విద్యార్థులు నిమ్‌సెట్‌ ద్వారా ఎంసీఏ చేసి మంచి ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. భోపాల్‌, అలహాబాద్‌ పరీక్ష కేంద్రాల్లో 1200 నుంచి 1500 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుంటే తిరుచ్చిలో 80, వరంగల్‌లో 150 మంది మాత్రమే పరీక్షకు హాజరువుతున్నారు. డిగ్రీచేసినవారు జాతీయప్రాముఖ్యం కలిగిన ఎన్‌ఐటీలలో ఎంసీఏ చేస్తే మంచి భవిష్యత్‌ ఉంటుంది. దీనికోసం నిమ్‌సెట్‌ రాయడం ఒక్కటే మార్గం. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఎంసీఏ చేసిన విద్యార్థికి రూ.40 లక్షలకు పైగా ప్యాకేజీతో క్యాంపస్‌ప్లేస్‌మెంట్‌కు ఎంపిక కావడం గమనించాల్సిన అంశం. కోర్సుకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే వరంగల్‌ ఎన్‌ఐటీలో సంబంధిత డిపార్ట్‌మెంట్‌ను సంప్రదిస్తే మీ సందేహాలు తీరుస్తారు. 

హెల్ప్‌డెస్క్‌ నంబర్‌: 7303520035.


- వరంగల్‌ ఎన్‌ఐటీ డైరెక్టర్‌ 

ప్రొ. ఎన్వీ రమణారావు


logo